From Wikipedia, the free encyclopedia
స్కెచ్ (ఆంగ్లం: Sketch) ఒక వస్తువు లేదా దృశ్యం యొక్క ముఖ్య లక్షణాలను (అధ్యయనం చేయడమే ప్రధాన ఉద్దేశంగా) వేగంగా, ఎక్కువ వివరాలు లేని చిత్తుప్రతి వలె వేయబడ్డ ఒక సరళమైన రేఖాచిత్రం.[1][2] స్కెచ్ కు తర్వాత మరిన్ని స్పష్టమైన వివరాలను చేర్చి ఒక పరిపూర్ణ రేఖాచిత్రంగానో, చిత్రలేఖనంగానో మలచవచ్చు. కేవలం చిత్రలేఖనం కోసమే కాకుండా మట్టితో చేసే బొమ్మలు, రాతిపై మలిచే శిల్పాలకు, గ్రాఫిక్ డిజైన్ కు సైతం స్కెచింగ్ ఉపయోగపడుతుంది.[3] [4] [5] వేరే ఏ ఇతర కళా మాధ్యమంతో పోల్చినా, స్కెచ్ చాలా చవకైనది.[6] పరిశీలన, భావన, వివరణలు స్కైచింగ్ ప్రక్రియ ప్రధానాంశాలు.[5] దశాబ్దాలుగా స్కెచింగ్, స్కెచ్ బుక్ లు పరిశీలనకు పదును పెడుతూ, సాంకేతికతను పెంపొందిస్తూ, అనుభవాలను నమోదు చేస్తూ, దృశ్యపూర్వక భావవ్యక్తీకరణ యొక్క పరిధిని పెంచుతూ, సృజనాత్మకత స్థాయిని పెంచుతూ, ఆలోచనలను అభివృద్ధి చేస్తూ వస్తున్నవి.[7]
అనుభవజ్ఙులు అయిన కళాకారుడికైనా, కార్టూనిస్టుకు అయినా, అప్పుడే కళను అభ్యసించటం మొదలు పెట్టిన వారైనా స్కెచింగ్ తోనే వారి పని మొదలు అవుతుంది.[8] స్కెచింగ్ లో వైఫల్యం ఉండదు. స్కెచ్ యొక్క తుది నిర్ణేత, కేవలం, స్వయానా స్కెచ్ వేసిన కళాకారుడే! స్కెచింగ్ సరళమైనది, చవకైనది, ఎక్కడైనా వేయగలిగేది, వేగవంతమైనది. [9]
సాంప్రదాయిక స్కెచ్ రూపకల్పన, కూర్పు లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేది. ఇటువంటి స్కెచ్ కళాకారుడికి ఇది దిక్సూచిగా వ్యవహరించేది. ప్రధాన చిత్రకారుడు స్కెచ్ లు మాత్రం వేసి, అతని సహచరులు మిగతా వివరాలను చేయటాన్ని మాత్రం బాట్టెగా (bottega) లేదా స్టూడియా షాప్ (studio-shop) అని వ్యవహరిస్తారు.[3]
స్కెచ్ లు మూడు విధాలు. అవి
క్రోకిస్ (ఆంగ్లం: Croquis) అనేది ఒక మనిషి (మాడల్) ను చూస్తూ కేవలం ప్రధానమైన అంశాలను నమోదు చేస్తూ వేగంగా వేయబడే ఒక స్కెచ్.[10][11][12] సాధారణంగా మాడల్ (ఒక్కోమారు ఒకరి కంటే ఎక్కువ మాడల్స్) వివస్త్రలై ఉంటారు. కళాకారులు తమను వివిధ భంగిమలలో చిత్రీకరించేలా మాడళ్ళు త్వరితంగా తమ భంగిమలను మారుస్తూ ఉంటారు. ఒక్కో భంగిమ నిడివి పది నుండి ఇరవై నిముషాలు ఉంటుంది.[13] కొంత వ్యవధి తర్వాత భంగిమ మార్చే సౌలభ్యం ఉండటంతో మాడళ్ళు కూడా క్రోకిస్ లో అసౌకర్యానికి గురి కారు.[14] ఒకే చోట కుదురుగా ఉండ (లే)ని జీవాలను (ఉదా: కీటకాలు, జంతువులు, చిన్నపిల్లలు) చిత్రీకరించటానికి సైతం క్రోకిస్ చక్కగా ఉపయోగపడుతుంది.[14] ఫ్యాషన్ టెక్నాలజీలో సృష్టించబోయే దుస్తులు మాడల్ ఒంటి పై ఎలా ఉంటాయి అని ఊహించటానికి క్రోకిస్ ను ఉపయోగిస్తారు.[14] క్రోకిస్ ను అలాగే వదిలి వేయవచ్చు, లేదా మరింత సొబగులను అద్ది ఒక పరిపూర్ణ చిత్రలేఖనంగా కూడా అభివృద్ధి చేయవచ్చు.[14]
