From Wikipedia, the free encyclopedia
స్టీము లోకోమోటివ్ /స్టీము రైలు ఇంజను అనేది వాహన యంత్రం. స్టీము రైలు ఇంజను అనేది ఉక్కు పట్టాలపై నడిచే వాహనం అనిచెప్పవచ్చును. ఈ రైలు ఇంజనులో ఉన్న బాయిలరులో స్టీము ఉత్పత్తి చేసి, ఆ స్టీమును ఆవిరి యంత్రంకు పంపినపుడు, పీడనంలో వున్న స్టీము యొక్క వ్యాకోచ సంకోచాల వలన స్టీము ఇంజను సిలిండరులోని పిస్టను రాడ్ ముందుకు వెనక్కి (reciprocating ) కదులును. పిస్టను రాడ్ రెండో చివరను రైలు ఇంజను చక్రాలకు అపకేంద్రంగా బిగించి ఉన్నందున, పిస్టను రాడ్ ముందుకు వెనక్కి కడులునపుడు, ఇంజను చక్రాన్ని చక్రీయంగా /వర్తులంగా తిప్పడం వలన రైలు ఇంజనును పట్టాలపై ముందుకు కదులును. స్టీము రైలు ఇంజనులను మొదట పట్టా లెక్కించినపుడు బాయిలరులో ఇంధనంగా రాకాసి/నేల బొగ్గుతో పాటు కలపను కుడా వాడేవారు. కదిలే ఇంజనులో ఉన్నందున స్టీము ఇంజనులోని బాయిలరులను లోకోమోటివ్ బాయిలరులు అనిపిలవడం మొదలైంది.అంతేకాకుండా స్టీము రైలుఇంజనును స్టీము లోకోమోటివ్ అని పిలవడం సాధారణమైనది.రైలు ఇంజనుకు అవసరమైన నీరు, బొగ్గును రైలులోకోమోటివ్ ఇంజనుకు వెనుకవున్న భాగంలో నిల్వచేయుదురు. మొదట్లో నీరు, బొగ్గు వున్న పెట్టె వంటిది ఇంజనుకు తగిలింఛి వుండేది. తరువాత ఆభాగానిన్ని స్టీము ఇంజనులో భాగంగా నిర్మించారు.
మొదటి స్టీము లోకోమోటివ్ ఇంజనును రిచర్డ్ ట్రేవీతిక్ (Richard Trevithick) [1] తయారు చేసాడు.1801 లో మొదట రోడ్డు మీద నడిచే స్టీము లోకోమోటివ్ ఇంజనుఆవిష్కరించాడు.మూడు సంవత్సరాల తరువాత 1804 సంవత్సరం ఫిబ్రవరి 21 న లోకోమోటివ్ స్టీము ఇంజనును రూపొందించాడు.మొట్ట మొదటి వాణిజ్య లోకోమోటివ్ 1812-13 లో జాన్ బ్లేన్కిన్సొప్ (John Blenkinsop) [2] చే కనుగొనబడింది.దీనిని రాబర్ట్ స్టెపెన్సన్ అండ్ కంపెని తరుపున రాబర్ట్ స్టెపెన్సన్, అతని కుమారుడు రాబర్ట్ తయారు చేసారు.
1825 లో స్టాక్టన్, డార్లింగుటన్ రైల్వేకు లోకోమోసన్ నెం.1 [3] అనే లోకోమోటివ్ ఇంజను పబ్లిక్ రైలులైను పై ప్రయాణికులను తీసుకెళ్ళింది.మొదట 19వ శతాబ్దికి ముందుకాలంలో బ్రిటనులో స్టీము లోకోమోటివ్ లు అభివృద్ధి చేయబడి 20 వ శతాబ్ది మధ్య కాలం వరకు సరుకుల, ప్రయాణికుల రవాణాకు వాటి వినియోగం కొనసాగినది.అయితే 1900 సంవత్సరం నుండి క్రమంగా డిజిల్, ఎలక్ట్రికల లోకోమోటివ్ ఇంజనుల వాడకం పెరగడం మొదలైంది బ్రిటనులో.1930నాటికి ఎక్కువ ఎలక్ట్రికల్, డిజిల్ లోకోమోటివ్[4] ఇంజనులు వాడకంలోకి తీసుకు రాబడినవి. 1980 నాటికి అత్యధికభాగం స్టీము లోకోమోటివ్ ఇంజనులు పట్టాలపై పరుగులు ఆపాయి.అక్కడక్కడ కొన్ని చారిత్రక, టూరిస్టు విహార ప్రాంతాలలో, పర్వతాలు లోయలున్న పర్యాటక ప్రాంతాలలో స్టీము లోకోమోటివ్ లు తమ అస్తిత్వాన్ని చాటుతున్నవి.
