హిమాలయాల్లోని కారకోరం శ్రేణిలో తూర్పున ఉన్న హిమానీనదం From Wikipedia, the free encyclopedia
సియాచెన్ హిమానీనదం, హిమాలయాల్లోని తూర్పు కారకోరం శ్రేణిలో, భారత పాకిస్తాన్ల మధ్య నున్న నియంత్రణ రేఖ ముగిసే NJ9842 బిందువుకు ఈశాన్యంగా, సుమారు 35.421226°N 77.109540°E వద్ద ఉన్న హిమానీనదం. [3] [4] 76 కిలోమీటర్ల పొడవైన ఈ హిమానీనదం, కారకోరంలోకెల్లా అత్యంత పొడవైనది. ధ్రువేతర హిమానీనదాల్లో అత్యంత పొడవైన వాటిలో ఇది రెండవ స్థానంలో ఉంది. ఇది, చైనా సరిహద్దులోని ఇందిరా కల్ వద్ద, 5,753 మీటర్ల ఎత్తున పుట్టి, 3,620 మీ ఎత్తున అంతమౌతుంది. సియాచెన్ హిమానీనదమంతా, అక్కడి అన్ని ప్రధాన కనుమలతో సహా, 1984 నుండి భారత పరిపాలనలో ప్రస్తుత లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా ఉంది. [5] [6] [7] [8] పాకిస్తాన్, సియాచెన్ హిమానీనదం [9] తనదని వాదిస్తూ ఉంటుంది. హిమానీనదానికి పశ్చిమాన ఉన్న సాల్టోరో శిఖరాలకు పశ్చిమాన ఉన్న ప్రాంతం పాక్ నియంత్రణలో ఉంది. [10] ఈ ప్రాంతం లోని పాకిస్తాన్ పోస్టులు, 100 పైచిలుకు ఉన్న భారతీయ పోస్టుల కంటే 3,000 అడుగులు క్రింద ఉంటాయి. [11] [12]
సియాచెన్ హిమానీనదం | |
---|---|
కాశ్మీరు ప్రాంతంలో సియాచెన్ హిమానీనదం | |
Type | పర్వతీయ హిమానీనదం |
Location | కారకోరం, లడఖ్ (భారత నియంత్రణలో ఉంది. పాక్ వివాదం చేసింది) |
Coordinates | 77°14′N 35°10′E |
Area | 2,500 కి.మీ2 (970 చ. మై.)[1] |
Length | నదుల పొడవును కొలిచినట్లుగా అత్యంత దీర్ఘమైన దారి గుండా కొలిస్తే 76 కి.మీ. (47 మై.) లేదా ఇందిరా కల్ నుండి కొలిస్తే 70 కి.మీ. (43 మై.) [2] |
సియాచెన్ హిమానీనదం, యూరేసియన్ ప్లేట్‌ను భారత ఉపఖండాన్నీ వేరుచేసే గొప్ప విభజన రేఖకు దక్షిణాన ఉంది. ఇది కారకోరం శ్రేణిలో బాగా హిమానీనదాలున్న ప్రాంతంలో ఉంది. దీన్ని కొన్నిసార్లు "మూడవ ధ్రువం" అని కూడా పిలుస్తారు. పశ్చిమాన సాల్టోరో శిఖరాలకు (రిడ్జి), తూర్పున ప్రధాన కారకోరం శ్రేణికీ మధ్య ఈ హిమానీనదం ఉంది. సాల్టోరో రిడ్జి, ఉత్తరాన చైనా సరిహద్దులో కారకోరం శ్రేణిలోని సియా కాంగ్రీ శిఖరం నుండి ఉద్భవించింది. సాల్టోరో రిడ్జి ఎత్తు 5,450 నుండి 7,720 మీటర్ల వరకు ఉంటుంది. ఉత్తరం నుండి దక్షిణానికి చూస్తే, ఈ శిఖరాలపై ప్రధాన కనుమలు ఇలా ఉంటాయి: సియా లా 5,589 మీ., బిలాఫాండ్ లా 5,450 మీ., జ్యోంగ్ లా 5,689 మీ. శీతాకాలపు సగటు హిమపాతం 1000 సెం.మీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు −50 °C (−58 °F) వరకు పడిపోతాయి. సియాచెన్ హిమానీనద వ్యవస్థ విస్తీర్ణం, అన్ని ఉప హిమానీనదాలతో సహా, 700 చ.కి.మీ. ఉంటుంది.
