Remove ads
స్వేచ్ఛా-విషయ విజ్ఞాన సర్వస్వం From Wikipedia, the free encyclopedia
బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టాడు. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. ఇది క్రమంగా తెలుగు భాషాభిమానులను విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ (టపా) తెలుగు వికీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. దానిని సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించాడు. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబరు 10న[1] ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియా మొదటి చిహ్నాన్ని (లోగోని) రూపొందించిన ఘనత ఆయనదే.
2003 డిసెంబరులో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. తన తరువాతి ప్రయత్నాలలో ఒక భాగంగా నాగార్జున రచ్చబండ వంటి తెలుగు సమాచార సమూహములలో ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రయత్నం సక్రమ ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. రావు వేమూరి, మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతను నిర్వహిస్తున్న కట్టా మూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి గ్రంథం, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన ఊరగాయ రుచులను ఆధారంగా వ్రాసిన ఊరగాయ వ్యాసం (నెట్) వాడుకరులను తెలుగు వికీపీడియా వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ తరువాత వాకా కిరణ్, చావాకిరణ్, వైజాసత్య, మాకినేని ప్రదీపు, చదువరి మొదలైన వారి విశేష కృషితో మరింత ముందుకు సాగింది.
2005లో జూలైలో వైజాసత్య, చదువరి కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల గురించిన సమాచారం తెలుగులో చూసుకొనగలిగిన అవకాశం పాఠకులకు కలిగింది. ఈ ప్రాజెక్టులో బాటు (ఆటోమేటిక్ ప్రోగ్రాం స్క్రిప్ట్)లను తయారుచేసి మ్యాపులతో పేజీలను సిద్ధం చేయడంలో మాకినేని ప్రదీప్ కృషి గుర్తింపదగినది. 2005 సెప్టెంబరులో 'విశేషవ్యాసం', 'మీకు తెలుసా', 'చరిత్రలో ఈ రోజు' శీర్షికలు [2] ప్రారంభమయ్యాయి.
ఆ తరువాత వీవెన్ కృషితో తెవికీ రూపురేఖలు సుందరంగా తయారయ్యాయి. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన కాజా సుధాకరబాబు, చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైనవారి కృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలయ్యాయి. బ్లాగేశ్వరుడు, విశ్వనాధ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో కృషి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. చంద్ర కాంత రావు కృషి ఆర్థిక శాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. విక్షనరీలో విశేషంగా కృషి చేసిన టి.సుజాత తెవికీలో కూడా ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషి చేశారు. చిట్కాలు, ప్రకటనలపై దేవా, ఇస్లాము, ఉర్ధూ భాష వివరాలపై అహ్మద్ నిసార్ కృషి చేశారు. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక, అక్టోబరులో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమయ్యాయి. కాసుబాబు ఈ శీర్షికలను దాదాపు ఐదేళ్లు ఒక్కడే నిర్వహించడం విశేషం. వీటిని కొంత కాలం అర్జున కొనసాగించగా, 2013 నుండి ప్రధానంగా కె.వెంకటరమణ, రవిచంద్ర నిర్వహిస్తున్నారు.
తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో తెవికీ వార్త 2010 జూలై 1న ప్రారంభమైంది. 8 సంచికలు తరువాత ఆగిపోయింది. 2010 లో ప్రారంభమైన గూగుల్ అనువాద వ్యాసాలు 2011 లో దాదాపు 900 పైగా వ్యాసాలు చేర్చిన తరువాత వాటి నాణ్యత పెంచడానికి తెవికీ సభ్యుల సూచనలు అమలు చేయకుండానే ఆగిపోయాయి. వీటి వలన సగటు వ్యాస పరిమాణం పెరిగింది. 2011 లో వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి.[3] తెలుగు వికీపీడియన్లు భారత వికీ సమావేశం 2011 లో పాల్గొన్నారు.[4] వికీమీడియా భారతదేశం విశిష్ట వికీమీడియన్ గుర్తింపు రాజశేఖర్,టి.సుజాత లకు లభించింది[5]
తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఏప్రిల్ 10,11 తేదీలలో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) ఆధ్వర్యంలో హైదరాబాదులోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగింది. దీనిలో భాగమైన వికీ సర్వసభ్యసమావేశం, వికీ అకాడమీ, వికీచైతన్యవేదికలలో వికీపీడియా సభ్యులు పాల్గొని వికీపీడియా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను చర్చించారు. తరువాత వికీపీడియా గురించి ఫోన్ ద్వారా వీక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాల కార్యక్రమాన్ని హెచ్ఎమ్‌టీవీ ప్రసారంచేసింది. ఇందులో రాజశేఖర్, రహ్మానుద్దీన్, మల్లాది, విష్ణులు పాల్గొన్నారు. [6]
తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో గత 10 సంవత్సరాలలో విశేష కృషి చేసిన చదువరి, మాకినేని ప్రదీపు, చావా కిరణ్, వీవెన్, పాలగిరి రామకృష్ణా రెడ్డి, రవిచంద్ర, అహ్మద్ నిసార్, వీర శశిధర్ జంగం, జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్, ఎల్లంకి భాస్కర నాయుడు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇచ్చిన కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము నకు ఎంపికయ్యారు.
