కోడెల శివప్రసాదరావు (1947 మే 2 ౼ 2019 సెప్టెంబరు 16) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి.[1] శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన కోడెల శివప్రసాదరావు, ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రిమండళ్లులో పలు శాఖల్లో పనిచేశాడు.[2]
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, గవర్నరు ...
మూసివేయి
గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించాడు.[3] అతని తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వారిది మధ్యతరగతి కుటుంబం.
కోడెల ప్రాథమిక విద్యను స్వగ్రామం కండ్లకుంట, సిరిపురం, నర్సరావుపేట లలో చదివాడు. విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివాడు. అతని చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే అతనిని డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. వారణాసిలో ఎం.ఎస్.చేసాడు
సత్తెనపల్లిలోని రావెల వెంకట్రావు దగ్గర కొంతకాలం వైద్యసేవలు అందించాడు. తరువాత నరసరావుపేటలో స్వంత హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టాడు. గ్రామీణులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించాడు.అనతికాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులపట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా ఉత్తమ వైద్యసేవలందించి,మంచి సర్జన్‌గా పేరుగడించాడు.
కోడెల ఎంబీబీఎస్ చదువుతుండగానే వివాహమైంది.భార్య శశికళ గృహిణి.వీరి సంతానం ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యన్నారాయణ. ఒక కుమార్తె. విజయలక్ష్మి. ముగ్గురూ వైద్యులే. అమ్మాయి గైనకాలజిస్టు. పెద్దబ్బాయి క్యాన్సర్ సర్జన్. రెండో అబ్బాయి ఎముకల స్పెషలిస్టు. కానీ రెండో అబ్బాయి ప్రమాదవశాత్తూ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
కోడెలకు రాజకీయాలు మీద ఇష్ఠం లేకపోయినప్పటికీ, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని తలంపుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. మొదటిసారిగా అతడు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే,మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవాడు.
1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు.
- నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేసి త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
- కోటప్పకొండను అభివృద్ధి చేసి జిల్లాలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చుటలో కీలక పాత్ర వహించారు. 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంటో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, పిల్లలకోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. దారి మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు.
- గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది సాధించవచ్చు అని కోడెల జన్మభూమిపై మమకారంతో గ్రామాలకు చెంది, విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” అనే నినాదంతో ప్రణాళికను రూపొందించారు.
సత్తెనపల్లి లో అభివృద్ధి కార్యక్రమాలు
- ఒక ఉద్యమంలా సత్తెనపల్లి నియోజకవర్గం లో మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించి నెరవేర్చాడు. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టాడు.
- కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి.
- హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంత్యక్రియలు జరపటానికైనా, తరువాత జరిగే కర్మకాండ కోసమైనా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. యజ్ఞశాలను పోలిన దహనవాటికలు నిర్మించారు. స్నానాల కోసం నీటి వసతి కల్పించారు, దుస్తులు మార్చుకోవటానికి గది కట్టించారు. ఉద్యానమనిపించే విధంగా చెట్లు, మొక్కలు పెంచారు. శ్మశానం చుట్టూ గోడ, పవిత్రప్రదేశమని స్ఫురింపజేసే ప్రవేశద్వారం నిర్మించారు. ఇవిగాక శ్మశానానికి వెళ్లే దోవను చక్కని రోడ్డుగా మార్చారు. అంత్యక్రియలు చూడవచ్చే బంధుజనం కోసం బెంచీలు ఏర్పాటు చేసారు. ఏ మతంవారి శ్మశానాలు వారికి ఉన్నాయి కనుక అన్నింటినీ వారివారి విశ్వాసాలకు తగిన రీతిలో ఆధునికీకరించారు.
- నియోజకవర్గం అంతటా పారిశుద్ధ్య కార్యక్రమం అమలు జరిగింది. స్వచ్ఛమేవ జయతే అంటూ ప్రజలు స్వచ్ఛందంగా అభివృద్ధి కృషిలో పాల్గొన్నారు. స్వచ్ఛ సత్తెనపల్లి రూపొందింది.