ఒక ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ వాతావరణ ప్రభావాలను రంగులలో చిత్రీకరించటం.[3]
ఒక వ్యక్తి యొక్క ముఖకవళికలను, ఇతర భౌతిక లక్షణాలను చిత్రీకరించటం.[3]
స్కెచింగ్ కు కావలసిన పరికరాలు
పెన్సిళ్ళు పలురకాలుగా లభ్యం అవుతాయి. కరకుగా గీతలు గీసే పెన్సిళ్ళూ కొన్ని అయితే, మృదువుగా గీసేవి మరికొన్ని. పెన్సిళ్ళలో కరకుదనాన్ని H అక్షరం, మృదుత్వాన్ని B అక్షరం సూచిస్తాయి.[15] ఉదా:4H పెన్సిల్ 2H పెన్సిల్ కంటే కరకుగా గీస్తుంది. 4B పెన్సిల్ 2B పెన్సిల్ కంటే మృదువుగా గీస్తుంది. మధ్యస్తంగా ఉండే HB పెన్సిల్ పై ఒత్తిడిని బట్టి, ఒత్తిడి ఎక్కువ ఉంటే మృదువుగా, తక్కువ ఉంటే కరకుగా గీస్తుంది.[16] అత్యంత కరుకైన పెన్సిల్ 6H అయితే అత్యంత మృదువైన పెన్సిల్ 6B.[17] 0.3 మి.మీ, 0.5 మి.మీ వ్యాసం ఉన్న మెకానికల్ పెన్సిళ్ళు సన్నని గీతలను వేయటానికి ఉపయోగిస్తారు.[18] పెన్సిళ్ళతో బాటు బాల్ పాయింట్ పెన్ లు, మార్కర్లు, చార్కోల్ కూడా స్కెచింగ్ లో వినియోగిస్తారు. [19] [20]
పెన్లు నాలుగు రకాలు. అవి:
పురాతన శైలిలో సిరా బుడ్డిలో ముంచి, తీసి కాగితం పై గీతలు గీయటానికి ఉపయోగించే పెన్నులు.[18]
నిబ్బు వెనుక భాగంలో ఉండే ఖాళీలో సిరా నింపగలిగే సౌలభ్యం ఉన్న పెన్నులు.[18]
బాల్ పాయింట్ కలిగిన నిబ్ కు వెనుక భాగంలో ఉన్న ప్లాస్టిక్ గొట్టంలో సిరా నింపబడి ఉన్న పెన్నులు.[18]
ఒకే వెడల్పుతో గీతలు గీయటానికి స్కెచ్ పెన్ లు ఉపయోగ పడతాయి.[21]
స్కెచ్ బుక్ లలో పేపరు వివిధ పరిమాణాలలో వస్తుంది. కొన్ని కాగితాలు కరకుగా మరి కొన్ని మృదువుగా ఉంటాయి. సాధారణంగా కరకు కాగితానికి కరకు పెన్సిళ్ళు, మృదువు కాగితానికి మృదువైన పెన్సిళ్ళు వాడబడతాయి. ఏయే కాగితానికి ఏయే పెన్సిళ్ళు నప్పుతాయనేది కాస్త అనుభవం పై తెలుస్తుంది. వివిధ ప్రయోగాలు చేసి ఈ విషయం స్వయంగా తెలుసుకోవాలి.[22]
గాజు ఉత్పత్తులు, నీరు, కుండలు, లోహాలు చిత్రీకరించటానికి మృదువైన కాగితం, చెక్క, రాయి వంటి వాటిని చిత్రీకరించటానికి కరకైన కాగితం ఉపయోగపడతాయి. [23]
షార్పెనర్ లు పెన్సిళ్ళను చెక్కటానికి ఉపయోగిస్తారు. అయితే స్కెచింగ్ లో ప్రావీణ్యులు షార్పెనర్ బదులుగా బ్లేడ్ లేదా కత్తిని వాడమని సూచిస్తారు. ముక్కును ఎంత భాగం ఉంచాలి అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి. [24]
పెన్సుల్ ముక్కును పదునుగా ఉంచటానికి ఉపయోగించబడుతుంది.[25]
ఒకవైపు పదునుగా ఉండేటట్లు బిగుతుగా చుట్టి ఉన్న కాగితాన్నే పేపర్ స్టంప్ అంటారు.[26] పెన్సిల్, కార్బన్, క్రేయాన్, చార్ కోల్ వంటి వాటితో వేసిన స్కెచ్ లలో టోనింగ్ చేయటానికి దీనిని వాడతారు.
