From Wikipedia, the free encyclopedia
గోధ్ర రైలు దహనం అనేది 2002 ఫిబ్రవరి 27 న గుజరాత్ లోని గోధ్ర రైలు స్టేషను వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు తగలబడగా 59 మంది దుర్మరణం పాలైన దుర్ఘటన.[1][2] అయోధ్య లోని బాబరీ మసీదు స్థలం వద్ద కరసేవకు వెళ్ళి తిరిగి వస్తున్న హిందూ యాత్రికులు ఈ మృతుల్లో అధికులు.[3] గుజరాత్ ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిషను ఆరేళ్ళ దర్యాప్తు తరువాత, 1,000 నుండి 2,000 మంది దాకా ఉన్న మూక చేసిన దహన కాండ ఇది అని తేల్చింది.[4] కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషను, ఈ దహనం ఒక ప్రమాదంగా తేల్చింది. ఈ కమిషను నియామకం రాజ్యాంగ విరుద్ధం అని తరువాత తేలింది.[5] గోధ్ర ఘటనలో 31 మంది ముస్లిములను నేరస్థులుగా కోర్టు తేల్చింది.[6] అయితే, మంటలకు అసలు కారణం ఇంకా తేలాల్సి ఉంది.[7][8]
గోధ్ర రైలు దహనం | |
---|---|
స్థలం |
గోధ్ర, గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | |
తేదీ |
2002 ఫిబ్రవరి 27 |
మరణాలు |
59 |
గాయాలు |
48 |
ఈ ఘటనే తదనంతరం జరిగిన గుజరాత్ అల్లర్లకు కారణంగా భావించబడుతోంది. ఈ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లిములు, 254 మంది హిందువులూ మరణించగా,[9] వాస్తవానికి 2,000 కు పైగా మరణించి ఉంటారని అంచనా.[10]
2002 ఫిబ్రవరిలో, వేలాది మంది రామభక్తులు గుజరాత్ నుండి అయోధ్యకు విశ్వ హిందూ పరిషత్ పిలుపున పూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొనేందుకు వెళ్ళారు. ఫిబ్రవరి 25 న 1700 మంది యాత్రికులు, కరసేవకులు[11] సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.[12] 2002 ఫిబ్రవరి 27 న రైలు నాలుగ్గంటలు ఆలస్యంగా ఉ 7:43 కు గోధ్ర స్టేషను చేరింది. రైలు తిరిగి బయలుదేరుతూండగా ఎవరో గొలుసు లాగగా రైలు సిగ్నలు పాయింటు వద్ద ఆగింది. చైనును అనేక మార్లు లాగారని ఆ తరువాత రైలు డ్రైవరు చెప్పాడు.[13]
దాదాపు 2,000 మందితో కూడిన మూక రైలుపై దాడి చేసింది. కొద్దిసేపు రాళ్ళు విసిరాక, నాలుగు బోగీలను తగలబెట్టారు. ఆ బోగీల్లో అనేక మంది చిక్కుకుపోయారు. 27 మంది మహిళలు, 10 మంది పిల్లలతో సహా 59 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. 48 మంది గాయాలపాలయ్యారు. గుజరాత్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జె. మహాపాత్ర, "రైలు గోధ్ర స్టేషనుకు రావడానికి చాలా ముందే, ఆ దుర్మార్గులు పెట్రోలులో ముంచిన బట్టలను సిద్ధంగా ఉంచుకున్నారు", అని చెప్పాడు.[14] మార్థా నస్‌బామ్ ఈ వాదనను సవాలు చేస్తూ, మంటలు ప్రమాదకారణంగా జరిగాయని, ముందుగా ప్లాను చేసిన కుట్ర కాదనీ అనేక దర్యాప్తుల్లో తేలిందని చెప్పింది.[15][16] "కాంగ్రెసు, దాన్ని వామపక్ష మిత్రులూ కలిసి వాస్తవాలను వక్రీకరించడం వలననే వాస్తవాలు విస్తృతంగా అందరికీ తెలియరాలేద"ని మధు కిష్వార్ ఆరోపించింది.[17]
