ఇల్లాలి ముచ్చట్లు ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, ఆంధ్రజ్యోతి వార పత్రికలో. ఈ శీర్షికను 1967వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఈ శీర్షికను "పురాణం సీత" నిర్వహించేవారు. అందరూ ఈ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమయి, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉండటం మరొక కారణం కావచ్చును. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడయిన తరువాత కూడా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, ఈ శీర్షికను కూడా విజయవంతంగా కొనసాగించారు.

Thumb
ఇల్లాలి ముచ్చట్లు వ్యాస సంపుటి ముఖ చిత్రం

ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి (చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) హాస్యభరితంగా, ఆహ్లాదకరంగా వ్రాస్తూనే అవసరమైనప్పుడు, అవసరమైనంతవరకు సునిసితమైన విమర్శదగ్గర నుండి, కత్తుల్లాంటి మాటలతో తీవ్ర విమర్శకూడా చేస్తూండేవారు. చక్కటి పొందికతో, ఎక్కడా కూడా తూకం చెడకుండా, ఈ శేర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు.

ఇల్లాలి ముచ్చట్లు చిహ్నం

Thumb
తెలుగు వార పత్రికల చరిత్రలో,ప్రసిద్ధి చెందిన "ఇల్లాలి ముచ్చట్లు" శీర్షిక చిహ్నం
Thumb
ఇల్లాలి ముచ్చట్లు వ్యాస సంపుటి ముఖ చిత్రం

ఒక వ్యాస శీర్షికకు ప్రత్యేక చిహ్నం ఉండటం అన్నది, తెలుగు వారపత్రికలలో ఇదే మొదటిది అయిఉండవచ్చును. తెలుగు వారిళ్ళల్లో, మహిళలు వంట చెయ్యటం అన్నది సర్వ సామాన్యం. పూర్వం కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. తరువాత, తరువాత, బొగ్గుల కుంపట్లు వచ్చినాయి. కట్టెల పొయ్యి, గ్యాస్ స్టౌవ్ కు మధ్య, తెలుగు మహిళలు ఎక్కువ కాలం బొగ్గుల కుంపట్ల మీదనే దశాబ్దాలపాటు వంటలు చేసి తమ తమ కుటుంబ సభ్యులకు ఆప్యాంయంగా వడ్డించారు. కుంపటి ముందు కూచుని, అవసరమైనప్పుడు విసినకర్రతో విసురుతూ, వంట చేస్తున్నప్పుడు, కొంత ఆలోచించటానికి మహిళలకు అవకాశం ఉండేది (కుంపట్ల మీద వంట నెమ్మదిగా జరుగుతుంది కనుక). అటువంటి ఆలోచనలను, తన బుర్రలో వండి పురాణం సీత పాఠకులకు అందిస్తున్నట్టు ఉంటుంది ఈ చిహ్నం . కుంపటి మీద బాణలి నుంచి అట్లకాడతో బయటకు తీయబడుతున్న పదార్థం భూగోళం ఆకారంలో వెయ్యటంలో ఉద్దేశం, ఈ శీర్షిక భూమ్మీద ఉండే/జరిగే ప్రతి విషయాన్ని సృశిస్తుందని సూచిస్తుంది.

రచనా శైలి

వ్యాసరచన ఎక్కువ భాగం స్వగతంలోనే జరిగింది. కొన్ని కొన్ని వ్యాసాలలో "పురాణం సీత" తన భర్తతో మా (పో)ట్లాడుతున్నట్టు వ్రాయటం జరిగింది. వార పత్రికలలో, వ్యాసాలను స్వగతంగాను లేదా ఏక వ్యక్తి సంభాషణ రూపంలో, కథలాగ చెప్పే పద్ధతి, ఈ వ్యాస శీర్షికతోనే మొదలు. వ్యాసాలన్నీ చక్కటి వ్యావహారికి భాషలో అవసరమైన చోట ఆంగ్ల పదాలను యధాతధంగా వాడుతూ, సంగీతంలో మెట్లు మెట్లుగా పరాకాష్ఠకు చేరుకున్నట్టుగా ముగింపుకు చేరువవుతాయి. దాదాపు అన్ని వ్యాసాలలోనూ ఒక విధమైన ఊపిరి సలపని వేగం ఉంది. పాఠకుడు వ్యాసం చదవటం మొదలుపెడితే ముగింపుగు వచ్చినాక మాత్రమే తెలుస్తుంది, చివరవరకూ చదివినట్టు. పాఠకుల ఆసక్తికి కారణం, కొంతవరకు వ్యాసంలో చర్చించబడ్డ ఆ కాలపు సామాజిక సమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనేవి అయినప్పటికి, వ్యాస శైలి అటువంటి ఆసక్తిని ఎక్కువగా నిలపగలిగిందని చెప్పక తప్పదు. వ్యాసాలన్నీ కూడా హాస్యభరితంగా ఉంటాయి. ఒక పక్క కన్నీళ్ళు పెట్టిస్తూ కూడా హాస్యం అంతర్లీనంగా వ్రాయగలగడం (నుదుటన్ వ్రాసిన వ్రాలు...దడిగాడువానసిరా ఒక ఉదాహరణ) పురాణం సీతకే చెల్లింది. ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఈ విధంగా వ్రాయటమేమీ తేలిక కాదని, తేలికని ఊహిస్తున్నవారు ప్రయత్నించి చూడవచ్చని సవాలు చేసి, ఈ శీర్షిక శైలిని కొనియాడారు.-[1]