బల్టీ భాషలో "సియా" అంటే ఈ ప్రాంతంలో విస్తృతంగా ఉండే గులాబీ కుటుంబానికి చెందిన మొక్క. "చున్" అంటే సమృద్ధి. సియాచెన్ అనే పేరు గులాబీలతో సమృద్ధిగా ఉన్న భూమిని సూచిస్తుంది. హిమానీనదంకు ఆ పేరు పెట్టిన శ్రేయస్సు, లేదా కనీసం ఆ పేరును ప్రచారం చేసిన శ్రేయస్సు, టామ్ లాంగ్స్టాఫ్కు చెందుతుంది.
భారతదేశం, పాకిస్తాన్ రెండూ సియాచెన్ ప్రాంతం మొత్తంపై సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నాయి. [3] 1970, 1980 లలో అమెరికా, పాకిస్తాన్ ల పటాల్లో NJ9842 బిందువు (భారతదేశం-పాకిస్తాన్ల మధ్య ఉన్న నియంత్రణ రేఖకు ఉత్తర కొసన ఉన్న బిందువు) నుండి కారకోరం కనుమ వరకు చుక్కల రేఖను చూపించేవారు. ఇది కార్టోగ్రాఫిక్ లోపమని భారతదేశం భావించేది. సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కూడా వాదించేది. 1984 లో, భారతదేశం ఆపరేషన్ మేఘదూత్ అనే సైనిక చర్యను చేపట్టి, సియాచెన్ హిమానీనదాన్ని, దాని ఉపనదులతో సహా, నియంత్రణ లోకి తెచ్చుకుంది. [13] సియాచెన్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ తలపెట్టిన ఆపరేషన్ అబబీల్ మొదలవడానికి ఒక రోజు ముందు భారత్ ఈ ఆపరేషన్ జరిపి సియాచెన్ గ్లేసియర్‌కు పశ్చిమాన ఉన్న సాల్టోరో రిడ్జిలో ఉన్న అత్యధిక శిఖరాలను తన అధీనం లోకి తెచ్చుకుంది. [14] [15] 1984 - 1999 మధ్య కాలంలో, భారత పాకిస్తాన్ ల మధ్య తరచూ కొట్లాటలు జరిగేవి. [16] [17] అయితే, యుద్ధాల కంటే ఇక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితుల వల్లనే ఎక్కువ మంది సైనికులు మరణించారు. [18] సియాచెన్ సమీపంలో 2003 - 2010 మధ్య నమోదైన వివిధ ఆపరేషన్లలో పాకిస్తాన్, 353 మంది సైనికులను కోల్పోయింది, ఒక్క 2012 గాయరీ సెక్టార్ హిమసంపాతం లోనే 140 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. [19] [20] ప్రతికూల వాతావరణం కారణంగా 2012 జనవరి, 2015 జూలై మధ్యకాలంలో 33 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. [21] 2015 డిసెంబరులో భారత రక్షణ శాఖ సహాయ మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ 1984 లో ఆపరేషన్ మేఘదూత్ మొదలుపెట్టినప్పటి నుండి సియాచెన్ హిమానీనదంపై శీతోష్ణస్థితి, పర్యావరణం, తదితర కారణాల వల్ల మొత్తం 869 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు. [22] భారత పాకిస్తాన్ లు రెండూ సియాచెన్ పరిసరాల్లో వేలాది మంది సైనికులను మోహరిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని నిస్సైనికీకరించేందుకు ఛేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 1984 కి ముందు, ఈ ప్రాంతంలో ఏ దేశానికీ సైనిక దళాలు లేవు. [23] [24] [25]