గుజరాత్ ఫోరెన్సిక్ లాబరేటరీ నివేదిక ప్రకారం, S-6 బోగీలో పెద్ద మూతి గల ఒక డబ్బాలోనుండి 60 లీటర్ల దహనశీల ద్రవాన్ని పోసారు. బోగీకి తూర్పు చివరన ఉన్న రెండు ద్వారాల్లోను ఉత్తర దిక్కున ఉన్న ద్వారం ముందు ఉన్న దారిలో నిలబడి ఈ ద్రవాన్ని పోసారు. వెనువెంటనే బోగీని తగలబెట్టారు. బోగీపై తీవ్రమైన రాళ్ళ దాడి కూడా చేసారని నివేదికలో పేర్కొన్నారు.[18][19]
2002 మార్చి 6 న గుజరాత్ ప్రభుత్వం, సంఘటనను దర్యాప్తు చేసేందుకుగాను, మాజీ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి కె.జి.షా నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ను నియమించింది.[20] అయితే షా కు మోదీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతడి నియమకాన్ని బాధితులు, మానవహక్కుల సంస్థలు, రాజకీయపార్టీలూ నిరసించాయి. అతడి స్థానంలో సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తిని నియమించాలని కోరాయి. ఫలితంగా ప్రభుత్వం, షా కమిషన్ను ద్విసభ్య కమిషనుగా విస్తరించి మాజీ సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి నానావతిని కమిషనుకు అధినేతగా నియమించింది. దీంతో ఇది నానావతి-షా కమిషను అయింది.[21] 2008 మార్చిలో కమిషను తన తొలి నివేదికను సంర్పించేందుకు కొద్దిగా ముందు షా మరణించగా, అతడి స్థానంలో 2008 ఏప్రిల్ 6 న మాజీ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి అక్షయ్ కుమార్ మెహతాను హైకోర్టు నియమించింది.[22] కమిషను తన ఆరేళ్ళ దర్యాప్తు కాలంలో 40,000 పైచిలుకు పత్రాలు, వెయ్యికి పైగా సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలనూ పరిశీలించింది.[23] కమిషను గడువు మూణ్ణెల్లు కాగా, 22 సార్లు పొడిగింపుల తరువాత 2014 జూన్‌లో తుది నివేదికను సమర్పించింది.[24][25]
2008 సెప్టెంబరులో సమర్పించిన తన నివేదిక భాగం-1 లో గుజరాత్ పోలీసులు ప్రతిపాదించిన కుట్ర సిద్ధాంతాన్ని సమర్ధించింది.[5] గోధ్రకు చెందిన మౌల్వీ హసన్ హాజీ ఇబ్రహీమ్ ఉమర్జీ, సీఆర్పీయెఫ్ నుండి బహిష్కృతుడైన నానూమియా లను ప్రధాన కుట్రదారులుగా పేర్కొంది.[26] ఈ నిర్ణయానికి మద్దతుగా అప్పట్లో ఖైదీగా ఉన్న జబీర్ బిన్యామిన్ బెహెరా అనే నేరస్తుడి వాంగ్మూలాన్ని పేర్కొంది. అయితే తరువాత అతడు తా నా వాంగ్మూలాన్ని ఇవ్వలేదని పేర్కొన్నాడు.[27] రైలు దహనానికి బాగా ముందుగానే 140 లీటర్ల పెట్రోలును కొని, రజాక్ కుర్కుర్ అనే వ్యక్తికి చెందిన అతిథి గృహంలో దాచి ఉంచినట్లు, దహనానికి ముందు బోగీపై పెట్రోలును పోసినట్లూ ఫోరెన్సిక్ సాక్ష్యాన్ని కూడా కమిషను తన నివేదికలో సమర్పించింది. వేలాది మంది ముస్లిములు సిగ్నల్ ఫాలియా వద్ద రైలుపై దాడి చేసినట్లు కమిషను తన నివేదికలో నిశ్చయించింది.[28]
భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), భారత జాతీయ కాంగ్రెసు పార్టీలు, కమిషను తన తీర్పులో గుజరాత్ ప్రభుత్వాన్ని నిర్దోషిగా పేర్కొనడంతో విమర్శించాయి. కొద్ది నెలల్లోనే జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నివేదిక ఇచ్చినట్లుగా ఉందని కూడా అన్నాయి. కాంగ్రెసు ప్రతినిధి వీరప్ప మొయిలీ కూడా ఇదే కారణంతో కమిషన్ను తన తుది నివేదికను ఇచ్చేందుకు కొద్దిగా ముందు విమర్శించాడు. సీపీఐ (ఎం), మత భావనలకు ఊతమిచ్చేలా నివేదిక ఉందని విమర్శించింది.[29][30] క్రిస్టోఫర్ జాఫ్రెలోట్ వంటి వాళ్ళు కుట్ర సిద్ధాంతాన్ని అంత త్వరగా సమర్ధించినందుకుగాను, సంఘటనలో ప్రభుత్వ జోక్యం పట్ల ఉన్న సాక్ష్యాన్ని పట్టించుకోనందుగ్గానూ కమిషన్ను విమర్శించారు.[31]
2004 మే 17 న యుపిఏ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాక, లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి అయ్యాడు. ఆయన 2004 సెప్టెంబరులో, ఘటన జరిగిన రెండున్నరేళ్ళ తరువాత, సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేష్ చంద్ర బెనర్జీ నేతృత్వంలో దర్యాప్తు కమిషను నియమించాడు. 2005 జనవరిలో బెనర్జీ తన తాత్కాలిక నివేదికను సమర్పించాడు. రైలు దహనం ఒక ప్రమాదమని ఆ నివేదికలో ప్రతిపాదించాడు. మృతులపై ఉన్న కాలిన గాయాలు అంతర్గత జ్వలనం కారణంగానే అవుతాయని ఫోరెన్సిక్ నివేదిక చెప్పడాన్ని ఇందుకు ఆధారంగా అయన తీసుకున్నాడు. ఈ కేసులో ఉన్న ఆధారాల పట్ల రైల్వే వ్యవహరించిన విధానాన్ని ఆయన తన నివేదికలో విమర్శించాడు.[32][33][34]
బెనర్జీ నివేదికలోని అంశాలను నీలకంఠ్ తులసీదాస్ భాటియా గుజరాత్ హైకోర్టులో సవాలు చేసాడు. ఆయన ఈ సంఘటనలో గాయపడ్డాడు. 2006 అక్టోబరులో, బెనర్జీ నివేదిక లోని అంశాలను హైకోర్టు తోసిపుచ్చింది. బెనర్జీ కమిషను యొక్క దర్యాప్తు రాజ్యాంగ విరుద్ధము, చట్టవిరుద్ధమూ అని కూడా కోర్టు తేల్చింది. ఆ కమిషను ఏర్పాటు దురాలోచనతో చేసిన అధికార దుర్వినియోగం అని కూడా చెప్పింది. గోధ్ర సంఘటన ప్రమాదమంటూ చేసిన వాదన రికార్డులో ఉన్న ప్రైమా ఫేసీకి వ్యతిరేకంగా ఉంది, అని కూడా చెప్పింది. బెనర్జీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టరాదని కూడా హైకోర్టు తీర్పిచ్చింది.[35][36][37][38][39][40][41]
అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, బెనర్జీ నివేదిక త్వరలో జరగనున్న బీహారు ఎన్నికలలో లబ్ధి పొందేందుకు చేసిన ప్రయత్నంగా వర్ణించింది.[42] హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ, ఆ తీర్పు కాంగ్రెసుకు చెంపపెట్టు అని అంది.[43] అప్పటి రైల్వే మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం, గోధ్ర అనంతర అల్లర్లు అప్పటి నరేంద్ర మోదీ గుజరాత్ ప్రభుత్వమే చేయించిందని బెనర్జీ నివేదిక నిరూపించిందని, భాజపా అసలు స్వరూపాన్ని బయలు చేసిందనీ అన్నాడు.