బ్రిటన్‌లో స్టీము లోకోమోటివ్ ఇంజనుల కన్న ముందు రైల్వే వారు రవాణా, ప్రయాణికుల బోగిలను/పెట్టెలను గుర్రాలతో రైలు పట్టాలపై లాగించే వారు. 1785 లో విలియం ముర్దొష్ అనే స్కాటిష్ ఆవిష్కకర్త ప్రోటోటైపు చిన్న స్టీము రోడ్డు లోకోమోటివ్ ను బిర్మింగ్హమ్ లో తయారు చేసాడు[5].1787 లోపూర్తి స్థాయిలో స్టీము లోకోమోటివ్ తయారు చేయుటకు విలియం రేనాల్డ్ నిర్ణయించాడు.1794 లో అమెరికాలో స్టీము బోటు తయారు చేసిన జాన్ ఫిచ్ ఆధ్వర్యంలో లోకోమోటివ్ ఇంజను మాదిరి ఆకృతి రూపు దిద్దుకుంది[6].ఈ ఇంజను యొక్క నమునా ఇప్పటికి కొలంబస్ లోని ఒహియోహిస్టారికల్ సొసైటి మ్యూజియంలో ఉంది.
మొదటి పూర్తిస్థాయి రైల్వే లోకోమోటివ్ కోల్ బ్రూక్ డెల్ లోకోమోటివ్. ఇది పట్టాల మధ్య దూరం మూడు అడుగుల (914 మిల్లీమీటర్లు) వున్న పట్టాల మీద పయనించేలా నిర్మించారు.దీనిని రిచర్డ్ ట్రెవితిక్ 1802 లో నిర్మించాడు.ఈ ఇంజనును బ్రిటనులోని కోల్ బ్రూక్ డెల్ ఐరన్ వర్కుస్ వారి కొరకు తయారు చేసాడు. దీని గురించిన ఇతర వివరాలు అందుబాటులో లేవు. రిచర్డ్ ట్రెవితిక్ 1804 లో నిర్మించిన మరో ఇంజను పట్టాలిక్కిన రికార్డు అధార పూర్వకంగా ఉంది.ఈ ఇంజను పట్టాల మధ్య దూరం 4 అడుగుల 4అంగుళాలు (1,321 మిల్లీమీటర్లు).ఇది పెన్ –వై-డేరిన్ ఐరన్ వర్క్స్ నుండి నుండి సౌత్ వేల్సు లోని అబెర్ఎయ్నొన్ (Abercynon) వరకు పయనించింది.
1812లో మాథ్యూ ముర్రే జంట స్టీము సిలిండరులున్న సలమన్కా (salamanca) [7] అనే రైలును నడిపాడు.ఆతరువాత పప్పింగు బిల్లీ (Puffing Billy) అనే లోకోమోటివ్ ను 1812-14లో విలియం హెడ్లీ తయారు చేసాడు[8].లండన్‌లో, 1825లో జార్జి స్టేపెన్సన్ [9] లోకోమోసన్ నెం1 పేరుతొ ఈశాన్య ఇంగ్లాండులోని స్టాక్టన్ అండ్ డార్లింగుటన్ రైల్వే కై తయారు చేసాడు. నిజానికి ప్రపంచంలో ఇదే మొదటి పబ్లిక్ స్టీము రైల్వే.1829లో జార్జి స్టేపెన్సన్ కుమారుడు రాబర్ట్ న్యూ క్యాసిల్‌లో ది రాకెట్ (the Rocket) అనే లోకోమోటివ్ తయారు చేసాడు.ఇది రైన్హిల్ ట్రైల్ పోటీలో నెగ్గింది[10].ఈ లోకోమోటివ్ విజయవంతంగా నడవడంతో ఇతని సంస్థ తయారు చేసిన లోకోమోటివ్ ఇంజను త్వరలోనే ఇంగ్లాండు, అమెరికా, యూరోప్ దేశాల్లో పట్టాలపై నడవడం మొదలెట్టాయి.ఆ తరువాత లివరుఫూల్ అండ్ మాంచెష్టరు రైల్వే సంస్థ[11] స్టీము లోకోమోటివ్ ఉపయోగించి లతో ప్రయాణీకుల, సరుకుల రవాణా బోగిలను నడపడం మొదలెట్టింది
