కంచర్ల సుగుణమణి ప్రముఖ సంఘ సేవకురాలు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ అనుచరురాలిగా ఈమె సుప్రసిద్ధురాలు.
జీవిత విశేషాలు
ఈమె 1919, నవంబర్ 27వ తేదీన కాకినాడలో గురుజు వెంకటస్వామి, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదుగురు చెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ముల మధ్య పెరిగింది. ఆ రోజులలోనే ఈమె మగపిల్లలతో సమానంగా మహారాజా కాలేజీలో డిగ్రీ చదివింది. చిన్నప్పటినుండి మంచి వాతావరణంలో పెరగడంవల్ల ఈమెకు సేవాభావం అలవడింది. ఈమె వివాహం గాంధేయవాది కంచర్ల భూషణంతో జరిగింది. ఆ రోజుల్లోనే కట్నకానుకలు వద్దని, చదువు, సంస్కారం వున్న అమ్మాయి కావాలని కంచర్ల భూషణం ఈమెను వివాహం చేసుకున్నాడు.[1]
సంఘసేవ
ఆమె చదువుకునే రోజులలోనే భూకంపాలు, వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు, ఇంటింటికీ వెళ్ళి విరాళాలు సేకరించి కాలేజీ యాజమాన్యానికి అప్పగించింది. తనలోని తపనను అక్షరాలతో పొదిగి గృహలక్ష్మి, భారతి వంటి పత్రికలకు వ్యాసాలు వ్రాసింది. స్త్రీ జనోద్ధరణ కోసం 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే సంస్థ ప్రారంభించింది. భర్త ఉద్యోగరీత్యా ఈమె ఢిల్లీ వెళ్ళింది. ఆకాశవాణిలో ఈమె తొలి తెలుగు ప్రసంగం ఢిల్లీ నుండి ప్రసారమయింది. 1944 సంవత్సరంలో భర్తకు బదిలీ కావడంతో మద్రాసుకు మకాం మార్చింది. భర్త ప్రోత్సాహంతో, ఈమె దుర్గాబాయమ్మను సందర్శించి ఆమెతో పాటుగా సేవ చెయ్యాలనే ఆకాంక్షను వెలిబుచ్చింది. దుర్గాబాయమ్మ దానికంగీకరించి ఈమెకు ”ఆంధ్రమహిళ” పత్రిక పూర్తి బాధ్యతను అప్పగించింది. మద్రాసులో ఈమెకు బులుసు సాంబమూర్తి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన ప్రముఖుల సాంగత్యంతో ఈమె ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది. దుర్గాబాయమ్మ గారితో కలిసి ”కస్తూరిబానిధి”కి విరాళాలు ఒక సంవత్సరంలో 6 లక్షలు ప్రోగు చేసింది. ఆ రోజుల్లో 6 లక్షలంటే సామాన్యం కాదు. మహాత్మాగాంధి ఆజ్ఞ ప్రకారం దుర్గాబాయమ్మతో కలసి ఆ నిధితో ఈమె రాష్ట్రమంతా పర్యటించి, ”కస్తూరిబా సేవా సంఘాలు” స్థాపించి అనుభవజ్ఞులైన సేవికలను ఏర్పాటుచేసింది. ఈనాటికీ అవి నిర్విరామంగా సేవలు చేస్తున్నాయంటే వాటి వెనుక ఈమె కృషి ఎంతో ఉంది.
భర్త ఉద్యోగరీత్యా అరకు వెళ్ళినప్పుడు అక్కడి గిరిజనుల పూరిళ్ళు, ఆహారం, భాష, కట్టుబాట్లు విచిత్రంగా వుండటం ఆమె గమనించింది. అక్కడి అనారోగ్యాలూ, విషజ్వరాలూ, కొండదేవతలకిచ్చే నరబలులు, జంతుబలులూ చూసి చలించిపోయి, మద్రాసులోని స్త్రీ శిశు సంక్షేమ అధికారి పారిజాతం నాయుడికి లేఖ వ్రాసింది. ఆమె సహకారంతో ఒక సంక్షేమ కేంద్రాన్ని స్థాపించి, తమ కాలనీలోని స్త్రీల సహకారంతో పిల్లలకు చదువు, ఆటపాటలు, కుట్లు, పారిశుధ్యం నేర్పుతూ సుగుణమణి ఐదు సంవత్సరాలు వారికి సేవ చేసింది. ఇప్పటికీ అక్కడ ఆ కేంద్రంలో స్త్రీలకు, పిల్లలకు చదువు, వృత్తివిద్యలు, ఆరోగ్యసూత్రాలు నేర్పుతున్నారు.
