చంద్రునిపైకి భారత్ చేసిన రెండవ యాత్ర From Wikipedia, the free encyclopedia
చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక. చంద్రుడిపై నిదానంగా, మృదువుగా దిగి (సాఫ్ట్ ల్యాండింగు), 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్ఎల్వి ఎమ్కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉండే ఆర్బిటరు, దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండిగయ్యే ల్యాండరు, ల్యాండరు నుండి బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచే రోవరు - ఈ మూడూ చంద్రయాన్-2 లో భాగాలు. భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమంలో ఇది రెండవ యాత్ర.
సంస్థ | ఇస్రో |
---|---|
మిషన్ రకం | ఆర్బిటరు, విక్రమ్ ల్యాండరు, ప్రజ్ఞాన్ రోవరు |
దీనికి ఉపగ్రహం | చంద్రుడు |
లాంచ్ తేదీ | 2019 జూలై 22 |
లాంచ్ వాహనం | జిఎస్ఎల్వి ఎమ్కె3 |
మిషన్ వ్యవధి | ఆర్బిటరు: 1 సంవత్సరం; ల్యాండరు, రోవరు: 14 రోజులు |
హోమ్ పేజి | https://www.isro.gov.in/chandrayaan2-home-0 |
ద్రవ్యరాశి | మొత్తం (ఇంధనంతో): 3,850 కి.గ్రా.[1][2][3] మొత్తం (ఇంధనం లేకుండా): 1,308 కి.గ్రా.[4] ఆర్బిటరు (ఇంధనంతో): 2,379 కి.గ్రా.[2][3] ఆర్బిటరు (ఇంధనం లేకుండా): 682 కి.గ్రా.[4] విక్రమ్ ల్యాండరు (ఇంధనంతో): 1,471 కి.గ్రా.[2][3] విక్రమ్ ల్యాండరు (ఇంధనం లేకుండా): 626 కి.గ్రా.[4] ప్రజ్ఞాన్ రోవరు: 27 కి.గ్రా.[2][3] |
సామర్థ్యం | ఆర్బిటరు: 1 కి.వా.[5]
విక్రమ్ ల్యాండరు: 650 వా ప్రజ్ఞాన్ రోవరు: 50 వా |
చంద్రయాన్-2 కార్యక్రమం ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికీ[6][7] ఇస్రో తలపెట్టింది. 6 చక్రాలు కలిగిన రోవరు చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయనిక విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారాన్ని ల్యాండరుకు అందజేయగా అది భూమిపై ఉన్న డీప్ స్పేస్ నెట్వర్కుకు చేరవేస్తుంది.[8] చంద్రయాన్-1ను సాకారం చేసిన మైలస్వామి అన్నాదురై నేతృత్వంలోని బృందం చంద్రయాన్-2 పైన పనిచేస్తుంది.
ఇస్రో రూపకల్పన ప్రకారం - ఇంతవరకు ఏ దేశం కూడా కాలూనని ప్రదేశంలో, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-2 ల్యాండరు దిగుతుంది. దాన్నుండి రోవరు బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ వివిధ పరీక్షలు చేస్తుంది. 14 భూమి రోజుల పాటు (ఒక చంద్రుడి పగలు) అది పరీక్షలు జరుపుతుంది. ఆర్బిటరు చంద్రకక్ష్యలో సంవత్సరం పాటు పనిచేస్తుంది.
మొదట 2019 జూలై 15 న జరపాలని తలపెట్టిన ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వలన ప్రయోగానికి 56 నిముషాల ముందు రద్దు చేసారు.[9] క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత, 2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్ఎల్వి ఎమ్కె3 ఎమ్1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్ష్యలో ప్రవేశపెట్టారు.[10]
భూకక్ష్యలో ఉండగా కక్ష్యను పెంచడానికి, ఆ తరువాత భూకక్ష్య నుండి చంద్రుని బదిలీ కక్ష్యలోకి చేర్చేందుకు, చంద్ర కక్ష్యలో ఉండగా కక్ష్య తగ్గించేందుకూ ఇస్రో అనేక విన్యాసాలను జరిపింది. ఆర్బిటరు లోని ద్రవ ఇంధన ఇంజన్లను ఇందుకు వినియోగించారు.
చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలో చేరాక, ప్లాను ప్రకారమే ఆర్బిటరు, ల్యాండరు విడిపోయాయి. ఆ తరువాత ల్యాండరు ఆ కక్ష్య నుండి రెండు అంచెలలో దిగువ కక్ష్య లోకి దిగి, అక్కడి నుండి చంద్రుడి ఉపరితలం పైకి ప్రయాణం సాగించింది. ల్యాండరు చంద్రుడి ఉపరితలం నుండి 2.1 కి.మీ. ఎత్తున ఉండగా, దానికి భూమితో సంపర్కం తెగిపోయింది. ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో తెలిపింది.[11]
చంద్రునిపై ఒక ల్యాండరును సాఫ్ట్ ల్యాండింగు చెయ్యడం, చంద్ర ఉపరితలంపై రోవరును నడపడం చంద్రయాన్-2 కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. శాస్త్రసంబంధ లక్ష్యాలు - చంద్ర ఉపరితల శోధన, ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యతను శోధించడం, చంద్రుని వాతావరణాన్ని పరిశీలించడం, నీరు, మంచురూపంలోని నీటి లభ్యతను పరిశీలించడం.[12] చంద్ర ఉపరితలాన్ని ఫొటోలు తీసి 3డి మ్యాపులు తయారు చెయ్యడం.[13]
2008 సెప్టెంబరు 18న నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కాబినెట్ మంత్రుల సమావేశంలో ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.[14]
2007 నవంబరు 12 న రష్యన్ అంతరిక్ష సంస్థ (రోస్కాస్మోస్), ఇస్రో సంయుక్తంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టాలి అని ఒప్పందం చేసుకున్నారు.[15] రోవరును, అర్బిటరునూ తయారు చేసే ప్రధాన బాధ్యత ఇస్రో తీసుకోగా, రోస్కాస్మోస్ ల్యాండర్‌ని తయారు చేసే బాధ్యత తీసుకుంది. అంతరిక్ష వాహనం ఆకృతిని 2009 ఆగస్టులో పూర్తి చేసారు, రెండు దేశాల శాస్త్రవేత్తలు కలిపి ఈ నమూనాను పరిశీలించారు.[16][17][18] అయితే సాంకేతిక కారణాల వలన తదనంతర కాలంలో రోస్కాస్మోస్ ఈ ల్యాండరును తయారు చెయ్యలేనని అశక్తత వ్యక్తం చేసింది.[19][20] దాంతో ఈ బాధ్యతను కూడా ఇస్రోయే చేపట్టింది. చంద్రయాన్-2 యావత్తూ స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రోయే రూపొందించిన కార్యక్రమం అయింది.
చంద్రయాన్-2 ప్రాజెక్టులో అత్యంత కీలకమైన శాస్త్రవేత్తల జాబితా ఇది:[21][22][23]
3,850 కేజీలు బరువు గల చంద్రయాన్-2 ను శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏంకె-II ద్వారా ప్రయోగించాలని ప్రణాళిక తయారు చేసారు.[24] ఆర్బిటరు తోటి ఎనిమిది పేలోడ్లు, రోవరు తోటి రెండు పేలోడ్లూ పంపించాలని నిర్ణయించినట్టు ఇస్రో ప్రకటించింది.[25][26] నాసా, ఇఎస్ఏ సంస్థలు ఆర్బిటరు[27] కోసం సాంకేతిక పరికరాలు సరఫరా చేసి ఈ ప్రయోగంలో పాల్గొంటాయి అని భావించారు. కానీ బరువు పరిమితుల దృష్ట్యా అంతర్జాతీయ పేలోడ్లను ఈ ప్రయోగంలో పంపకూడదు అని నిర్ణయించారు.[28] కానీ ఆ తరువాత నాసా తయారు చేసిన 22 గ్రాముల బరువున్న లేజరు రెట్రోరిఫ్లెక్టరును ల్యాండరుతో పంపించాలని నిర్ణయించారు.
