From Wikipedia, the free encyclopedia
తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగిన వాటిల్లో కాటమరాజు కథ ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుదీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి ఆరుద్ర ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు. ఈ పుస్తకానికి దిగుమర్తి సీతారామస్వామి ముందుమాట రచించారు. ఈ నాటకాన్ని స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై వారు పుస్తకంగా 1999 లో ప్రచురించారు.[1] కొమ్ము వారు ఈ కథను కాటమరాజు కొమ్ము కథలుగా ప్రదర్శిస్తారు.
కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది. కాటమరాజు, యాదవరాజు నెల్లూరు సమీపానగల కనిగిరి ప్రాంతాల్ని పరిపాలించాడు. ఇతని కోట కనిగిరి దగ్గర పంచలింగాల కొండ దిగువున ఉండేది. అతడు గొప్ప పరాక్రమశాలి. అతనికి చాలా పశుసంపద ఉండేది. అయితే ఒకసారి తీవ్ర కరువు ఏర్పడితే, సరిహద్దులోని నెల్లూరు సీమను పాలించే నల్లసిద్ధి రాజు ప్రాంతంలోని అడవులలో పశువులను మేపుకొనేందుకు బదులుగా కొన్ని కోడెదూడలను ఇచ్చే ఒప్పందం కుదుర్చుకుంటాడు. నల్లసిద్ధిరాజు ఉంపుడుకత్తె కుందుమాదేవి (కన్నమదేవి) పెంపుడు చిలక ఆలమందలను బెదిరించడంతో దానిపై బాణం వేసి చంపుతారు కాటమరాజు అనుచరులు. దానికి ఆగ్రహించిన కన్నమదేవి తమ భటులతో వీరి పశువులను చంపిస్తుంది. దానికి కోపించి కాటమరాజు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాడు. తదుపరి రాయబారం విఫలం కాగా యుద్ధం మొదలవుతుంది. నల్లసిద్ధి సేనాపతి ఖడ్గతిక్కన ఎర్రగడ్దపాటి పోరు సా.శ. 1280 – 1296 లో పరాజయం పొందుతాడు. వెనుతిరిగిన ఖడ్గ తిక్కన తన భార్య, తల్లి నిందించేసరికి మరల యుద్ధానికి వెళ్లి కాటమరాజు పక్షాన పోరులో పాల్గొన్న బ్రహ్మనాయుడు చేతిలో చనిపోతాడు. బ్రహ్మరుద్రయ్య చనిపోతాడు. ఆ తరువాత నల్లసిద్ధిరాజుకి కాటమరాజుకి జరిగిన యుద్ధంలో కాటమరాజు ఆవులు, ఎద్దులు, నల్లసిద్ధిరాజు గుఱ్ఱాలు, ఏనుగుల బలంతో తలపడతాయి. నల్లసిద్ధి చనిపోయి కాటమరాజుని విజయం వరిస్తుంది.
పల్నాటి యుద్ధం సా.శ. 12 వ శతాబ్దంలో జరగగా, కాటమరాజు మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉన్న కాలంలో నల్లసిద్ధిరాజుకి, కాటమరాజుకి జరిగింది. కాటమరాజు కథా చక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని “సుద్దులగొల్లలు, కొమ్ములవారు” అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత “యాదవభారతం ఎద్దుమోత బరువు” అనే సామెత పుట్టింది. దీనిని తొలుత శ్రీనాథ కవి రచించాడనటానికి గాథాకవుల వాక్యాలు ఆధారమైనా, శ్రీనాథ విరచితమైన కథ దొరకలేదు.
