ఋషి
From Wikipedia, the free encyclopedia
ఋషి జ్ఞానోదయం పొందిన వ్యక్తిని సూచించే పదం. వివిధ హిందూ వేద గ్రంథాలలో వీరి ప్రస్తావనలుంటాయి. వేదాల శ్లోకాలను రచించినది ఋషులేనని నమ్ముతారు. హిందూమతంలో వైదిక అనంతర సంప్రదాయంలో ఋషులను "గొప్ప యోగులు" గా పరిగణిస్తారు. వారు తీవ్రమైన తపస్సు తర్వాత వారు అత్యున్నత సత్యాన్ని, శాశ్వతమైన జ్ఞానాన్నీ పొందారు. ఆ జ్ఞానాన్నే వారు శ్లోకాలుగా రూపొందించి మానవాళికి అందించారు. ఈ పదం పాళీ సాహిత్యంలో ఇషి గా కనిపిస్తుంది. బౌద్ధమతంలో, వారిని బుద్ధులు, పచ్చేకబుద్ధులు, అరహతులు లేదా ఉన్నత స్థాయి సన్యాసి అనీ అంటారు.

హిందూ గ్రంథాలలో

వేదాలలో, ఋషి అనే పదం వేద శ్లోకాలను రచించిన కవిని సూచిస్తుంది. [1] ముఖ్యంగా, ఋషి అనేది ఋగ్వేద శ్లోకాల రచయితలను సూచిస్తుంది. ఋషుల తొలి జాబితాలు కొన్ని జైమినియ బ్రాహ్మణం లోని శ్లోకం 2.218, బృహదారణ్యకోపనిషత్తులో శ్లోకం 2.2.4లో కనిపిస్తాయి. [2]
వేదానంతర సంప్రదాయం ఋషులను "మునులు" లేదా సాధువులుగా పరిగణిస్తుంది. వీళ్ళు అసురులు, దేవతలు, మర్త్య పురుషుల కంటే భిన్నమైన వారు. ప్రారంభ పౌరాణిక వ్యవస్థలో దైవిక మానవుల ప్రత్యేక తరగతి ఇది. స్వామి వివేకానంద ఋషులను మంత్ర-ద్రష్టలు లేదా "క్రాంతదర్శులు"గా అభివర్ణించాడు. అతను ఇలా చెప్పాడు- "మంత్ర-ద్రష్టలు, క్రాంత దర్శులూ అయిన భారతీయ ఋషులకు సత్యం తెలియవచ్చింది. భవిష్యత్తులో ఋషులందరికీ తెలుస్తుంది, మాట్లాడేవారికీ, పుస్తకాలు మింగేసే వారికీ, పండితులకూ, భాషావేత్తలకూ తెలియదు. కానీ ఆలోచనా దర్శులకు మాత్రమే తెలుస్తుంది" [3]
వేద గ్రంథాల కూర్పుకు సహకరించిన ప్రముఖ మహిళా ఋషులు : ఋగ్వేదంలో రోమష, లోపాముద్ర, అపల, కద్రువ, విశ్వవర, ఘోష, జుహూ, వాగంభృణి, పౌలోమి, యమి, ఇంద్రాణి, సావిత్రి, దేవయాని. సామవేదంలో నోధ, అకృష్టభాష, సికటానివావారి, గౌపాయనాలు ఉన్నారు.
మరోవైపు, మహాభారతం 12 వ పర్వంలో మారీచి, అత్రి, అంగీరసం, పులహ, క్రతు, పులస్త్య, వశిష్టుల వేదానంతర జాబితా ఉంది. మహాభారత జాబితా స్పష్టంగా మొదటి మన్వంతరానికి చెందిన సప్తర్షులను సూచిస్తుంది, ప్రస్తుత మన్వంతరానికి సంబంధించిన వారిని కాదు. [4] ఒక్కో మన్వంతరానికి ఒక్కో సప్తర్షి సముదాయం ఉంటుంది. హరివంశ 417ff లో, ప్రతి మన్వంతరానికి చెందిన ఋషుల పేర్లు ఉన్నాయి.
సప్తర్షులతో పాటు, ఋషులను వేరేవిధాలుగా కూడా వర్గీకరించారు. ప్రాధాన్యతల అవరోహణ క్రమంలో వారు - బ్రహ్మర్షి, మహర్షి, రాజర్షి. మనుస్మృతి iv-94, xi-236 లోను, కాళిదాసు రాసిన రెండు నాటకాలలోనూ దేవర్షి,పరమర్షి, శ్రుతర్షి, కందర్షి అనే మరో నాలుగు రకాల ఋషుల గురించి ఉంది.
హేమాద్రి రాసిన చతుర్వర్గ-చింతామణిలో చూపిన ఎనిమిది రకాల బ్రాహ్మణులలో ఏడవ స్థానంలో ఋషులు ఉన్నారు. అమరకోశంలో [5] ( ఋషులు సంకలనం చేసిన ప్రసిద్ధ సంస్కృత పర్యాయపద నిఘంటువు) ఏడు రకాల ఋషుల గురించిన ప్రస్తావన ఉంది. వారు: శ్రుతర్షి, కందర్షి, పరమర్షి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. అమరకోశం ఋషిని సన్యాసి, భిక్షువు, పరివ్రాజకుడు, తపస్వి, ముని, బ్రహ్మచారి, యతి మొదలైన ఇతర రకాల సాధుజనుల నుండి స్పష్టంగా వేరు చేసి చూపిస్తుంది.
బౌద్ధ గ్రంథాలలో
ఋషి అనే పదం బౌద్ధ గ్రంథాలలో ప్రస్తావించబడింది. పాళీలో, వారిని "ఇసి"లు అంటారు. బౌద్ధంలో ఋషిని బుద్ధుడు, పచ్చేకబుద్ధుడు, అర్హత్ లేదా ఉన్నత స్థాయి సన్యాసిగా సూచిస్తారు. బౌద్ధ పాళీ సాహిత్యంలో, బుద్ధుడిని చాలాసార్లు "మహేసి" (పాళీ భాషలో. సంస్కృతంలో మహర్షి) అని పిలుస్తారు. [6] వారినే ఋషులు అని పిలవవచ్చు. పాళీ కానన్‌లోని ఇసిగిలి సుత్తలో ఐదు వందల మంది ఋషుల (పచ్చెకబుద్ధులు) పేర్ల ప్రస్తావన ఉంది. సా.శ. 1-3వ శతాబ్దాలలో రాసిన బౌద్ధ గ్రంథం, మహామయూరి తంత్రం, జంబూద్వీపం (ఆధునిక భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ) అంతటా ఉన్న ఋషులను ప్రస్తావిస్తుంది. బుద్ధధర్మ రక్షణ కోసం వారిని ప్రేరేపిస్తుంది. [7]
అనేక జాతక కథలలో కూడా వివిధ ఋషుల గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. నళినికా జాతక కథలో హిమాలయాల్లో ఒంటరిగా నివసిస్తున్న బుద్ధుడు అనే ఋషి(ఇసి) గత జీవితాన్ని పరిచయం చేస్తుంది. అతని కుమారుడి - అతను కూడా ఋషే - పేరు ఇసిసింగ ( పాళీ. సంస్కృతంలో: ఋష్యంగ). అగస్త్య జాతక కథ (సంస్కృతం. పాళీలో అకిట్ట జాతక) అగస్త్య (సంస్కృతం; పాళీలో అక్ఖత) అణే పేరున్న బోధిసత్వుని ఋషిగా పేర్కొంటుంది.
ఇండోనేషియాలో ఋషి
జావా, ఇండోనేషియాలోని చాలా మధ్యయుగ హిందూ దేవాలయాల్లో అగస్త్య ఋషి విగ్రహాలున్నాయి. ఇవి సాధారణంగా శైవ దేవాలయాల దక్షిణ భాగంలో ఉంటాయి. [2] కాండీ సాంబిసారి, యోగ్యకర్త సమీపంలోని ప్రంబనన్ ఆలయాలు దీనికి ఉదాహరణలు . [8]
కంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్‌లలో రూసీ

