From Wikipedia, the free encyclopedia
పద్మ పురాణం (ఆంగ్లం: Padma Purana) హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. [1][2] సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ పురాణం యొక్క రాతప్రతులు వివిధ పాఠాంతరాల రూపంలో లభ్యమౌతున్నాయి. వీటిలో రెండు ముఖ్యమైనవి. ఈ రెండింటి మధ్యలో చాలా తేడాలున్నాయి. ఒకటి భారతదేశం తూర్పు ప్రాంతానికి చెందినది కాగా మరొకటి పడమర ప్రాంతానికి చెందినది. [3] ఇది 55,000 శ్లోకాలు కలిగిన పెద్ద గ్రంథాలలో ఒకటిగా చెప్పబడుతున్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతులలో సుమారు 50,000 శ్లోకాలు ఉన్నాయి. [4][5]
ఈ గ్రంథంలోని పాఠ్యాన్ని మేళవించిన విధానాన్ని పరిశీలిస్తే ఇది వివిధ యుగాలలో వేర్వేరు రచయితలు రాసిన వేర్వేరు విభాగాలను సంకలనం చేసినట్లుగా కనిపిస్తుంది. [6] ఇందులో సృష్టి నిర్మాణం, పురాణాలు, వంశచరిత్రలు, భూగోళ శాస్త్ర సంబంధ విషయాలు, నదులు, ఋతువులు, దేవాలయాలు, భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు ముఖ్యంగా (రాజస్థాన్ లోని బ్రహ్మదేవాలయం [7]) తీర్థయాత్రలు, వాల్మీకి రామాయణంలోని సీతా రాముల కథ కన్నా భిన్నమైన కథనం, పండగలు, ఎక్కువగా విష్ణువును కీర్తించే, కొంచెం శివుని, కీర్తించే గాథలు, నీతి నియమాలు, అతిథి ఆదరణ, యోగా, ఆత్మను గురించిన తాత్విక వివరణ, అద్వైతం, మోక్షం లాంటి అంశాలను స్పృశించారు. [2][4][8]
ఆధునిక యుగములో వెలసిన పద్మ పురాణములలో మొదటిది వేలూరి శివరామ శాస్త్రి గారి ఆముద్రిత పద్మ పురాణము.రెండవది పిశుపాటి చిదంబర శాస్త్రి గారి శ్రీమదాంధ్ర పద్మపురాణము. శివరామ శాస్త్రిగారును, చిదంబర శాస్త్రిగారును ఇంచుమించు సమాన వయస్కులు. ఇరువురును శతావధానులు.వేలూరి వారి పద్మపురాణము సమగ్రముగా లభించటంలేదు. ఆది ఖండము, భూమి ఖండము, బ్రహ్మ ఖండము అను మూడు ఖండములు మాత్రమే ఉన్నాయి. ఇక పిసుపాటివారు పద్మపురాణము మాత్రమే తెలుగులో లభించుచున్న సమగ్ర గ్రంథము.విశేషమగు వ్యయప్రయాసలకోర్చి ఈమహాగ్రంధమును రసజ్ఞుల సహాయసహకారములతో నాలుగు సంపుటములుగా ముద్రించి తెలుగువారికి సమర్పించి ధన్యులైన వారు కవిసోదరులైన సుబ్రహ్మణ్యశాస్త్రిగారు- విశ్వేశ్వరశాస్త్రి గారు.
పైన పేర్కొన్న ఇరువురే కాక పేరూరు సంస్థానాధీశులు వేంకట రామోజీ రామర్సు వారి ఆస్థాన విద్వాంసులైన మరువాడ శంభన్న శాస్త్రి గారు ఆంధ్ర వచనములో ఆదిమ ఖండము, బ్రహ్మ ఖండము, భూమి ఖండము లను రచించారు.
Seamless Wikipedia browsing. On steroids.