ఆర్బిటరును ఇస్రో రూపొందించింది. ఇది చంద్రునికి 100 X 100 కిలోమీటర్ల వర్తుల కక్ష్యలో పరిభ్రమిస్తుంది.[28] ఆర్బిటర్‌లో ఎనిమిది రకాల పేలోడ్లను పొందుపరచాలని నిర్ణయించారు. వీటిలో రెండు చంద్రయాన్-1లో వాడిన పరికరాలే కానీ వాటిని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరిచారు. ప్రయోగ సమయంలో బరువు సుమారు 2,379 కేజీలు.[29][30] ఇందులో 1,697 కిలోలు ఇంధనం కగా, మిగతా 682 కిలోలు ఆర్బిటరు బరువు. 1000 వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆర్బిటరుకు ఉంది. ఆర్బిటరు ఇటు భూమిపై ఉన్న ఇస్రో వారి డీప్ స్పేస్ నెట్వర్కు తోను, చంద్రుడిపై దిగే ల్యాండరు తోనూ సంపర్కంలో ఉంటుంది.[31][32] ల్యాండరు ఆర్బిటరు నుండి విడివడే ముందు, దీనిలోని హై రిజల్యూషన్ కెమెరా ల్యాండరు దిగే ప్రదేశాన్ని హై రిజల్యూషన్ పరిశీలనలు చేస్తుంది. అర్బిటరు స్ట్రక్చరును హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసి 2015 జూన్ 22 న ఇస్రోకు అందించింది.[33][34]
దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్ అని పేరు పెట్టారు. దీన్ని ఇస్రోయే రూపొందించింది. చంద్రయాన్-1 లోని చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టిన చంద్ర శోధక యంత్రంలా కాకుండా ఈ ల్యాండరును మృదువుగా, నిదానంగా దిగేలా రూపొందించారు.[31] ల్యాండరు బరువు 1,471 కేజీలు. 650 వాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం దీనికి ఉంది. చంద్రునిపై కాలూనే సమయానికి ల్యాండరు వేగం సెకండుకు 2 మీటర్లు ఉండేలా ల్యాండరును రూపొందించారు. ల్యాండరు ఆర్బిటరు తోను, భూమిపై ఉన్న ఇస్రో వారి డీప్ స్పేస్ నెట్వర్కు తోను, చంద్రుడిపై నడిచే రోవరు తోనూ సంపర్కంలో ఉంటుంది. ఇది 14 భూమి రోజుల పాటు (ఒక చంద్రుడి పగలు) పనిచేసేలా రూపొందించారు.
ఆర్బిటరు నుండి విడిపోయాక, విక్రమ్ తన 800 న్యూటన్ల ద్రవ ఇంధన ఇంజన్లను వాడి 30 x 100 కి.మీ. చంద్ర కక్ష్యకు దిగుతుంది. అక్కడ తనలోని వ్యవస్థలన్నిటినీ పరీక్షించుకుని సాఫ్ట్ ల్యాండింగు ప్రయత్నం మొదలు పెడుతుంది. ల్యాండింగయ్యాక, రోవరును బయటికి పంపి శాస్త్ర పరీక్షలను నిర్వహిస్తుంది. 14 రోజుల పాటు ఇది పనిచేస్తుంది.
విక్రమ్‌లో 800 న్యూటన్ సామర్థ్యం గల 5 ప్రధాన ఇంజన్లు, 50 న్యూటన్ల సామర్థ్యం గల 8 యాటిట్యూడ్‌ను నియంత్రించే 8 ఇంజన్లు ఉంటాయి.[35][36] విక్రమ్ 12° కోణంలో వాలుగా ఉండే తలంపై కూడా జాగ్రత్తగా దిగగలదు.[37][38]
2016 అక్టోబరులో ల్యాండరు నమూనాలపై భూమ్మీద, గాల్లోనూ జరిపే పరీక్షలు మొదలయ్యాయి. కర్ణాటక, చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరె వద్ద ఈ పరీక్షలు జరిగాయి. భూమ్మీద 10 వరకూ గుంతలను చేసి, వాటిని పరిగణన లోకి తీసుకుని సరైన ల్యాండింగు సైటును ఎంపిక చేసుకోగల ల్యాండరు సామర్థ్యాన్ని పరీక్షించారు.[39]
