From Wikipedia, the free encyclopedia
అక్కన్న, మాదన్న లు 1674 నుంచి 1685 మధ్యలో గోల్కొండ సంస్థానంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన తానీషా పరిపాలనలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు అన్నదమ్ములు. 1685 అక్టోబరు నెలలో వారు మరణించే వరకు గోల్కొండ రాజ్యంలోని అన్ని వ్యవహారాలు తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. వీరి మేనల్లుడైన కంచర్ల గోపన్న రామదాసుగా పేరుగాంచిన తెలుగు వాగ్గేయకారుడు. ముస్లిం అధికారులు అధికంగా ఉన్న రాజ్యంలో హిందువులుగా వీరు అధికారం చలాయించగలిగారు కాబట్టి గోల్కొండ చరిత్రలో వీరి ప్రాముఖ్యత చెప్పుకోదగినది. వీరి మరణం తర్వాత ఔరంగజేబు తానీషా చక్రవర్తిని ఓడించి గోల్కొండ కోటను ఆక్రమించాడు. దీనితో గోల్కొండ రాజ్యంలో కుతుబ్ షాహీల పాలన అంతం అయింది.
అక్కన్న మాదన్నలు హనుమకొండలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భానుజయ్య, భాగ్యమ్మ. భానుజయ్య హనుమకొండలో ఆమిల్ (గోల్కొండ ప్రభుత్వాధికారి) దగ్గర ఉద్యోగం చేసేవాడు. చారిత్రక సాహిత్యంలో వీరు కులకర్ణి వంశపు కన్నడ బ్రాహ్మణులనియి, మహారాష్ట్రులనియు, శివాజీ ప్రధానియగు మోరోపంత్ పింగళే దాయాదులనియు కొన్ని వాదనలున్నవి. కానీ ఈ వాదమును సమకాలీనులగు మరే చరిత్రకారులు ప్రస్తావించలేదు. చారిత్రక నిదర్శనములు గానీ, స్థల పురాణములు గానీ ఈ వాదమునకు బలం చేకూర్చలేదు. మామిడిపూడి వేంకటరంగయ్య ఆధ్వర్యంలో ప్రచురించిన సమగ్ర ఆంధ్ర విజ్ఞానకోశం ప్రకారం వీరి పింగలి వంశం, మహారాష్ట్రలోని పింగళే వంశము వేరు. కానీ వీరు ఎచ్చటివారో చెప్పుటకు నిష్కర్షమైన ఆధారాలు లేవు. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం వీరు హనుమకొండకు చెందిన వారుగా తెలుస్తోంది.[1] వీరికి నలుగురు కొడుకులు. అక్కన్న, మాదన్న, విస్సన్న (విశ్వనాథం), మల్లన్న (మృత్యుంజయుడు). మరో ముగ్గురు సోదరీమణులు. వీరి పేర్లు తెలియవు గానీ వీరి కొడుకులు కంచర్ల గోపన్న, పొదిలి లింగన్న, పులిపల్లి ఎంకన్న (రూస్తం రావు).[2] ఒక సమకాలీన డచ్ మూలాల ప్రకారం అక్కన్న తన తల్లికి ఇష్టమైన వాడు. కానీ మాదన్న అందరికైనా తెలివైనవాడు. వీరు బహుశా స్మార్త బ్రాహ్మణులు కావచ్చు. వీరు శివుడు, విష్ణువు, సూర్యుడు మొదలైన దేవతలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.[3] అక్కన్నకు మల్లు అనే కొడుకును, కూతురును ఉండిరి. మాదన్నకు మల్లన్న అనే కుమారుడూ, మరో కుమార్తె ఉండిరి.
భానుజయ్య తన కుమారులకు యుక్తవయస్సు రాగానే ఉపనయనం చేసి ఆ రోజుల్లో అవసరంగా ఉన్న పారసీ, హిందీ, సంస్కృతము, ఆంధ్రము లాంటి పలు భాషలు నేర్పించాడు. అక్కన్న వారసులు అక్కరాజులుగా, మాదన్న వారసులు మాదరాజులుగా ప్రాచుర్యం పొందారు.
వివాహానంతరం ఈ సోదరులు ఉద్యోగ నిమిత్తం గోల్కొండ రాజధానియగు హైదరాబాదుకు వెళ్ళారు. అప్పటికి వీరి వయస్సు సుమారు 20 సంవత్సముల పైబడి ఉండవచ్చును. 1650 ప్రాంతంలో కొంత ప్రయత్నం మీదట మీర్జా మహమ్మద్ సయీద్ మీర్జుమ్లా వద్ద భూమి ఆదాయ శాఖలో గుమాస్తాలుగా ఉద్యోగంలో కుదురుకున్నారు. తర్వాత తమ తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగారు. 1656లో మీర్ జుమ్లా చేసిన తిరుగుబాటులో వీరు పాల్గొనలేదు కాబట్టి వీరి ఉద్యోగాలు అలానే ఉన్నవి. ఈ ప్రస్థానంలో వీరు ఇద్దరూ సయ్యద్ ముజఫర్ అనే పర్షియన్ మూలాలున్న అధికారి దగ్గర పనిచేసేవారు. ముజఫర్ అబుల్ హసన్ ను గద్దె నెక్కించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ వీరు తెలివిగా ముజఫర్ ను అతని ఇంట్లోనే బంధించి ఖజానాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.[4]ఖజానా అధికారిగా మరింత బాగా బలపడి గోల్కొండ సామ్రాజ్యంలో అన్ని వ్యవహారాలు తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకున్నాడు. అందుకు అతని సోదరులు అక్కన్న, మేనల్లుడు రూస్తంరావులు సహకరించారు. ఆయన చనిపోయేవరకు ఇలాగే కొనసాగింది. అక్కన్న కొంచెం తక్కువ ప్రాధాన్యం కలవాడైనా సైన్యాధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. ఆ ఉద్యోగంలో అతను స్వయంగా సేనలను నడిపించకపోయినా యుద్ధ ప్రణాళికలు రూపకల్పన చేసేవాడు.
ఒక రాత్రి అన్నదమ్ములు తమ భవంతి నుంచి బయటకు వస్తుండగా దారిలో ఉన్న హంతకుల గుంపు వారి తలలను నరికివేశారు. వీరి తలలను ఔరంగజేబు కుమారుడైన షా ఆలం దగ్గరకు పంపారు. అతడు వాటిని షోలాపురంలోనున్న ఔరంగజేబు దగ్గరికి పంపాడు. అతడు వాటిని ఏనుగుల చేత తొక్కించి గోలకొండ కోట ఇక తమకు వశమైనట్లేనని సంబర పడ్డాడు. వీరి మరణంతో తానీషా మిక్కిలి దుఃఖించాడు. వీరి మరణానికి సరైన కారణాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. మొఘల్ చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ ప్రకారం గోల్కొండ సుల్తాను తమకు పూర్తిగా లొంగకపోవడానికి కారణం వీరేనని మొఘలాయీలు భావించారు.[5] తెలంగాణాలో వీరిని మంచి పాలకులుగానూ, అమరులుగానూ కీర్తించబడుతున్నారు.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.