భారత పాకిస్తాన్ ల సైనిక ఉనికిని పక్కన పెడితే, ఈ హిమానీనదం నిర్జన ప్రాంతం. భారత శిబిరం నుండి 10 మైళ్ళ దిగువన ఉన్న వార్షి గ్రామమే ఇక్కడికి అత్యంత సమీపంలో ఉన్న పౌర ఆవాసం. [26] [27] ఈ మారుమూల ప్రాంతానికి రహదారి సౌకర్యం చాలా పరిమితంగా ఉంది. భారత వైపున, 35.1663°N 77.2162°E వద్ద ఉన్న సైనిక స్థావరం జింగ్రుల్మా వరకు మాత్రమే రోడ్డు ఉంది. ఇది హిమానీ నదం అంచు నుండి 72 కి.మీ. దూరంలో ఉంది. [28] [29] మనాలి - లేహ్ - ఖార్దుంగ్ లా- సియాచెన్ మార్గంతో సహా సియాచెన్ ప్రాంతానికి చేరుకోవడానికి భారత సైన్యం వివిధ మార్గాలను అభివృద్ధి చేసింది. 2012 లో, భారత సైన్యాధిపతి జనరల్ బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ, భారత సైన్యం ఈ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉండాల్సిందేననీ, సియాచెన్ కోసం భారత సాయుధ సిబ్బంది "చిందించిన రక్తం కోసం" భారత్ ఇక్కడ ఉండాలనీ అన్నాడు. [30] [31] ఒక దశాబ్దానికి పైగా సుస్థిరంగా ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితుల ప్రకారం, భారతదేశం 76 కి.మీ. పొడవైన గ్లేసియరును, దాని ఉపనదులనూ నియంత్రిస్తోంది. అలాగే హిమానీనదానికి పశ్చిమాన ఉన్న సాల్టోరో రిడ్జిలో (శిఖరాల్లో) ఉన్న సియా లా, బిలాఫాండ్ లా, జ్యోంగ్ లా, యర్మ లా (6,100 మీ), చులుంగ్ లా (5,800 మీ) తో సహా అన్ని ప్రధాన కనుమలు, శిఖరాలను కూడా భారత్ నియంత్రిస్తోంది . [32] [33] సాల్టోరో రిడ్జికి పశ్చిమాన ఉన్న హిమనదీయ లోయలను పాకిస్తాన్ నియంత్రిస్తోంది. [34] [35] 1980 లలో సియాచెన్‌లో సైనిక కార్యకలాపాల వలన భారతదేశం 1000 చ.కి.మీ. భూభాగాన్ని నియంత్రణ లోకి తెచ్చుకుందని టైమ్ పత్రిక రాసింది. [36] పాకిస్తాన్‌పై నమ్మకం లేనందున భారతదేశం సియాచెన్‌ను ఖాళీ చేయదని 2016 ఫిబ్రవరిలో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంటులో చెప్పాడు. 1984 లో ఆపరేషన్ మేఘదూత్ జరిపిన నాటి నుండి సియాచెన్‌లో 915 మంది ప్రాణాలు కోల్పోయారని అతడు చెప్పాడు. [37] అధికారిక రికార్డుల ప్రకారం, అందులో శత్రువుల బుల్లెట్లకు బలైంది కేవలం 220 మంది మాత్రమే. [38] 110 కిలోమీటర్ల పొడవైన వాస్తవ క్షేత్రస్థితి రేఖను ప్రామాణీకరించడం, వివరించడం, గీయడం జరిగే వరకు భారత్ తన సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి తీసుకోదని భారతదేశం విస్పష్టంగా పేర్కొంది. [39] [40]
1949 కరాచీ ఒప్పందం విభజన రేఖను NJ9842 వరకే జాగ్రత్తగా వివరించింది. ఆ తరువాత, "విభజన రేఖ అక్కడ నుండి ఉత్తరంగా హిమానీనదాల వైపు” కొనసాగుతుందని పేర్కొంది. [41] [42] [43] [44] [45] భారతీయ వైఖరి ప్రకారం విభజన రేఖ, సియాచెన్ హిమానీనదానికి పశ్చిమాన సాల్టోరో శ్రేణి వెంట, NJ9842 దాటి ఉత్తరం వైపు కొనసాగాలి; [46] పర్వత శ్రేణుల వెంట నడిచే అంతర్జాతీయ సరిహద్దు రేఖలు వాటర్‌షెడ్ విబహజన రేఖ వెంబడి సాగుతాయి. [39] [47] 1972 సిమ్లా ఒప్పందంలో ఉత్తర కొసన ఉన్న రంగంలో 1949 నాటి నియంత్రణ రేఖకు ఎటువంటి మార్పూ చేయలేదు.
