పానిపట్
హర్యానా రాష్ట్రం లోని చారిత్రిక నగరం From Wikipedia, the free encyclopedia
పానిపట్ హర్యానాలోని ఒక చారిత్రిక నగరం, పానిపట్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది ఢిల్లీకి ఉత్తరంగా 90 కి.,మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి-1 పై చండీగఢ్‌కు దక్షిణంగా 169 కి.మీ. దూరంలో ఉంది. సా.శ. 1526, 1556, 1761 లో నగరానికి సమీపంలో జరిగిన మూడు ప్రధాన యుద్ధాలు భారత చరిత్రలో కీలకమైన మలుపులు. పానిపట్ "నేతగాళ్ళనగరం"గా, "టెక్స్‌టైల్ సిటీ"గా ప్రసిద్ధి చెందింది. "వస్త్రాలను రీసైక్లింగ్ చేయడానికి ప్రపంచ కేంద్రం" అయినందున దీనిని "క్యాస్ట్-ఆఫ్ క్యాపిటల్" అని కూడా పిలుస్తారు. [2]
1989 నవంబరు 1 న కర్నాల్ జిల్లాను చీల్చి, పానిపట్ కేంద్రంగా పానిపట్ జిల్లాను ఏర్పాటు చేసారు. 1991 జూలై 24 న దీన్ని మళ్ళీ కర్నాల్ జిల్లాలో విలీనం చేసారు. 1992 జనవరి 1 న, మళ్ళీ ప్రత్యేక జిల్లాగా చేసారు. పురాణాల ప్రకారం, మహాభారత కాలంలో పాండవులు స్థాపించిన ఐదు నగరాల్లో (ప్రస్థాలలో) పానిపట్ ఒకటి. దాని చారిత్రిక పేరు పాండవప్రస్థం. దుర్యోధనుడి నుండి పాండవులు కోరిన ఐదు గ్రామాలలో పానిపట్ మొదటిసారి మహాభారతంలో నమోదు చేయబడింది. ఐదు గ్రామాలు "పంచ పాట్":
చరిత్ర
మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21 న ఢిల్లీ ఆఫ్ఘన్ సుల్తాన్ ఇబ్రహీం లోధి, తుర్కో-మంగోల్ వీరుడు బాబర్‌ల మధ్య జరిగింది. ఈ యుద్ధం పర్యవసానంగా ఉత్తర భారత ఉపఖండంలో మొఘల్ పాలన మొదలైంది. బాబర్ సైన్యం తమ కంటే సంఖ్యలో చాలా పెద్దదైన ఇబ్రహీం లోడీ సైన్యాన్ని ఓడించింది. ఈ మొదటి పానిపట్ యుద్ధంతో ఢిల్లీలో బహ్లూల్ లోడీ స్థాపించిన 'లోడీ పాలన' ముగిసింది. భారతదేశంలో మొఘలు పాలనకు నాంది పలికింది.