తెలుగు వికీమీడియా 11వ వార్షికోత్సవాలు 2015, ఫిబ్రవరి 14, 15 తేదీలలో తిరుపతి లోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగాయి. 2014 సంవత్సరం తెలుగు వికీపీడియాలో విశేష కృషి చేసిన రాజశేఖర్, టి. సుజాత, వెంకటరమణ, సుల్తాన్ ఖాదర్, పవన్ సంతోష్ లకు కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము అందజేయడం జరిగింది.
ప్రతిరోజూ ఒక వ్యాసం చొప్పున 2016 లో ప్రారంభించి 2019 లో వెయ్యి వ్యాసాలకు పైబడి అభివృద్ధి చేసి ప్రణయ్ రాజ్ తెవికీ అభివృద్ధికి తోడ్పడ్డాడు.[7] 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు అనుగుణంగా, జిల్లా, మండల, గ్రామ వ్యాసాలను సవరించడంలో యర్రా రామారావు విశేషకృషి చేశాడు.
స్మార్ట్ ఫోన్లలో తెర విస్తీర్ణము చిన్నదిగా ఉండటంవలన దీనికి తగ్గ మొబైల్ రూపంలో వికీపీడియా అందుబాటులో ఉంది.[8] దీనికొరకు ప్రత్యేక ఉపకరణం కూడా విడుదలైంది.[9][10]
ప్రదేశాల స్థానం చూపుటకు తొలిగా రేస్టర్, సాధారణ వెక్టర్ రూపంలో స్థిర భౌగోళిక పటములు వాడేవారు. 2018 జూన్ లో అందుబాటులోకివచ్చిన కార్టోథిరియన్ పొడిగింత ద్వారా ఓపెన్‌స్ట్రీట్‌మేప్(OSM) ఆధారిత గతిశీల పటములు వాడుట వీలయ్యైంది.[11] వీటిని తెవికీలో 2019 జూన్ లో వాడడం ప్రారంభమైంది.
నెలవారీగా వెల్లడించే సారాంశ గణాంకాల ఆధారంగా తెలుగు వికీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.[12] మరిన్ని వివరాల కొరకు,[13] ఇతర భాషలతో పోల్చిచూడడం కొరకు గణాంకాలు [14] చూడవచ్చు. నెలవారీగా పేజీవీక్షణల వివరాలు [15] అందుబాటులోవున్నాయి. భారతదేశ భాషల పేజీవీక్షణలు [16] కూడా చూడవచ్చు. తెలుగు వికీపీడియా అభ్యర్థించే విశిష్ట పరికరాలు 2018 ఆగస్టు 1 నాటికి 10 లక్షలు చేరాయి. 2018 నవంబరు పేజీ అభ్యర్ధనల గణాంకాల ప్రకారం, దేశాలవారీగా భారతదేశం, అమెరికా, హాంగ్‌కాంగ్, యునైటెడ్ కింగ్డమ్ మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి.[12]
తెవికీలో ఉన్న వ్యాసాలను చేరుకోవటానికి శోధన పెట్టె, లింకులు, వ్యాసం చివర కనిపించే వర్గాలు, మార్గదర్శన పెట్టె ఉపయోగంగా ఉంటాయి. వీటిద్వారా కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్లుకూడా వారికి కావలసిన వ్యాసాలకు సునాయాసంగా చేరుకోవచ్చు.