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మొదటి రైల్వేఇంజనులు అన్నియు బ్రిటను నుండి దిగుమతి చేసుకుని తిప్పనవే.మొదటగా తిప్పిన స్టౌర్బ్రిడ్జి లయన్ (1829) [12], తరువాత జాన్ బుల్ ( 1831 సెప్టెంబరు 15) [13] కూడా బ్రిటన్ లో తయారు చేసినవే.కాని త్వరలోనే స్థానికంగానే రైళ్ళను తయారు చెయ్యడం ప్రారంభించారు.1830 లో పీటరు కూపర్ అనే ఇంజనీరు బాల్టిమోర్ అండ్ ఒహియో రైలు రోడ్ సంస్థ కై తయారు చేసినటామ్ తంబ్ (Tom Thumb) అనే ఇంజనునే అమెరికాలో తయారైన మొదటి రైలు[14].డేవిట్ట్ క్లింటన్ అనే రైలు కూడా 1830 లో అమెరికాలోనే తయారు అయ్యింది[15].
బ్రిటన్, అమెరికాలఉ దాటి తరువాత 1829 లో సెయింట్-ఏటిఎన్నే, లయాన్ (Saint-Etienne and Lyon) మధ్య మొదటి రైలు నడిచింది.తరువాత 1835 మే న బెల్జియం లోని మేకేలెన్, బ్రుస్సేల్స్ కలుపుతూ ఎలెపెంట్ అనే రైలు నడిచింది.జర్మనీలో తయారైన మొదటి స్టీము లోకోమోటివ్ రాక్ అండ్ పినియన్ రకానికి చెందినది, దీని ఇంజను బ్రిటిషు జాన్ బ్లెన్కిన్షొప్ తయారు చేసిన సలమనక ఇంజనును పోలి ఉంది. దీనిని రాయల్ బెర్లిన్ ఐరన్ ఫౌండ్రి (Königliche Eisengießerei zu Berlin) లో జోహన్ ఫ్రేడిరిక్ క్రిగర్ చేసాడు.ఈ రైలు ఫ్యాక్టరీ ప్రాంగణంలో వర్తులంగా (గుండ్రంగా) ట్రాక్/పట్టాల మీద తిరిగేది. నిజానికి జర్మనీలో ఇదే మొదటి ప్రయాణికుల రైలు అని చెప్పవచ్చు. చూచుటకు వచ్చిన వీక్షకులు స్టీము లోకోమోటివ్‌కు వున్న బోగీలు/పెట్టెలు ఎక్కి ప్రయాణించి నందుకు రుసుం వసూలు చేసే వారు.ఇదే ఇంజను డిజైను/రూప నిర్మాణాన్ని అనుసరించి 1817 మరో స్టీము లోకోమోటివ్ తయారైంది. కాని దానిని ఉపయోగించిన ఆధారాలు లేవు.
1835 డిసెంబరు 7 న బావరియన్ లుడ్విగ్ రైల్వే వారి అడ్లేర్ (Adler ) అనే స్టీము లోకోమోటివ్ Nuremberg, Fürth మధ్య తిరిగింది[16].ఈ లోకోమోటివ్ రాబర్ట్ స్టేపెన్సన్ తయారుచేసిన 118 వ లోకోమోటివ్.
