From Wikipedia, the free encyclopedia
దేవి ప్రసాద్ రాయ్ చౌదరి (15 జూన్ 1899-15 అక్టోబర్ 1975) ఒక భారతీయ శిల్పి, చిత్రకారుడు, విద్యావేత్త. ఇతడు తన స్మారక కాంస్య శిల్పాలకు, ముఖ్యంగా శ్రామికుల విజయం, అమరవీరుల స్మారక చిహ్నానికి ప్రసిద్ధి చెందాడు. భారతీయ ఆధునిక చిత్రకళకు చెందిన ప్రధాన కళాకారులలో ఒకడిగా అనేకులచే పరిగణించబడ్డాడు.[1] ఇతడు జలవర్ణాలు, ప్రకృతి దృశ్యాలతో సహా విస్తృత మాధ్యమాలలో పనిచేశాడు. భారీ శిల్పాలు ఇతని ప్రత్యేకత. సామాజిక వాస్తవికతను తన కళకు మూలస్తంభంగా మలిచాడు. పెయింటింగ్, శిల్పకళలతో పాటు, ఇతనికి మల్లయుద్ధం, వేణుగానం, వేటలలో ప్రావీణ్యం ఉంది. తన ఖాళీ సమయంలో చిన్న కథలు రాశాడు.[2][3]ఇతడు 1929 నుండి 1957 వరకు మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ కు ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. ఆ సమయంలో ప్రభుత్వ విద్యా సంస్థకు నాయకత్వం వహించిన తొలి భారతీయులలో ఇతను ఒకడు.[4] కళల రంగంలో ఇతను చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1958లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో సత్కరించింది.[5] 1962లో లలిత కళా అకాడమీకి ఫెలోగా ఎన్నికయ్యాడు.[6]
దేవీప్రసాద్ రాయ్ చౌదరి MBE | |
---|---|
జననం | తేజత్, రంగ్‌పూర్ జిల్లా, బ్రిటిష్ ఇండియా | 1899 జూన్ 15
మరణం | 1975 అక్టోబరు 15 76) మద్రాస్, తమిళనాడు | (వయసు
వృత్తి |
|
ప్రసిద్ధి | కాంస్య విగ్రహాలు శ్రామిక విజయం అమరవీరుల స్మారకం పాట్నా |
భార్య / భర్త | చారులతా రాయ్ చౌదరి |
పిల్లలు | 1, భాస్కర్ రాయ్ చౌదరి |
పురస్కారాలు | పద్మభూషణ్ (1958) ఫెలో ఆఫ్ లలిత కళా అకాడమీ(1962) |
రాయ్ చౌదరి 1899 జూన్ 15న బ్రిటిష్ ఇండియా అవిభక్త బెంగాల్లోని రంగ్పూర్ జిల్లా తేజత్ గ్రామంలో ఒక జమీందారీ కుటుంబంలో జన్మించాడు.(ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉంది). తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఇంటి నుండి చేశాడు.[7] ప్రఖ్యాత బెంగాలీ చిత్రకారుడు అబనీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో ఇతడు తన మొదటి చిత్రలేఖన పాఠాలు నేర్చుకున్నాడు.[8] బోయిస్ అనే ఇటాలియన్ చిత్రకారుడి వద్ద పాశ్చాత్య శైలిలో చిత్రలేఖనం నేర్చుకున్నాడు. అటుపిమ్మట హిరణ్మయ్ రాయ్ చౌదరి మార్గదర్శకత్వంలో శిల్ప శిక్షణ పొందాడు.[2]