విక్రం ల్యాండరు లోని నాలుగు పేలోడ్లు ఇవి:[1][40]
రోవరుకు ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు. దీన్ని ఇస్రో రూపొందించింది. ఇది 27 కేజీల బరువుతో, 50 వాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ రోవరుకున్న ఆరు చక్రాల సహాయంతో చంద్రుని ఉపరితలం పైన తిరుగుతుంది. సెకండుకు 1 సెంటీమీటరు వేగంతో ప్రయాణించగలదు. మొత్తం అర కిలోమీటరు దూరం ప్రయాణించే సామర్థ్యం ప్రజ్ఞాన్ కుంది. చంద్రుని ఉపరితలాన్ని పరీక్షించి, విశ్లేషణ చేసి ఆ సమాచారాన్ని ల్యాండరుకు అందిస్తుంది.[31][32]
ప్రజ్ఞాన్ ఒక చంద్ర పగలు కాలం (అంటే భూమిపై 14 రోజులు) పాటు పనిచేస్తుంది. చంద్రుని రాత్రి సమయంలో ఉండే గడ్దకట్టించే శీత స్థితిని అందులోని ఎలక్ట్రానిక్స్ తట్టుకోలేవు. అయితే, దానిలో ఆటోమాటిగ్గా నిద్రించే/మేలుకునే పవర్ వ్యవస్థ ఉంది. చంద్ర రాత్రి వేళ పవర్ వ్యవస్థ నిద్రిస్తుంది. రాత్రి ముగిసి, పగలు మొదలు కాగానే పవర్ వ్యవస్థ మేలుకుంటుంది. ఆ వ్యవస్థ పని చేస్తే, ప్రజ్ఞాన్ పని చేసే కాలాన్ని మరో రెండు చంద్ర పగళ్ళ కాలం పాటు పొడిగించవచ్చు.[46][47]
రోవరులో కింది శాస్త్ర పరికరాలు అమర్చారు.
ల్యాండింగు స్థలం [48] | అక్షాంశ రేఖ్ంశాలు |
---|---|
ప్రాథమిక స్థలం | 70.90267°S 22.78110°E |
ప్రత్యామ్నాయ స్థలం | 67.87406°S 18.46947°W |
ల్యాండింగు కోసం రెండు స్థలాలను గుర్తించారు.[48] ప్రాథమిక ల్యాండింగు స్థలం (PLS54) 70.90267 S 22.78110 E వద్ద ఉంది. ప్రత్యామ్నాయ స్థలం (ALS01) 67.874064 S 18.46947 W వద్ద ఉంది. ల్యాండింగు ప్రాంతాలను ఎంపిక చేసేందుకు అనుసరించిన పరిస్థితులు: దక్షిణ ధ్రువ ప్రాంతం, భూమివైపు ఉండే ప్రాంతం, 15 డిగ్రీల లోపు వాలు ఉండే ప్రాంతం, 50 సెం.మీ. కంటే చిన్నవైన రాళ్ళు ఉండే చోటు, గుంతలు, రాళ్ళు ఉండే ప్రదేశం, కనీసం 14 భూమి రోజుల పాటు ఎండ ఉండే చోటు, చుట్టుపక్కల ఉండే గుట్టల వలన ఎక్కువ కాలం పాటు నీడ పడని చోటు.[48]
2010 ఆగస్టు 30 కల్లా ఇస్రో చంద్రయాన్-2 పేలోడ్లను ఖరారు చేసింది.[32].
చంద్రుడి దక్షిణ ధ్రువానికి ల్యాండరు, రోవరును పంపాలని తలపెట్టిన తొలి దేశం భారతే. ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు కాగా ఇందులో వాహక నౌకకు రూ. 375 కోట్లు అయింది. చంద్రయాన్-2 లోని మూడు విభాగాల్లో ఆర్బిటరు చంద్రుడి కక్ష్యలో తిరుగుతూంటుంది. ల్యాండరు చంద్రునిపై మృదువుగా దిగుతుంది. రోవరు దీనినుండి విడివడి, చంద్రుడి మీద కదులుతూ ఉపరితలాన్ని పరిశీలిస్తూ, పరిశోధిస్తుంది. చంద్రయాన్-2 లో ఇస్రో తాను రూపొందించిన 13 శాస్త్ర పరిశోధన పరికరాలతో పాటు నాసా వారి లేజరు రెట్రోరిఫ్లెక్టరును కూడా అమర్చింది.