1837 లో ఆస్ట్రియాలో మొడటగా ప్రార్ంభమైన రైల్వే ఎంపేరర్ ఫెడినండ్ నార్తరన్ రైల్వే.వారు Vienna-Floridsdorf, Deutsch-Wagram మధ్య ఈ రైల్వే నిర్మించారు. 1860 లో తయారైన జి.కె.బి 671 (GKB 671) [17] అనే ఇంజను ఆస్ట్రియాలో ఇప్పటికి పనిచేసే స్థితిలో వుంది, ప్రత్యేక సందర్భాల్లో ఈ రైలును ఇప్పటికి (2015) నడుపుతున్నారు.1838లో సక్షొనియా అనే లోకోమోటివ్ను జర్మనీలో మొదటగా ప్రోపెసరు Johann Andreas Schubert తయారు చేసాడు[18].ఈ లోకోమోటివ్ ఇంగ్లాండుకు చెందిన కోమెట్ లోకోమోటిట్ నమునా ఆధారంగా చేసారు. దీనిని Maschinenbaufirma Übigau కై తయారు చేసారు.జర్మనీలో స్వంతంగా Beuth అనే లోకోమోటివ్ ను 1846లో ఆగస్టు బోర్సిగ్ చే రూపొందించబడినది[19].
Kassel, లోని Henschel-Werke వాళ్ళు తయారు చేసిన Drache లోకోమోటివ్ 1848 లో పట్టాలెక్కింది.ఇటలీలో నాపోలి-పోర్టిచి మార్గంలో మొదటగా Bayard [20], Vesuvio అనే లోకోమోటివ్ రైళ్ళు తిరిగాయి.స్విట్జర్లాండ్ లోని మొదటి రైల్వే 1844 లో ప్రారంభించిన Strasbourg–Basle రైలు మార్గం. మూడు సంవత్సరాల తరువాత Zürich నుండి Baden వరకు Spanisch Brötli Bahn అనే రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇండియన్ రైల్వే వద్ద 5000 డిజిల్,4500 ఎలక్ట్రికల్ మరొయు 40 స్టీములోకోమోటివ్ లు ఉన్నాయి.
1851 డిసెంబరు 21 న ఇండియాలో స్టీము లోకోమోటివ్ చరిత్ర మొదలైంది. డిల్లికి 90 కిలోమీటర్ల దూరంలో వున్న సోలని ఆనకట్ట (రూర్కి దగ్గర) నిర్మాణం సమయంలో థామసన్ అనే, 4′ 8.5″ గేజి స్టీము రైలు ఇంజను ఉపయోగించారు.ఇది ఆరు చక్రాలున్న WT టాంకు ఇంజను.ఇదే ఇండియాలో మొదటి స్టీము లోకోమోటివ్. దీనిని ఇ.బి, విల్సన్ అనే ఇంజనీరు నిర్మించాడు[21].అయితే అతి తక్కువకాలంలోనే బాయిలరు పేలి పోవడం వలన ఇంజను నిరుపయోగమైంది.
ఇండియాలో మొదటి ప్రయాణికుల లోకోమోటివ్ ఏప్రిల్ 1853 లో బోరి బందరు స్టేషను నుండి థానా వరకు నడిచింది.ఈ రైలు 14 బోగిలను కలగి సింధు, సాహిబ్, సుల్తాన్ అను మూడు లోకోమోటివ్ ఇంజనులు జోడింప బడివుండెను.400 మంది ప్రయాణికులతో 34 కిలో మీటర్ల దూరం ప్రయాణించుటకు ఒక గంట 15 నిమిషాలు పట్టింది.ఇండియాలో తిరిగిన మొదటిస్టీము లోకోమోటివ్ లు ఇంగ్లాండు నుండి దిగుమతి చెయ్యబడింది. బాంబే - థానా మధ్య తిరిగిన మొదటి లోకోమోటివ్ ఇంగ్లాండు లోనివాలకాన్ పౌండ్రిలో తయారైంది[22].
మొదటి తరానికి చెందిన స్టీము ఇంజనులు అన్నియు 2-4-0, 0-4-2 అమరికతో 6 చక్రాలున్న ఇంజనులు.ఈ రకపు ఇంజనులు అన్నియు లోపల సిలిండరు కలిగిన ఇంజనులు.1855 లో కిట్సన్, థామసన్ అండ్ హేవిట్సన్లు మద్రాసు రైల్వే, ఈస్ట్ ఇండియన్ (EIR) వారికి వెలుపల సిలిండర్లను కలిగిన స్టీము ఇంజనులను తయారు చేసారు. వీటిలో ఎక్సుప్రెస్ (EIR No. 21) స్టీము ఇంజనును డిల్లి లోని జమాల్ పూర్ రైల్వే ఇన్స్టిట్యూట్, ఫైరి క్విన్ (EIR No. 22) అనే స్టీము ఇంజనును నేషనల్ రైల్వే మ్యూజియంలోభద్ర పరిచారు. 1877లో 4-4-0 అమరికతో బయట స్టీము సిలిండరులు ఉన్న H తరగతి స్టీము ఇంజను నిజాం గ్యారెంటేడ్ స్టేట్ రైల్వే (NSR) లో ప్రవేశ పెట్టారు.