1556 నవంబరు 5 న అక్బరుకు చివరి ఢిల్లీ హిందూ చక్రవర్తి హేమ చంద్ర విక్రమాదిత్యకూ (హేమూ) మధ్య రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. [3] [4] 1556 అక్టోబరు 7 న ఢిల్లీలోని పురానా కిలాలో పట్టాభిషేకం చేసుకున్న తరువాత ఆగ్రా, ఢిల్లీ వంటి రాజ్యాలను స్వాధీనం చేసుకున్న హేమ చంద్ర, తనను తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. అతడికి పెద్ద సైన్యం ఉంది. మొదట్లో అతని దళాలు గెలుపు బాటలో ఉన్నాయి. కాని అకస్మాత్తుగా అతని కంటిలో బాణం గుచ్చుకోవడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఏనుగు పైనున్న అంబారీలో అతను కనబడకపోవడంతో, అతని సైన్యం పారిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న హేమూను అక్బరు శిబిరానికి తీసుకెళ్లారు, అక్కడ ఆక్బరు బైరమ్ ఖాన్ చేత హేమూ తల నరికించాడు. [5] హేమూ తలను కాబూల్ పంపించి అక్కడి ఢిల్లీ దర్వాజా వెలుపల వేలాడదీయించాడు. అతని మొండేన్ని ఢిల్లీ లోని పురానా కిలా వెలుపల వేలాడదీయించాడు. రాజా హేమూ వీరమరణం పొందిన ప్రదేశం ఇప్పుడు పానిపట్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
మూడవ పానిపట్టు యుద్ధం 1761 జనవరి 14 న మరాఠా సామ్రాజ్యానికి, ఆఫ్ఘన్, బలూచ్ ఆక్రమణదారులకూ మధ్య జరిగింది. మరాఠా సామ్రాజ్య దళాలకు సదాశివరావు భావు నాయకత్వం వహించగా, ఆఫ్ఘన్లకు అహ్మద్ షా అబ్దాలి నాయకత్వం వహించాడు. ఆఫ్ఘన్ల సైన్యం 1,10,000 మంది, మరాఠాలు 75,000 మంది. 1,00,000 మంది యాత్రికులు కూడా ఉన్నారు. భారతదేశం లోని ఇతర సామ్రాజ్యాల నుండి సహకారం లేకపోవడంతో మరాఠా సైనికులకు ఆహారం అందలేదు. ఇరుసైన్యాలు ప్రాణాలర్పించి పోరాడాయి. నజీబ్-ఉద్-దౌలా, షుజా-ఉద్-దౌలాలు ఆఫ్ఘన్లకు ఆహార సరఫరా చేసారు. మరాఠా వారి వెంట యాత్రికులున్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. యాత్రికులెవరూ పోరాడేవాళ్లు కాదు. జనవరి 14 న, 1,00,000 మంది సైనికులు మరణించారు. ఆఫ్ఘన్లు విజయం సాధించారు. అయితే, విజయం తరువాత, ఉత్తర భారతదేశం లోని శత్రువులను ఎదుర్కోలేక, మరింత ప్రాణనష్టం జరగకుండా ఆఫ్ఘనిస్తాన్కు తిరిగి వెళ్లారు. ఈ యుద్ధం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో కంపెనీ పాలనను స్థాపించడానికి పూర్వగామిగా ఉపయోగపడింది, ఎందుకంటే ఈ యుద్ధం తరువాత ఉత్తర, వాయవ్య భారతదేసం లోని రాజ్యాలు బలహీనపడ్డాయి. [6]
భౌగోళికం
పానిపట్ 29.39°N 76.97°E వద్ద [7] సముద్రమట్టం నుండి 219 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం, నగర జనాభా 2,94,292. [1] పానిపట్ పట్టణ సముదాయంలో (నగరంతో కలిసిన చుట్టుపట్ల ప్రాంతాలను కలిపి) 2,95,970 జనాభా ఉంది. అక్షరాస్యత 83%. [8]
చూడదగ్గ ప్రదేశాలు
- హేము సమాధి స్థలం
- ఇబ్రహీం లోధి సమాధి
పానిపట్ సిండ్రోమ్
భారతీయ రాజులలో వ్యూహాత్మక ఆలోచన, సంసిద్ధత, నిర్ణయాత్మక చర్యలు లేకపోవడం అనేది పానిపట్టు వద్ద జరిగిన మూడు యుద్ధాల్లో కనబడింది. ఈ మూడు యుద్ధాల్లోనూ ఆక్రమణదారుని ఎదుర్కొన్న సైన్యాలు నిర్ణయాత్మకంగా ఓడిపోయాయి. ఇలాంటి లక్షణాలను సూచిస్తూ '' పానిపట్ సిండ్రోమ్ '' అనే పదం పరిభాష లోకి ప్రవేశించింది. ఈ పదాన్ని ఎయిర్ కమోడోర్ జస్జీత్ సింగ్ కాయించాడు. [9] [10] [11] [12]
జాతీయ రహదారి 44 పానిపట్ ను గ్రాండ్ ట్రంక్ రోడ్ నెట్‌వర్క్‌తో కలిపే ప్రధాన రహదారి. [13]
పానిపట్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి అన్ని ప్రధాన భారతీయ నగరాలకూ రవాణా సౌకర్యం ఉంది [14]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.