తొలి ప్రణాళిక ప్రకారం 2019 జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:51 గంటలకు చంద్రయాన్-2 ను మోసుకెళ్ళే జిఎస్ఎల్వి ఎమ్కె3 ఎమ్1 వాహనాన్ని ప్రయోగించాల్సి ఉంది. కానీ క్రయోజనిక్ దశలోకి ఇంధనం నింపిన తరువాత, హీలియమ్ ట్యాంకు లోని పీడనం పడిపోతూండడంతో ప్రయోగానికి సరిగ్గా 56 నిమిషాల ముందు ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది.[49] నౌకను పూర్తిగా ఏ భాగానికి ఆ భాగాన్ని విప్పదీయకుండానే సమస్యను ఇస్రో శాస్త్రవేత్తలు పరిష్కరించారు. దీంతో తక్కువ సమయంలోనే వాహకనౌకను తిరిగి ప్రయోగించగలిగే వీలు కుదిరింది.
2019 జూలై 22 న జిఎస్ఎల్వి రాకెట్టును శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించడం ద్వారా భారత రెండవ చంద్ర యాత్ర మొదలైంది.
2019 జూలై 22 మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జీఎస్ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ముందుగా నిర్ణయించిన సమయానికే నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీని నింగిలోకి పంపి, చంద్రయాన్-2 ను 169.7 x 45,475 కి.మీ. ల భూకక్ష్యలో (169.7 కిలోమీటర్ల పెరిజీ[lower-alpha 1], 45,475 కిలోమీటర్ల అపోజీ[lower-alpha 1] కలిగిన కక్ష్య) ప్రవేశపెట్టింది. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ ప్రకటించాడు.[50] క్రయోజనిక్ దశలోని ఇంధనాన్ని సంపూర్ణంగా వాడుకోవడంతో అనుకున్నదాని కంటే ఎక్కువ అపోజీ కలిగిన కక్ష్యలో చంద్రయాన్-2 ను ప్రవేశపెట్టగలిగారు. దీనివలన, భూకక్ష్య దశలో కక్ష్య పెంచేందుకు చెయ్యవలసిన విన్యాసాల్లో ఒక దాన్ని తగ్గించ గలిగారు.[50][51][52] చంద్రయాన్-2 ఇంధనంలో 40 కిలోలు ఆదా అయింది కూడా.[53]
చంద్రయాన్-2 లోని ద్రవ ప్రొపల్షను ఇంజన్‌ను ఐదు సార్లు మండించడం ద్వారా శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 కక్ష్యను పెంచుకుంటూ పోయి, 276 x 1,42,975 కి.మీ. కక్ష్యకు చేర్చారు.[54] ఆరవ, చివరి విన్యాసంలో చంద్రయాన్-2 ను చంద్ర బదిలీ కక్ష్య లోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు 20 న చంద్రయాన్-2 బదిలీ కక్ష్యలో చంద్రుని సమీపానికి చేరినపుడు ఇస్రో తొలి విన్యాసాన్ని జరిపింది. ద్రవ ఇంజన్‌ను 1738 సెకండ్ల పాటు మండించి చంద్రయాన్-2 ను జయప్రదంగా 114 x 18,072 కి.మీ. ల చంద్ర కక్ష్య లోకి ప్రవేశపెట్టింది.[56]
భూకక్ష్యలో ఉన్నపుడు కక్ష్య పరిమాణాన్ని పెంచుకుంటూ పోగా, చంద్ర కక్ష్యలో కక్ష్యా పరిమాణాన్ని తగ్గించుకుంటూ పోతారు. ఆగస్టు 21 న జరిపిన రెండవ తగ్గింపులో (ఆగస్టు 20 న జరిపినది మొదటిది) 1228 సెకండ్ల పాటు ఇంజన్‌ను మండించి కక్ష్యను 118 x 4412 కి.మీ.కు తగ్గించారు. ఈ కక్ష్యలో 2650 కి.మీ. ఎత్తు నుండి చంద్రయాన్-2 చంద్రుడి ఫోటో తీసి భూమికి పంపింది.
