నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి[1]. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతంతో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.

Thumb

కాలం

తెలుగు సాహిత్యరంగంలో నన్నెచోడుని కాలనిర్ణయం చాలా వివాదాస్పదమైంది. చిలుకూరి వీరభద్రరావు క్రీ. శ. 925-40 మధ్యకాలంలోని వారని వ్రాశారు. ఆయన పద్యాన్నొకదాన్ని[నోట్స్ 1] ఆధారం చేసుకుని నన్నయ్యకు వందయేళ్ళ మునుపే ఆంధ్రకవిత వర్ధిల్లుతోందని వ్రాశారు.[2] ఐతే నన్నెచోడుడు నన్నయకన్నా ప్రాచీనుడు అనేందుకు వీలుచిక్కే పద్యానికి పలు పాఠాంతరాలు ఉండడం, వాటికి మూలమైన ప్రతి యేదో దాని ప్రామాణ్యమేదో తెలియరాకపోవడంతో నన్నయకన్నా ప్రాచీనుడనే వాదనలు నిలువట్లేదని వేటూరి ప్రభాకరశాస్త్రి నిర్ధారించారు. 12వ శతాబ్దికి చెందిన సోమనాథుని కవిత్వం, కుమారసంభవాలలో చాలా దగ్గర పోలికలున్న పద్యాలు కనిపిస్తున్నాయి. నెట్టను నేలకు నింగికి సూత్ర నుంచి గట్ట వెన్నెల గుంపుగా జేయ వచ్చి (బసవపురాణం) వరకున్న ద్విపదలు, నేలయు నింగియు దాలముల్ వాయింప (కుమారసంభవం) [3] వంటి పద్యాలు ఒకేరకంగా ఉన్నాయని పండితులు వ్రాశారు. వేటూరి ప్రభాకరశాస్త్రి ఈ రీత్యా వీరు కాలం విషయంలో చిరుభేదమే కలిగివున్నారేమోనని సంశయించారు.

కవిత్వం

నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివ, స్కాంద, వాయు, బ్రహ్మాండ పురాణాల్లోనూ, భారత రామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు.

