పరాగసంపర్కము
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
పుష్పించే మొక్కలలోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగసంపర్కం (Pollination) అంటారు.[1] ఫలదీకరణ జరగడానికి ముందు తప్పనిసరిగా పరాగసంపర్కం జరిగితీరాలి. వివృతబీజాలలో అండాలు వివృతంగా (open) ఉండటం వలన పరాగరేణువులు నేరుగా అండద్వారం మీద పడతాయి. ఇటువంటి పరాగసంపర్కాన్ని ప్రత్యక్ష పరాగసంపర్కం (Direct pollination) అంటారు. కానీ ఆవృతబీజాలలో అండాలు అండాశయం లోపల అంతర్గతంగా, సంవృతంగా (closed) ఉండటం వలన పరాగరేణువులు కీలాగ్రంపైన పడతాయి. ఇటువంటి పరాగసంపర్కాన్ని పరోక్ష పరాగసంపర్కం (Indirect pollination) అంటారు.
ఆవృతబీజాలలోని పరాగసంపర్కాన్ని రెండు రకాలుగా విభజించవచ్చును. అవిఆత్మ పరాగసంపర్కం, పర పరాగసంపర్కం
వివిధ అనుకూలతలు పరపరాగ సంపర్కానికి దొహదం చేస్తాయి. అవి...
అ)ద్విభిన్నకీలత: ఈ పువ్వులలో పొట్టికేసరాలు, పొడువు కీలాలు లేదా పొడువు కేసరాలు, పొట్టి కీలాలు ఉంటాయి. ఉదా: ప్రిము ఆ)త్రిభిన్నకీలత: పొడువుగా, పొట్టిగా, మధ్యస్థంగా మూడు రకాల ఎత్తులలో కీలాలు అమరి ఉంటాయి. ఉదా: ఆక్సాలిస్
పర పరాగసంపర్కం జరగటంలో పుష్పంలోని అంతర్గత సౌలభ్యాలతో పాటు, బాహ్యకారకాలు ప్రభావితం చేస్తాయి. తమ సహకారాన్ని అందిస్తాయి. గాలి, నీరు, జంతువులు ఈ పాత్రను పోషిస్తాయి.[2] సహకారాల రీత్యా పరాగసంపర్కాన్ని కింది విధంగా విభజిస్తారు.
గాలి సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని వాయు సహకార పరాగసంపర్కం అంటారు. ఈ సంపర్కాన్ని జరిపే పుష్పాలు కొన్ని ప్రత్యేకమైన అనుకూలనాలు కలిగి ఉంటాయి.[3] పుష్పాలు చాలా వరకు ఏకలింగ పుష్పాలు. కాటికిన్ రూప పుష్పవిన్యాసాన్ని కలిగి ఉంటాయి. పుష్పవిన్యాసాలలో పురుష పుష్పాలు ఎక్కువగాను, స్త్రీ పుష్పాలు తక్కువగాను ఉంటాయి. పుష్పాలు గాలి వటానికి వేలాడుతూ ఉంటాయి. పరాగరేణువులు నునుపైన గోడలతో, పొడిగా, తేలికగా ఉండి, గాలిలో ఎక్కువ దూరం తేలిపోయేలా ఉంటాయి. గాలి ద్వారా వచ్చే పరాగరేణువులను స్వీకరించడానికి వీలుగా కీలాగ్రాలు బహిర్గతమై, శాఖయుతంగా, కుంచె లేదా ఈక వలె ఉంటాయు. ఉదా: క్వీర్కన్, ట్రిటికమ్
నీటిలో మునిగి ఉండే మొక్కలలో (ఉదా: సిరటోఫిల్లం) మాత్రమే నిజమైన జల సహకార పరాగసంపర్కం జరుగుతుంది. ఈ సంపర్కం జరిపే పువ్వులలోని పరాగరేణువులు పొడువుగా నాళికల వలే ఉంటాయి.[4] వీటికి బాహ్య కవచం ఉండదు.అరుదుగా కొన్ని మొక్కలలో నీటి ఉపరితలాన కూడా పరాగసంపర్కం జరుగుతుంది. ఉదా: రప్పియ
జంతువుల సహకారంతో చాలా మొక్కలు పరాగసంపర్కాన్ని నిర్వహిస్తాయి. సహకార జీవిని బట్టి ఇది నాలుగు రకాలు. అవి. 1. అర్నిథోఫైలి, 2. కిరోప్టెరిఫైలి, 3. మెలకోఫైలి, 4. ఎంటమోఫైలి.
పక్షుల సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని అర్నిథోఫైలి అంటారు. ఈ సంపర్కాన్ని జరిపే మొక్కలలో పుష్పాలు పెద్దవిగా ఉంటాయి. వాసన ఉండవు. హమ్మింగ్ బర్డ్స్, హనిథ్రిషెస్ వంటి చిన్నవైన పక్షిజాతులు ఈ సంపర్కం జరగడానికి మొక్కలకు తోడ్పడుతాయి. ఉదా: బిగ్నోనియా
గబ్బిలాల సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని కిరోప్టెరిఫైలి అంటారు. ఈ సంపర్కాన్ని జరిపే మొక్కలలో పుష్పాలు రాత్రి పూట వికసిస్తాయి. ఎక్కువ వాసన, సమృద్దిగా స్రవించే మకరందం గబ్బిలాలను ఆకర్షిస్తాయి. ఉదా: బాహీనియా, మెగలాండ.
నత్తల సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని మెలకోఫైలి అంటారు. ఉదా: లెమ్నా, ఎరాయిడే
కీటకాల సహకారంతో జరిగే పరాగసంపర్కాన్ని ఎంటమోఫైలి అంటారు. ఈ సంపర్కాన్ని జరిపే మొక్కలలో పుష్పాలు ఆకర్షణీయమైన ఆకర్షక పత్రాలు, పుష్పపుచ్చాలు, కేసరాలు, సువాసనను కలిగి ఉంటాయి. ఆహారంగా పుప్పొడిని అందిస్తాయి. ఉదా: లెమ్నా, ఎరాయిడే
చార్లెస్ డార్విన్ పరిశోధనల వలన ఆత్మ పరాగసంపర్కం కంటే పర పరాగసంపర్కం వలన అనేక లాభాలున్నాయని తెలిసింది.
Seamless Wikipedia browsing. On steroids.