హిమానీనదం నుండి కరిగిన జలాలు లడఖ్‌లోని నుబ్రా నదికి ప్రధాన వనరు. ఇది ష్యోక్ నదిలో కలుస్తుంది. ష్యోక్ నది వెళ్ళి పాకిస్తాన్ గుండా 3,000 కిలోమీటర్లు ప్రవహించే సింధు నదిలో కలుస్తుంది. ఆ విధంగా, ఈ హిమానీనదమే సింధు నదికి ప్రధానమైన వనరుగా ఉంటూ, [48] ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థను పోషిస్తోంది. [49]
హిమానీనదంపై 1984 కి ముందు జనావాసాలు లేవు. అప్పటినుండి వేలాది మంది సైనికులు ఉండటం వల్ల హిమానీనదంపై కాలుష్యం చేరుకుంది. ద్రవీభవనం మొదలైంది. బయోడిగ్రేడబుల్ కాని వ్యర్థాలను పెద్ద మొత్తంలో వేయడం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉపయోగించడం ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. [50]
పాకిస్తాన్ వాతావరణ శాఖ 2007 లో నిర్వహించిన ఒక సర్వేలో తేలిన ప్రాథమిక పరిశోధనలలో సియాచెన్ హిమానీనదం గత 30 సంవత్సరాలుగా వెనుకకు పోతోందని, ఆందోళనకరమైన స్థాయిలో కరుగుతున్నదని తేలింది. [51] హిమానీనదం యొక్క ఉపగ్రహ చిత్రాల అధ్యయనంలో హిమానీనదం సంవత్సరానికి 110 మీటర్ల చొప్పున వెనుకకు వెళుతోందనీ, పరిమాణం దాదాపు 35 శాతం తగ్గిందనీ తేలింది. [48] [52] పదకొండు సంవత్సరాల కాలంలో, హిమానీనదం దాదాపు 800 మీటర్లు, [53] పదిహేడేళ్ళలో 1700 మీటర్లూ తగ్గింది. 2035 నాటికి సియాచెన్ ప్రాంతంలోని హిమానీనదాలు వాటి 2011 పరిమాణంలో ఐదవ వంతుకు తగ్గుతాయని అంచనా. [54] 1929–1958 మధ్య గల ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో, సైనికీకరణకు ముందు, హిమనదీయ తిరోగమనం సుమారు 914 మీటర్లు. [55] ఇటీవలి హిమనదీయ తిరోగమనానికి సిద్ధాంతీకరించబడిన కారణాలలో ఒకటి, శిబిరాలు, పోస్టుల నిర్మాణం కోసం చేసే రసాయన పేలుళ్ళు. [56] 2001 లో భారతదేశం, బేస్ క్యాంపుల్జ్ నుండి ఔట్‌పోస్టులకు కిరోసిన్, విమాన ఇంధనాన్ని సరఫరా చేయడం కోసం హిమానీనదంలో చమురు పైపులైన్లను (సుమారు 250 కిలోమీటర్ల పొడవు) వేసింది. [57] 2007 నాటికి, సియాచెన్ వద్ద ఉష్ణోగ్రత పెరుగుదల ఏటా 0.2 డిగ్రీల సెల్సియస్ గా అంచనా వేసారు. దీనివల్ల హిమానీనదంలో ద్రవీభవనం, హిమసంపాతాలు, చీలికలూ ఏర్పడతాయి. [58]
ఇక్కడ ఉన్న సైనిక దళాలు ఉత్పత్తి చేసే వ్యర్థాలను హిమానీనదపు చీలికల్లో పారబోస్తారు. ఈ ప్రాంతం గుండా వెళ్ళిన పర్వతారోహకులు హిమానీనదం మీద పెద్ద మొత్తంలో చెత్త, ఖాళీ మందుగుండ్లు, పారాచూట్లు మొదలైనవి చూశారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అవి కుళ్ళిపోవు, తగలబడవు. [59] భారత దళాలు రోజూ 1000 కిలోగ్రాముల వ్యర్థాలను హిమనదీయ పగుళ్లలో పోస్తాయి. [51] హిమానీనదం నుండి చెత్తను విమానాల్లో తరలించడానికీ, ఆక్సిజన్-లేమి, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉండే ఈ ప్రాంతంలో బయోడిగ్రేడబుల్ వ్యర్థాల కోసం బయోడిజెస్టర్లను