From Wikipedia, the free encyclopedia
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతంలోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహాఇల్లాలు. 'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు. ఈమె చదువుసంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానంచేసి, విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి . భారతీయ సాంప్రదాయంలో 'అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా 'అతిథి దేవోభవ' అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి ఆమె .
డొక్కా సీతమ్మ | |
---|---|
జననం | 1841 అక్టోబరు రెండోవారం మండపేట, రామచంద్రపురం తాలుకా, తూర్పుగోదావరి జిల్లా |
మరణం | 1909 |
ప్రసిద్ధి | నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణ గానూ |
భార్య / భర్త | డొక్కాజోగన్న |
తండ్రి | అనుపిండి భవానీశంకరం, |
తల్లి | నరసమ్మ |
తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం తాలుకా, మండపేట గ్రామంలో 1841 అక్టోబరు రెండోవారంలో సీతమ్మ జన్మించింది. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ తండ్రిని గ్రామస్థులు 'బువ్వన్న' అనే ముద్దు పేరుతో పిలుస్తుండేవారు. చిన్ననాటి సీతమ్మకు తల్లి, తండ్రి గురువులై కథలు, గాథలు, పాటలు, పద్యాలు అన్నీ నేర్పారు. ఆమె ఆ రోజుల్లో స్త్రీ విద్య నేర్చుకునే అవకాశాలు అంతగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు బద్ధురాలై, పెద్దబాలశిక్ష వంటి గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చెయ్యకుండానే, పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ కాలం చేస్తే, ఇల్లు చక్కదిద్దే భారం సీతమ్మ పై పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది. గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు అనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు.అతను ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమయ్యింది. భోజనం చేసే సమయం అయింది. వారు మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకరం గుర్తుకు వచ్చాడు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం గారింటికి వెళ్లి ఆ పూట వారి ఇంటి ఆతిధ్యాన్ని స్వీకరించారు.జోగన్నగారికి అతిథి మర్యాదలు చేయటంలో సీతమ్మ చూపించిన ఆదరాభిమానాలకు సంతృప్తి చెంది పరమానందభరితుడయ్యాడు. యవ్వనంలో ఉన్న సీతమ్మగారు చూపించిన గౌరవ మర్యాదాలు, ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్నగారికి ఆమెను వివాహం చేసుకోవాలనే భావన కలిగింది.
గోదావరి నది పాయలలోని లంకగన్నవరంలో సంపన్న కుటింబీకుడు డొక్కా జోగన్న పంతులు. పెద్ద రైతే కాకుండా, పంతులు వేద పండితుడైనందున ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ, మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమవడం వలన, భవానీ శంకరం గారి ఆహ్వానంపై వెళ్లి, ఆ పూట వారి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. జోగన్నకు ఆతిధ్యం ఇవ్వడం పట్ల సీతమ్మ చూపించిన ఆదరాభిమానాలకు ఆయన ముగ్ధుడు అవడం జరిగింది. అప్పట్లో యవ్వనంలో ఉన్న సీతమ్మ మర్యాద, అణకువ కూడా నచ్చి జోగన్నకు ఆమెను పెళ్ళిచేసుకోవాలనే కోరిక కలిగింది. ఆయనకు సాముద్రిక శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. బువన్న సీతమ్మను డొక్కా జోగన్నకు ఇచ్చి వైభవంగా పెళ్ళి జరిపించాడు. సీతమ్మకు మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్కా ఇంటి పేరుగా మారింది. ఆమెకు వయసుతో బాటు ఉదార గుణం కూడా నానాటికీ పెంపొందసాగింది. జోగన్న - సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి ఆనందించనివారు లేరనే చెబుతుండే వారు. శుచి, శుభ్రతలతో బాటు ఆప్యాయతా, ఆదరణలకు వారి ఇల్లు పెట్టింది పేరుగా ఆ గ్రామమంతా చెప్పుకునేవారు. ఆ కాలంలో గోదావరి దాటాలంటే ఒకే ఒక ప్రయాణ సాధనం పడవ. జోగన్న ఊరు లంకగన్నవరం గోదావరికి మార్గమధ్యంలో ఉన్నందు వల్ల ప్రయాణీకులు అలసి అక్కడకు చేరేవారు. అలాటివారికి అన్నపానాలు సమకూర్చడం సీతమ్మ భర్తతో కలిసి చేస్తుండేది. ఆ ఇంటి దంపతుల లక్ష్యం ఒక్కటేగా ఉండేది. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమని అడిగినా లేదు, తర్వాత రా అనే పదాలే లేకుండా, ఆదరించి అన్నంపెట్టడం వారికి నిత్యకృత్యంగా మారింది.
ఆమె గురించిన కథల్లో... తన జీవిత చివరలో, ఆమె తన ఆస్తులను ఇచ్చి, తన హిందూ విశ్వాసాలకు అనుగుణంగా చనిపోవడానికి ఆమెను వారణాసికి తీసుకెళ్లడానికి ఒక ఎద్దు బండి డ్రైవర్ను నియమించింది, కానీ వెనక్కి తిరిగి, తరువాతి గదిలో ఆకలి గురించి విన్న తర్వాత ఒక కుటుంబానికి త్వరగా భోజనం వండినారు.అలాగే ఒకసారి అంతర్వేది తీర్ధానికి ప్రయాణమైన వారు కొందరు తీర్ధ యాత్రికులు సీతమ్మ గారి ఇంటికి వెళ్ళలని అనుకోవడం విని వెనక్కి మరలినట్టుగా చెప్తారు.
ఈ మహాతల్లి జీవితచరిత్రను 1959 వ సంవత్సరంలో మిర్తిపాటి సీతారామఛయనులు 'విరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ' పేరిట గ్రంథస్తం చేయడంజరిగింది. ఈ గ్రంథాన్ని ఇతని పుత్రులు మిర్తిపాటి నారాయణ, మాచరిబాబు, వేంకట్రామయ్య గార్లు 2009 లో పునర్ముద్రించి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకునిరావడం జరిగింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.