మొదట్లో ఇండియాలో నిర్మించిన రైల్వేలు ఎక్కువగా వాణిజ్య, మిలిటరీ పనులకై వాడారు.ఇండియా నుండి ముడి సరుకులను (ముఖ్యంగా పత్తి) ఎగుమతి చెయ్యుటకు రేవు పట్టణాలకు రైలుమార్గాల నిర్మాణం జరిగింది. ఫలితంగా ముఖ్య రేవులైన ముంబై, మద్రాసు, కలకత్తా లకు వివిధ రైలుకంపెనీలు రైలుమార్గాలు వేసాయి.20 వ శతాబ్ది ప్రారంభానికి ఇండియాలోనే లోకోమోటివ్ ఇంజనుల తయారి మొదలైంది. కాక పొతే రైల్వేల నిర్వహణ బ్రిటిషు ప్రభుత్వం నిర్వహించేది.1920 నుండి రైల్వేల విస్తరణ ఊపు అందుకుంది.ఇండియా మొత్తంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ 66 వేల కిలోమీటర్ల దూరం రైలుమార్గాలు నిర్మించారు. 1925 ఫిబ్రవరి ౩ లో విక్టోరియా టెర్మినస్, కుర్ల మధ్య, 16 కిలోమీటర్ల దూరం ఎలక్ట్రికల్ లోకోమోటివ్^ను నడిపి చూసారు.స్వాత్రంత్రం తరువాత ఇండియాలో రైల్వేల విస్తరణ, అభివృద్ధిపై భారత దేశ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది.1950 జనవరి 26 న బెంగాల్లో స్వదేశియ స్టీము లోకోమోటివ్ వర్క్ షాపును ప్రారంభించారు.ఆతరువాత డిజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ల అభివృద్ధిపై భారత రైల్వే దృష్టి సారించింది. అమెరికాలో అమెరికా లోకో మోటివ్ కంపెనిలో తయారైన WDM-1 డిజిల్ ఇంజను 1957 లో ఇండియాలో పట్టాలెక్కింది. తరువాత దశాబ్దాలలో క్రమంగా స్టీము లోకోమోటివ్ ల స్థానాన్ని డిజిల్ ఇంజనులు ఆక్రమించాయి[22].
ఇండియాలో 1970లో చిత్తరంజన్ లొకో వర్కు షాపులో తయారైన చివరి స్టీములోకోమోటివ్ అనిథిమ్ సీతారా (Anthim Sitara) [23][24],1990 కి అన్ని స్టీము లోకోమోటివ్ ల సేవలు నిలిపి వేసారు.ఇండియాలో రోజుకు 11,000 రైళ్ళు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి.అందులో7000 రైళ్ళు,130 లక్షల ప్రయాణీకులను దేశంలోని నలుమూలకు చేర్చుతున్నవి.
జపానులో మొదటి రైలుమార్గం 1872 లో టోక్యో, యోకోహమా మధ్య మొదలైంది. బ్రిటిషువారి సహాయంతో నిర్మించిన రైలుమార్గంలో నడిపింది కూడా బ్రిటిషు లోకోమోటివ్ ఇంజనునే.ఈ మార్గంలో రైలు గంటకు 20 మైళ్ళ గరిష్ఠ వేగంతో నడిచింది. పట్టాల మధ్య వెడల్పు 1.067 మీటర్లు. ఆ తరువాత 17 సంవత్సరాలు పట్టింది మిగతా నగరాలను ఓల్డ్ టోకైడో ( తూర్పు సముద్ర మార్గం).జులై 1889 నాటికి టోక్యో నుండి ఒకాసా వరకు నేరుగా ప్రయాణించే విధంగా రైలు మార్గం వేసారు.515 కిలోమీటర్ల ఈ దూరాన్ని చేరటానికి 20 గంటలు పట్టేది.మొదట్లో 1900 వరకు రైలు ఇంజనులను బ్రిటను, జర్మనీ, అమెరికా లనుండి దిగుమతి చేసుకునే వారు.5.5 టన్నుల కుడకోనెబ్కెఇ-గో అనే చిన్న ఇంజను జపానులో తయారైంది.దీనిని నావికా స్థావరానికి బొగ్గును రవాణాకు ఉపయోగించారు. 1880 నాటికి కేవలం నాలుగు రైలు మార్గాలున్న రైల్వే 1920 నాటికి దేశమంతా విస్తరించాయి.దేశంలోని మొదటి రైల్వేలు ఎక్కువగా ప్రవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నే నిర్మింపబడినవి.రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ప్రయాణికులరైళ్ళను రద్దు చేసి మిలిటరీ కార్యక్రమాలకై ఉపయోగించారు.రెండవ యుద్ద కాలంలో బాంబుల వలన చాలా రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి[25].