2019 ఆగస్టు 28 న మూడవ కక్ష్య తగ్గింపును జరిపింది. 1190 సెకండ్ల పాటు ద్రవ ఇంధన ఇంజన్‌ను మండించి నౌకను 179 x 1412 కి.మీ. కక్ష్యలోకి దించారు.[57][58]
2019 ఆగస్టు 30న జరిపిన నాలుగవ విన్యాసంలో కక్ష్యను మరింత తగ్గించారు. 1155 సెకండ్ల పాటు ఇంజన్‌ను మండించి, చంద్రయాన్-2 నౌకను 124 x 164 కి.మీ. కక్ష్య లోకి చేర్చారు.[59] సెప్టెంబరు 1 న జరిపిన ఐదవ విన్యాసంలో కక్ష్యను మరింత తగ్గించి 119 x 127 కి.మీ. కక్ష్య లోకి చేర్చారు. ఈ విన్యాసంలో నౌకలోని ఇంజన్‌ను 52 సెకండ్ల పాటు మండించారు. సెప్టెంబరు 2 న ల్యాండరును ఆర్బిటరు నుండి విడదీసే కార్యక్రమం ఉంటుందని, ఆ తరువాత రెండు దశల్లో ల్యాండరు కక్ష్యను తగ్గించి చంద్రుడిపై దిగేందుకు రంగం సిద్ధం చేస్తామనీ ఇస్రో తెలిపింది.[60]
2019 సెప్టెంబరు 2 న విక్రమ్ ల్యాండరును ఆర్బిటరు నుండి విడదీసారు.[61] ఆర్బిటరు దాని మిగతా జీవిత కాలం పాటు ఇదే కక్ష్యలో చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందని ఇస్రో తెలిపింది.[62]
ల్యాండరును చంద్రునిపై దించే క్రమంలో దాన్ని కక్ష్య నుండి రెండు దశల్లో తప్పించింది. సెప్టెంబరు 3 ఉదయం 8:50 కి జరిపిన మొదటి విన్యాసంలో ల్యాండరులోని ఇంజన్‌ను 4 సెకండ్ల పాటు మండించి దాని కక్ష్యను 119 x 127 కి.మీ నుండి 104 x 128 కి.మీ.కు తగ్గించారు.[63] తిరిగి, సెప్టెంబరు 4 తెల్లవారుఝామున 3:42 కు చేసిన రెండవ విన్యాసంలో ల్యాండరు లోని ఇంజన్‌ను 9 సెకండ్ల పాటు మండించి, దాన్ని 35 x 101 కి.మీ. కక్ష లోకి దించారు. దీంతో ల్యాండరు చంద్రుని దక్షిణ ధ్రువం వైపుగా దిగే ప్రయాణం మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. ఆర్బిటరు మాత్రం 96 x 125 కి.మీ. కక్ష్యలోనే పరిభ్రమిస్తూ ఉంది.[64][65]
2019 సెప్టెంబరు 7 రాత్రి 1:45 గంటలకు విక్రమ్ ల్యాండరు చంద్రుడి ఉపరితలం వైపుగా దిగడం మొదలైంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా, ల్యాండరుకు భూమితో సంబంధం తెగిపోయిందని ఇస్రో ఛైర్మన్, కె శివన్ ప్రకటించాడు.[66][67] తరువాత సెప్టెంబరు 7 న చేసిన ప్రకటనలో ఇస్రో, ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ప్రకటించింది. వాహనం లాంచి లోను, యాత్ర నిర్వహణ లోనూ చూపిన కచ్చితత్వం కారణంగా ఆర్బిటరు జీవితకాలం సంవత్సరం నుండి దాదాపు 7 సంవత్సరాల వరకూ పెరిగిందని కూడా ఇస్రో తెలిపింది.[68]
సెప్టెంబరు 8 న ఇస్రో చైర్మన్ కె.శివన్ ఒక ప్రకటన చేస్తూ, చంద్రుని ఉపరితలంపై ల్యాండరును గుర్తించామని తెలిపాడు. ఆర్బిటరు థర్మల్ ఇమేజింగ్ కెమెరాతో ఫొటోలు తీసిందని, ల్యాండరుతో సంపర్కం కోసం కృషి చేస్తున్నామనీ అతను తెలిపాడు.[69]
మిషన్ 'గగన్-యాన్' 2022 నాటికి సాకారం అవుతుంది
విస్న్, న్యూఢిల్లీ భారతదేశం అంతరిక్షంలోకి మనిషిని పంపాలనే ఉద్దేశాన్ని ధ్రువీకరించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపై ప్రధాని నరేంద్ర మోది. year 2018
అంతరిక్షంలోకి మనిషిని పంపాలనే ఉద్దేశాన్ని భారత్ ధ్రువీకరించింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు. అతని ప్రకారం, ఈ మిషన్ 'గగన్-యాన్' 2022 నాటికి నిర్వహించబడుతుంది. అంతకుముందు, మానవులను అంతరిక్షంలోకి పంపే ఏ మిషన్‌ను ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ మిషన్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత, మానవులను అంతరిక్షంలోకి పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని నాల్గవ దేశంగా భారతదేశం అవతరిస్తుంది.