రుయేసి (సంస్కృతం: ఋషి, Khmer: តាឥសី តា , Thai: ฤๅษี ) ఒక సన్యాసి. భారతదేశంలో ఋషికి సమానమైన పదం ఇది. మయన్మార్‌లో, రాసే అని పిలుస్తారు. థాయిలాండ్‌లో ఫ్రా రియుసి అక్ఖోట్ అని పిలువబడే ఋషి అక్ఖత (పాళీ. సంస్కృతంలో అగస్త్య), బౌద్ధ జాతక గ్రంథాలలో వలె, ఆగ్నేయాసియాలో కూడా ఒక ముఖ్యమైన రుయేసి. ఈ రుయేసినే బోధిసత్త అని పేర్కొన్నారు. అతను శ్రీలంకలో, ఆగ్నేయాసియాలో సన్యాస జీవితం గడిపాడు. [2] ఆగ్నేయాసియా బౌద్ధమతంలో రుయెసిస్‌ను పూజించడం ఒక ప్రముఖ పద్ధతి. "ఋషి" ("రూసి" అని ఉచ్ఛరిస్తారు) అనే పేరు థాయ్ వర్ణమాల ల సో రీయు-సి ( Thai: ษ ฤๅษี) అనే అక్షరానికి మూలం కూడా.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.