19వ శతాబ్ది చివరి కాలంలో క్వింగ్ వంశపాలనా కాలంలో మొదటి రైల్వేల నిర్మాణం జరిగింది.అప్పటికే యూరోప్, నార్త్ అమెరికా, ఇండియా, జపాను లలో రైల్వేలు అభివృద్ధి చెందాయి. ఇందుకు కారణం అప్పటికి చైనా ఇంకా పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడం, రాజుయొక్క సంశయాత్మక ప్రవర్తన.1664లో ఒక బ్రిటిషు వ్యాపారస్తుడు 600 మీటర్ల న్యారోగేజి రైలుమార్గాన్ని బీజింగు పట్టణంలోని Xuanwu Gate వెలుపల నిర్మించి, ప్రద ర్శించాడు. అప్పటి కోర్టు దీనిని, కొత్తదిగా, విభిన్నమైనది భావింఛి తొలగింపునకు ఆదేశించింది.అలాగే జూలై 1876 లో షాంగైలో నిర్మించిన రైలు మార్గాన్ని కూడా క్వింగ్ అనుమతి లేకుండా నిర్మించినందున 1877 లో తొలగించారు. చైనాలో మొదటి రైల్వే కైపింగ్ ట్రామ్ వే అండ్ ఇంపెరియాల్ రైల్వేస్ ఆఫ్ నార్త్ చైనా. Tangshan నుండి Xugezhuang వరకు 10 కిలోమీటర్ల దూరం వున్న రైలుమార్గాన్ని 1881లో నిర్మించారు.ఈ రైలు మార్గంలో టాంగ్షాన్ గనులనుండి బొగ్గునురవాణాకు ఉపయోగించారు.తరువాత ఈ మార్గాన్ని 1888 లో టియన్జిన్ వరకు, 1894 లో Shanhaiguan, Suizhong వరకు పొడగించారు. 1896 నాటికి చీనాలో 370 మైళ్ళ పొడవున్న రైలు మార్గం మాత్రమే. అప్పటికి అమెరికాలో 182,000 మైళ్ళ రాలు మార్గం వాడుకలో ఉంది. 1894 లో చీనా –జపానీస్ యుద్ధం తరువాత రైలురోడ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. మంచురియా మీదుగా రష్యన్లు రైలు రోడ్డును వేసారు. తరువాత ఇది జపానీయులచే పొడగింపబడింది. ఫ్రెంచి వారు వియత్నాం నుండి కుమ్మింగుకు రైలు మార్గం వేసారు. 1916 లో చైనిస్ రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారి స్వంత రైల్వేల నిర్మాణం మొదలైంది. 1949 లో చీనాలో కమ్యూనిస్ట్ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎక్కువ రైల్వేలు నిర్మింపబడినవి. 1935 ముందు నాటికి దాదాపు 20,000 కిలోమీటర్ల రైలు రోడ్లు వుండగా కమ్యునిస్టులు అధికారంలోకి వచ్చేనాటికి అందులో సగం రైల్వేలు మాత్రమే పనిచేసేవి. 1949 నుండి 1964 మధ్యలో ప్రభుత్వం 15,000 కిలోమీటర్ల కొత్త రైలుమార్గాన్ని నిర్మించింది.1990 నాటికి 40,000 కొత్త రైలు మార్గాలను వాడుకలోకి తెచ్చింది[26].
Seamless Wikipedia browsing. On steroids.