నాటక సంస్థ From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఆంధ్రదేశంలో నాటక కళ అభివృద్ధి దోహదం చేసేందుకే ఏర్పడిన కళా సంస్థ. ఈ సంస్థ 1929 లో నాటి ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో రిజిష్టర్ చేయబడింది.[1]
సురభి నాటక సమాజాధినేత వనారస గోవిందరావు. సురభి నాటకానికి దేశ విదేశాలలో ప్రదర్శన అవకాశాలు కల్పించి విస్తృత ప్రచారం చేసిన సురభి సమాజంచే ఆవిర్భవించిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు చరిత్ర పుటల్లో గణనీయమైన స్థానాన్ని పొంది, తెలుగు నాటకరంగాన్ని అనేక మలుపులు తిప్పి చైతన్యాన్ని సృష్టించింది.
మూకీ చలన చిత్రాలు, తెలుగు టాకీ చిత్రాలు విరివిగా వెలువడుతూ తెలుగు నాటకాన్ని, నాటక రంగ ప్రాశస్త్యాన్ని అణగదొక్కి వెనక్కునెట్టివేస్తున్న రోజుల్లో నాటకరంగావశ్యకతను, దాని ప్రశస్తిని నిలబెట్టి ముందంజ వేసేందుకు తగిన ప్రోత్సాహం, సహాయ నహకారాల కోసం తాను పడే తపనను లక్ష్మయ్య తన యజమాని గోవిందరావుకు తెలిపాడు. ఆయన అంగీకారం తెలపడంతో, తన తపనను విజ్ఞప్తి రూపంలో దేశంలో ఆనాటి ప్రసిద్ధ పండితులు, కళాకారులు, నాటకాభిమానులు, కళాపోషకులు, అందరికీ తెలిపి వారందరినీ ఒకచోట చేర్చేందుకు కృ షి చేశాడు. ఆ కృషి ఫలితంగానే 1929, జూన్ 19, 20, 21 తేదీలలో తెనాలి పట్టణంలో సురభివారి నాటక ప్రదర్శనశాలలో ప్రప్రథమంగా ఆంధ్ర నాటక కళా పరిషత్తు పేరిట ఒక సంస్థ ఆవిర్భావం, మూడు రోజులపాటు మహాసభలు జరిగాయి.[2]
ప్రథమ పరిషత్తు మహాసభలకు దేశోధ్ధారక, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మహామహోపాధ్యాయ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, చట్టి చిన పూర్ణయ్యపంతులు, మల్లాది విశ్వనాథకవిరాజు, వనారస గోవిందరావు, కొత్తపల్లి లక్ష్మయ్య వ్యవస్థాపక సభ్యులుగా ధనసహాయం అందించారు. మొదటి రోజున సాంఖ్యాయన శర్మ, రెండవ రోజున కాశీనాథుని నాగేశ్వరరావు ఈ సభలకు అధ్యక్షత వహించారు.
పరిషత్తు నాటక సమాజాలకు రైళ్ళలో ప్రయాణ రాయితీలు, టికెట్లపై వినోదపు పన్ను రద్దు, స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించడం, ఒకే పౌరాణిక నాటకాన్ని కొన్నిసమాజాలతో ప్రదర్శింపజేసి, వాటిలో ఉత్తమంగా ఎన్నికైన వాటికి బహుమతులను అందజేయడం, అంతకుముందున్న సంప్రదాయాలను అధిగమించి, స్త్రీ పాత్రధారుల ఫోటోలను కూడా కరపత్రాలలో ప్రచురించి స్త్రీలను కూడా ప్రోత్సహించడం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆనాడు పరిషత్తులో పాల్గొనడమే ప్రతిష్ఠాత్మకంగా ఉండేది. ఇక బహుమతి గెల్చుకుంటే ఆస్కార్ అవార్డు లభించినట్లు భావించేవారు. నాటకరంగానికి ఒక పత్రిక అవసరమని తలచిన కొత్తపల్లి లక్ష్మయ్య ‘నాట్యకళ’ అనే పత్రికను 1937 లో ప్రారంభించాడు.