మొత్తం ముప్పైనాలుగు రంగాలుగా విభజించబడ్డ ఈ నాటకరచన ఒకరంగం నుండి మరో రంగంలోని పాత్రలకూ, స్థలానికీ అత్యంత సహజంగా మారుతూ కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపిస్తుంది. అటువంటి బహుళప్రచారంలో ఉన్న పాత్రలను తీసుకుని కాటమరాజుని అవతారపురుషుడిగా, సౌమ్యుడు, మితభాషి ఐన ఉత్తముడిగా చిత్రీకరించాడు. ఖడ్గతిక్కన వ్యక్తిత్వ చిత్రణ, ధీరత్వ వర్ణన, పాత్ర ఉదాత్తత వంటి విషయాల్లో ఎటువంటి మార్పూ చెయ్యకుండా ఆ పాత్రపై పాఠకుడిలో ఆరాధనాభావాన్ని కలిగిస్తారు రచయిత.
కథానాయకుడైన కాటమరాజు మొదటినుంచీ ధర్మబద్ధుడిగా, ఆవేశం, ఆగ్రహం, విషాదం కలిగించే సందర్భాల్లో సంయమనం పాటించే వ్యక్తిగా, అవసరానికిమించి మాట్లాడని తత్వంగలవాడిగా, తన పశుగణాలపై, తమవారిపై అపారమైన అభిమానంగలవాడుగా కనిపిస్తాడు. ఇచ్చినమాటకు అతను కట్టుబడే విధానాన్ని నిరూపించడానికి ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే – దక్షిణాదికి పశువులతో సహా తరలివస్తున్నప్పుడు అది శత్రుసీమ కాబట్టి తన కొడుకుని పంపడం ఇష్టం లేని సవతితల్లి, అయితమరాజును పంపకుండా కొన్ని సాకులు ఏర్పరుస్తుంది. కానీ అక్కడ కాటమరాజు తప్పక నెగ్గుకొస్తాడనే నమ్మకం లోలోపల ఉన్నది కావటం చేత సంవత్సరం తర్వాత తాము దక్షిణాదిన సాధించిన దానిలో తమ్మునికి వాటా ఇవ్వమని మాట తీసుకుంటుంది. ఐతే ఆమె చెప్పిన గడువుకి యుద్ధం మొదలౌతుంది. తాము నెల్లూరిసీమలో సాధించినది ఇదే కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడికి యుద్ధంలో భాగం ఇస్తానని కబురు పంపుతాడు కాటమరాజు.
“తమకు గురుతుల్యులైన బ్రాహ్మలతో యుద్ధం చెయ్యడం యాదవవంశ ఆనవాయితీ కాదని”, కాటమరాజు కత్తిని ఒరలో దించి ఒంటరివాడైన తిక్కన ముందు తలదించి నిలబడే సన్నివేశం నాయక పాత్రకు ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టింది.
ఇటుపక్క కత్తి దించిన వారిపై కదనం చేయలేక ఇంటికి తిరిగివచ్చిన ఖడ్గ తిక్కనను పిరికివాడిగా భావించి తల్లి, తండ్రి, భార్య హేయంగా అవమానిస్తున్నప్పుడు కనీసం నోరు మెదపక తిక్కన సహనం పాటించిన సందర్భంలో వ్యక్తిత్వం, బాధ్యత, యుద్ధనీతుల నిర్వాహణలో సంయమనం సాధించడానికి ఆ పాత్ర వహించిన మౌనం అతని గంభీరతను నిరూపిస్తుంది.
ఎనిమిదవ రంగంలో బోయలు యాదవుల వల్ల తమ భుక్తికి ఇబ్బందిగా ఉందనీ, వేటలో తమకన్నా వారు చురుగ్గా ఉండటం వల్ల వేట తమవరకూ రావడం లేదనీ తిక్కన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, ‘వాళ్లంత చురుగ్గా మీరు లేకపోవడం వాళ్ల దోషం కాదు’ అని సమాధానపరచి పంపుతాడు. అటువంటిది, ఒప్పందాన్ని అతిక్రమించి యాదవులు రాజ్యం దాడిచేశారన్న వార్త విని, యుద్ధం చెయ్యడానికి కృతనిశ్చయుడౌతాడు. రెండు సందర్భాల్లోనూ వేడుకున్నది తమ ప్రజలే అయినా, ఒప్పంద నియమాలను సూక్ష్మంగా విచారించి స్పందించే ధోరణి కనపడుతుంది.