కొన్ని ముచ్చట్లు

ఈ శీర్షికలోని వ్యాసాలనుండి కొన్ని ముచ్చట్లను ఇక్కడ ఉదహరించటం జరిగింది.

  • ఎన్నికలలా వ్యాసం నుండి-"...వాళ్ళకు జాతీయ పతాకానికి, కాంగ్రెసు జండాకి వున్న తేడా తెలీదు. ఇలాంటి ప్రజలుంటారనే మన నెహ్రూగారు కాంగ్రెసు జండాలో రాట్నం పీకిపారేసి చక్రం పెట్టారు. ఆ జండా ఈ జండా ఒకటే అనే భావం కలిగేలా జాతీయ పతాకాన్ని రూపొందించకుండా వుండవలసింది.
  • గోవూవత్సం వ్యాసం నుండి-..."ఆడదానికొచ్చే బాధలన్నీ వ్యక్తిగతమైనవికావు. సమాజం అమె నెత్తిమీద రుద్దినవి....."
  • మూడే రంగులు వ్యాసం నుండి..."ఏయ్! రిక్షావాలా! కాలవంటే తెలుసు కదా! నహర్ అంటే కాలవట. కాలవ పక్కనుండే వాళ్ళు కనుక నెహ్రూలన్నారట: కాలవ పక్కనుండే మీవాళ్ళంతా నెహ్రూ లౌతారట్రా ఇడియట్!(దాదాపు 1990ల వరకు విజయవాడలో ఏలూరు కాలవ, బందరు కాలవ, రైవస్ కాలవల ఒడ్లమీద బీదవాళ్ళు-రిక్షావాళ్ళు తదితరులు- గుడిసెలు వేసుకుని జీవితాలు ఈడుస్తూ ఊండేవారు. వ్యాసంలోని ఈ వ్యాఖ్య, రచయిత వ్యంగ విమర్శనా పటిమకు పరాకాష్ట)
  • ధర్మ దర్శనం వ్యాసంనుండి ...."స్వర్గం, మోక్షం ఎంత మంచివైనా, ఎవరో దిక్కుమాలిన వాళ్ళకూ అభాగ్యులకూ తప్ప, ఎవరికీ స్వర్గస్థులం కావాలని వుండదు, అదేమి చిత్రమో..."
  • దడిగాడువానసిరా వ్యాసం నుండి..."జెరూస్లెంలో ఆక్రోశకుడ్యమని ఏడవటానికి ఓ గోడ కట్టేరుట. ఆ గోడదగ్గరకు వెళ్ళి ఏడిస్తే మనశ్శాంతి లభిస్తుందట. అలాటి ఎన్నో గోడలు మనకి కావాలే....మన బ్రతుకులు తల్చుకుంటే ఏ గోడకేసి తిరిగినా ఇంట్లో ఏడుపొచ్చేస్తుందే. మరి మనం వేరే ఎక్కడికి వెళ్ళనక్కర్లేదే....."
  • తారుమారు బలే పెళ్ళి వ్యాసం నుండి..."గొప్పగా, డాబుగా దర్జాగా వుండటానికి ఎంత ప్రయత్నిస్తే మనుష్యులు అంత అసహ్యంగా వుంటారు....."
  • చిత్తశుద్ధిలేని శివపూజలు వ్యాసం నుండి-ప్రభుత్వం చేస్తున్న కుటుంబ నియంత్రణ ప్రచారం గురించి..."ఉన్నమాట చెబుతున్నాను. పిల్లల్ని నిందిస్తే పిల్లల తల్లికి కష్టంగా వుంటుంది. పిల్లల తల్లికి కష్టం కలిగితే ఈ ఉద్యమ అంతా దెబ్బతింటుంది. ఎంతో సున్నితమైన ఈ సమస్యను పరమ మోటుగా డీల్ చేస్తొంది..."
  • మనమాట మన పలుకు అందులోని కులుకు వ్యాసం నుండి-'...మన నిజమైన తెలుగు మన అట్టడుగు వర్గ ప్రజల దగ్గర ఇంకా మిగిలివుంది. మన అమ్మమ్మలు, అత్తలు, వదినలు, బామ్మలు వీరంతా ప్రాంణంలేచి వచ్చే హాయైన తెలుగు మాట్లాడుతారు. చాలా విచారకరమైన సంగతి ఏవంటే పుస్తకాలు రాసేవాళ్ళు చాలామంది దగ్గర ఆడ మగా అన్న తేడా లేకుండా ఒరిజనల్ ఒకటోరకం తెలుగు లేదు.....అనగా తెలుగు బిడ్డ కావటానికి బదులు తెలుగు పీడగా తయారవుతున్నాం...."
  • కర్రలూ-పాములూ వ్యాసం నుండి-"...మరి మనదేశంలో ఇన్ని పార్టీలేవిటి? చక్కగా రెండో మూడో పార్టీలుంటే అందంగా వుటుందిగాని సంతలో దుకాణాల్లగ ఇన్ని పార్టీలేవిటీ? ఇందరు నాయకులేవిటి? వీళ్ళంతా ఏవిటి చేస్తారు?...."
  • ఆంధ్రా తుగ్లక్ లేక మా పిచ్చి మావయ్య వ్యాసం నుండి-"...శరీరాలు ఎదిగి మనసులు ఎదగక మూసుకుపోయిన బాపతు జనం ఆడవారిలోనేకాదు మగవారిలో కూడా హెచ్చుమందేవుండి వుంటారు..."