2002 ఫిబ్రవరి 28 నాటికి 51 మందిని అల్లర్లు, దోపిడీలు, దహనకాండ వంటి నేరాలకు గాను అరెస్టు చేసారు.[44] ఒక కుట్రదారును పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసారు. అతడు ముస్లిము తీవ్రవాద సంస్థ హర్కతుల్ జిహాదీ ఇస్లామీ అనే సంస్థకు కమాండరని, అతడు బంగ్లాదేశ్‌లో ప్రవేశించే ప్రయత్నంలో ఉన్నాడనీ పశ్చిమ బెంగాలు ఛీఫ్ సెక్రెటరీ సౌరీన్ రాయ్ చెప్పాడు. 2002 మార్చి 17 న ప్రధాన నిందితుడు, స్థానిక కౌన్సిలరూ అయిన హాజీ బిలాల్‌ను ఉగ్రవాద వ్యతిరేక పోలీసులు గోధ్రలో పట్టుకున్నారు. 1540 మందితో కూడిన మూక ఫిబ్రవరి 27 న సబర్మతి ఎక్స్‌ప్రెస్ గోధ్ర స్టేషన్ను వీడగానే దానిపై దాడి చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మార్చిలో గోధ్ర మునిసిపాలిటీ అధ్యక్షుడు మహమ్మద్ హుసేన్ కలోటాను అరెస్టు చేసారు. అరెస్టైనవారిలో కార్పొరేటర్లు అబ్దుల్ రజాక్, షిరాజ్ అబ్దుల్ జమేషా ఉన్నారు. బిలాల్‌కు గ్యాంగు లీడరు లతీఫ్‌తో సంబంధాలున్నాయని, అతడు అనేక మార్లు కరాచీ వెళ్ళి వచ్చాడనీ కూడా పేర్కొన్నారు.[45][46]
రైల్వే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు పి.కె.జోషి ఎదుట సిట్ సమర్పించిన 500 పైచిలుకు పేజీల చార్జి షీటులో, సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీపై గోధ్ర స్టేషనుకు దగ్గరలో 1540 మందితో కూడిన మూక దాడి చేసినపుడు 59 మంది మరణించారు అని పేర్కొన్నారు.[47] చార్జిషీటులో నిందితులుగా పేర్కొన్న 68 మందిలో 57 మందిని రాళ్ళు విసిరినందుకు, తగలబెట్టినందుకూ నేరారోపణ చేసారు. ఆ మూక పోలీసులపై కూడా దాడి చేసి, తగలబడుతున్న రైలు వద్దకు వెళ్లబోయిన అగ్నిమాపక దళాన్ని అడ్డుకుని, రైలును మరోసారి చుట్టుముట్టారని కూడా నివేదికలో పేర్కొన్నారు. ఈ మూకలో ఉన్నందుకుగానూ మరో 11 మందిపై నేరారోపణ చేసారు.[48] తొలిగా, 107 మందిపై నేరారోపణ చేయగా, కేసు కోర్టులో ఉండగానే ఐదుగురు చనిపోయారు. మరో ఐదుగురు బాలురు కావడంతో వారిని ప్రత్యేక కోర్టులో విచారించారు. విచారణలో 253 మంది సాక్ష్యులను పరిశీలించారు. 1500 కు పైగా పత్రాలను ప్రవేశపెట్టారు.[49] 2015 జూలై 24 న ప్రధాన నిందితుడు హుసేన్ సులేమాన్ మొహమ్మద్‌ను మధ్య ప్రదేశ్, ఝబువా జిల్లాలో అరెస్టు చేసారు.[50] 2016 మే 18 న అప్పటివరకూ పరారీలో ఉన్న కుట్రదారు ఫరూక్ భానాను ముంబైలో గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసింది.[51]
2002 మార్చి 3 న నిందితులపై ఉగ్రవాద నిరోధ చట్టాన్ని ప్రయోగించారు. అయితే కేంద్ర ప్రభుత్వ వత్తిడి కారణంగా దాన్ని సస్పెండు చేసారు. 2002 మార్చి 9 న పోలీసులు ఆరోపణలకు నేరపూరిత కుట్రను కూడా చేర్చారు. 2003 మేలో 54 గురు నిందితులపై నేరారోపణ పత్రాన్ని దాఖలు చేసారు. కానీ వాళ్ళపై ఉగ్రవాద నిరోధ చట్టాన్ని (పోటా) ప్రయోగించలేదు. 2002 లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో గెలిచి భాజపా తిరిగి అధికారాన్ని చేపట్టిన తరువాత నిందితులందరిపై పోటాను ప్రయోగించారు.[52]
2003 సెప్టెంబరులో సుప్రీమ్ కోర్టు విచారణపై స్టే ఇచ్చింది. కేంద్రంలో యుపిఏ అధికారంలోకి వచ్చాక, పోటాను రద్దుచేసింది. 2005 మేలో పోటా సమీక్షా కమిషను నిందితులపై పోటాను ప్రయోగించరాదని నిశ్చయించింది. మృతుల బంధువులొకరు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్నప్పటుకీ, గుజరాత్ హైకోర్టు, సుప్రీమ్ కోర్టు రెండు కూడా ఈ సవాలును తోసిపుచ్చాయి. 2008 సెప్టెంబరులో నానావతి కమిషను తన నివేదికను సమర్పించింది. 2009 లో సిట్ యొక్క నివేదికను ఆమోదించాక, కేసు విచారణ కోసం కోర్టు ఒక ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పరచింది. కేసును విచారిస్తున్న బెంచి, సిట్ చైర్మన్ను సంప్రదించాక, పబ్లిక్ ప్రాసెక్యూటరును నియమించాలని కూడా చెప్పింది. సాక్ష్యుల సంరక్షణకు చర్యలను చేపట్టేందుకు సిట్‌ను నోడల్ ఏజెంసీగా నియమించింది. ఉప చార్జి షీట్లను దాఖలు చెయ్యడం కూడా సిట్ చెయ్యాలని చెప్పింది. సిట్ నిందితుల బెయిలును రద్దు చేవచ్చని కూడా తెలిపింది..[53] కేసుకు సంబంధించి 100 మందికి పైగా అరెస్టు చేసారు. నిందితులను బ్బంధించి ఉంచిన సబర్మతి జైలులోనే కోర్టును నెలకొల్పారు. 2009 మేలో వాదోపవాదాలు మొదలయ్యాయి.[54] కేసును విచారించేందుకు అడిషనల్ సెషన్స్ జడ్జి పి ఆర్ పటేల్ ను నియమించారు.
