From Wikipedia, the free encyclopedia
కొత్త సచ్చిదానందమూర్తి (1924 సెప్టెంబరు 25 - 2011 జనవరి 25) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు[1]. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు.
కొత్త సచ్చిదానందమూర్తి | |
---|---|
జననం | కొత్త సచ్చిదానందమూర్తి 1924 సెప్టెంబరు 25 గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి |
మరణం | 2011 జనవరి 25 86) గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి | (వయసు
వృత్తి | ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో తత్వశాస్త్రాచార్యునిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతి 1986-89 కాలంలో యూజీసీ ఉపాధ్యక్షుడిగా సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్ సంస్థకు ఛాన్సలర్ |
ప్రసిద్ధి | ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత, పద్మ భూషణ్ గ్రహీత, లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు, డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డు |
మతం | హిందూ మతము |
భార్య / భర్త | వేదవతీదేవి. |
పిల్లలు | నలుగురు కుమారులు |
తండ్రి | కొత్త వీరభద్రయ్య, |
తల్లి | రాజరత్నమ్మ |
Notes తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు. |
గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1924 సెప్టెంబరు 25న కొత్త వీరభద్రయ్య, రాజరత్నమ్మ దంపతులకు తొలి సంతానంగా జన్మించిన సచ్చిదానందమూర్తి భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఆచార్య సచ్చిదానందమూర్తి వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఆటలు ఆడే వయసులో పురాణ ఇతిహాసాలను అవపాసన పట్టిన నిత్యసోదకుడు. మాతృభాషతో పాటు సంస్కృతం, హిందీ భాషల్లో ప్రావీణ్యం సాధించారు.
సంగం జాగర్లమూడిలో జన్మించిన సచ్చిదానందమూర్తి బాల్యం అందరిలా సరదాగా గడిచిపోలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొత్త విషయాలు అన్వేషించటంలోనే ఉండేవి. స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (వాల్తేరు) లో డిగ్రీ పూర్తిచేశారు. కళాశాల విద్య అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ పూర్తి చేసి, 1956లో ఇక్కడే తత్వశాస్త్రంలో పి.హెచ్.డి. పూర్తిచేశారు. అందరిలా కాక తన ఆలోచనలను తత్వశాస్త్రాల వైపు మళ్ళించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఎన్నో రచనలు చేశారు. టిబెట్ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తిచేసిన మూర్తి 1959లో అమెరికాలోని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నుంచి మళ్లీ స్వదేశానికి వచ్చి 1960లో తాను విద్యనభ్యసించిన ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఆచార్యునిగా చేరారు. 1963లో బీజింగ్‌లోని చైనా పీపుల్స్ విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేశారు. మధ్యలో జె.ఎన్.టి.యు. ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏడేళ్లకే గుంటూరు యూనివర్శిటీ పి.జి. సెంటర్‌కు ప్రత్యేకాధికారిగా వచ్చారు. ఇక్కడ 1971 వరకు పనిచేసిన ఆయన జిల్లాలో కళాశాలల అభివృద్ధికి విశేష కృషిచేశారు.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 1975-78 మధ్య పలు విద్యా విధానాలకు నాంది పలికారు.
1986-89 కాలంలో విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసారు.
సారనాథ్‌లోని విశ్వవిద్యాలయ స్థాయిగల సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్ సంస్థకు ఛాన్సలర్ హోదాలో1989-2001 వరకూ పనిచేశారు. అప్పుడే టిబెట్‌తో మంచి సంబంధాలేర్పడ్డాయి. తర్వాత విదేశాల్లో చాలాచోట్ల తత్వశాస్త్రంపై ప్రసంగాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్ దేశాల్లో పర్యటించారు. ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
టిబెట్‌తో సచ్చిదానందమూర్తికి మంచి సంబంధాలే ఉన్నాయి. 1989లోనే టిబెటన్ స్టడీస్ సెంటర్‌కు కులపతిగా పనిచేసిన రోజుల్లో అక్కడి వారితో అవినాభావ సంబంధమేర్పడింది. పలుమార్లు దలైలామాతో కలిసి పలు తత్వ విషయాలపై పరిశోధనాంశాలను చర్చించారు.