తెలుగు వికీపీడియాలో 2019 డిసెంబరు నెలాంత గణాంకాల ప్రకారం 93 లక్షల పేజీ వీక్షణలు, 16 లక్షల నిర్దిష్ట పరికరాల ద్వారా జరుగుతున్నాయి.[17] 2019 నవంబరులో కొత్తగా 243 మంది నమోదు కాగా, కనీసం ఐదు సవరణలు చేసే సభ్యులు 71 మంది ఉన్నారు.[18] సభ్యత్వానికి ఎటువంటి షరతులు నిబంధనలు ఉండవు. వ్రాయాలన్న కుతూహలం, కొంత భాషా పరిజ్ఞానం మాత్రమే అర్హత. సభ్యత్వం లేకున్నా రచనలు, దిద్దుబాట్లు ఎవరైనా చేయవచ్చు. కొత్తగా చేరిన సభ్యులకు సహాయంగా సాంకేతిక వివరణలనూ, విధానాలనూ తెలుసుకొనే విధంగా సులభ శైలిలో వివరించిన పాఠాలు సభ్యులందరికి అందుబాటులో ఉంటాయి. మొదటి పేజీలో వీటికి లింకులు ఉంటాయి. లింకుల వెంట పయనిస్తూ రచనలను కొనసాగించవచ్చు. ఖాతా తెరచి పనిచేసే సభ్యులు చేసే దిద్దుబాట్లను గణాంకాలు చూపిస్తూ ఉంటాయి. సభ్యులు చర్చల్లోనూ పాల్గొనవచ్చు, సలహాలు, సహాయం తీసుకోవచ్చు, అందించనూ వచ్చు.
ఆధారాలుంటే, అనంతమైన ఆకాశం నుండి మట్టి రేణువు వరకూ దేని గురించైనా ఏదైనా వ్రాయవచ్చు. అచ్చుతప్పులుంటే సరిదిద్ద వచ్చు. ప్రాజెక్టులుగా, వర్గాలుగా విడదీసి పనులు జరుగుతుంటాయి కనుక ఆసక్తి ఉన్న రంగంలో వ్రాసే వీలుంటుంది. విస్తారమైన సమాచారం ఉంటుంది కనుక చదివి తెలుసుకోవడమూ చక్కని అనుభవమే. సభ్యుల ఊహలకు ఇక్కడ తావులేదు. సమాచారానికి వాస్తవం, నిష్పాక్షికత ప్రధానం. ఇతర వికీపీడియాలనుండి నాణ్యత గల వ్యాసాలకు అనువాదాలను సమర్పించ వచ్చు. ఇతరుల రచనలను అనుమతి లేకుండా ప్రచురించకూడదు. రచనలనే కాకుండా, బొమ్మలనూ (చిత్రం), ఛాయా చిత్రాలను అప్ లోడ్ చేయవచ్చు. అవి చట్టపరమైన ఇబ్బందులు కలిగించనివి అయి ఉండాలి. వాటిని వివిధ వ్యాసాలలో వివరణ చిత్రాలుగా వాడుకొనే వీలుంది. రచనలను తెలుగులోనే చేయాలి. ఇతర భాషాపదాల వాడుకను ప్రోత్సహించడం లేదు. అనివార్య కారణాలలో మాత్రమే ఇతరభాషా పదాలను వాడటానికి అనుమతి ఉంటుంది.
సార్వజనీనమైనవి, సమాచార పూరితమైనవి, వాస్తవికతను ప్రతిబింబించేవి అయిన రచనలకు మాత్రమే తెలుగు వికీపీడియాలో స్థానం. అవాంఛనీయమైన రచనలను నిర్వాహకులు తొలగిస్తూ ఉంటారు. వారికి ఈ విషయంలో విశేష అధికారాలు ఉంటాయి. తొలగించడంతో పాటు సభ్యుల రచనలపై కొంతకాలం నిషేధం అమలవుతుంది. దుశ్చర్య, అవాంఛనీయమైన రచనలను నియంత్రించడానికి ఈ విధానాలు పాటిస్తుంటారు; శిక్షలు అమలు చేస్తుంటారు.
నిర్వహణ కోసం తెవికీ సభ్యులలో కొందరిని నిర్వాహకులు, అధికారులుగా సభ్యులు ఎన్నుకుంటారు. తెవికీ నిర్వాహకుల, అధికారుల వివరాలు చూడండి.