రాయ్ చౌదరి కళలోకి రావాలనే ఆసక్తి ఇతడికి, ఇతని కుటుంబ పెద్ద అయిన ఇతని జమీందార్ తాతకు మధ్య విభేదాలకు కారణమైంది. ఫలితంగా ఇతడు తన ఆస్తిని వదులుకుని ఉత్తర కోల్కతా ఒక నాటకశాలలో చిత్రకారుడిగా పని చేయాల్సి వచ్చింది. నగరంలోని బాలుర పాఠశాలలో చిత్రకళను బోధించాడు. కొంతకాలం శాంతినికేతన్లో చిత్రకళ ఉపాధ్యాయునిగా పని చేశాడు. అక్కడ ఇతని వద్ద శిష్యరికం చేసినవారిలో రాంకింకర్ బైజ్ ఒకడు.[4]
రాయ్ చౌదరి 1929లో మద్రాసు స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో సూపరింటెండెంట్ గా చేరాడు. ఆ విధంగా బ్రిటిష్ వారు నడుపుతున్న విద్యా సంస్థకు నాయకత్వం వహించిన తొలి భారతీయులలో ఇతడు ఒకడు అయ్యాడు. ప్రైవేట్ పనులను చేపట్టడానికి తనను అనుమతించాలనే ఒప్పందం మీద ఈ పదవిని అంగీకరించాడు.[9] పాఠశాలలో తన ముప్పై సంవత్సరాల కాలంలో, ఇతడు దక్షిణ భారతదేశంలోని అనేక మంది కళాకారులకు స్ఫూర్తినిచ్చాడు. అప్పటి వరకు సంప్రదాయ చిత్రాలను మాత్రమే రూపొందించిన విద్యార్థులలో సృజనాత్మకతను ప్రేరేపించడానికి తోడ్పడ్డాడు. ఇది ఆధునిక కళల కేంద్రంగా పాఠశాల ప్రస్తుత రూపురేఖలను పూర్తిగా మార్చింది.[4] తదనంతరం, ఇతడు చేసిన సేవలకు గాను 1937లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ఎంబీఈ సత్కరించింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా పాఠశాలకు బాధ్యత వహించినప్పటికీ, రాయ్ చౌదరి ఒక కళాకారుడిగా ఎన్నో కళాఖండాలను సృష్టించాడు. ఇతడు రెండు స్టూడియోలను నిర్వహించేవాడు, ఒకటి తన నివాసంలో, మరొకటి పాఠశాలలో. ఇతడు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు, ఎక్కువగా పెద్ద ఎత్తున శిల్పాలపై పనిచేశాడు. అయితే, ఇతడు తన జీవితకాలంలో కళాప్రదర్శనను నిర్వహించలేదు. దానికి కారణం ఇతడు ఈ క్రింది విధంగా పేర్కొంటాడు:
నా నిరాడంబరమైన స్టూడియోను కళకు అంకితమైన పాత, పవిత్రమైన ఆలయంగా నేను భావిస్తాను. నేను సృష్టించే వస్తువులను పూజిస్తాను. వాటిని ప్రజల దృష్టికి అప్పుడప్పుడు తీసుకెళ్లడం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కళను నిజంగా ఇష్టపడే వారికి నా స్టూడియోకు స్వాగతం. ఒక గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని భక్తులు సందర్శించరా?[2]
1954లో లలిత కళా అకాడమీ స్థాపించబడినప్పుడు, ఆయన వ్యవస్థాపక ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[10] 1955లో టోక్యోలో నిర్వహించిన యునెస్కో ఆర్ట్ సెమినార్, 1956లో చెన్నైలో నిర్వహించిన నిఖిల్ భారత్ బంగియా సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.[7] తన కళతో పాటు, ఆ సమయంలో బెంగాలీ పత్రికలలో చిన్న కథలను ప్రచురించి కథకునిగా కూడా బాగా ప్రసిద్ధి చెందాడు.