అభిప్రాయాలు

  • కొడవటిగంటి కుటుంబరావు-[1] "...ఇల్లాలి ముచ్చట్లు శీర్షిక తెలుగు జర్నలిజంలో ఒక సరికొత్త ప్రయోగం కావటమే గాక, చాలా విజయవంతమైన ప్రయోగం....అది (ఇల్లాలి ముచ్చట్లు) ములుకు తాళ్ళ చరణాకోల. దాన్ని ఒక్కసారి ఝుళిపిస్తే అనేక చోట్ల గాయాలవుతాయి.......ఇట్లా రాయటం తేలిక అని ఎవరన్న భ్రమపడినట్టయితే, ప్రయత్నించి చూడవచ్చు.
  • నార్ల వెంకటేశ్వర రావు-[2] పురాణంలోని సీతవలె, పురాణం సీత అందరి మన్ననలను పొందుతున్నది.
  • రాచకొండ విశ్వనాధ శాస్త్రి-[3]".....మన దేశంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఇల్లాళ్ళకి జీవితం ముచ్చట అనే ప్రసక్తి లేకుండా పువ్వుల తోటలో నిప్పుల మంటలా ఉంటుందికదా! అటువటప్పుడు 'ఇల్లాలి ముచ్చట్లు" అనడంలో అర్ధం ఉందా అనిపించింది నాకు. చదివేక మాత్రం, 'ముచ్చట' వేరు 'ముచ్చట్లు' వేరు అని తెలుసుకున్నాను. తీన్ తారుగా చిక్కులు చిక్కులుగా బాధలు బాధలుగా ఉన్న, ఈ జీవితం ఎందుకు ఇలా ఉంది అని తెలుసుకొందికి, ఈ వ్యాసాల్లో, ఈ ఇల్లాలు కొంత పయత్నించినట్టుగా నాకు తోస్తొంది.
  • నండూరి రామమోహనరావు--[4] ఈ పుస్తకానికి ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వనక్కర్లేదు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ పుస్తకంలోని శీర్షికలు వారంవారం పడుతున్నప్పుడు పాఠకుల నుంచి శరపరంపరగా వచ్చిపడిన ప్రశంసలే అసలైన సర్టిఫికేట్లు.......ఈ ముచ్చట్లలో ఏ పేజీ తిరగేసినా బోలుడు గడుసుదనం, సెటైర్, పొగరు, వగరు కనిపిస్థాయి.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.