1944 నుంచీ ఆలిండియా రేడియోలోనూ, టి.వి. వచ్చిన తరువాత అన్ని ఛానల్స్‌లోను ఎన్నో స్త్రీల సమస్యల గురించి తన నిశ్చితాభిప్రాయాలను వెలిబుచ్చుతూనే ఉంది. శిశువుల నుంచీ వృద్ధుల దాకా స్త్రీలను ఆదుకోవాలనే ఆశయంతో సుందర్‌నగర్‌లో వృద్ధాశ్రమం ఏర్పాటుచేసింది.
ఆంధ్రమహిళాసభ
ఈమె దుర్గాబాయమ్మ కోరిక మేరకు 1957 అక్టోబరులో హైదరాబాదు వచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. ”ఆంధ్రమహిళాసభ” హైదరాబాద్ శాఖను అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించాడు. అప్పుడు విద్యానగర్‌లో ప్రారంభించిన ”ఆంధ్రమహిళాసభ” మెటర్నిటీ హాస్పిటల్, హేండీక్రాఫ్ట్స్ ఇన్‌స్టిట్యూట్, హైస్కూల్, హాస్టల్, అసెంబ్లీహాల్‌లతో నిండిపోతే, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా స్థలం తీసుకుని ఆర్ట్స్, సైన్స్, లా కాలేజీలు, కంప్యూటర్ కోర్స్, సంగీతం క్లాసులు, లిటరసీ భవన్, గాంధీభవన్, హాస్టల్, వికలాంగుల స్కూలు, ఫిజియోథెరపీ, నర్సింగు హాస్టల్ అలా ఎన్నో ఏర్పాటు చేశారు. 260 మంది పిల్లలు ఎన్నో వృత్తి విద్యలు నేర్చుకుంటున్నారు. ”ఆంధ్రమహిళాసభ” పెట్టిన కొత్తలో దుర్గాబాయమ్మతో కలిసి ఈమె ఇంటింటికీ తిరిగి బేడా, పావలా కూడా విరాళాలుగా సేకరించింది. అలా మొదలైన సేవ మరణించేవరకూ లక్షలలో విరాళాలు సేకరిస్తూ ”ఆంధ్రమహిళాసభ”ను శాఖోపశాఖలుగా విస్తరిస్తూ, కొన్ని శాఖలకు కార్యదర్శి గాను, సలహాదారుగాను సేవలు చేస్తూ, 6 ఏళ్ళు అధ్యక్షురాలిగా సమర్ధ వంతంగా ఆ పదవిని నిర్వహించింది. దుర్గాబాయమ్మ మరణించాక ‘ఆంధ్రమహిళాసభ’ పూర్తి బాధ్యతలను చేపట్టింది. ట్రస్ట్ బోర్డ్‌కి మరణించేవరకు తన సహాయ సహకారాలను అందించింది. ఈమె ఆధ్వర్యంలో దుర్గాబాయమ్మ సెంటినరీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగింది. మద్రాసు, హైదరాబాద్‌లలోనే కాకుండా, కర్నూలు, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఇబ్రహీంపట్నంలలో కూడా ఆంధ్రమహిళాసభ ఎంతో కృషి చేస్తున్నది. ఎడల్ట్ ఎడ్యుకేషన్ రూరల్ ఏరియాలలో లిటరసీ హౌస్ దక్షిణ భారతంలో ”ఆంధ్రమహిళాసభ”లో మాత్రమే వున్నది. వాలంటరీ సెక్టార్‌లో కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చే మొదటి సంస్థ యిదే. ఇన్ని సంస్థలు దుర్గాబాయమ్మ తదనంతరం కూడా అంత ఘనంగానూ నడుస్తున్నాయంటే, అది ఈమె ఓర్పు, నేర్పు, సహనం, సమయపాలనల వల్లనే.