మద్రాస్ వాల్టాక్ థియేటర్ లో 1941లో జరిగిన పరిషత్తులో సాంఘిక నాటక పోటీలు ప్రారంభమయ్యాయి. ఆ ఏడాది పది నాటకాలు పోటీకి రాగా గాలి బాల సుందరరావు అపోహా నాటకంలో ప్రముఖ రంగస్థల నటి పూర్ణిమకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే ఆంధ్రశ్రీ చారిత్రక నాటకానికి ప్రథమ బహుమతి రాగా, ఆ నాటకంలో మాంచాల పాత్రధారిణి అంజలీదేవి ఉత్తమ బహుమతి గెలుచుకుంది.
పరిషత్తు కార్యవర్గం ఏర్పడిన తర్వాత పరిషత్తు కార్య్రకమాలు కొత్తపుంతలు తొక్కాయి. 1949లో ఏలూరు పరిషత్తులో ఆత్రేయ రాసిన ఎన్.జీ.వో. నాటకానికి ప్రథమ బహుమతి రావడం, 1946లో కాజ వెంకట్రామయ్య గుడివాడలో నిర్వహించిన పరిషత్తు మహాసభలు చరిత్రలో చిరస్మరణీయ సంఘటనలుగా నిలిచాయి. 1948 జనవరి 18న విజయవాడ దుర్గా కళామందిరంలో జరిగిన పద్నాల్గవ పరిషత్తు మహాసభలు జరిగాయి. పరిషత్తు సొంత భవనం కోసం విజయవాడ జింఖానా క్లబ్ ఎదుట రైవస్ కాల్వగట్టున శంకుస్థాపన చేశారు. కానీ రాఘవ కళామందిరం భవన నిర్మాణం ప్రణాళికగానే ఉండిపోయింది.
సుమారు 200 సమాజాలకు అనుబంధంగా ఉండి, సుదీర్ఘ చరిత్ర కల్గి రాజకీయాలకు అతీతమై నటులకు, కళాకరులకు, రచయితలకు, కళాపోషకులకే ఆది నుండి పరిమితం కావడంతో, అన్ని వర్గాల వాళ్లు ఈ సంస్థ అభివృద్ధికి కృషిచేసి చరిత్ర పుటటలో నమోదు కాబడ్డారు.
కొప్పరపు సుబ్బారావు లిటిల్ థియేటర్స్, గరికపాటి రాజారావు ప్రజానాట్యమండలి, కె.వి. గోపాలస్వామి నాయుడు విద్యార్థి నాటకరంగం, హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం వంటి సంస్థలకే కాక ఈనాడు కొత్తగా ఆవిర్భవిస్తున్న సంస్థలన్నింటికి మార్గదర్శక సంస్థ ఆంధ్ర నాటక కళాపరిషత్తు.
చలన చిత్ర రంగంలో ప్రముఖులైన ఎందరో కళాకారులు, రచయితలు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు పరిషత్తుతో సంబంధంబఉండి, పరిషత్తు ప్రోత్సాహంతో పైకి వచ్చినవారే. ఉత్తమ ప్రమాణాలను నాటకరంగంలో నెలకొల్పి, అర్థ శతాబ్దం పైగా అత్యుత్తమ సేతలు అందించిన ఈ సంస్థను యధావిధిగా తన కార్య్రకమాలు కొనసాగేలా కాపాడుకోవలసిన బాధ్యత కళాభిమానులందరిపైనా ఉంది.
ఇటీవలి కాలంలో సంస్థను పునరుద్ధరించి బొల్లినేని కృష్ణయ్య అధ్యక్షులుగా, అన్నమనేని ప్రసాదరావు కార్యదర్శిగా వ్యవహరిస్తూ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు, వరంగల్లు, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో ప్రాంతాల వారీగా రచయితలు, కవులు, కళాకారుల సదస్సును నిర్వహించి నాటక రంగ అభ్యున్నతికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. హైదరాబాదు రవీంద్ర భారతిలో 2013 జూన్ 9న రాష్ట్ర స్థాయి నాటక పరిషత్తుల సదస్సు నిర్వహించి వారు పోటీల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి విస్తృతంగా చర్చించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.