దేవానంద్ (ఆంగ్లం: Dev Anand) ( సెప్టెంబర్ 26, 1923 - డిసెంబర్ 3, 2011) సుప్రసిద్ధ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు.
దేవానంద్ | |
---|---|
జననం | ధరందేవ్ పిశోరిమల్ ఆనంద్ సెప్టెంబర్ 26, 1923 గురుదాస్‌పూర్, పంజాబ్ |
మరణం | డిసెంబర్ 3, 2011 |
మరణ కారణం | గుండె పోటు |
వృత్తి | నటుడు, చిత్ర నిర్మాత, చిత్ర దర్శకుడు |
జీవిత భాగస్వామి | కల్పనా కార్తిక్ |
పిల్లలు | 1 కొడుకు (సునీల్ ఆనంద్); 1 కూతురు దేవిన |
దేవానంద్, ప్రఖ్యాత గాయని, నటి సురయ్యా 1948 నుంచి 1951 మధ్య ఆరు చిత్రాలలో కలిసి నటించారు. విద్య (1948) చిత్రం లోని కినారె కినారె చలెజాయెంగె పాట చిత్రీకరణ సమయంలో పడవ మునిగినప్పుడు, నీటిలో పడి మునిగిపోతున్న సురయ్యాను దేవానంద్ రక్షించి ఆమె ప్రేమ చూరగొన్నాడు. జీత్ చిత్రం చిత్రీకరణ సమయంలో దేవ్ ఆనంద్ తన ప్రేమ వ్యక్త పరిచాడు. అయితే వీరి ప్రేమకు సురయ్యా తల్లి సానుకూలమయినా, హిందువయిన దేవానంద్ తో పెళ్లేమిటని సురయ్యా అమ్మమ్మ తీవ్రంగా నిరసించింది. దేవ్ ఫోన్ చేస్తే పరుషంగా మాట్లాడి, దేవ్ మనసును గాయపరిచింది. అయినా దేవ్, దివేచా అనే సినీఛాయాచిత్రకారుడి ద్వారా సురయ్యాకు 3000 రూ||లు ఖరీదు చేసే వజ్రపుటుంగరాన్ని పంపితే సురయ్యా మహదానంగా స్వీకరిస్తే తన కథ సుఖాంతమని భావించాడు దేవ్. చనిపోతామని బెదిరించి, సురయ్యా మనస్సు మార్చారు ఆమె బంధుగణం. భగ్న హృదయురాలైన సురయ్యా దేవ్ పంపిన ఉంగరాన్ని సముద్రంలో విసిరేసింది. దేవ్ కు ఈ పరిణామాలు శరాఘాతమయ్యాయి. దో సితారె (1951) వీరిరువురూ కలిసి నటించిన చివరి చిత్రం. సురయ్యా జీవితాంతం అవివాహత గానే మిగిలిపోయింది. సురయ్యా తన 75వ సంవత్సరంలో (2004) ముంబాయిలో కన్ను మూసింది. విఫల ప్రేమ దేవానంద్ లో పట్టుదల పెంచి మంచి నటుడ్ని చేసింది.
తన సహ నటి కల్పనా కార్తిక్ ( అసలు పేరు మోనా సింగ్ ) తో ప్రేమలో పడి, టాక్సీ డ్రైవర్ చిత్రం, చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి, చావు వ్యక్తిగత వ్యవహారాలని గట్టిగా నమ్మే దేవానంద్ తన పెళ్ళి నిరాడంబరంగా, అతి కొద్ది మంది వ్యక్తుల మధ్య జరుపుకున్నాడు. ముస్లిం అయిన సురయ్యాతో వివాహానికి మతం అడ్డొస్తే, క్రిస్టియన్ అయిన మోనా సింగ్ తో వివాహానికి మతం అడ్డురాలేదు.
దేవ్, కల్పానా లకు ఇద్దరు సంతానం. కొడుకు సునీల్ ఆనంద్, కూతురు దేవిన. సునీల్ ఆనంద్ (1956) ఆనంద్ ఔర్ ఆనంద్ (1984) చిత్రంతో నటన ఆరంభించి మరో మూడు చిత్రాలు చేశాడు. చివరి చిత్రం మాస్టర్ (2001). నటుడిగా సఫలత పొందలేదు. నవకేతన్ సంస్థ చిత్ర నిర్మాణ నిర్వహణలో ప్రస్తుతం పాల్గొంటున్నాడు.
బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుభి మోగించిన గైడ్ చిత్రం పెక్కు విశేషాలను కలిగి ఉంది. ఈ చిత్రంలో నాయికగా నటించమని వహీదారెహమాన్ ను దేవానందే కాకుండా సత్యజిత్ రే కూడా అడగటం జరిగిందని కొందరు చెప్తారు. అయితే ఈ చిత్రం చిత్రీకరణ హక్కులను దేవానంద్ రచయిత ఆర్కె నారాయణ్ నుంచి ముందు పొందటం జరిగింది. ఈ చిత్రానికి అంకురార్పణే ఒక కథ. దేవ్, హం దొనో చిత్రం 1962 బెర్లిన్ చలనచిత్రోత్సవానికి, భారత దేశ అధికారిక చిత్రంగా ఎంపికయ్యింది. అక్కడే దేవానంద్ అమెరికా దర్శకుడు టాడ్ డేనియల్ (మాతృ దేశం పోలండ్ ) ను కలవటం జరిగింది. టాడ్, పెర్ల్ ఎస్ బక్ (నోబుల్ సాహిత్య గ్రహీత) ఆహ్వానం పై అమెరికా వెళ్లి వారితో వ్యాపార ఒప్పందం చేసుకొని గైడ్ చిత్రంలో నటించటానికి అంగీకరించాడు.
గైడ్ చిత్రానికి ముగ్గురు దర్శకులు. ఆంగ్ల చిత్రానికి టాడ్ డేనియల్ దర్శకత్వం వహించాడు. చిత్రానువాదం పెర్ల్ ఎస్ బక్, టాడ్ డేనియల్ సంయుక్తంగా నిర్వహించారు. స్ట్రాట్టన్ ఇంటర్నేషనల్ పతాకం కింద, టాడ్ డేనియల్ నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించాడు. ఒకే సారి ఆంగ్ల, హిందీ చిత్రాల చిత్రీకరణ సాంకేతిక కారణాలవలన సాధ్యం కాకపోవటం తో, తొలుత ఆంగ్ల చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ కారణంగా హిందీ చిత్రం ఆలస్యం అవటం వలన అప్పటి దాక దర్శకత్వం వహించిన చేతన్ ఆనంద్, తన సొంత చిత్రం హకీకత్ నిర్వహణ బాధ్యతను నిర్వహించటానికై, గైడ్ దర్శకత్వ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. విజయ ఆనంద్ గైడ్ దర్శకత్వం స్వీకరించాడు. ఆంగ్ల చిత్రానువాదం కాకుండా, భారతీయ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త చిత్రానువాదం తయారు చేశాడు. మనసంతా లగ్నం చేసి దర్శకత్వం వహించిన విజయ్ ఆనంద్ కృషి ఫలించి అనుకున్న విధంగా తీయగలిగాడు.
ఈ లోపు ఆంగ్ల చిత్రం విడుదలయ్యింది. అయితే చిత్రానువాదం పేలవంగా ఉండి, ఆంగ్ల ప్రేక్షకులను చిత్రం ఆకట్టుకోలేక పోయింది. చిత్రం పరాజయం పాలయ్యింది. ముంబాయిలో హిందీ చిత్రం అక్కడి ప్రముఖులకు చూపించినా, ఒకరూ నోరు విప్పి చిత్రం పై తమ అభిప్రాయం చెప్పలేదు. చిత్రంలో నాయకుడు ఒక వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరచుకొంటాడు. ఆమెను మోసం చేసి జైల్ కు వెళ్తాడు. చివరకు ఒక సాధువుగా మారి, ఎడారిలో నిరాహార దీక్ష చేసి మరణిస్తాడు. ఎప్పుడూ అందంగా కనిపించే దేవ్ చిత్రంలో అందవిహీనంగా కనిపించటాన్ని విమర్శకులు ఏకి పారేసారు. నాయకుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడం భారతీయ చిత్రాలకు తగని పని. చిత్రం కొనటానికి పంపిణీదారులెవరూ ముందుకు రాలేదు. దేవానంద్ పని అయిపోయింది, దివాళా తీయటం తప్పదని గిట్టని వాళ్లు ప్రచారం మొదలెట్టారు.