ఎరేజర్ లు వీలైనంత తక్కువగా వాడాలి. కొన్ని ప్రత్యేకమైన ప్రభవాలను తేవటానికి మాత్రమే ఎరేజర్ వాడాలి.[25] సరిగా వేయబడని గీతలను చెరిపేయటానికే కాకుండా, ఎరేజర్ లను టోన్ లను తేలిక చేయటానికి కూడా వినియోగిస్తారు. [18]
మొదట స్కెచ్ చేయబోయే చిత్రంలో ప్రధానమైన రేఖలను మాత్రం చిత్రీకరించటం జరుగుతుంది. కచ్చితమైన కొలతల కొరకు పెన్సిల్ ను చేత్తో పట్టుకుని చేతిని పూర్తిగా చాచి దృశ్యం ముందు పెట్టి, దృశ్యంలో ఒక కొలమానాన్ని పెన్సిల్ పొడవులో కొలచి దీనిని మిగతా కొలతలకు ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది. కొలతల అనుసారం రేఖలను మార్చుకోవచ్చు. దృక్కోణం కొరకు దృశ్యం లోని అడ్డ గీతలకు, నిలువు గీతలకు మిగతా సరళ రేఖలు ఎంత వాలులో ఉన్నాయో తెలుసుకోవటానికి పెన్సిల్ ని వాటికి సమాంతరంగా పెట్టు తెలుసుకోవచ్చు. అటు తర్వాత దృశ్యంలో ఉన్న ప్రధానాంశాలు రేఖాగణిత అంశాల వలె చిత్రీకరించబడతాయి. మరిన్ని వివరాలు (వెలుగు-నీడలు) చిత్రీకరించి స్కెచ్ ను పూర్తి చేయవచ్చు.[27]
కదిలే అంశాలను చిత్రీకరించటం స్కెచ్ లో ఒక సవాలు. కదులుతూ ఉన్న అంశాన్ని తీక్షణంగా గమనించి ఒక దృశ్యాన్ని మాత్రం గుర్తు పెట్టుకొని ఆ దృశ్యాన్ని మాత్రం చిత్రీకరించటం ఒక పద్ధతి. [28] ఇలా గమనించటంలో కన్ను, మెదడు కలిసి పని చేయవలసి ఉంటుంది. దీనికి కొంత స్వీయ శిక్షణ, అనుభవం కావలసి వస్తుంది. మొదట ఎటువంటి స్కెచ్ ను వేసే ఉద్దేశం లేకుండా వివరాలలోకి వెళ్ళకుండా అంశం లోని ప్రధాన లక్షణాలను గుర్తించగలగాలి. [18] కదులుతోన్న అంశం ఒక ఆసక్తికరమైన భంగిమకు రాగానే కళ్ళు మూసుకోవడం మరొక పద్ధతి. [29] కళ్ళు మూసుకొన్న తర్వాత చివర చూచిన దృశ్యంలో వివిధ భాగాలు ఎలా అమర్చబడి ఉన్నాయో గుర్తు తెచ్చుకోవటంతో స్కెచ్ కు సర్వం సన్నద్ధం అయినట్టు లెక్క. గుర్తు తెచ్చుకొన్న దృశ్యాన్ని మాత్రం చిత్రీకరించాలి తప్పితే అదనంగా ఏవీ చేర్చకూడదు.