ఆంధ్రమహిళ
”ఆంధ్రమహిళ” పత్రిక పూర్తి బాధ్యత సుగుణమణి తీసుకుంది. అందులో కనుపర్తి వరలక్ష్మమ్మ, ఆచంట రుక్మిణమ్మ, కాంచనపల్లి కనకాంబ మొదలైన ఆనాటి ప్రముఖ రచయిత్రుల వ్యాసాలను ప్రచురించటమే కాదు, తనూ స్వయంగా వ్రాసి పత్రికను తీర్చిదిద్దింది. ప్రూఫులు దిద్దటం దగ్గరనుంచీ, స్టాంపులు అంటించి నడిచివెళ్ళి పోస్ట్ చెయ్యటం దాకా అన్ని బాధ్యతలూ ఈమే నిర్వర్తించేది.
ఆంధ్ర బాలానందసంఘం
అటు ‘ఆంధ్రమహిళాసభ’లో స్త్రీ సంక్షేమంతో పాటుగా, యిటు ‘బాలానంద సంఘం’లో శిశుబాలల సంక్షేమానికీ ఈమె అంకితమయ్యింది. ‘బాలానంద సంఘం’లో మొదటి నుంచే ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎంతో సేవ చేసింది. రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు, అక్కయ్య న్యాయపతి కామేశ్వరి దంపతులకు ఈమె ఎంతో ఆత్మీయురాలు. న్యాయపతి రాఘవరావు చనిపోయి తరువాత 1984 నుండి ఈమె బాలానంద సంఘం అధ్యక్షురాలిగా పనిచేసింది. ఈమె ఆధ్వర్యంలో ”ఆంధ్ర బాలానంద సంఘం” 1990 సంవత్సరంలో స్వర్ణోత్సవాలను దిగ్విజయంగా జరుపుకున్నది.
పదవులు
ఈమె ప్రజాజీవితంలో ఎన్నో పదవులు ఈమెను వరించాయి. వాటిలో కొన్ని
- కార్యదర్శి/సలహాదారు/అధ్యక్షురాలు - ఆంధ్ర మహిళా సభ
- ఉపాధ్యక్షురాలు/అధ్యక్షురాలు - ఆంధ్రబాలానంద సంఘం
- సభ్యురాలు - మద్రాస్ రాష్ట్ర సొసైటీ అడ్వయిజరీ బోర్డు
- సభ్యురాలు - వికలాంగుల సలహాబోర్డు
- కార్యదర్శి - కస్తూర్బా గాంధీ సేవాసంఘం ఉమెన్ కమిటీ
- ఆంధ్రప్రదేశ్ ఛైర్‌పర్సన్ - శారదా సంఘం
- సభ్యురాలు - ఉమ్మడి ఏపీ కార్మిక సంక్షేమ సలహా కమిటీ
పురస్కారాలు, సన్మానాలు
ఈమె అందుకున్న పురస్కారాలలో కొన్ని:
- 1991: ఛైల్డ్ వెల్ఫేర్‌కి గాను నేషనల్ అవార్డు అప్పటి ప్రెసిడెంట్ చేతులమీదుగా అందుకుంది.
- 1991: శిరోమణి ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ వారి చేత వికాసశ్రీ అవార్డు
- 1993: భరతముని కళా అవార్డు
- 1994: రాజీవ్‌రత్న నేషనల్ అవార్డు
- 2000: మిలీనియమ్ అవార్డు
- 2000: రామకృష్ణమఠ్ ద్వారా లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు
- 2001: ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పెరల్ సిటీ జూనియర్ ఛాంబర్ వారిచె హైదరాబాద్ పెరల్ అవార్డు
- 2002: గాంధీగారి మనుమరాలు, తారాగాంధీ చటర్జీ ద్వారా సర్వోదయా సంస్థ అవార్డు
- 2005: రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం
- కేంద్ర సాంఘికసంక్షేమ శాఖ ఉత్తమ సంఘసేవకురాలు పురస్కారం
- దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అవార్డు
- ఇందిరాప్రియదర్శిని ప్రతిభా అవార్డు
మరణం
ఈమె తన 99వ యేట 2017, జూలై 5వ తేదీ బుధవారం తెల్లవారుఝామున హైదరాబాదులో మరణించింది.[2]
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.