భారతీయ చిత్రకారిణి From Wikipedia, the free encyclopedia
అమృతా షేర్ గిల్ (ఆంగ్లం: Amrita Sher-Gil) (30 జనవరి 1913[1] - 1941 డిసెంబరు 5) 20వ శతాబ్దానికి ప్రముఖ భారతీయ చిత్రకారిణి. అమృత తండ్రి పంజాబీ, తల్లి హంగేరీ యూదు. అమృత భారతదేశపు ఫ్రీడా కాహ్లోగా వ్యవహరించబడింది. (ఫ్రీడా కాహ్లో మెక్సికన్ చిత్రకారులు.) భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్ లను చిత్రీకరించిన మహిళా చిత్రకారులు అమృతాయే. 1938లో గోరఖ్‌పుర్‌లోని తన ఎస్టేట్‌లో గీసిన ‘ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్’ చిత్రం వేలంలో రూ.37.8 కోట్లకు అమ్ముడుపోయింది. భారతీయ కళాకారుల చిత్రాలకు సంబంధించి ప్రపంచ వేలంలో దక్కిన రెండో అత్యధిక ధర ఇది. అమృతా షేర్ గిల్ చిత్రాల్లో ఇప్పటివరకూ అత్యధిక ధర పలికింది కూడా ఇదే. 2021లో శాఫ్రాన్ఆర్ట్ సంస్థ ఈ వేలం నిర్వహించింది.[2]
అమృతా షేర్ గిల్ | |
---|---|
జననం | బుడాపెస్ట్, హంగేరీ | 1913 జనవరి 30
మరణం | 1941 డిసెంబరు 5 28) లాహోర్, బ్రిటీషు రాజ్యం (ప్రస్తుత పాకిస్తాన్) | (వయసు
జాతీయత | భారతీయురాలు |
రంగం | చిత్రకారులు |
శిక్షణ | Grande Chaumiere École des Beaux-Arts (1930–34) |
2023 సెప్టెంబరు 16న జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో అమృతా షేర్ గిల్ కాన్వాస్‌పై గీసిన అందమైన ఆయిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ రూ. 61.8 కోట్లకు ($7.4 మిలియన్లు) ధర పలికింది. దీంతో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టేషన్’ పెయింటింగ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలుకొట్టినట్టయింది. ఒక భారతీయ పేయింటర్ వేసిన చిత్రానికి లభించిన అత్యధిక ధర ఇదే అవడం విశేషం.[3]
సిక్కు రాచవంశానికి చెందిన సంస్కృత, పర్షియన్ పండితులు ఉమ్రావో సింఘ్ షేర్-గిల్ మజితియా, హంగేరికి చెందిన ఒపేరా గాయని మేరీ ఆంటోనియట్ గోటెస్ మన్ కు అమృతా తొలి సంతానం. అమృతాకు ఒక సోదరి, ఇంద్రాణీ షేర్-గిల్. అమృత బాల్యం చాలా మటుకు బుడాపెస్ట్ లో గడిచింది. భారతదేశంపై, ఇక్కడి సంస్కృతి-సాంప్రదాయలపై గౌరవం కలిగిన (ఇండాలజిస్ట్) ఎర్విన్ బాక్తే అమృతాకు మేనమామ. అమృతా చిత్రాలకు విమర్శకులుగా ఉంటూ, చిత్రకళలో ఆమె ప్రావీణ్యతకు పునాదులు వేశారు. వారి ఇంటిలోని పనిమనుషులనే తన చిత్రకళకు మాడల్ లుగా పరిగణించమని తెలిపేవాడు.
1921 లో అమృతా తల్లిదండ్రులు ఇరువురు కుమార్తెలతో కలిసి భారతదేశం వచ్చారు. ఇరువురూ పియానో, వయొలిన్ నేర్చుకొన్నారు. తన ఐదవ ఏటి నుండే అమృతా చిత్రలేఖనం చేస్తున్ననూ, ఎనిమిదవ ఏటి నుండి చిత్రలేఖనం పై అధిక దృష్టిని కేంద్రీకరించింది. 1923 - 1924 వరకు అమృతా తల్లితో బాటు ఇటలీలో ఉంది. అక్కడి కళాకారులను, వారి కళాఖండాలను గమనించింది. 1924 లో మరల భారతదేశం తిరిగివచ్చింది.
