Remove ads
తెలుగు రచయిత From Wikipedia, the free encyclopedia
దాశరథి రంగాచార్య(ఆగస్టు 24, 1928 - జూన్ 8, 2015) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.
దాశరథి రంగాచార్య | |
---|---|
జననం | దాశరథి రంగాచార్య ఆగస్టు 24, 1928 చిట్టి గూడూరు, ఖమ్మం జిల్లా, తెలంగాణ |
మరణం | జూన్ 8, 2015 |
ఇతర పేర్లు | దాశరథి రంగాచార్య |
ప్రసిద్ధి | తెలుగు కవులు, తెలుగు రచయితలు, తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుడు |
దాశరథి రంగాచార్యులు 1928, ఆగస్టు 24 న మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూర్ మండలం,చిన్నగూడూర్ లో గ్రామం జన్మించారు. ఆయన అన్న కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.
నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.
తండ్రి కుటుంబ కలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.
కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి లో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.[1]
తెలంగాణాసాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు "జనపదం"లో అక్షరీకరించారు.
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. "
దాశరథి రంగాచార్యులు రాసిన "చిల్లర దేవుళ్లు" నవల సినిమాగా తీశారు. టి.మాదవరావు దర్శకత్వంలో నిర్మించిన చిల్లర దేవుళ్లు ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పలు భాషలలోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళప్రాచుర్యం పొందింది.
దాశరథి రంగాచార్యులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ పోరాట క్రమానికి నవలల రూపం కల్పించడం, తెలంగాణ ప్రాంత చారిత్రిక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ జీవనయానం వంటివి సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.
దాశరథి రంగాచార్యుల "చిల్లర దేవుళ్లు" నవలకు ఆంధ్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందు వల్ల రంగాచార్యులను, "అభినవ వ్యాసుడు" బిరుదు ప్రదానం చేశారు. 21-1-1994న ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్యులు దంపతులకు సత్కరించారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాశరథి రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు జరిగాయి.
గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్ సోమాజిగుడాలోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దాశరథి (86) 2015, జూన్ 8 సోమవారం ఉదయం కన్నుమూశారు.[3]
రంగాచార్యులు నవలలు, ఆత్మకథ, వ్యాసాలు, జీవిత చరిత్రలు, సంప్రదాయ సాహిత్యం తదితర సాహితీప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు.
వట్టికోట ఆళ్వారుస్వామి నిజాం పాలనలో తెలంగాణా జనజీవితాన్ని ప్రతిబింబించే నవలలు రాయాలని ప్రారంభించి ప్రజల మనిషి, గంగు నవలలు రాసి మరణించారు. ఆయన ప్రారంభించి పూర్తిచేయని ప్రణాళికను రంగాచార్యులు స్వీకరించారు.[4][5] ఆ క్రమంలో ప్రజలలో విప్లవబీజాలు పడుతున్నకాలాన్ని స్వీకరించి చిల్లరదేవుళ్ళు రాశారు. నిజాంపాలనలో ప్రజలపై జరిగిన దౌర్జన్యం, వెట్టిచాకిరీ, ఆడబాప వంటి వ్యవస్థలు, జనంలో పెరుగుతున్న అసహనం, అప్పటి ఆంధ్రోద్యమం, మతమార్పిడులు, వాటిని వ్యతిరేకిస్తూ తిరిగి హిందూమతంలోకి తెస్తున్న ఆర్యసమాజ్ వంటివన్నీ చిల్లరదేవుళ్ళు నవలలో చిత్రీకరించారు.[6] విప్లవానికి నేపథ్యాన్ని చిత్రించేందుకు నవల పనికివచ్చింది. విప్లవబీజాలు ఎదిగి ప్రజాపోరాటానికి దారితీస్తున్న కాలాన్ని (1940 దశకం) స్వీకరించి తర్వాతి నవల మోదుగుపూలు రాశారు. ఈ నవలలో నిజాం రాజ్యంలో ఉండే జాగీర్దారు అధీనంలోని ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. పత్రిక చదవడం కూడా నిషేధమైన అనూహ్యమైన స్థితిగతుల్లో, ఊరికి వచ్చిన వ్యక్తి పత్రిక చదివించడమే కాక గ్రంథాలయం కూడా పెట్టించడం, అది తగలబడిపోతే అడవిలోని ఆటవికులను చేరదీసి విప్లవం రేకెత్తిస్తాడు. 