శివసేన పార్టీ స్థాపకుడు, కార్టూనిస్టు From Wikipedia, the free encyclopedia
బాల్ థాకరే (జనవరి 23, 1926 - నవంబర్ 17, 2012) (లేదా బాలాసాహెబ్ థాక్రే) శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, మరాఠీలకు ఆరాధ్యుడు [4],
బాల్ థాకరే జనవరి 23, 1926లో పూనేలో జన్మించాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ థాకరే. 1950లలో రాజకీయ వ్యంగచిత్రకారుడిగా (కార్టూనిస్టుగా) జీవనం ప్రారంభించిన థాకరే 1960 నాటికి సొంత రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవాడు. ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల సాధనకై పోరాటం చేయడానికి 1966లో శివసేన పార్టీకి ఏర్పాటుచేశాడు. "మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే' అనే ఉద్యమంలో భాగంగా ముంబాయిని వదిలిపోవాలని ప్రవాసులను హెచ్చరించాడు. హిందూత్వను, హిందూ జాతీయవాదాన్ని కూడా బలపర్చాడు. జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీతో జతకట్టి కీలక పాత్ర వహించాడు. శివసేన పార్టీ స్థాపించిననూ 1995లో మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిననూ బాల్ థాకరే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేడు, ఎన్నికలలో పోటీచేయలేడు. పార్టీ అధినేతగానే ఉంటూ పార్టీని నడిపించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకంజ వేయలేడు.
86 ఏళ్ళ వయస్సులో నవంబర్ 17, 2012న ముంబాయిలోని తన నివాసం మాతోశ్రీలో మరణించాడు.
థాకరే స్థాపించిన ఆంగ్ల పత్రిక సామ్నా, హిందీ పత్రిక దోపహార్ సామ్నాలు సంతాపం ప్రకటించాయి. జాకెట్ పేజీలు, కవర్ పేజీలు కూడా పూర్తి నలుపులో ప్రచురించి ఆ పత్రికలు తమ విచారాన్ని వ్యక్తం చేశాయి. రెండు కవర్ పేజీలు పూర్తి నలుపు రంగులో ప్రచురించడం పత్రిక చరిత్రలో ఇదే తొలిసారి.
శివసేన అధినేత బాల్ థాకరే మృతదేహానికి సాయంత్రం ఆరు గంటలకు (నవంబర్ 17) దహన సంస్కారాలు జరిగినవి. సందర్శన కోసం శివాజీ పార్కులో థాకరే మృతదేహాన్ని ఉంచారు. అభిమానుల తాకిడితో శివాజీ పార్కు కిక్కిరిసి పోయింది. ముంబయి రోడ్లు కూడా జనసంద్రమయ్యాయి. 1966లో శివసేన ఆవిర్భావం సందర్భంగా సరిగ్గా బాల్ ఠాక్రే ప్రసంగించిన చోటే ఆయన చితిని ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల్లో కూడా ఠాక్రే ఇక్కడి నుంచే ప్రసంగించేవారు. ముంబై పోలీసులు 21 తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. ఠాక్రే భౌతికకాయం వద్ద మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పుష్పగుచ్ఛాలుంచి నివాళి అర్పించారు. ఎలాంటి అధికార పదవీ చేపట్టని ఠాక్రేకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. మహారాష్ట్ర ప్రజలను కొన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేసినందుకు గౌరవంగా ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఠాక్రేకు వీడ్కోలు పలికింది. గతంలో ఎన్నడూ బహిరంగ అంత్యక్రియలు జరగని శివాజీ పార్కులో ఠాక్రే అంత్యక్రియలకు అనుమతిచ్చింది. ముంబైలో 1920లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అంత్యక్రియల తర్వాత బహిరంగ అంత్యక్రియలు జరగడం ఇదే తొలిసారి! శివాజీ పార్కుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ తదితరులు చేరుకున్నారు. 20 లక్షల మందికి పైగా పాల్గొన్న ఠాక్రే అంతిమయాత్ర, అంత్యక్రియలు జనసంద్రాన్ని తలపించింది. గత ఐదు దశాబ్దాల కాలంలో దేశంలో ఒక నేత అంత్యక్రియల్లో ఇంతమంది పాల్గొనడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. 1956లో చనిపోయిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంత్యక్రియలకు కూడా ఇదే స్థాయిలో జనం తరలి వచ్చారు.
తనువంతా ఆదర్శ హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకున్న శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరేకు ఐదేళ్ల పాటు ఓ ముస్లిం వైద్యుడు చికిత్స అందించారు. శనివారం ఆయన మృతిని ప్రకటించింది కూడా ఆ వైద్యుడే. అతడి పేరు జలీల్ పార్కర్. జలీల్ పార్కర్ ఐదేళ్లుగా థాకరేకు వైద్య సేవలు చేస్తున్నారు. చివరి నిమిషం వరకు థాకరేకు ఆయన వైద్య సేవలు అందించారు.
థాకరేకు జలీల్ అంటే ప్రత్యేకమైన విశ్వాసం. ఇతడు లీలావతి ఆసుపత్రిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్య నిపుణుడు. థాకరేకు నమ్మకమైన వైద్యుడిగా ఆయన ఇన్నేళ్లుగా కొనసాగారు. థాకరే మృతిని జలీల్ కన్నీటి పర్యంతమై ప్రకటించారు. కొన్నేళ్ల క్రితం శ్వాస సంబంధమైన వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన థాకరేకు జలీల్ విజయవంతంగా చికిత్స చేశారు.
థాకరేతో పాటు ఆయన కుటుంబ సభ్యుల విశ్వాసాన్ని కూడా జలీల్ పొందారు. ఈ ఐదేళ్లలో జలీల్ పార్కర్ శివసేన అధినేత ప్రాణాలను ఐదుసార్లు కాపాడారట. థాకరేకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆయనే వైద్యం చేసేవారు. థాకరే తనయుడు ఉద్దవ్ థాకరేకు గుండె శస్త్ర చికిత్స కూడా జలీల్ సారథ్యంలోని వైద్య బృందమే నిర్వహించింది.
హిందుత్వవాది అయిన థాకరే వ్యక్తిగత వైద్యుడు ఓ ముస్లిం వ్యక్తి ఉండటంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తినా జలీల్ ఏమాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాదు థాకరే తనను ఎంతగానో ఆదరిస్తారని సమాధానం చెప్పేవారు. థాకరే కుటుంబానికి జలీల్ ఎంత సన్నిహితుడు అంటే ఈ సంవత్సరం (2012) పార్టీ తరఫున జరిగిన దసరా వేడుకల్లో ఆయనకు డయాస్ పైన సీటు కేటాయించారు.
జై హింద్
Seamless Wikipedia browsing. On steroids.