From Wikipedia, the free encyclopedia
మానవ లేదా జంతు జీవిత కార్యకలాపాలపై హానికరమైన ప్రభావం కలగజేసే మోతలను శబ్ద కాలుష్యం అంటారు. దీన్ని పర్యావరణ శబ్దం లేదా ధ్వని కాలుష్యం అని కూడా పిలుస్తారు. మోతలకు మూలం ప్రధానంగా యంత్రాలు, రవాణా, ప్రచార వ్యవస్థలు. [1] [2] పట్టణ ప్రణాళిక సరైన పద్ధతిలో లేకపోతే శబ్ద కాలుష్యానికి దారితీస్తుంది. పారిశ్రామిక, నివాస భవనాలు పక్కపక్కనే ఉన్నపుడు నివాస ప్రాంతాలలో శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. నివాస ప్రాంతాలలో బిగ్గరగా వినిపించే సంగీతం, రవాణా (ట్రాఫిక్, రైలు, విమానాలు మొదలైనవి), పచ్చిక కోసే యంత్రాలు, నిర్మాణం, ఎలక్ట్రికల్ జనరేటర్లు, పేలుళ్లు, ప్రజలు మొదలైనవి మోతలకు ప్రధాన వనరులు. పట్టణ పర్యావరణ శబ్దంతో సంబంధం ఉన్న సమస్యలు పురాతన రోమ్‌లో కూడా ఉన్నాయి . [3] శబ్దాన్ని డెసిబెల్ (డిబి) లో కొలుస్తారు. గృహ విద్యుత్ జనరేటర్లతో సంబంధం ఉన్న శబ్ద కాలుష్యం అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొత్తగా ఏర్పడుతున్న పర్యావరణ క్షీణత. సగటు శబ్దం స్థాయి 97.60 dB, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివాస ప్రాంతాల కోసం సూచించిన 50 dB విలువను మించిపోయింది. తక్కువ ఆదాయ వర్గాలవారు నివసించే పరిసరాల్లో శబ్ద కాలుష్యం అత్యధికంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. [4]
శబ్ద కాలుష్యం ఆరోగ్యాన్ని, ప్రవర్తనను రెండింటినీ ప్రభావితం చేస్తుంది. అవాంఛిత ధ్వని (మోత) శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శబ్ద కాలుష్యానికి అనేక ఆరోగ్య పరిస్థితులకూ సంబంధం ఉంది. వీటిలో హృదయ సంబంధ రుగ్మతలు, రక్తపోటు, అధిక ఒత్తిడి స్థాయిలు, టిన్నిటస్, వినికిడి లోపం, నిద్రలేమి, ఇతర హానికారక, కలతపెట్టే ప్రభావాలు ఉన్నాయి. [5] [6] [7] [8] 2019 నాటి సమీక్ష ఒకదానిలో, శబ్ద కాలుష్యం వేగవంతమైన అభిజ్ఞా క్షీణతతో ముడిపడి ఉంది. [9]
ఐరోపా అంతటా, యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ప్రకారం, 55 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉండే రహదారి ట్రాఫిక్ మోతల స్థాయి వలన 11.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారని అంచనా. WHO నిర్వచనం ప్రకారం 55 డెసిబెల్స్ కు పైబడి ఉండే మోతలు మానవ ఆరోగ్యానికి హానికరం. [10]
నిద్ర, సంభాషణ వంటి సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినప్పుడు గాని, వ్యక్తి జీవన నాణ్యతను దెబ్బతీసే సందర్భం లోనూ ధ్వనులు అవాంఛితమౌతాయి. [11] 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ మోతలకు ఎక్కువ కాలం గురైతే, వినికిడి దెబ్బతింటుంది. [12] రవాణా, పారిశ్రామిక శబ్దాలకు చాలా తక్కువగా బహిర్గతమయ్యే మాబన్ తెగ్ ప్రజలను, మామూలు అమెరికా జనాభాతో పోల్చినపుడు, కాస్త మధ్యస్తంగా ఉండే మోతలకు సదా గురౌతూ ఉన్నవారికి వినికిడి లోపం కలుగుతుందని చూపించింది. [6]
కార్యాలయాల్లోని మోతలు వినికిడి నష్టానికి, ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. వినికిడి నష్టం అనేది ప్రపంచవ్యాప్తంగా పని-సంబంధ అనారోగ్యాలలో ఒకటి. [13]
మానవులు శబ్దానికి ఆత్మాశ్రయంగా ఎలా అనుగుణంగా ఉంటారో స్పష్టంగా తెలియదు. మోతలను తట్టుకునే శక్తికి డెసిబెల్ స్థాయిలతో సంబంధం ఉన్నట్లు కనబడదు. ముర్రే షాఫెర్ సౌండ్‌స్కేప్ పరిశోధన ఈ విషయంలో సంచలనం సృష్టించింది. తన రచనలో, మానవులు ఒక ఆత్మాశ్రయ స్థాయిలో శబ్దంతో ఎలా సంబంధం కలిగి ఉంటారో, అటువంటి ఆత్మాశ్రయతను సంస్కృతి ఎలా మలుస్తుందో అతను చాలా తర్కబద్ధమైన వాదనలు చేస్తాడతడు. [14] ధ్వని అనేది బలాన్ని ప్రదర్శించడం అని కూడా షాఫెర్ పేర్కొన్నాడు. ఉదాహరణకు, కొన్ని రకాల కార్లు, మోటార్ సైకిళ్ళు పెద్ద పెద్ద, విలక్షణమైన మోతలు చేస్తూంటాయి. అదొక ఆధిపత్య ప్రదర్శన.