1940ల్లో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రాంతంలో ఏర్పడిన సాయుధపోరాట కాలాన్ని నవల ప్రతిబింబిస్తుంది.[7] తెలంగాణాలో సాయుధ పోరాటం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, సాంఘిక స్థితిగతుల నేపథ్యంలో జనపథం నవల రాశారు. 1948లో తెలంగాణా నిజాం పరిపాలన నుంచి విముక్తం కావడం మొదలుకొని, 1970ల్లో అంకురించిన వామపక్ష తీవ్రవాద ఉద్యమాలు (నక్సలైట్ పోరాటాలు) వరకూ నవల సాగుతుంది.[5] తెలంగాణా జనజీవితంలో 1938నాటి స్థితిగతులు ప్రతిబింబిస్తూ చిల్లర దేవుళ్లు, 1942 నుంచి 1948 వరకూ సాగిన తెలంగాణా సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ మోదుగుపూలు, 1948 నుంచి 1968 వరకూ జరిగిన పరిస్థితులు చూపిస్తూ జనపథం రాశారు. మొత్తంగా అలా తెలంగాణా సాయుధ పోరాటపు ముందువెనుకలను నవలల్లో చిత్రించాలన్న తన ప్రణాళిక నెరవేర్చుకున్నారు.[8] దాశరథి రంగాచార్యులు సికిందరాబాద్ పురపాలక కార్పొరేషన్ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాకా ఆయనకు ప్రభుత్వం వెస్ట్ మారేడ్ పల్లిలో భూమి కేటాయిస్తే, ఇల్లుకట్టుకున్నారు. దగ్గరలో స్థిరపడ్డ పేదల ఇళ్ళు, స్థలాలు ఆక్రమించుకుని ఒక గూండా వారిని అన్యాయం చేస్తుంటే రంగాచార్యులు అతన్ని ఎదరించి నిలిచారు. మురికివాడల్లోని పేదల్లో కొందరిని ఆ గూండా కొనేయడంతో విఫలమైన ఆ ఉద్యమం ఫలితంగా మాయ జలతారు నవల వెలువడింది. బతికేందుకు నగరం చేరుకుని మురికివాడల్లో నివసించే పేదల జీవితాలు, వాటి చుట్టూ అల్లుకున్న ధనరాజకీయాలు మాయ జలతారు నవలలో వస్తువుగా స్వీకరించారు.[5] అమృతంగమయ నవలలో ఓ గ్రామం పుట్టుక నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ పోవడాన్ని చిత్రీకరించారు. విశిష్టమైన శైలిలో రాసిన ఈ నవలలో మహాత్మా గాంధీ ప్రవచించిన గ్రామస్వరాజ్యం అంశాన్ని ప్రధానంగా స్వీకరించారు. గాంధేయవాదంతో పాటుగా నవలలో ఆధ్యాత్మికత వంటివి కూడా చూపించారు. గ్రామాల్లోని జనజీవనంలో ఆధునికత ప్రవేశించడంతో జరిగిన మార్పులు కథలో ముఖ్యంగా స్వీకరించారు.[9] రానున్నది ఏది నిజం? నవలలో భారతదేశం భవిష్యత్తు గురించి కన్న కలలను అక్షరబద్దం చేశారు. ఆ నవల రెండు భాగాలుగా వెలువడ్డ జనపథం నవలకు కొనసాగింపు.[10] 1970ల్లో తెలంగాణా ప్రాథమిక విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మకమైన పరిణామాల నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుని జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని చిత్రీకరిస్తూ రంగాచార్య రాసిన నవల పావని.[5]
దాశరథి రంగాచార్య వేదాలను తెలుగులోకి సంపూర్ణంగా అనువాదం చేసిన తొలి వ్యక్తిగా పేరుపొందారు. స్వయంగా మార్క్సిజాన్ని నమ్మే రంగాచార్య, వేదాల బోధనలు సమసమాజానికి దారులని నమ్మారు. మార్క్సునూ మహర్షిగా గౌరవించారు. ఆ నేపథ్యంలో తెలుగువారికి వేదాల సారం అందాలన్న ఆశయంతో వేదాలను తెలుగులోకి అనువదించారు. ఎమెస్కో విజయకుమార్ వాటిని ప్రచురించారు. తొలిప్రతిని ఒక గిరిజనుడు, ఒక దళితుడు, ఒక స్త్రీ చేతులకు అందించారు.[11][12] ఉర్దూ సాహిత్యంలో కళాత్మకమైన, చారిత్రిక నవలగా నిలిచిపోయిన మీర్జా రుస్వా ఉమ్రావ్ జాన్ అదా నవలను అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. 19వ శతాబ్దికి చెందిన లక్నో నగరపు వేశ్యాగృహాలను, సంగీత, సాహిత్య, నృత్యప్రదర్శనల సంస్కృతిని ఆధారం చేసుకుని రాసిన నవల అది. ఉమ్రావ్ జాన్ అనే సంగీత, సాహిత్య, నృత్యకారిణి, వేశ్య జీవితాన్ని నవలలో చిత్రించారు. ఉర్దూ సాహిత్యంలోనే తొలినవలగా పేరుపొందిన ఉమ్రావ్ జాన్ అదాను దాశరథి రంగాచార్య అందం చెడకుండా తెలుగులోకి అనువదించారు.[13]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.