ఉపయోగించటానికీ భారత సైన్యం "గ్రీన్ సియాచెన్, క్లీన్ సియాచెన్" అనే ఉద్యమాన్ని చేపట్టింది. [60] హిమానీనదం వద్ద వదిలిన వ్యర్థాల్లో దాదాపు నలభై శాతం (40%) ప్లాస్టిక్, కోబాల్ట్, కాడ్మియం, క్రోమియం వంటి విషపదార్థాలున్నాయి. అంతిమంగా ఇవి నీటిని ప్రభావితం చేస్తాయి. ఈ నీరు ష్యోక్ నదిలో కలిసి, చివరికి స్కర్దూ వద్ద సింధు నదిలో ప్రవేశిస్తుంది. సింధు నది నీటిని తాగడానికీ, నీటిపారుదల కొరకూ ఉపయోగిస్తారు. [61] [62] హిమానీనదం వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను శాస్త్రీయ మార్గాలను ఉపయోగించి విజయవంతంగా పారవేసేందుకు మార్గాలను కనుగొనడానికి ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. [63] అంటార్కిటికా యాత్రకు వెళ్ళిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో వృద్ధి చెందగల బ్యాక్టీరియంను ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా వ్యర్ధాలు సహజంగా కుళ్ళిపోవడానికి దోహదపడతాయి. [64]
సియాచెన్ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం కూడా భారీ సైనిక ఉనికిని ప్రభావితమౌతాయి. [61] ఈ ప్రాంతం మంచు చిరుత, గోధుమ ఎలుగుబంటి, ఐబెక్స్‌తో సహా అరుదైన జాతులకు నిలయం. సైనిక ఉనికి కారణంగా ఇవి ప్రమాదంలో ఉన్నాయి. [63] [65]
సియాచెన్ హిమానీనదం, భూమిపై అత్యంత ఎత్తైన యుద్ధభూమి. [66] ఇక్కడ భారత, పాకిస్తాన్‌లు 1984 ఏప్రిల్ నుండి అడపాదడపా పోరాడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో, 6,000 మీటర్ల కన్నా ఎత్తులో, రెండు దేశాలకూ శాశ్వత సైనిక శిబిరాలు ఉన్నాయి .
భారతదేశం, పాకిస్తాన్ రెండూ చాలా ఖర్చుతో కూడుకున్న ఈ సైనిక ఔట్‌పోస్టులను మూసెయ్యాలనే కోరుకుంటున్నాయి. అయితే, 1999 లో కార్గిల్ యుద్ధానికి కారణమైన పాకిస్తాన్ చొరబాట్ల తరువాత, ఆ దేశం ప్రస్తుత నియంత్రణ రేఖను అధికారికంగా గుర్తించనంత వరకూ, సియాచెన్ నుండి వైదొలగరాదని భారతదేశం నిశ్చయించుకుంది. అటువంటి గుర్తింపు లేకుండా సియాచెన్ లోని పోస్టులను ఖాళీ చేస్తే, పాకిస్తాన్ మళ్ళీ చొరబడుతుందని భారత్ ఆందోళన.
ఈ ప్రాంతాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని, మన్మోహన్ సింగ్. ఆ పర్యటనలో, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాడు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్థలాన్ని సందర్శించాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ 2012 లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయానితో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. [67] సియాచెన్ సంఘర్షణను వీలైనంత త్వరగా పరిష్కరించుకోడానికి వారిద్దరూ నిబద్ధతను కనబరచారు. అంతకు ,ముందరి సంవత్సరంలో, భారత రాష్ట్రపతి, అబ్దుల్ కలాం సియాచెన్‌ను సందర్శించిన మొదటి దేశాధినేత అయ్యాడు.
