From Wikipedia, the free encyclopedia
పాటిబండ్ల ఆనందరావు (జ. మార్చి 21, 1951) రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు.[1][2] బహుళజాతి కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రయత్నంలో, భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న సామాన్య పేద రైతు ఇతివృత్తాన్ని తీసుకొని రాసిన పడమటి గాలి నాటకంతో జీవనాటక రచయితగా గుర్తింపు పొందాడు.
పాటిబండ్ల ఆనందరావు గారు 1951 మార్చి 21న ప్రస్తుత ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామంలోఅచ్చమ్మ, బొడ్డియ్య దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఏడు మంది సంతానంలో ఆనంద రావు ఒక్కడే చదువుకున్నాడు. వీధి బడి నుండి ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే చదివాడు. కారుమంచి గ్రామం ఉన్నత పాఠశాలలో స్కూలు ఫైనల్ వరకు చదివాడు. కావలి జవహర్ భారతి కాలేజీలో పియుసి, ఆ తరువాత నెల్లూరు మూలాపేట లోని వేద సంస్కృత పాఠశాలలో తెలుగు విద్వాన్ కోర్సూ చదివాడు. ఒంగోలులో ఏబీఎన్ విద్యాసంస్థల్లో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేసి 2009వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశాడు.
1981 వ సంవత్సరంలో దర్పణం అనే నాటికతో ఆనంద రావు నాటక యజ్ఞం ప్రారంభమైంది. తరువాత పెదకాకాని గంగోత్రి సంస్థ నిర్వాహకుడు నాయుడు గోపి తో పరిచయం కావడంతో ఆ సంస్థ ద్వారా సహారా, నిషిద్ధాక్షరి, మానస సరోవరం, కాదు సుమా కల వంటి నాటకాలను రచించి ఆంధ్ర దేశమంతటా దిగ్విజయంగా ప్రదర్శించారు. దేశంలోని అన్ని పోటీ పరిషత్తులలో అసంఖ్యాకమైన బహుమతులు అందుకున్నాడు. పరిషత్తులూ, పోటీలూ, బహుమతులూ అతని తృష్ణను సంతృప్తి పరచలేక పోయాయి. పరిషత్తు పోటీల శృంఖలాల నుండి నాటకాన్ని విడిపించాలని సంకల్పించాడు. నాలుగు సంవత్సరాల పాటు ఏమీ రాయకుండా స్తబ్దంగా ఉండిపోయాడు. అమెరికాలోని ఆటా సంస్థ వారి ప్రకటనతో ఎంతో కాలంగా తనలో రగులుతున్న సమాజపు వికృత పోకడలూ, వ్యవసాయ రంగంలోని సాధకబాధకాల మీద అవధులు లేని నాటకం రాయడానికి పూనుకొని పడమటి గాలి నాటకాన్ని సృజించాడు. అది మహోధృతంగా ప్రదర్శించబడి విమర్శకుల, పత్రికల, ప్రజలా మన్ననలు పొందింది.
మరుగున పడిపోయిన ప్రకాశం జిల్లా చీమకుర్తి తాలూకా పులికొండ వీధి భాగవత జానపద కళా రూపాన్ని అభ్యసించి దాన్ని డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర, "రాజగృహ ప్రవేశం" నాటకంలో ప్రవేశపెట్టి ఆంధ్ర దేశమంతటానూ ఢిల్లీలోనూ ప్రదర్శించారు. స్వతంత్రగా నాటకాలు రచించడంలోనే గాక, కథలనూ నవలలనూ నాటకీకరించడం లోనూ అతను సిద్ధహస్తుడు. రచయిత పతంజలి రాసిన "గోపాత్రుడు" నవలనూ నగ్నముని రాసిన ఆకాశ దేవర కథనూ నాటకాలుగా మలిచి జనరంజకంగా ప్రదర్శించారు.
అతను గద్య నాటకాలనే గాక పద్య నాటకాలను కూడా అంతే సమర్ధతతో రాయగలడు. బుద్ధుని జీవితం మీద ఆయన రాసిన "హంస గీతం" ఒక అద్భుత కళా ఖండం. అనేకమైన లలిత గేయాలను తన నాటకాలలో చొప్పించాడు.
అతని దర్శకత్వ ప్రతిభ తన పడమటి గాలి నాటకాన్ని దర్శకత్వం వహించడం లోనే గాక ఇతరుల నాటకాలను అదే నిబద్ధతతో ప్రదర్శించడంలో కూడా కనబడుతుంది. సమకాలీన నాటక రచయితల్లో సుప్రసిద్ధులూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు దీర్ఘాసి విజయ భాస్కర్ రాసిన "కుర్చీ", "మహాత్మా జ్యోతిరావు పూలే" నాటకాలను దర్శకత్వం వహించి దేశమంతటా అమోఘంగా ప్రదర్శించాడు.
అతను మంచి నటులు. పూర్వాశ్రమంలో పరిషత్తు పోటీలకు నాటకాలాడేటప్పుడు "నిషిద్ధాక్షరి" లో ఎర్రన్న పాత్రకూ "సహారా" లో త్రిశంకు పాత్రకూ ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్యనటుడు బహుమతులందుకున్నాడు.
అతను బాగా పాడగలడు కూడా. మహాకవి జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని ఏకపాత్ర గా మలచి సంభాషణలను అద్భుతంగా పలకడమే గాక పద్యాలను రాగయుక్తంగానూ పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు.
అతను రచయిత, దర్శకుడు, నటుడు, గాయకుడే గాక చాలా గొప్ప ఆర్గనైజర్ కూడా. పరిషత్తు పోటీల గాఢ పరిష్వంగం నుంచి నాటకాన్ని విడిపించిన తరువాత "పడమటి గాలి", రాజగృహ ప్రవేశం", "ఆకాశ దేవర", "కుర్చీ","మహాత్మా జ్యోతీరావు పూలే" మొదలైన నాటకాలను కనీసం 30 మంది కళాకారులతో వందల ప్రదర్శనలు దేశమంతటా చేశారంటే అతని ఓర్పూ, సాటి కళాకారుల్నీ మనుషుల్నీ ప్రేమించే విధానమూ, అందరినీ కలుపుకుపోయే నేర్పూ తెలుస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.