శబ్ద కాలుష్యం పెద్దలపైన, పిల్లలపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) ఉన్నవారిలో హైపరాక్యుసిస్ -అంటే, శబ్దం పట్ల అసాధారణమైన సున్నితత్వం కలిగి ఉండడం- ఉంటుంది. ASD ఉన్నవారికి మోతలు వినబడినపుడు భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు కలుగుతాయి. పెద్ద పెద్ద మోతలు ఉన్నచోట్ల శారీరికంగా అసౌకర్యం కలుగుతుంది. [15] దీంతో ASD ఉన్న వ్యక్తులు మోతలు ఉండే చోట్ల నూండి తప్పించుకుంటూంటారు. ఇది ఒంటరితనానికి దారితీసి, వారి జీవన నాణ్యతపై ప్రతికూలం ప్రభావం కలుగజేస్తుంది.
మోత జంతువులపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. వేటాడే జంతువులకు, వాటి ఆహారానికీ మధ్య ఉండే సున్నితమైన సమతుల్యత మారుతుంది. మోతల వల్ల జంతువుల మధ్య జరిగే సంభాషణల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇవి మిగతా సామాజిక వ్యవహారాలపై ప్రభావం చూపుతాయి. [16]
పట్టణ పరిసరాలలో నివసించే యూరోపియన్ రాబిన్లు, పగలు ఉండే శబ్ద కాలుష్యం కారణంగా పగటిపూట కంటే రాత్రిపూట పాడే అవకాశం ఎక్కువగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్నందున రాత్రిపూట పాడతాయి. వాటి కూత పర్యావరణం ద్వారా మరింత స్పష్టంగా ప్రసారమౌతుంది. [17]
ట్రాఫిక్ మోతలకు గురైనప్పుడు జీబ్రా ఫించ్ అనే పక్షులు తమ భాగస్వాముల పట్ల వాటికి ఉండే విశ్వాసపాత్రత తగ్గుతుంది ఇది కాలాంతరంలో తీవ్రమైన జన్యు పరిణామాలకు దారితీస్తుంది. [18]
మానవ కార్యకలాపాల వల్ల సముద్రంలో కూడా శబ్ద కాలుష్యం ప్రబలంగా ఉంది. ఓడల ప్రొపెల్లర్లు, డీజిల్ ఇంజిన్లు అధిక స్థాయిలో శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. [19] [20] ఈ శబ్ద కాలుష్యం తక్కువ-ఫ్రీక్వెన్సీలోని శబ్ద స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. [21] కమ్యూనికేషన్ కోసం ధ్వనిపై ఆధారపడే తిమింగలాలు వంటి జంతువులు ఈ శబ్దం ద్వారా ప్రభావితమవుతాయి. పీతలు ( కార్సినస్ మేనాస్ ) వంటి సముద్ర అకశేరుకాలు కూడా ఓడ శబ్దం ద్వారా ప్రతికూలంగా ప్రభావితమవుతాయని తేలింది. [22] పెద్ద పీతలు చిన్న పీతల కంటే శబ్దాల ద్వారా ప్రతికూలంగా ప్రభావితమవుతాయని గుర్తించారు.