- రక్షిత మంచినీటి సదుపాయం, గ్రామాల్లో సిమెంటు రోడ్లు, వైద్య సౌకర్యాలు, చెరువు పూడిక తీయటం, ఇంకుడు గుంతలు, చెట్లు పెంచటం ఇతర నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంటాయి గాని సత్తెనపల్లిలో అమలు జరిగినవి కొన్ని ప్రత్యేకతలను సంతరించుకొన్నాయి. ఉదాహరణకు పూడికతీయటంతో పాటు చెరువు కట్టలను అందంగా తీర్చిదిద్ది, ప్రజలు సాయంత్రం వేళ వాహ్యాళికి వెళ్లి కూర్చునే విధంగా (హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ నమూనాలో) ఆకర్షణీయం చేసారు.
- ఐదంటే ఐదు రోజుల్లో యాభైవేల ఇంకుడు గుంతలు తవ్వించారు. ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. (రివర్స్ ఆస్మోసిస్) యంత్రాలను ఏర్పాటుచేసి త్రాగునీరు వసతి కల్పించారు. గ్రామాల్లో చాలాకాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్క గ్రామానికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు.
- సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రం మొత్తంలోకి ఆదర్శ (మోడల్) పురపాలక సంఘంగా ఎంపికైంది. చిన్న పట్టణమైనా వీధి దీపాలుగా ఎల్ఈడీ లైట్లూ, వాకింగ్ ట్రాక్, పార్కులు, సర్వత్రా పచ్చదనం, అతిథిగృహాలు, ఆటస్థలం, కళాశాలలకు కొత్త భవనాలు, కొత్తదనంతో వావిలాల ఘాట్, వందపడకల ఆస్పత్రి (విస్తరణలో) మొదలైనవి మునిసిపాలిటీకి గుర్తింపు తెచ్చాయి.
- కులమతాలకి అతీతంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గునే విధంగా, అక్టోబరు 22 ఆదివారం నాడు, శరభయ్యగ్రౌండ్స్ వేదికగా, కార్తీకమాస వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించాడు
సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ అభివృద్ధి ఫలాలను అందించడంతో అభివృద్ధి ప్రదాతగా నిలిచారు.
ప్రశంశ
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంలోఅతని హయాంలో ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేసి చూపించటం ఎలా సాధ్యమైందనేది తెలుసుకొనుటకు యూనిసెఫ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేయటానికి ప్రతినిధులను పంపించాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం సత్తెనపల్లి నియోజకవర్గంపై ఆసక్తి చూపారు.గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.
ఉద్యమస్పూర్తిగా అవయవదాన అంగీకార కార్యక్రమం
తన పుట్టినరోజు సందర్భంగా, మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో 2017 మే 2న డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించాడు.[4] భారీ ఎత్తున ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్ రికార్డు సృష్టించారు.నరసరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 11,987 మంది అవయవదానానికి అంగీకారం తెలిపారు.[5] కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించిన గిన్నీస్‌బుక్ ప్రతినిధి డాక్టర్ స్వప్నయ్ కోడెల శివప్రసాదరావుకు బహిరంగ వేదికపై గిన్నీస్ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.[5]
హోం మంత్రిత్వ శాఖ: 1987-1988
- గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కోడెల 1987లో ఎన్టీఆర్ కేబినెట్లో హోం మంత్రిత్వ శాఖను నిర్వహించారు.
నీటిపారుదల మంత్రిత్వ శాఖ :1996-1997
- నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్.టి. రామరావు చేత పులిచింతల ప్రాజెక్ట్ కొరకు శంకుస్థాపన చేయబడింది. ఆల్మట్టి సమస్యను జాతీయ స్థాయిలో అందరికి తెలిసేలా నేషనల్ ప్రెస్ వద్ద బహిర్గతం చేసాడు.
పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ;1997-1999
- 1995,1999ల్లో చంద్రబాబు పరిపాలనాలో పౌర సరఫరాలు, పంచాయితీ రాజ్, ఆరోగ్యం, ఇరిగేషన్ వంటి చాలా ప్రతిష్ఠాత్మకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు. పంచాయితీ రాజ్ శాఖలో నాలుగున్నర లక్షల డ్వాక్రా గ్రూపులును స్థాపించి ప్రశంసలు అందుకున్నాడు.
పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ
- పౌర సరఫరాల శాఖలో పంపిణీ వ్యవస్థను దోషరహితంగా తీర్చిదిద్ధటంతో ప్రభుత్వ నుండి తన వాటాను పౌరులు పూర్తిగా పొందగలిగారు.
వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- ఆరోగ్యం మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి సేవలందిస్తూ, అత్యంత సరసమైన రీతిలో ప్రజలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో అతను కీలక పాత్ర పోషించాచు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అప్పటి ప్రధాన మంత్రి వాజపేయి ప్రారంభించాడు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి: 2014-2019
- 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి గా పనిచేసారు.
విదేశీ పర్యటనలు
- 2014 లో యౌండీ, కామెరూన్లో జరిగిన కామన్వెల్త్ స్పీకర్ల సమావేశానికి హాజరయ్యాడు.
- 2014 సెప్టెంబరు 27 నుండి 2014 అక్టోబరు 10 వరకు మారిషస్, దక్షిణాఫ్రికా నైరోబీ, కెన్యాలలో జరిగిన పోస్ట్ కాన్ఫరెన్స్ అధ్యయన పర్యటనకు హాజరయ్యాడు
- ఢాకా, బంగ్లాదేశ్ లో జరిగిన 26వ కామన్వెల్త్ పార్లమెంటరీ సెమినార్ హాజరయ్యారు, 2015 మే 7 నుండి మే 21 వరకు ప్రీ కాన్ఫరెన్స్ పర్యటనలో పాల్గొన్నాడు.
- కువైట్‌లో 27 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించిన కువైట్ తెలుగు సంఘం సమావేశంలో పాల్గొన్నాడు.
- సింగపూర్ లో 2015 జూన్ 18 నుండి 2015 జూన్ 20 వరకు జరిగిన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో హాజరయ్యాడు
- లండన్, బ్రిటన్ లో 2015 సెప్టెంబరు 6 నుండి 2015 సెప్టెంబరు 10 వరకు జరిగిన చర్చావేదిక " కనెక్ట్ విటి డాట్స్ ప్రోగ్రాం' పై చర్చించటానికి వెళ్లాడు.
- గ్లమన్ కన్సల్టింగ్ , ది భారతదేశ కాన్సులేట్ జనరల్, హాంబర్గ్, జర్మనీచే 2015 నవంబరు 1 నుండి 2015 నవంబరు 10 వరకు సంయుక్తంగా నిర్వహంచబడిన 'హాంబర్గ్ ఇండియా-2015' ప్రోగ్రాంకు హాజరయ్యాడు.
- 2016 జనవరి 27 నుండి 2016 జనవరి 29 వరకు జరిగిన "ఇన్వెస్ట్-ఇన్-ఈస్ట్ -2016" శ్రీలంకలోని కొలంబోలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు.
- ఘనా, ఉగాండాలో 2016 ఏప్రిల్ 09 నుండి 2016 ఏప్రిల్ 14 వరకు వరకు జరిగిన CPA సమావేశాలకు హాజరయ్యాడు.
- 2016 మే 2 నుండి 2016 మే 9 వరకు బ్రెజిల్లో జరిగిన "82 వ ఎపోజూబు" హాజరయ్యాడు.
- 2016 ఆగస్టు 7 నుండి 2016 ఆగస్టు 11 వరకు 'CPA - రాష్ట్ర జాతీయ శాసనసభల శాసనసభ సమావేశం' చికాగో లోని ఇల్లినాయిలో జరిగిన సమావేశాలకు హాజరయ్యాడు.
ప్రజా వైద్యునిగా, ప్రజా పతినిధిగా సుధీర్ఘమైన చరిత్రగల రాజకీయ నాయకుదు కోడెల శివప్రసాదరావు చరమాంకం విషాదంగా ముగిసింది. 2019 లో జరిగిన శాసన సభ ఏన్నికలలో కోడెల సత్తెనపల్లిలో పరాజయం పొందారు. నైరాశ్యంతో 2019, సెప్టెంబరు 16న హైదరాబాదులోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు.[3]