తెలుగు వికీపీడియా అభివృద్ధికి ముఖ్య కారణం కొత్త సభ్యులను ప్రోత్సహించడం. కొత్త సభ్యులను ప్రోత్సహించడంలో సభ్యులు, నిర్వాహకులు, అధికారులు సైతం ఓర్పు నేర్పుతో వ్యవహరిస్తుంటారు. అత్యుత్సాహంతో కొత్తవారు చేసే పొరపాట్లను సరిచేస్తూ సూచనలు, సలహాలు అందిస్తూ ఉంటారు. కావలసిన సహాయం అందించడంలో అందరూ ఉత్సాహం చూపుతూనే ఉంటారు. సభ్యుల మధ్య ఉండే స్నేహపూరిత వాతావరణం కొత్త వారి ఆందోళనను ఒకింత తగ్గిస్తూ ముందుకు సాగేలా చేస్తుంది. మృదుమధురంగా సూచనలను అందించడం ఎక్కువమంది సభ్యుల పద్ధతులలో ఒకటి.
తెలుగు వికీపీడియా చేసే కృషికి గుర్తింపుగా సభ్యులు ఒకరికి ఒకరు పతకాలు ప్రదానం చేస్తూ ఉంటారు. దిద్దుబాట్లు గణించి, కొన్ని ప్రాజక్టులలో సాధించిన విశేష కృషి, ఉపయోగకరమైన విషయాలు సమర్పించినప్పుడు పతకాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. ఈ పతకాలు ఇవ్వడానికి ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. సభ్యులు ఎవరైనా ఎవరికైనా వారు గుర్తించిన సభ్యుల కృషికి తగినట్లు పతకాలు సమర్పించ వచ్చు.
ప్రతి పేజీకి ఒక చర్చాపేజి ఉంటుంది. వ్యాసానికి సంబంధించి ఆ చర్చాపేజీలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు; రచయిత నుండి సమాధానం పొందవచ్చు. వ్యాసంపై అభిప్రాయం అక్కడ జతచేయవచ్చు. సభ్యుని పేజీలో ఒక చర్చాపేజీ ఉంటుంది. దానిలో సభ్యునితో అనేక విషయాలపై చర్చించవచ్చు. అభినందనలు, ప్రశంసలు, నెనర్లు (ధన్యవాదాలు) కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. రచ్చబండ- ఇది తెలుగు వికీపీడియా సభ్యుల అభిప్రాయవేదిక. సభ్యులందరి సలహాలూ, సంప్రదింపులూ, సందేహాలూ ఇక్కడ చోటు చేసుకుంటాయి. తెవికీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలకు ఇది ప్రధానమైన నెలవు.
తొలిగా బ్లాగరుల సమావేశాలు, ఆ తరువాత తెవికీ అకాడమీ, వార్షిక పుస్తకప్రదర్శనల ద్వారా, అనుబంధ సంస్థల ద్వారా శిక్షణ, ప్రచార కార్యక్రమాల వలన, పత్రికలలో వచ్చిన ప్రత్యేక వ్యాసాల ద్వారా తెవికీ ప్రచారం జరుగుతున్నది[19][20][21][7] హైదరాబాదు నగరంలో ప్రతిఏటా జరుగుతున్న హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో 2008 నుండి ప్రతి సంవత్సరం ఈ-తెలుగు సంస్థతో కలిసి తెలుగు వికీపీడియన్లు వికీపీడియా ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటుచేస్తున్నారు. వికీపీడియాలో తెలుగులో సమాచారం పెంపొందిపచేయడంలో మరింత ఎక్కువ మందిని భాగస్వాములుగా చేసే లక్ష్యంతో ఏర్పాటుచేస్తున్న ఈ స్టాల్ కు 2019 నుండి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం సహకారం అందిస్తున్నాయి.[22][23]
క్రియాశీలంగా ఉండే వికీపీడియా సభ్యులు హైద్రాబాదు లాంటి నగరాలలో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి కొత్త సాంకేతికతలు, ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు. దేశంలో జరిగే సోదర భాష ప్రాజెక్టుల సమావేశాలలో, వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే సాంకేతిక సదస్సులలో పాల్గొనటం, అలాగే వికీమీడియా ఫౌండేషన్ ప్రతిసంవత్సరం ప్రపంచంలో వివిధ నగరాలలో నిర్వహించే వికీమేనియా అనే అంతర్జాతీయ సమావేశానికి హాజరయి వికీపీడియా అభివృద్ధికి జరుగుతున్న చర్యలను తెలుసుకొని తదుపరి తెలుగు వికీ ప్రాజెక్టులలో అమలు చేయడానికి సహకరిస్తారు.