పర్యావరణంలోను కార్యాలయాల్లోనూ మోతలను తగ్గించడానికి హైరార్కీ ఆఫ్ కంట్రోల్స్ భావనను ఉపయోగిస్తూంటారు. మోతలు పుట్టే దగ్గరే దాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవచ్చు. అలా నియంత్రణలు సాధ్యపడనప్పుడు లేదా తగినంతగా లేనప్పుడు, వ్యక్తులు విడివిడిగా శబ్ద కాలుష్యపు హానికరమైన ప్రభావాల నుండి తమను తాము రక్షించుకోవడానికి కూడా చర్యలు తీసుకోవచ్చు. పెద్ద పెద్ద మోతలకు దగ్గర్లో ఉన్నవారు చెవుల్లో ఇయర్ ప్లగ్గులు, ఇయర్ మఫ్‌లు పెట్టుకోవచ్చు. [23] ఇటీవల, వృత్తిపరమైన మోతలను ఎదుర్కొనే ప్రయత్నంలో కొన్ని కార్యక్రమాలు పుట్టుకొచ్చాయి. ఈ కార్యక్రమాలు మోతలు పుట్టించని పరికరాల కొనుగోలును ప్రోత్సహిస్తాయి. నిశ్శబ్ద పరికరాలను రూపొందించడానికి తయారీదారులను ప్రోత్సహిస్తాయి. [24]
సరాఇన పట్టణ ప్రణాళిక ద్వారాను, రహదారుల మెరుగైన రూపకల్పన ద్వారానూ రహదారులు, ఇతర పట్టణ సదుపాయాల నుండి వచ్చే శబ్దాన్నిమోతలను తగ్గించవచ్చు. శబ్దం నిరోధకాలను ఉపయోగించడం, వాహన వేగాన్ని పరిమితం చేయడం, రహదారి ఉపరితలపు రూపాన్ని మార్చడం, భారీ వాహనాలపై పరిమితి విధించడం, బ్రేకులు వెయ్యడాన్ని, త్వరణాన్నీ తగ్గించి, వాహన ప్రవాహం మెత్తగా కదిలేలా చేసే ట్రాఫిక్ నియంత్రణలను ఉపయోగించడం, సరైన టైర్ల రూపకల్పన వంటి వాటి ద్వారా రహదారి శబ్దాన్ని తగ్గించవచ్చు. ఈ వ్యూహాలను వర్తింపజేయడంలో ముఖ్యమైన అంశం రహదారి శబ్దం కోసం కంప్యూటర్ మోడల్. ఇది స్థానిక స్థలాకృతి, వాతావరణ శాస్త్రం, ట్రాఫిక్ కార్యకలాపాలు, ఊహాత్మక ఉపశమనాన్ని పరిష్కరించేలా ఉండాలి. రహదారి ప్రాజెక్టు ప్రణాళిక దశలో ఉండగానే ఈ పరిష్కారాలను చేర్చితే, మోతలను తగ్గించేందుకు తీసుకునే చర్యల ఖర్చు తక్కువగా ఉంటుంది.
మోతలను తక్కువగా వెలువరించే జెట్ ఇంజిన్లను ఉపయోగించడం, విమాన మార్గాలను మార్చడం, రన్‌వే వాడే సమయాలను మార్చడం వంటి చర్యల ద్వారా విమాన శబ్దాన్ని తగ్గించవచ్చు. ఇది విమానాశ్రయాల సమీపంలో ఉండే నివాసితులకు ప్రయోజనం చేకూర్చుతుంది.
1970 ల వరకు ప్రభుత్వాలు మోతలను పర్యావరణ సమస్యగా కాకుండా "చిరాకు"గా చూసేవి.
శబ్ద కాలుష్యం చేసేవారికీ, బాధితులకూ మధ్య తలెత్తే విభేదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటారు. పరిష్కారం కుదరనపుడు, పైస్థాయికి తీసుకువెళ్ళే పద్ధతులు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి.
శబ్ద కాలుష్యం భారతదేశంలో పెద్ద సమస్య. [25] బాణాసంచా, లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నియమ నిబంధనలు తయారు చేసింది. అయితే అమలు చాలా అలసత్వం ఉంది. ఆవాజ్ ఫౌండేషన్ భారతదేశంలో ఒక ప్రభుత్వేతర సంస్థ. ఇది 2003 నుండి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, అవగాహన, విద్యా ప్రచారాలు మొదలైన పద్ధతుల ద్వారా వివిధ వనరుల నుండి వచ్చే శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి పనిచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు చట్టాలను కఠినంగా అమలు చెయ్యడం పెరుగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లలో సంగీతం ప్రసారం చెయ్యడాన్ని భారత సుప్రీంకోర్టు నిషేధించింది. శబ్ద కాలుష్యంపై మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని 2015 లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఇది కేవలం చిరాకు తెప్పించడం మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుందని వారు చెప్పారు. అయినప్పటికీ, చట్టం అమలు పేలవంగా ఉంది. [26]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.