తన పదహారవ ఏట అమృతా చిత్రకారిణిగా శిక్షణ పొందేందుకు తన తల్లితో బాటు ఐరోపా బయలుదేరినది. ఫ్రాన్స్‌లో ప్రముఖ చిత్రకారుల శిష్యురాలిగా చేరినది. ఆమె పై అక్కడి చిత్రకళానిపుణుల యొక్క ప్రభావం ఆమె మొదటి చిత్రపటాల (1930ల) లోనే బహిర్గతమైనది. 1932లో ఆమె చిత్రీకరించిన Young Girls ఆ మరుసటి సంవత్సరం ప్యారిస్ లోని అసోసియేట్ ఆఫ్ ద గ్రాండ్ సాలోన్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారం గ్రహించిన అతి పిన్న వయస్కురాలు, ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి, అమృతాయే.
1934 నాటికల్లా, అమృతా మనస్సులో తను భారతదేశం తిరిగిరావాలని, ఇక్కడి స్థానికతను ప్రతిబింబించేలా తన వృత్తి ఉండాలనే కోరికలు బలీయమైనాయి. తన తుది శ్వాస దాకా అమృత ఈ విషయాలను చిత్రీకరించటమే కొనసాగించింది. 1935లో అమృత ఆంగ్ల విలేఖరి మాల్కం మగ్గరిడ్జ్ ను షిమ్లాలో కలిసినది. తన ప్రేమికుడి చిత్రపటాన్ని అమృతా వేసింది. వారు కొంతకాలం సహజీవనం చేశారు. కార్ల్ ఖండాల్వాలా ఆమె భారతీయ మూలాలను కనుగొనమని ఇచ్చిన స్ఫూర్తితో ఆమె యాత్రలు మొదలుపెట్టినది. చిత్రకళలో అజంతా, ముఘల్, పహారీ శైలులకు ముగ్ధురాలైనది.
1937 లో దక్షిణ భారతదేశం బయలుదేరినది. Bride's Toilet, Brahmacharis, South Indian Villagers Going to Market ఆమె కుంచె నుండి జాలువారినది అప్పుడే. శాస్త్రీయ భారతదేశపు కళ వైపే ఆమె అధిక శ్రద్ధ చూపేది. అప్పటి వరకు పేదరికం, నిరాశలు మాత్రమే తొణికిసలాడే భారతీయ చిత్రకళలో, ఈ చిత్రపటాలతో ఆమె వర్ణాల పట్ల, భారతీయ సూక్ష్మాల పట్ల దాగి ఉన్న భావోద్వేగాలతో నింపివేసింది. ఈ సమయానికల్లా అమృతా వృత్తిలో పరివర్తన వచ్చింది. తన కళాత్మక ధ్యేయం, కేవలం భారతీయ ప్రజల జీవన విధానాన్ని తన కాన్వాస్ ద్వారా వ్యక్తపరచటం మాత్రంగానే దిశానిర్దేశం చేసుకొన్నది. ఒకానొక లేఖలో అమృతా ఈ విధంగా పేర్కొన్నది.
నేను భారతదేశంలో మాత్రమే చిత్రపటాలను వేయగలను. ఐరోపా పికాసో, మాటిస్సే, బ్రేక్వీకి చెందినది... కానీ భారతదేశం, నాకు మాత్రమే చెందినది.
భారతదేశంలో తన మజిలీ తనలోని కళను కొత్త పుంతలను త్రొక్కించింది. యుద్ధం జరుగుతున్నప్పుడు తాను ఐరోపాలో ఉన్నప్పటి కళకి, ప్రత్యేకించి హంగేరీ చిత్రకారుల ప్రభావం ఉన్న తన కళకీ; ఈ కళకీ చాలా వ్యత్యాసం ఉన్నట్లు అమృతా గుర్తించింది.
