From Wikipedia, the free encyclopedia
కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి (1852 - జూన్ 6, 1897) ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు.[1]
ఈయన గోపాలకృష్ణ శాస్త్రి, వీరమ్మ దంపతులకు 1852వ సంవత్సరంలో గుంటూరు లో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణ శాస్త్రి తెలంగాణలోని విప్పుల మడక అగ్రహారంలో కొంతకాలం ఉన్నాడు.
తరువాత ఈయన గుంటూరు జిల్లా కారుమూరు గ్రామంలో స్థిరపడడంతో సుబ్రహ్మణ్య శాస్త్రి మెట్రిక్యులేషన్ వరకు ఇక్కడే చదివారు. గుంటూరులోని అమెరికన్ ఎవాంజెలికల్ లూథరన్ మిషన్ స్కూల్లో 1884 వరకు, గవర్నమెంట్ హైస్కూల్లో 1889 వరకు తెలుగు పండితుడిగా పనిచేశాడు. ఆ తరువాత మదరాసు వచ్చయప్ప కళాశాలలో ప్రధానాధ్రోపాధ్యాయుడిగా పనిచేశారు.
1881లో గుంటూరులో తెలుగు పండితులుగా పనిచేస్తున్నకాలంలో ధార్వాడ వారి నాటకాలు చూసి తను కూడా వచనంలోనే నాటకాలు రచించి ప్రదర్శింపజేశారు. ఆత్మానందంకోసం గుంటూరు హిందూ నాటక సమాజం స్థాపించారు. ఈ సమాజం ఆంధ్రదేశంలో స్థాపించబడ్డ సమాజాలలో రెండవది అని పరిశోధకుల అభిప్రాయం.[2]
నాటకాలలో నటించడం అగౌరవంగా ఉన్న రోజులలో శాస్త్రి తన విద్యార్థులతోనే కాక, అన్న కుమారుడు గోపాలకృష్ణయ్యతో కూడా నాటకాలలో నటింపచేసి ఇతరులకు మార్గదర్శకులయ్యారు. ఈయన రచించిన నాటకాలేవి అచ్చుకాలేదు. క్రమంగా రాతప్రతులు కూడా అంతరించిపోయాయి. ఈనాడు నాటకరంగంలో ప్రసిద్ధిగాంచిన నాటకకథలలో చాలాభాగం శాస్త్రి ఆనాడే నాటకాలుగా రాసి మార్గదర్శకులయ్యారు.
ఈయన నాటకాలలో ద్రౌపదీ వస్త్రాపహరణం తప్ప అన్నీ వచన నాటకాలే. ప్రదర్శనీయత, సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకొనే నాటకాలు రచించారు. ఒక దృశ్యం నడుస్తుంటే ఇంకో దృశ్య సజ్జీవకరణకు వీలుగా రంగాలను కూర్చడం ఈయన నాటకాలలోని విశేషం.
ద్రౌపదీ వస్త్రాపహరణ నాటకం ధర్మవరం రామకృష్ణమాచార్యల నాటకాల బాణీలో నడిచింది. పద్యాలు, పాటలే గాక పాత్రల గుణగణాలను, నాటక రీతిని తెలిపే ఉత్తరరంగం, ఒకే భావంగల గద్య, పద్య, గేయ రచన, కొత్త కొత్త చంధస్సులు వాడడం ఇందుకు నిదర్శనలు.
ఈయన రచించిన 31 నాటకాలలో 13 నాటకాలు మాత్రమే ఇప్పడు లభిస్తున్నాయి. వీటిలో గయోపాఖ్యానం, సిరియాళ చరిత్ర, వజ్ర దంష్ట్రోపాఖ్యానం, శుకరంభాసంవాదం, శశిరేఖా పరిణయం, శ్రీరామ జననం, కీచక వధ, సత్యహరిశ్చంద్ర, సుగ్రీవపట్టాభిషేకం, సీతాన్వేషణం, సీతాపహరణం అముద్రితాలు. ద్రౌపది వస్త్రాపహరణం (1882) ముద్రితం.[3]
నాటకకర్తగా, నాటక సమాజ నిర్వాహకుడుగా, దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న ఈయన 1897, జూన్ 6వ తేదీన స్వర్గస్థులయ్యారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.