రాయ్ చౌదరి ఠాగూర్ మార్గదర్శకత్వంలో చదువుకున్నప్పుడు, ఇతడు ప్రధానంగా తన గురువు శైలి, టెక్నిక్ లో చిత్రాలను రూపొందించాడు. ఫ్లాట్ టోన్లతో వాష్ టెక్నిక్లో ప్రవహించే గీతలు ఇతడి ప్రారంభ చిత్రాలలో కనిపిస్తాయి. ఇతడి చిత్రాలలోని అంశాలు ఎక్కువగా పౌరాణిక ఇతివృత్తాలపై ఆధారపడి ఉండేవి. పాశ్చాత్య కళా పద్ధతులకు పరిచయం అయిన తరువాత, పాశ్చాత్య విద్యా శైలిలో కళాకృతులను సృష్టించాడు.[4] తన జీవితపు తరువాతి భాగంలో, చౌదరి సామాన్యుల వైపు ఆకర్షితుడయ్యాడు. పేద ప్రజలతో మమేకమై నమూనాల నుండి కాకుండా జీవితం నుండి గీయడం ప్రారంభించాడు. అంతేకాకుండా అనేక ప్రకృతి దృశ్య చిత్రాలను కూడా రూపొందించాడు. ఇతని చిత్రాలలో తను వేటాడే సమయంలో పరిశీలించిన జంతువుల హావభావాలు కూడా ఉన్నాయి.[9] రాయ్ చౌదరి టెంపెరా, ఆయిల్, వాటర్ కలర్, పేస్టెల్స్ వంటి వివిధ మాధ్యమాలతో ప్రయోగాలు చేశాడు. 1930లలో, పాశ్చాత్య కళా విమర్శకులు ఇతడిని తైలవర్ణ చిత్రకళారంగంలో ఇతడు చేసిన కృషికి ప్రపంచంలోని అత్యుత్తమ పోర్ట్రెయిట్ చిత్రకారులలో ఒకడిగా పరిగణించారు.[11] చెన్నైలో ఇతడు రూపొందించిన కొన్ని ప్రముఖ చిత్రాలు గ్రీన్ అండ్ గోల్డ్ (లండన్లోని రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్లో ప్రదర్శించబడింది) ,ఆఫ్టర్ ది స్టార్మ్ (జపనీస్ వాష్ టెక్నిక్) నిర్వాణ, బ్రిడ్జ్, ది ప్యాలెస్ డాల్, దుర్గా పూజ ఊరేగింపు, అభిసారిక , పూజారిణి మొదలైనవి.[2]
రాయ్ చౌదరి నైపుణ్యం కలిగిన చిత్రకారుడైనప్పటికీ, ఇతడు తన ముద్రాత్మక శైలిలో తన శిల్పాలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందాడు. శిల్పాన్ని చెక్కడం కంటే దానిని పోతపోయడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఇతడు ఫ్రెంచ్ శిల్పి అగస్టే రోడిన్ శిల్పాలచే ప్రభావితమయ్యాడు .[12] కోల్కతాలో తన ప్రారంభ రోజులలో, ఇతడు సర్ జె. సి. బోస్, పెర్సీ బ్రౌన్, శ్రీమతి బ్రౌన్ విగ్రహాలను నిర్మించాడు. చెన్నైలో ఉన్నప్పుడు, సి. వి. కుమారస్వామి శాస్త్రి (ప్రధాన న్యాయమూర్తి, మద్రాస్ హైకోర్టు) లార్డ్ ఎర్స్కిన్ (మద్రాస్ గవర్నర్), జిటి బోగ్ (ఒరిస్సా గవర్నర్) జార్జ్ స్టాన్లీ (మద్రాస్ గవర్నర్), సి.పి రామస్వామి అయ్యర్, సి.ఆర్. రెడ్డి, సి. అబ్దుల్ హకీమ్, అన్నీ బెసెంట్, అశుతోష్ ముఖర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మహాత్మా గాంధీ , మోతీలాల్ నెహ్రూ వంటి ప్రముఖుల ప్రతిమలను చెక్కాడు. ఇవి రాయ్ చౌదరి స్మారక కృతులుగా పరిగణించబడ్డాయి.[2]తన తరువాతి శిల్పాలలో, రాయ్ చౌదరి తన చిత్రాల మాదిరిగానే తన పరిసరాల నుండి, సామాజిక పరిసరాల నుండి ప్రేరణ పొందాడు. ఇతడు 1930లలో పూర్తి చేసిన ట్రావెన్కోర్ ఆలయ ప్రవేశ ప్రకటన ఆయన మొదటి బహుళ-బొమ్మల శిల్పాలలో ఒకటి. ఇది ట్రావెన్కోర్ హిందూ దేవాలయాలలో దళితులను ప్రవేశించడానికి అనుమతించే ఆలయ ప్రవేశ ప్రకటన వర్ణించింది. 