తన మీద సీసపద్యం చెప్పిన కొమరభట్టుకి ఎత్తుగీతి పూర్తి చేశాక బహుమతి ఇస్తానన్న వాగ్దానానికి తిక్కన చివరి క్షణాల్లో సైతం కట్టుబడి తన ఉంగరం ఇచ్చి పంపడం ఒక ఎత్తయితే, తమతో ప్రాణాలొడ్డి పోరాడుతున్న శత్రుసేనలోని వీరుడిని చూసి ఆరాధనాభావంతో ఎన్నాళ్లక్రితమో ఆగిపోయిన పద్యాన్ని కొమరభట్టు పూర్తి చెయ్యడం ఆ సన్నివేశానికి కథలో ఉదాత్తమైన స్థానాన్ని కల్పించింది. యుద్ధరంగం:
వీరరస ప్రధానమైన కథ కాబట్టి అయువుపట్టైన యుద్ధ సన్నివేశాలకి అవసరమైనంత భాగం ఈ నాటకంలో దక్కినట్టే కనిపిస్తుంది.
జిలుగుటమ్ములు పాతించి, పారాలు తవ్వించి, నిడిపట్టు, అలిమేక, దిగుమజవ వంటి వ్యూహాలతో కూడిన చక్రబంధాన్ని రచించి నల్లసిద్ధి ఆధునిక యుద్ధతంత్రాలతో సాయుధసేనతో సమరశంఖారావం చేస్తే..
అడ్దాయుకటువ, అమలచెలిక, కుందలింగముకొంద, తూమువేరులను కాపాడటానికి బొల్లావును నియమించి, గోసంగి బలాలు, భండన విక్రములైన యాదవవీరులు, ఏనుగులను చంపడానికి ఎద్దులు, అశ్వాలను చంపడానికి అక్షీణసంఖ్యలో ఆవులనూ తరలించి, స్థైర్యమే సైన్యంగా, ఆత్మబలమే అంగరక్షణగా కాటరాజు బలగం రణభూమిలోకి దిగినట్టు చిత్రిస్తారు రచయిత.
దొనకొండలో ఉండవలసిన దోరవయసు బాలుడు పోచయ్య యుద్ధభూమిలో బాలచంద్రుడివలే భయంగొల్పి, వీరాభిమన్యుడివలె విజృంభించి చివరకు రాజభటులు ప్రయోగించిన విలుమూకలకూ, చాయలబల్లాలకూ బలి అవుతాడు. ఈ రకంగానే మిగతా యాదవముఖ్యులంతా హతమౌతారు.
పతాక సన్నివేశంలో తలపడ్ద కాటమరాజు, నల్లసిద్ధి తమ తమ తప్పొప్పులపై, బలమూ, బలగాల ప్రస్తావనతో రాజనీతి గురించి మాట్లాడుకునే సన్నివేశం సందర్భోచితంగా ఉంటుంది.
మోవాకుల మీద లేఖ రాయడం కోసం ఎర్రయ్య తాటిచెట్టుని పెకలించుకురావడం అంతకుముందే ప్రచారంలో ఉన్న వీరగాథల్లోనే ఉండటం వల్ల ఆరుద్ర గారు తేదలచుకున్న రామాయణ సామ్యానికి హనుమంతుడి బలానికి పోలిక సరిపోయింది.
భీకర యుద్ధసన్నివేశాల్లో, బీభత్సరసం ఆయువుపట్టుగా సాగే సందర్భాల్లో రంగస్థలం మీద చూపించడానికి ఉన్న పరిమితుల దృష్ట్యా అటువంటి సన్నివేశాల్ని ఛాయానాటకం టెక్నిక్ ద్వారా చూపించారు.