నన్నెచోడుని కుమార సంభవము

కాళిదాసు విరచిత సంస్కృత కుమార సంభవము 17 సర్గల గ్రంధము కాగా, తెలుగు కుమార సంభవము 12 ఆశ్వసముల గ్రంధము.అయితే ఇందు కాళిదాస రచితము 8 సర్గలే అని పండితుల అభిప్రాయము. చోడుని కుమార సంభవము లోని మొదటి రెండాశ్వాసములకు మూలము సంస్కృత కుమార సంభవములో లేదు. అయితే మిగతా దంతయు సంస్కృత కుమార సంభవమును అనుసరించిన ప్రణాలికయే. కాకపోతే అశ్వాససంఖ్యయందు మార్పు కలదు. మొదటి రెండాశ్వాసముల కధ శైవాగమ పద్దతికి అనుకూలముగా శైవపద్దతిలో ప్రసిద్ధమైన దక్షాధ్వర ధ్వంస కధనమును తన గ్రంధమున అధికముగ చేర్చినాడు.ఈ కధవలన చోడుడొక ప్రయోజనము నాశించియుండెను.ఈ కధయందు శివుడు వేదబాహ్యుడు కాడనియు, అతడే వరదైవమనియు నిరూపితము చేసినాడు.కాళిదాసీ కధ నికటి రెండు శ్లోకములలో సూచించి యున్నాడు.చోడుడా శ్లోకములందలి భావమును గ్రహించి పెంపుజేసి రెండాశ్వాసములుగా రచించినాడు. కాళిదాసు ప్రధమ సర్గను హిమవద్వర్ణనతో ప్రారంభించెను. పూర్వ పీఠిక వంటి రెండాశ్వాసములను వదలి చూచినచో చోడుడును గంధమును హిమద్వర్ణనతోనే ప్రారంభించెను. హిమద్వర్ణానంతరము రెండు కావయములలోను కధ మైనాకుడి పుట్టుకతో ప్రారంభమయ్యెను.అభ్రాతృక కన్యా వివాహము నిషిద్దము గావున పార్వతి సబ్రాతృక యని తెలుపుట కాళిదాసు మైనాక జననమును వర్ణించెనని మల్లినాధసూరి తన వ్యాఖ్యానములొ పేర్కొనెనను.చోడుడతడు పరమేష్ఠి వరప్రసాదమన పుట్టినటులు పేర్కొనుట్ అధికము. తరువాత 'అపగత పుత్రావలోకన సుఖ తత్పరులై' (తె.కు.సం.3-21) మేనకా హిమవంతులు సతీదేవి తన పుత్రికగా జన్మిచుటకు శక్తినారాధించినటుల తెలుగులో వర్ణితము. సంస్కృతములో మేనక యెన్నో వ్రతములు గావించినటులు ఉన్నది కాని పుత్రికకై ప్రాకునాడినట్లు లేదు. సంస్కృతములో హిమవంతునికి పెక్కుసంతానమున్నట్లు వర్ణితము. (సం.కు.సం. 1-27). కాని తెలుగులో పారవతికి ముందు మైనాకుడొక్కడే యున్నట్లు వర్ణితము. (తె.కు.సం.3-20, 21). అటుపై పార్వతి జనన వర్ణన రెండింటిలోను సమానమే. పార్వతి బాల్య వర్ణన తెలుగులో పెంపు జేయబడెను.శైశవ క్రీడా సమయములో శివార్చన గావించెడిదట (తె.కు.సం.3-36). కాళిదాసు పార్వతి యొక్క ప్రాక్తన జన్మవిద్య యుపదేశకాలములో అనగా సకాలములో ప్రారంభమయ్యెను అని వర్ణించెను.చోడుడట్లా ఊరుకొనక ఇందుకూడ శివభక్తి స్ఫురింపజేసెను. సంస్కృతములో కౌమారము ప్రత్యేకముగా వర్ణించబడలేదు.అటుపౌ పార్వతి యౌవనమును ఇద్దరు సమానముగా వర్ణించిరి.కాళిదాసు 17 శ్లోకములలోను, చోడుడు 37 గద్యపద్యములలోను వర్ణించిరి.కాళిదాసు పార్వతిని 'కామస్య పుష్పవ్యతిరిక్త మస్త్రం' అని వర్ణించగా చోడుడు 'మన్మధనారి సమర్పనున్న కోమల తర పుష్ప బాణ ' అని సవరించెను.పార్వతి యౌవన వర్ణన సమాప్తిలో ఇరువురును రెండు పద్యములను వ్రాసిరి. అటుపై నారదుడు హిమవంతుని ఇంటికేతెంచుట రెండు గ్రంధములలోను సమానమే.నారదడు హిమవంతునికి ఆమె పరమేశ్వరునికి అగ్రమహిషి అగుననని తెలుపుట సమానమే. అటుపై శివుడు హిమగిరికి తపస్సునకై యేతెంచుట రెండింటిలోను వర్ణించబడినది.శివుడు గంగా ప్రవాహము చెంత తపస్సునకై స్థల నిర్దేశము గావించుకొనెనని కాళిదాసు వర్ణించినాడు.దానినే చోడుడు అనుసరించినాడు.పరమేశ్వరుడు తపస్సు గావించు కొనుటకు ఏయే సాధనములు మూలములో ఒక్క శ్లోకములో వర్ణించగా (సం.కు.సం.1-57) చోడుడు దాని అయిదు పద్యములలో వర్ణించెను. (తె.కు.సం.3-91 నుండి 95).అటుపై తపస్సు చేయుచున్న పరమేశ్వరుని సేవించుటకు హిమవంతుడేతెంచుట ఇద్దరును వర్ణించిరి.ఇటులు మిగతా సర్గలలో పోల్చియున్నచో చోడుడు సంస్కృత మూలముతో సమానముగానే పెక్కు చోట్ల తెనుగించినాడు.

నోట్స్

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.