1943 నాటి బెంగాల్ కరువు యొక్క కొన్ని కదిలే చిత్రాలను కూడా ఇతడు రూపొందించాడు. దీనిలో ఒక తల్లి తన ఆకలితో ఉన్న శిశువుతో ఉన్నట్లు చూపించాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతని గొప్ప శిల్పాలు సామాజిక నిబద్ధత దేశం యొక్క వలసవాద వ్యతిరేక పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి.[9] ఇతడి శిల్పాలు, ది ట్రయంఫ్ ఆఫ్ లేబర్ (1954) , ది మార్టియర్స్ మెమోరియల్ (1956) ఈ విషయంలో సామాజిక వాస్తవిక చిత్రణలకు అత్యుత్తమ ఉదాహరణలుగా నిలిచాయి.[8]
1923 మే 1న, మలయపురం సింగరవేలు మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్తాన్ స్థాపించాడు. ఇది కార్మిక వర్గాల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉంది. కొత్తగా ఏర్పడిన పార్టీ ఆధ్వర్యంలో భారతదేశంలో మొదటిసారిగా ఈ రోజును అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకున్నందున మే రోజున పునాది వేడుక జరిగింది.సింగరవేలు మొదటి కార్మిక దినోత్సవ వేడుకలను నిర్వహించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న మెరీనా బీచ్ వద్ద రాయ్ చౌదరి శిల్పం ఉంది. ఇది ఒక భారీ బండను కదిలించడంలో మునిగి ఉన్న నలుగురు శ్రామికుల బొమ్మలను చూపిస్తుంది, వారు తమ పనిలో విజయం సాధించినట్లుగా కనిపిస్తారు, తద్వారా ఇది శ్రమ విజయాన్ని సూచిస్తుంది. ఈ శిల్పం భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కార్మికులు చేసిన తీవ్రమైన కృషిని, కృషిని ఎత్తి చూపుతుంది. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ భవనం వెలుపల కూడా ఇలాంటి శిల్పం ఉంది.
పాట్నా సచివాలయం వెలుపల ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం స్వాతంత్ర్యం సాధించడానికి భారతీయులు చేసిన త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. సచివాలయ భవనంపై జాతీయ జెండా ఎగురవేయడానికి క్విట్ ఇండియా ఉద్యమం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఏడుగురు యువకుల లైఫ్ సైజ్ (నిజ పరిమాణ) విగ్రహం ఇది. ఈ శిల్పంలో ప్రతి వ్యక్తి దృఢమైన వైఖరిని కదలికను చాలా సహజంగా కనిపిస్తుంది. ఈ శిల్పం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్టోబర్ 1956లో రాజేంద్ర ప్రసాద్ చేత ఆవిష్కరింపబడింది.[13]
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్, తీన్ మూర్తి మార్గ్ కూడలి వద్ద రహదారి వెంబడి దండి మార్చ్ ఆధారంగా గ్యారా మూర్తి అనే స్మారక శిల్పం నిర్మించబడింది. ఈ శిల్పాన్ని రూపొందించే పనిని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాయ్ చౌదరికి అప్పగించాడు ఈ శిల్పం ఉపరితలంపై 29 మీటర్ల పొడవు , 4 మీటర్ల ఎత్తు, 11 బొమ్మల కలయికతో రూపొందించబడింది. దీనిని 1982లో దేవి ప్రసాద్ రాయ్ చౌదరి మరణం తరువాత ప్రతిష్టించారు. ఈ శిల్పం యొక్క చిత్రం 500 రూపాయల భారతీయ కరెన్సీ నోటుపై కూడా ముద్రించబడింది.[14]ఆయన ఇతర ముఖ్యమైన శిల్పాలలో కొన్ని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం, గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) రిథమ్, ఆఫ్టర్ ది బాత్, ది లాస్ట్ స్ట్రోక్, విక్టిమ్స్ ఆఫ్ హంగర్ (1952) , వెన్ వింటర్ కమ్స్ (1955) మొదలైన కాంస్య విగ్రహాలున్నాయి.[15][16]