ఢిల్లిలో ఈ చిత్రం ముందుచూపు కు, ప్రధాన మంత్రి మినహాయించి భారత ప్రభుత్వ మంత్రులంతా హాజరయారు. కుర్చీలు లేక కొందరు ప్రభుత్వాధికారులు నిల్చుని కూడా చిత్రాన్ని ఆసాంతం, ఆసక్తిగా చూశారు. 1965 ఫిబ్రవరి 6 న చిత్రం విడుదలయ్యింది. పంపిణీదారులు ఆసక్తి చూపక పోయినా, గైడ్ చిత్రం గురించి ప్రచారంలో వున్న వార్తలు ప్రేక్షకులను చిత్రశాలలకు రప్పించాయి. విజయానంద్ పఠిష్టమైన చిత్రానువాదం, దర్శకత్వం, కథలో వైవిధ్యం, ఎస్.డి.బర్మన్ సంగీతం, వహీద నృత్యాలు, దేవానంద్ నటనా కౌశల్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్రం ఒక కళాఖండమయ్యింది. ప్రేక్షకులు గైడ్ చిత్రాన్ని మరల మరలా చూసి కాసుల వర్షం కురిపించారు. గైడ్ సంగీత దర్శకత్వం మినహాయించి మిగతా అన్ని శాఖలలోను ఫిల్మ్ ఫేర్ ఉత్తమ బహుమతులను 7 శాఖలలో గెల్చుకొని, చిత్రరాజమై నిల్చుంది గర్వంగా. చాలా సంవత్సరాల తర్వాత, దూరదర్శినిలో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు రహదారులలో వాహనాలు తగ్గాయి, మనుషులు లేరు. ఎవరిళ్లలో వారు ఈ చిత్రాన్ని టి.వి.లో చూస్తూ కుర్చీలకతుక్కుపోయారు. విదేశీ చిత్రాల కోవలో, ఆస్కార్ చిత్రోత్సవానికి భారత దేశ అధికార చిత్రంగా ఎంపికయ్యింది. విడుదలయిన 42 ఏళ్ల తర్వాత, 2007 లో కేన్స్ చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దేవానంద్, వహీదా రెహమాన్ ల నట జీవితంలో గైడ్ ఒక అణిముత్యమై ప్రకాసిస్తుంది.
అయితే, ఈ చిత్రం చూసాక రచయిత ఆర్కె నారాయణ్ పెదవి విరచాడు. Misguided guide అని తన అసంతృప్తిని వ్యక్త పరిచాడు. ఒక నవలను సినిమాగా తీసి రచయితను మెప్పించటం ఎవరికైనా కత్తిమీద సామే.
అవార్డులు
పౌర సత్కారాలు
- 2001 – పద్మభూషణ్ పురస్కారం (భారతదేశపు మూడవ అత్యున్నత అవార్డు) [1]
భారత జాతీయ సినిమా అవార్డులు
- 2002 – దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, (భారతదేశపు అత్యున్నత సినిమా సత్కారం) [2]
భారత్ - పాకిస్తాన్ భాయి భాయి
నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి, దేవ్ ను ప్రత్యేక అతిథిగా అహ్వానించారు. పండిట్ జవహరలాల్ నెహ్రును దేవ్ ఇక్కడే మొదటిసారి దగ్గరిగా చూసాడు. ప్రధాని సహాయ నిధి కై, ఢిల్లీ లో, చిత్ర పరిశ్రమ ప్రత్యేక వినోద కార్యక్రమాల సాయంత్రం నిర్వహించింది. ఓ మేరె వతన్ కె లోగో అనే పాట లత పాడితే నెహ్రూ కళ్లు చెమర్చాయి. ఈ ప్రదర్శనకు వచ్చిన అప్పటి ప్రముఖ నట త్రిమూర్తులను నెహ్రూ తన తీన్ మూర్తి నివాసానికి ఆహ్వానిస్తే, అక్కడకు వెళ్లిన దేవ్ ఆనంద్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్ లకు ఇందిరా గాంధి స్వయంగా స్వాగతం చెప్పింది. తేనీరిచ్చి, నెహ్రూ వద్దకు తీసుకెళ్లింది. నెహ్రూ చెప్పిన కబుర్లు దేవ్ ఒక చిన్న పిల్లాడిలా ఆసక్తిగా విన్నాడు. దేవ్ అమెరికాలో ఉన్నప్పుడు, నెహ్రూ మరణ వార్త విని, ఖిన్నుడయ్యాడు. అక్కడి (అమెరికా) ప్రముఖ దిన పత్రికలు నెహ్రూ మరణ వార్తను ప్రముఖంగా ప్రచురించటం దేవ్ గమనించాడు.
దేవానంద్ సాహసవంతుడు. అత్యవసర పరిస్థితి (Emergency) విధించిన ఇందిరా గాంధికి వ్యతిరేకంగా, 1977 పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం చేశాడు. National Party of India అనే రాజకీయ పార్టీని స్థాపించి తరువాత దానిని నిర్వీర్యం చేశాడు. భారత్, పాక్ ల మధ్య సత్సంబంధాలకై తపన పడేవాడు. 10 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని వాజ్‌పేయి జరిపిన లాహోర్ బస్ యాత్రలో దేవ్ పాల్గొన్నాడు.
మరణం
యునైటెడ్ కింగ్‌డం, లండన్లో గుండె పోటుతో 2011, డిసెంబర్ 3 న మరణించారు.
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.