ఎర్ర రక్త కణాలు (Red blood cells) రక్తంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే రక్తకణాలు. ఒక మిల్లీలీటరు రక్తంలో ఎర్ర రక్త కణాలు ఐదు మిలియన్ల వరకు ఉంటాయి

Thumb
మానవ రక్తంలో ఎర్ర రక్తకణాలు

మన రక్తంలో ప్రతి ఒక్క తెల్ల కణానికి జవాబుగా దరిదాపు 600 ఎర్ర కణాలు ఉంటాయి. నిర్ధిష్టమైన ఆకారం లేని తెల్ల కణం కైవారం 10-20 మైక్రానులు ఉంటే గుండ్రటి బిళ్లలులా ఉన్న ఎర్రకణం వ్యాసం 7 మైక్రానులు ఉంటుంది. (ఒక మైక్రాను అంటే మీటరులో మిలియనవ వంతు!) ఎర్ర కణాలు ద్విపుటాకారపు (bi-concave) ఆకారంలో ఉంటాయి; అనగా, మధ్యలో చిన్న లొత్త ఉంటుంది.

ఎర్ర కణాలు వాటి జీవితకాలంలో మనకి ఎనలేని సేవ చేస్తాయి. సంతర్పణలో పరిచారకులు వంటశాల నుండి వడ్డన గది వరకు - ముందుకి, వెనక్కి - తిరిగినట్లు ఎర్ర కణాలు ఊపిరితిత్తులనుండి జీవకణాల వరకు - ముందుకీ, వెనక్కీ - పుట్టిన దగ్గరనుండి గిట్టే దాకా 75,000 సార్లయినా తిరుగుతాయి. ఇలా నాలుగు నెలలపాటు శ్రమించి జీవితం చాలిస్తాయి.

ఒకొక్క ఎర్ర కణంలో సుమారు 270 మిలియన్ల హిమోగ్లోబిన్ బణువులు ఉంటాయి. ఒకొక్క బణువు (molecule) ఎన్నో అణువుల (atoms) సముదాయం. ఒక బణువు ఎంత పెద్దదో చెప్పాలంటే దాని బణు భారం (en: molecular mass) చెబుతాం. ఒక ఉదజని బణువులో రెండు ఉదజని అణువులు ఉంటాయి; దాని బణు భారం 2. ఒక ఆమ్లజని బణువులో రెండు ఆమ్లజని అణువులు ఉంటాయి; దాని బణు భారం 32. అదే విధంగా హిమోగ్లోబిన్ బణు భారం 64,000 డాల్టనులు ఉంటుంది. అనగా, ఒక మోల్ హిమోగ్లోబిన్ ఉరమరగా 64,000 గ్రాములు తూగుతుంది.

ఒకొక్క హిమోగ్లోబిన్ బణువు కేవలం నాలుగు ఆమ్లజని అణువులని ఊపిరితిత్తుల దగ్గర సంగ్రహించి శరీరంలోని జీవకణాలకి అందజేస్తుంది. ఎర్ర కణాలు వాటి జీవితకాలంలో మనకి విశేషమైన సేవ చేస్తాయి. ఇవి పుట్టిన దగ్గరనుండి గిట్టే దాకా సుమారు 75,000 సార్లు ఊపిరితిత్తుల నుండి జీవకణాలకి ఆమ్లజనిని అందజేసి, సుమారు నాలుగు నెలలపాటు విశ్రాంతి లేకుండా పని చేసి, అవసాన కాలానికి తమ జన్మస్థానమైన మజ్జ (en:marrow) లోకి చేరుకుంటాయి. అక్కడ ఉన్న తెల్ల కణాలు వీటిని కబళించి మింగెస్తాయి.

కంటి ముందు బుడగలు

సగటు మగవాడి శరీరంలో సుమారు 25 ట్రిలియన్లు ఎర్ర కణాలు, సగటు ఆడదాని శరీరంలో సుమారు 17 ట్రిలియన్లు ఎర్ర కణాలు ఉంటాయి. వీటిలో వెయ్యింటికి ఎనిమిది చొప్పున రోజూ చచ్చిపోతాయి.అనగా, రోజుకి 200 బిలియన్లు చొప్పున (లేదా, సెకండుకి 2,300,000 చొప్పున చచ్చిపోతూ ఉంటాయి. కొన్ని మజ్జ చేరుకోకుండానే, దారిలో, చచ్చిపోయి రక్త ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇలా చితికి, చివికి పోయిన కణ భాగాలు మన కంటి గుడ్డులోని నేత్రరసంలో చేరి తెప్పలులా తేలియాడుతాయి. అవే మన కంటి ముంది తేలియాడుతూ, బుడగలలా కనిపించే మచ్చలు.

హిమోగ్లోబిన్ అవసరం

ఆమ్లజనిని మోసుకు వెళ్ళడానికి హిమోగ్లోబిన్ అవసరం. ఈ హిమోగ్లోబిన్ ని మొయ్యడానికి ఎర్ర కణాలు అవసరం. హిమోగ్లోబిన్ బణువులే నేరుగా రక్తప్రవాహంలో ప్రయాణించవచ్చు కదా? మధ్యలో ఎర్ర కణాలు ఎందుకు? ఇక్కడ ఒక ఉపమానంతో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పవచ్చు. ప్రమిద హిమోగ్లోబిన్ అనిన్నీ, ప్రమిదలో వెలుగుతూన్న దీపం ఆమ్లజని అనీ అనుకుందాం. ఈ ప్రమిదని దేవుడిగది నుండి వాకట్లోకి తీసుకెళ్లాలనుకుందాం. దీపం దారిలో ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతాం. అదే విధంగా రక్త ప్రవాహానికి ఎదురయ్యే అనేక వడపోత ప్రక్రియలకి బలి కాకుండా హిమోగ్లోబిన్ ని కాపాడడానికి ఎర్ర కణాలు "సంచులు" లా పని చేస్తాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.