సభ్యులు తమకు ఆసక్తి గల విషయాలను నిర్దిష్ట కాలంలో అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు, ఇతర సభ్యుల సహకారంతో ప్రాజెక్టు రూపంలో నిర్వహించుతారు. వీటికి నిధులు అవసరమనుకుంటే వికీమీడియా ఫాండేషన్ ను లేక వికీమీడియా ఫౌండేషన్ అనుదానం పొందే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ ని అభ్యర్ధించవచ్చు.
వికీమీడియా భారతదేశం 2011 జనవరి నుండి పని ప్రారంభించింది. వివిధ కార్యక్రమాల ద్వారా వికీపీడియా, సోదర ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి కృషి చేసింది. నగర, భాషా ప్రత్యేక ఆసక్తి జట్టుల ద్వారా కార్యక్రమాలను దేశమంతటా విస్తరించింది. అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సిఐఎస్) ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు, ఇతర చర్యల వలన "వికీమీడియా భారతదేశం" బలపడలేదు. కాలేకపోయింది. ఇతర కారణాల వలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనలను పాటించలేకపోయింది. 2019 సెప్టెంబరు 14 నుండి అమలు అయ్యేటట్లు "వికీమీడియా భారతదేశం" గుర్తింపును వికీమీడియా ఫౌండేషన్ రద్దుచేసింది.[24] సిఐఎస్ సంస్థ వికీమీడియా ఫౌండేషన్ అనుదానంతో భారతదేశంలో వికీపీడియా అభివృద్ధికి కృషి చేస్తున్నది. తెలుగు వికీపీడియా అభివృద్ధికై ప్రత్యేక ఉద్యోగిని నియమించటం ద్వారా 2013 నుండి 2019 జూలై వరకు కృషి జరిగింది.
2019 ఆగష్టులో ఐఐఐటి హైదరాబాదు సంస్థ కేంద్ర శాస్త్ర, విజ్ఞాన శాఖ, ఎలెక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖల సహాయంతో ప్రాజెక్టు తెలుగువికీ ప్రారంభించింది. ఆరేళ్లలో తెలుగు వికీ వ్యాసాలను అప్పటి 71,000 స్థాయినుంచి 30 లక్షలకు పెంచాలన్న లక్ష్యంగా పెట్టుకుంది.[25][26] దీనిలో భాగంగా ప్రయోగశాల వికీపీడియా ప్రాజెక్టును తెలుగు వికీపీడియా నకలుగా ప్రారంభించి ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి యంత్రసహాయంతో వ్యాసాలు చేర్చుతున్నారు. 2021 డిసెంబరు చివరలో సుమారు 20,000 పేజీలు మాత్రమే అదనంగా కనబడ్డాయి.[27] ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తున్నది.
మెటా-వికీ, కామన్స్, విక్షనరీ, వికీబుక్స్, వికీకోట్,వికీసోర్స్ మొదలైనవి తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు.
"ఉత్సాహం, చొరవ ఉండి, కొద్దిమందే అయినా చేయి చేయి కలిపితే సాధించగల అద్భుతానికి 'తెలుగు వికీపీడియా' మచ్చుతునక" అని ప్రముఖ మాధ్యమాల యజమాని, సంపాదకుడు రామోజీరావు కొనియాడాడు.[28]
వికీపీడియాలోని వ్యాసాలు చిత్రాలు చేర్చటం ద్వారా అభివృద్ధి పరచేందుకు ఏటా జులై, ఆగస్టు నెలల్లో పోటీ జరుగుతుంది. ‘ 2021 వికీపీడియా పేజెస్ వాంటింగ్ ఫొటోస్’ పోటీలో రెండు నెలలపాటు తెలుగు వికీపీడియన్లు 28,605 వ్యాసాలకు ఫొటోలు, మ్యాపులు ఎక్కించటం ద్వారా ప్రపంచ వికీపీడియాలలో తెలుగు వికీపీడియా మూడో స్థానంలో నిలిచింది.[29]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.