2007 సెప్టెంబర్ నుండి, భారతదేశం ఈ ప్రాంతానికి పరిమిత స్థాయిలో పర్వతారోహణ, ట్రెక్కింగ్ యాత్రలను ప్రారంభించింది. మొదటి బృందంలో చైల్ మిలిటరీ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఇండియన్ మిలిటరీ అకాడమీ, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీల్కు చెందిన క్యాడెట్లతో పాటు, సాయుధ దళాల అధికారుల కుటుంబ సభ్యులు ఉన్నారు. సాల్టోరో రిడ్జిపై "దాదాపు అన్ని ఆధిపత్య శిఖరాలన్నీ" భారత దళాల నియంత్రణలో ఉన్నాయని, పాకిస్తాన్ దళాలు సియాచెన్ హిమానీనదం దగ్గర ఎక్కడా లేవని అంతర్జాతీయ సమాజానికి చూపించడానికి కూడా ఈ యాత్రలను ఉద్దేశించారు. [68] దీనిపై పాకిస్తాన్ వెలిబుచ్చిన నిరసనలను భారత్ త్రోసిరాజంది. సియాచెన్ తమ స్వంత భూభాగామనీ, అక్కడికి ట్రెక్కింగ్ చేసేవారిని పంపడానికి తమకు ఎవరి అనుమతీ అవసరం లేదనీ భారతదేశం పేర్కొంది. [69] దీనికి తోడు, భారత సైన్యపు పర్వతారోహణ సంస్థ (AMI) ఈ ప్రాంతం లోనే ఉంది.
సైయాచిన్ ప్రాంతాన్ని "పీస్ పార్క్" గా ప్రకటించే ఆలోచనను పర్యావరణవేత్తలు, శాంతి కార్యకర్తలు ప్రకటించారు. సైనిక ఉనికి వలన తీవ్రంగా ప్రభావితమైన ఈ ప్రాంతపు పర్యావరణ వ్యవస్థను కాపాడటం ఇందులో భాగం. [70] 2003 సెప్టెంబరులో, డర్బన్‌లో జరిగిన 5 వ వరల్డ్ పార్క్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్నవారు, సహజ జీవ వ్యవస్థను పునరుద్ధరించడానికి, ప్రాణాలకు ప్రమాదం ఉన్న జాతులను రక్షించడానికి సియాచెన్ ప్రాంతంలో శాంతి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలను కోరారు. [58] ఇటాలియన్ పర్యావరణ శాస్త్రవేత్త గియులియానో టాలోన్, పర్యావరణ జీవం తీవ్రమైన ప్రమాదంలో ఉందని చెబుతూ, సియాచెన్ పీస్ పార్కును ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించాడు. [71] ట్రాన్స్‌బౌండరీ పీస్ పార్కు ప్రతిపాదన తేలిన తరువాత, అంతర్జాతీయ పర్వతారోహణ, అధిరోహణ సమాఖ్య (యుఐఎఎ), అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఐయుసిఎన్) జెనీవాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, భారతీయ, పాకిస్తాన్ పర్వతారోహకులను (మన్దీప్ సింగ్ సైన్, హరీష్ కపాడియా, నజీర్ సబీర్, షేర్ ఖాన్) ఆహ్వానించాయి . [72] కారకోరం శ్రేణిలో భాగంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి ఈ ప్రాంతాన్ని నామినేట్ చేసారు. కాని ప్రపంచ వారసత్వ కమిటీ దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. [73] సియాచెన్‌కు తూర్పు, పడమరల్లో ఉన్న ప్రాంతాలను ఇప్పటికే జాతీయ ఉద్యానవనాలుగా ప్రకటించారు: భారతదేశం కారకోరం వన్యప్రాణుల అభయారణ్యం ఏర్పాటు చేయగా, పాకిస్తాన్లో సెంట్రల్ కారకోరం నేషనల్ పార్క్ ఉంది. [74]
శాండియా నేషనల్ లాబొరేటరీస్, సియాచెన్ గురించి సమావేశాలను నిర్వహించి, భారతదేశం, పాకిస్తాన్, ఇతర దేశాల నుండీ సైనిక నిపుణులను, పర్యావరణవేత్తలనూ ఉమ్మడి పత్రాలను సమర్పించడానికి ఆహ్వానించింది. శాండియా ల్యాబ్స్ లోని పరిశోధకుడు కెంట్ ఎల్. బైరింగర్, సియాచెన్ సైన్స్ సెంటర్ అనే అధిక ఎత్తుల పరిశోధన సంస్థ ఏర్పాటు చెయ్యాలని, అక్కడ రెండు దేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు పరిశోధన కార్యక్రమాలను నిర్వహించాలనీ ప్రతిపాదించాడు. [71] ఇక్కడ హిమ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రాలు, ఇతర సంబంధిత రంగాలకు సంబంధించిన పరిశోధనలు చేస్తారు. [75] [76]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.