ఈ నాటక రచనలో కథనాన్ని నల్లేరు మీద నడిపించి వీరరసాన్ని విరివిగా ఒలికించడానికి ఆరుద్ర ఎంతో చాకచక్యంగా అలవోకగా వాడిన జాతీయాలు ప్రధాన కారణం. తెలుగు భాష, వాడుక పదాలు, నుడికారం వంటివాటిపై ఆయనకున్న పట్టు ఎన్నోచోట్ల తేటతెల్లమౌతుంది. అటువంటి కొన్ని వాడుకలు:
పుల్లరి – కప్పం, సుంకం, శిస్తు వంటిది. పశువులను పరాయి గడ్దపై మేపుకోనిచ్చినందుకు ప్రతిగా చెల్లించవలసిన రుసుము. శుద్ధకాంతలు – అంతఃపుర కాంతలని శుద్ధకాంతలు అని వ్యవహరిస్తారు, ఒకచోట ఏరాలి కొడుకు – సవతి కొడుకు పొరుపులు - పొరపొచ్చాలు రాణువలు- సేనలు కూటయుద్ధం – అధర్మయుద్ధం సాగుమానం: సహగమనానికి వికృతి రూపం కావచ్చు సృగాలాలు – నక్కలు కెంధూళి – గోధూళికి మరో రూపం (కెంపు+ధూళి)
కంఠమెత్తి రాగాలాపన చెయ్యడానికి వీలైన పద్యాలు లేని నాటకాన్ని తెలుగువాడు ఆదరించడు అనే రహస్యాన్ని తెలిసినవాడు కావడం చేత అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న కొన్ని చాటు పద్యాలను, వీరగాథల్లోని ద్విపద పంక్తుల్ని గ్రహించి కథలో ఉపయోగించారు. ఐతే వీటిల్లో ఏవి సేకరించినవి, ఏవి ఆయన రచించినవి అన్న సంగతి స్పష్టంగా లేదు.
రాగయుక్తంగా పాడుకోదగ్గవిగా, సరళంగా ఉన్న కొన్ని పద్యాలు:
సీ!!
సాబేతు ముసరతో ఆబోతు శుష్కించి
కంటి నెత్తుటిధార కార్చసాగె
రిల్లనొప్పి జనించి పుల్లావు వెతనొంది
నాలుగ్గడులుగూడ నడువలేదు
ముగ్గురోగముతోడ నిగ్గుచెడి పసరమ్ము
లుయ్యాలపోలిక నూగసాగె
నాలుకచేరితో నరములుబ్బిన గొడ్డు
“అంబా” యటంచైన నార్చలేదు.
పై పద్యంలో పశుజాతులు, వాటి వ్యాధులపై అవగాహన ఉన్నవాళ్లకి కాటకపరిస్థిని, అంటువ్యాధులను కరుణరసాత్మకంగా కళ్లకు కట్టారు. అని రాయశృంగారభట్టు యాదవులను హెచ్చరిస్తాడు.
రమ్మను సిద్ధిభూవరుని రాణువతో కదనమ్ము సేయగా
రమ్మను. చేవదప్పి సమరమ్మును చేసెడి శక్తిలేనిచో
నమ్మకమొప్ప మాదుచరణమ్ములపై శరణంచువాలగా
రమ్మను. యుద్ధమందు తన రాకడ పోకడలొక్కటేయగున్.
బెజవాడ బెబ్బులి పెయ్యలెర్రయ లేచి
కోడెదూడల నుసికొల్పునాడు
వెలమవీరుడు మాదు చెలుడు రాఘవుడల్లి
మింటమంటలు కురిపించునాడు
అరిభయంకరమూర్తి అయితన్న యేతెంచి
రిపుల కుత్తుకలుత్తరించునాడు
గోసంగి బీరన్న కోపించి రుద్రుడై
కొగంవాల్ కత్తితో కోయునాడు
అని కాటమరాజు భట్టుని హెచ్చరిస్తాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.