కొన్ని మౌలిక అంశాల్లో చంద్రయాన్-1, చంద్రయాన్-2 ల పోలికలు ఇలా ఉన్నాయి.
అంశం | చంద్ర్రయాన్-1 | చంద్రయాన్-2 |
---|---|---|
యాత్ర ఉద్దేశాలు | చంద్రుని పైకి ప్రోబ్‌ను పంపించడం. ప్రోబ్ చంద్రునిపై దూకుతూ చంద్రుని ఉపరితలాన్ని గుద్దుకుని నాశనమయ్యే లోపు పరీక్షలు చెయ్యడం | చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండరును మృదువుగా, మెల్లగా దింపడం, దానిలో నుండి రోవరును బయటికి తీయడం, 15 రోజుల పాటు రోవరును నడిపించి, చంద్రుని ఉపరితలంపై పరీక్షలు చెయ్యడం |
నౌక లోని భాగాలు | ఆర్బిటరు, ప్రోబ్ | ఆర్బిటరు, ల్యాండరు (విక్రమ్), రోవరు (ప్రజ్ఞాన్) |
వాహనం | పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ సి-11 | జిఎస్ఎల్వి ఎమ్కె-3 ఎమ్ 1 |
ప్రయోగానికైన ఖర్చు అంచనా | రు. 386 కోట్లు[70] | రూ 978 కోట్లు[71] |
జీవిత కాలం అంచనా | ఆర్బిటరు - రెండు సంవత్సరాలు | ఆర్బిటరు - 1 సంవత్సరం
ల్యాండరు, రోవరు - ఒక చంద్ర పగలు (కనీసం 14 భూమి రోజులు). చంద్ర రాత్రి (14 భూమి రోజులు) తరువాత అవి నిద్ర నుండి మేలుకుంటే మరొక రెండు చంద్ర పగళ్ళు పని చెయ్యవచ్చు. అది బోనసు అవుతుంది. |
ప్రయోగ సమయంలో నౌక ద్రవ్యరాశి | 1,380 కిలోగ్రాములు | 3,850 కిలోగ్రాములు |
ప్రయోగించిన తేదీ | 2008 అక్టోబరు 22 | 2019 జూలై 22 |
ప్రయాణ పద్ధతి | నౌక భూకక్ష్యను చంద్ర కక్ష్య వరకూ పెంచుకుంటూ పోయారు (గరిష్ఠ భూకక్ష్య అపోజీ: 3,80,000 కి.మీ.)
ఈ కక్ష్యలో నౌక చంద్రునికి 500 కి.మీ. దూరాన ఉండగా, ఇంజన్‌ను మండించి, నౌకను భూకక్ష్య నుండి చంద్ర కక్ష్యలోకి మార్చారు |
నౌకను 276 x 1,42,975 కి.మీ. భూకక్ష్యలోకి చేర్చి, అక్కడి నుండి చంద్ర బదిలీ కక్ష్య వైపు నడిపారు . |
చంద్రునిపై దిగిన తేదీ | 2008 నవంబరు 14 న ప్రోబ్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో గుద్దింది. | 2019 సెప్టెంబరు 7 వ తేదీన చంద్రుని మీద నిదానంగా మృదువుగా దిగే క్రమంలో, చంద్రుని ఉపరితలం నుండి 2.1 కి.మీ. ఎత్తున ఉండగా ల్యాండరు భూమితో ఉన్న సంపర్కం తెగిపోయింది. |
వాస్తవ జీవిత కాలం (ప్రయోగం ముగిసిన తేదీ) | 10 నెలలు (2009 ఆగస్టు 28) (ఆర్బిటరుతో చివరి సంపర్క తేదీ). | |
ప్రయోగ ఫలితం | 95% విజయవంతమైంది. రెండేళ్ళ కాలం పనిచేస్తుందని అనుకోగా 10 నెలలకే చంద్రయాన్-1 ఆయువు ముగిసినప్పటికీ.[72] | 90-95% విజయవంతమైంది.[68] |
సాధించిన విజయాలు | చంద్రునిపై నీటి జాడలు కనుగొంది.[73] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.