From Wikipedia, the free encyclopedia
అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.
బాలల దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
రకం | అంతర్జాతీయం |
జరుపుకొనే రోజు | నవంబర్ 14 |
సంబంధిత పండుగ | అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఫాదర్స్ డే, మదర్స్ డే, పేరెంట్స్ డే |
ఆవృత్తి | సంవత్సరం |
భారత దేశాన్ని దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్లాల్ నెహ్రూ సొంతం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషువారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాధించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిజేశారు. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే... నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు.[1]
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1954కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు.[2][3] 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ చిల్డ్రన్స్ డే లక్ష్యం.[4]
బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది.
Seamless Wikipedia browsing. On steroids.