1938 లో తన తల్లి వైపు బంధువు అయిన వైద్యుడు విక్టోర్ ఈగాన్ ను అమృతా వివాహమాడినది. అతనితో బాటు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్లో నివాసానికి వచ్చింది. తన రెండవ దశ చిత్రలేఖనం ఇక్కడే ప్రారంభమైనది. రవీంద్రనాథ్ ఠాగూర్, అబనీంద్రనాథ్ ఠాగూర్, జమిని రాయ్ వంటి వారి ఇష్టాలైన బెంగాలీ శైలి చిత్రకళ యొక్క ప్రభావం ఈ దశ చిత్రలేఖనంలో ప్రస్ఫుటంగా కనబడింది. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన చిత్రపటాలలో మహిళలని చిత్రీకరించే తీరు, అబనీంద్రనాథ్ చిత్రపటాలలో ప్రతిబింబించే వెలుగునీడలు అమృత చిత్రపటాలలో తొణికిసలాడేవి.
తన మెట్టినింట ఉన్నపుడే అమృతా తీరికగల గ్రామీణ జీవితాలను అంశాలుగా తీసుకొని Village Scene, In the Ladies' Enclosure, Siesta వంటి చిత్రపటాలను చిత్రీకరించింది. ప్రముఖ కళావిమర్శకుల మన్ననలు పొందిననూ, అమృతా చిత్రపటాలను కొనుగోలు చేసేవారు మాత్రం ఎవరూ లేనట్లే. తన కళాఖండాలను వెంటబెట్టుకొని భారతదేశం ఆసాంతం ప్రయాణం చేసిననూ అవి అమ్ముడుపోలేదు. చివరి నిముషాన హైదరాబాదుకు చెందిన సాలార్ జంగ్ వాటిని తిప్పి పంపాడు. మైసూరు మహారాజా రాజా రవివర్మ చిత్రపటాలకే అధిక ప్రాముఖ్యతనిచ్చి వాటిని కొనుగోలు చేశాడు.
బ్రిటీషు రాజ్‌కు సంబంధించిన కుటుంబం నుండి వచ్చిననూ, అమృతా కాంగ్రెస్ పక్షపాతి. నిరుపేదలు, అణగారినవారు, లేమిలో ఉన్నవారే ఆమెను కరిగించేవారు. అమే కళాఖండాలలో గ్రామీణ ప్రజల, అక్కడి మహిళల దీనావస్థయే ప్రతిబింబించేది. గాంధేయ సిద్ధాంతాలు, జీవినవిధానానికి ఆమె ముగ్ధురాలైనది. 1940లో కలిసినప్పుడు ఆమెలోని వర్ఛస్సుకు, కళాత్మకతకు నెహ్రూ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. ఒకానొక దశలో ఆమె కళాఖండాలను గ్రామాల పునర్వవస్థీకరణకు ప్రచారసాధనాలుగా వినియోగించాలని కూడా కాంగ్రెస్ అనుకొన్నది.
1941లో విక్టర్, అమృతా లాహోర్ కు వెళ్ళారు. అవిభాజిత భారతదేశానికి అప్పట్లో అది సాంస్కృతికత/కళాక్షేత్రం. అమృతాకు అనేక స్త్రీపురుషులతో లైంగిక సంబంధాలుండేవి. వీరిలో చాలామంది చిత్రపటాలను తర్వాతి కాలంలో ఆమె చిత్రీకరించినది కూడా. Two Women అనే పేరుతో తాను వేసిన చిత్రపటం, తాను, తన ప్రేమిక అయిన మేరీ లూయిస్ లదే అని ఒక అభిప్రాయం ఉంది.
1941లో లాహోర్ లో అత్యంత భారీ కళా ప్రదర్శన ప్రారంభించే కొద్ది రోజుల ముందు, అమృతా తీవ్రమైన అనారోగ్యం బారిన పడి కోమా లోకి వెళ్ళిపోయింది. 1941 డిసెంబరు 6 అర్థరాత్రిన చేయవలసిన ఎంతో కృషిని మధ్యంతరంగా వదిలివేసి కన్ను మూసినది. తన అనారోగ్యానికి కారణం ఇప్పటికీ తెలియలేదు. గర్బస్రావం, తదనంతర పరిణామాలే కారణాలుగా భావించబడుతోన్నది. అమృతా తల్లి విక్టర్ నే తప్పుబట్టినది. ఆమె మృతి తర్వాతి రోజునే ఇంగ్లండు ఆస్ట్రియా పై యుద్ధం ప్రకటించి, అతనిని దేశ శతృవుగా భావిస్తూ అదుపులోకి తీసుకొన్నారు. 1941 డిసెంబరు 7 న లాహోర్ లోనే అమృతా అంత్యక్రియలు జరిగినవి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.