దేశంలోని జే ఎన్ టి యూ, వారణాసి హిందూ విశ్వవిద్యాలయము, తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలతో పాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, బీజింగ్‌లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో సైతం సచ్చిదానంద సేవలు అందించటం తత్వశాస్త్రంలో ఈయన ప్రతిభకు నిదర్శనం.
భారతీయ తత్వశాస్త్ర నిపుణుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రథములైతే ఆయన వారసుడు ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి. ఈ విషయంలో దేశంలోని తత్వశాస్త్ర నిపుణులందరిదీ ఏకాభిప్రాయమే.
సర్వేపల్లికి, సచ్చిదానందమూర్తికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. సర్వేపల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగం అధిపతిగా అయిదేళ్లపాటు పనిచేశారు. సచ్చిదానందమూర్తి ఆ విభాగంలో విద్యసభ్యసించి అక్కడే మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. రాధాకృష్ణన్ భారత ఉప రాష్ట్రపతి అయిన తరువాతే ఆయనతో పరిచయం జరిగింది. ఆయన పలుమార్లు ఢిల్లీకి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించేవారు. తత్వశాస్త్ర అధ్యయనంలో సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారు.
సచ్చిదానంద మూర్తి తత్వ శాస్త్రంతో పాటు విద్వావిధానంలో సాధించిన ప్రగతికి భారత ప్రభుత్వం నుండి1984లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందాయి.
తత్వశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డును తొలి సారిగా 1982లో సచ్చిదానందకే ఇచ్చారు.
2007లో భారత తత్వశాస్త్ర పరిశోధనా సంస్థానము రజతోత్సవం సందర్భంగా ఆయనకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. స్వామి ప్రణవానంద తత్వ శాస్త్ర జాతీయ బహుమతి, శృంగేరీ పీఠం అందించే విద్యాసాగర అవార్డు, కాశీ సంస్కృత విద్యాలయం ప్రదానం చేసిన వాచస్పతి తదితర అవార్డులనూ ఈయన పొందారు.
1995లో తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం 'మహామహోపాధ్యాయ' అనే అరుదైన గౌరవాన్ని సచ్చిదానందకు ఇచ్చి గౌరవించింది.
జర్మనీ, రష్యాలోని పలు సంస్థలు కూడా సచ్చిదానందకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ బిరుదులు ఇచ్చి సత్కరించాయి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి పేరిట "ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ" పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆయన కీర్తికి నిదర్శనం.
సచ్చిదానందమూర్తి గారి భార్య వేదవతీదేవి. వీరికి యశోమిత్ర, రఘునాథ్, కృష్ణ, రమేష్ అనే నలుగురు కుమారులున్నారు. భారతీయ తత్వవేత్తగా అసమాన కీర్తి ప్రతిష్టలు పొందిన కొత్త సచ్చిదానందమూర్తి గారు 2011 జనవరి 25న తన స్వగ్రామంలో మరణించారు.
తత్వశాస్త్రం పై అనేక పరిశోధనలు, గ్రంథ రచనలు చేసిన సచ్చిదానందమూర్తికి అందిన బిరుదులు, పురస్కారాలు అంతే స్థాయిలో ఉన్నాయి. ఆయన రచించిన పుస్తకాలే ఎనలేని గుర్తింపు తెచ్చాయి. వందలకొలది పరిశోధనా పత్రాలు రాసారు.
తెలుగులో 12 గ్రంథాలు, ఆప్రో, ఏషియన్ తత్వ శాస్త్రాలపైనా ఆంగ్లంలో 30 గ్రంథాలు రచించారు.
తత్వశాస్త్రంపై సచ్చిదానందమూర్తి 1952లో రాసిన 'ఎవల్యూషన్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా' అనే గ్రంథానికి ఎం.ఎన్.రాయ్ పీఠిక రాయడం విశేషం. ఈ తరహా కృషికే మొదటిసారి డాక్టర్ బి.సి.రాయ్ అవార్డు సచ్చిదానందమూర్తికి దక్కింది. ఈ అవార్డును 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.