చలన అంశాల స్కెచ్ లన్ వేసే పద్ధతులు నాలుగు.[30] అవి
సాధారణ బాల్ పాయింట్ పెన్ (నలుపు రంగు) చవకైన స్కెచ్ పేపరు పై ఈ విధానాన్ని అవలంబించవచ్చు. రెండు ఇంచిల ఎత్తు మించని స్కెచ్ లను వేగంగా పది సెకన్ల వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకట్ వేస్తూ ముందుకు వెళ్ళాలి. హస్తాక్షరం చేసే సమయంలో ఎలా పట్టుకొంటారో ఈ స్కెచ్ లు వేసే సమయంలో కూడా అలానే పట్టుకోవాలి. కేవలం పిడికిలి, వ్రేళ్ళ కదలికలతోనే స్కెచ్ లను పూర్తి చేయాలి. ఈ విధానంలో ఉన్న రెండే రెండు నియమాలు: పెన్ను ఆగకూడదు, పెన్నును ఎత్తకూడదు. [31]
బ్రష్ పెన్, 6B చార్కోల్ పెన్సిల్ లను ఉపయోగించి భుజం, మోచేయిలను కదుపుతూ చలన అంశాన్ని చిత్రీకరించటం.[32] చిత్రీకరించే అంశం యొక్క మధ్యభాగం (మనుషులు, జంతువులు అయితే వారి/వాటి వెన్నెముక గుండా C ఆకారంలో, S ఆకారంలో ఉండే గీతలను గమనిస్తూ వాటి చిత్రీకరణకు తదనుగుణంగా చేతిని కదుపుతూ చిత్రీకరణను మొదలు పెట్టాలి. పెన్సిల్ యొక్క ముక్కు తప్పితే వేరే ఏదీ కాగితాన్ని తాకకూడదు.[32]
చిత్రలేఖనం చేయటానికి ఉపయోగించే మానికిన్ ను పోలినట్టు స్కెచ్ చేయటం. తల ఒక వృత్తాకారం, చాతీ, నడుము భాగాలు చతుర్భుజాలు, కాళ్లు చేతులు కేవలం సన్నని గీతల వలె గీయబడతాయి. తర్వాత, వీటిని ఆధారంగా చేసుకొని కండరాలు, వాటి పై దుస్తులు వేసుకోవచ్చు. మానికిన్ అప్రోచ్ కేవలం మనుషులకే కాక జంతువులకు కూడా అన్వయించుకోవచ్చు. [33]
మార్కర్ తో నో, చార్కోల్ పొడి రాయబడ్డ దూది ఉండతో మొదట చిత్రం యొక్క భంగిమను చిత్రీకరించి, అటు తర్వాత సన్నని గీతలతో స్కెచ్ ను పూర్తి చేయటం. [34]
స్కెచ్ లో ఉన్న రెండు ప్రధానాంశాలు, లైన్ డ్రాయింగ్, షేడింగ్.
ఎటువంటి షేడింగు లేకుండా కేవలం గీతలను ఉపయోగించి స్కెచ్ వేయటం. ప్రభావంలో లైన్ డ్రాయింగ్ కు పరిమితులు ఉండవచ్చు, కానీ ప్రమాణం, కదలిక, ఆకారం, మానసిక స్థితి (mood) లను వ్యక్తీకరిస్తుంది.[35]
షేడింగు స్కెచ్ కు లోతును ఇస్తుంది. విలువను పెంచుతుంది.[36] షేడింగు కొరకై ఉపయోగించబడే పద్ధతులు:
సన్నని గీతలను ఒక దాని ప్రక్కన ఒకటి గీస్తూ, వెలుగు-నీడలను చూపగలగటం.[37]
ఒక దిశలో హ్యచింగ్ తో బాటు, వ్యతిరేక లేదా మరొక దిశలో కూడా హ్యాచింగ్ చేయటం [38]
పెన్సిల్ ను కుంచె వలె ఉపయోగించి ఇతర సాంకేతికలతో సాధ్యం కాని కుంచెతో వేసినట్లే అగుపించే బొమ్మలను వేయటమే పెన్సిల్ పెయింటింగ్.[23]
కొద్దిగా నీటిని లేదా బెంజీన్ ను కుంచెతో బాటు ఉపయోగించి, వాటర్ కలర్ వలె పెన్సిల్ స్కెచ్ లను చిత్రీకరించటాన్ని వాష్ అండ్ బెంజీన్ అంటారు.[39]
ఆకాశం, భూమి కలిసే చోటు ఎప్పటికీ కంటి వద్దే ఉండాలి.[40] ఇదే కాక, ఒక మనిషిని, వస్తువును ఏ దృక్కోణం నుండి స్కెచ్ చేస్తున్నాం అన్న విషయం పై కళాకారుడికి స్పష్టత ఉండాలి.[41]
స్కెచ్ లతో వివిధ ప్రయోగాలు చేయమని అనుభవజ్ఙులు సూచిస్తారు.[46]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.