From Wikipedia, the free encyclopedia
భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం
'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'
దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.
దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.
యజ్ఞోపవీతం పరమపవిత్రం
ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!
బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.
ప్రతీ సంవత్సరము శ్రావణ పౌర్ణమి రోజున నాలుగు వేదశాఖలవారు ఉపాకర్మ అనువేద వ్రాతమును ఆరంభించవలయును: 1) ప్రాజాసత్య వ్రతము 2) సౌమ్య వ్రతము 3) ఆగ్నేయ వ్రతము 4) వైశ్వదేవ వ్రతము
వీనినే వేదవ్రత చతుష్టయము అని అందురు. ఆ నాలుగు వ్రతములు, వీనికి ఉత్సర్జనములు చేయవలయును. ఉపనయనము అయిన వటువు గురుకులమునందు వేదము నేర్చుకొను కాలమునందీ వ్రతములు చేయవలెను. ఒక్కొక్క వ్రతము ఒక్కొక్క సంవత్సరమునందు చేయవలెను. ఒక సంవత్సరము వ్రతము, మరొక సంవత్సరము నందు ఉత్సర్జనము చేయవలెను. ఈ విధముగ 4 వ్రతములు, 4 ఉత్సర్జనములు పూర్తియగు సరికి 8 సంవత్సరములు పూర్తి యగును. ఈ 8 సం.లలో గురుకులమునందు గోదానమును వేద సంస్కారము జరుపుకొనవలెను. అనగా గర్భాష్టమేషు బ్రాహ్మణాముపనయాత- 8 సంవత్సరము నందు ఉపనయనము జరిగిన, 8 సంవత్సరములు గురుకులమునందు ఉండుటతో 16 సం.లు పూర్తిఅగునని భావము.యజుర్వేదము నందు ప్రాజాపత్యకాండము, సౌమ్యకాండము, ఆగ్నేయ కాండము, వైశ్వదేవ కాండము అను 4 కాండములు కలవు. కాండ ప్రమణములు ప్రస్తుతము తెలియుటలేదు. శ్రావణమాసమునందు పూర్ణిమ దినమున శ్రవణా నక్షత్రముండును. ఆ దినమున పగటికాలమునందు ఉపాకర్మ చేయవలెను. శ్రావణ శుద్ధ పంచమి దినమున హస్తా నక్షత్రమునందును చేయవచ్చును. ఔపాననాగ్నియందు అధ్యాయోపా కర్మ చేయవలెనని శౌనకుడు చెప్పినాడు.
ఈ విధమగు యుక్తాయుక్త కాలనిర్ణయము చూచుకొని వేదప్రతిపాదితమగు ఉపాకర్మాది సంస్కారముల నాచరించవలసియున్నది. ఈ సంస్కారము ముఖ్యముగా వేదము నేర్హ్చుకొను విద్యార్ధుల కొరకు నిర్దేశించబడినది. అపౌరుషములు, దైవదత్తములునగు వేదశాస్త్రములను నేర్చుకొనుటకు, తగుశక్తి, తేజస్సు, గ్రహణశక్తి, ఆత్మజ్ఞానము స్పష్టమగు శబ్దోచ్చారణ, శ్రావ్యమగు ధ్వనిని కలిగి వేదవిద్యను ఆసాంతము నేర్చుకొనుటకు వేదమంత్రములచే చేయబడు సంస్కారమిది.
అందుకనే శ్రావణ పౌర్ణమి భారత దేశమందు ముఖ్యపర్వదినముగా చెప్పబడుచున్నది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.