ఇతని చిత్రాలు, శిల్పాలు చెన్నైలోని ప్రభుత్వ మ్యూజియం, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, జగన్ మోహన్ ప్యాలెస్ శ్రీచిత్రాలయం, హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం, కేరళ ట్రావెన్కోర్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించబడ్డాయి. ఇండియన్ మాస్టర్స్, వాల్యూమ్ I, ది టూ గ్రేట్ ఇండియన్ ఆర్టిస్ట్స్, దేవి ప్రసాద్ 'స్ ఆర్ట్ అండ్ ఎస్తెటిక్స్ వంటి పుస్తకాలలో కనిపిస్తాయి.[1] [17][18][19]
1958లో భారత ప్రభుత్వం ఇతడికి మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రదానం చేసింది.[5] ఆయన 1962లో లలిత కళా అకాడమీ ఫెలోషిప్పును అందుకున్నాడు. ఆరు సంవత్సరాల తరువాత 1968లో కోల్కతాలోని రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం ఇతడిని డి.లిట్.. తో సత్కరించింది.[7]
రాయ్ చౌదరి చారులతను వివాహం చేసుకున్నాడు. వీరికి భాస్కర్ అనే కుమారుడు ఉన్నాడు. భాస్కర్ జానపద నర్తకుడు, నటుడు, కొరియోగ్రాఫర్, రచయిత, చిత్రకారుడిగా పేరు గడించాడు.[20]
రాయ్ చౌదరి చిన్నతనంలో ఒక మల్లయోధుడి వద్ద కుస్తీ నేర్చుకున్నాడు. మద్రాసు స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థుల అభ్యర్థన మేరకు వారికి కుస్తీ నేర్పడానికి అంగీకరించాడు. పాఠశాలలో ఇతడి స్టూడియో వెనుక ఉన్న వేప చెట్టు కింద ఒక అఖాడా (కుస్తీ పిట్) తవ్వబడింది. బలీయమైన మల్లయోధుడు కావడంతో, ఇతని శిక్షణలో ఉన్న విద్యార్థులు మరింత క్రమశిక్షణతో రాటుదేలారు. క్రీడకు సంబంధించిన కొన్ని క్లిష్టమైన మెళకువలను నేర్చుకున్నారు.[21]
రాయ్ చౌదరి 1975 అక్టోబరు 15న మద్రాసులో డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో మరణించాడు.[22][23] 1993లో కోల్కతా లో ఇతని మొదటి సోలో ఎగ్జిబిషన్ను నిర్వహించారు, దీని తరువాత బిర్లా అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, కోల్కతా, జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, ముంబై, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, ఢిల్లీ లలిత్ కళా అకాడమీ, న్యూ ఢిల్లీతో సహా భారతదేశంలో అనేక ప్రదర్శనలు జరిగాయి.[24]1959లో అంతర్జాతీయ కార్మిక సంస్థ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ తపాలా బిళ్ళ ఇతని శిల్పం, ది ట్రయంఫ్ ఆఫ్ లేబర్ ప్రదర్శించబడింది.[25] 1967లో క్విట్ ఇండియా ఉద్యమం రజత జయంతి సందర్భంగా అమరవీరుల స్మారక చిహ్నం భారత తపాలా బిళ్ళపై కనిపించింది.[26]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.