2010 మేలో గోధ్ర ఘటనతో సహా తొమ్మిది సున్నితమైన కేసుల్లో విచారణ కోర్టులు తీర్పును వెలువరించకుండా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 2010 సెప్టెంబరులో విచారణ పూర్తైంది. అయితే, సుప్రీం కోర్టు తీర్పు కారణంగా తీర్పు వెలువరించలేదు. 2011 జనవరిలో స్టే ఎత్తివేసారు. 2011 ఫిబ్రవరి 22 న తన తీర్పును వెలువరిస్తానని న్యాయమూర్తి ప్రకటించాడు.[55]
2011 ఫిబ్రవరిలో కోర్టు ఈ సంఘటనను ఒక ప్లాను ప్రకారం చేసిన కుట్రగా తేల్చి, అందులో పాలుపంచుకున్న 31 మందిని దోషులుగాను, 63 మందిని నిర్దోషులుగానూ తీర్పు చెప్పింది. భారతీయ శిక్షాస్మృతి యొక్క విభాగాలు 302, 120B, 149, 307, 323, 324, 325, 326, 332, 395, 397, 436 ల ప్రకారం, రైల్వే చట్టం, పోలీసు చట్టాల ప్రకారమూ ఈ తీర్పును నిశ్చయించారు. 11 మంది దోషులకు ఉరిశిక్ష విధించింది; వీళ్ళలో మారణకాండకు ముందు రాత్రి కుట్రకు ప్లాను చేసేందుకు జరిగిన సమావేశంలో పాల్గొన్నవారు, బోగీలోకి ప్రవేశించి, పెట్రోలు పోసి నిప్పంటించిన వారూ ఉన్నారు. మరో ఇరవై మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.[56][57]
ఈ సంఘటనకు ప్రధానమైన కుట్రదారుగా సిట్ భావించిన మౌల్వీ సయీద్ ఉమర్జీని కోర్టు సరైన ఆధాఅరాలు లేనందున నిర్దోషిగా భావించి మరో 62 మందితో పాటు వదిలేసింది. [58][59] దోషులు గుజరాత్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 61 మందిని వదిలెయ్యడంపైనా, యావజ్జీవం విధించిన 20 మందికి ఉరి వెయ్యాలనీ అప్పీలు చేసుకుంది.[60]
భాజపా ప్రతినిధి షానవాజ్ హుసేన్, "కేంద్ర ప్రభుత్వము, కొన్ని ప్రభుత్వేతర సంస్థలూ చేసిన ప్రచారాలు నిజం కాదని తేలిపోయాయి"[61] అప్పటి కేంద్ర ప్రభుత్వ న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, దీనిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని, చట్టం తనపని తాను చేసుకుపోతుందనీ చెప్పాడు.[62][63] సిట్‌కు నేతృత్వం వహించిన ఆర్.కె.రాఘవన్, ఈ తీర్పు తనకు సంతృప్తి నిచ్చిందని చెప్పాడు. భాజపా ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్, ఈ తీర్పు, కేసును కప్పిపుచ్చాలనే యుపిఏ ప్రభుత్వపు దుర్మార్గమైన ఆలోచలనలను బట్టబయలు చేసిందని చెప్పాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.