From Wikipedia, the free encyclopedia
కీచకుని వధించిన భీముడు వంటశాలను చేరాడు. శరీరాన్ని శుభ్రంగా కడిగాడు. ఒంటికి రక్త వాసన వాసనలు తెలియకుండా పూత పూసాడు. తన శయ్యపై కూర్చున్నాడు. ద్రౌపది తన భర్త క్షేమంగా చేరుకున్నాడని ధ్రువపరచుకుని అక్కడ ఉన్న కావలి వాళ్ళను పిలిచింది. వారితో " నా భర్తలైన గంధర్వుల వలన ఇతడు ఎలాంటి దుర్గతి పాలయ్యాడో చూడండి " అన్నది. వారు అది విని కలవరపడి పెద్దగా అరచుకుంటూ నర్తనశాలలోకి ప్రవేశించారు.
కావలి వాళ్ళ అరుపులు విని ఉపకీచకులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ మాంసపు ముద్దలా పడి ఉన్న కీచకుని చూసి పెద్దగా దొర్లుతూ ఏడ్చారు. ఇంతలో వారి బంధువులు కూడా అక్కడికి వచ్చారు. వారిలో వారు " ఎన్నోచావులు చూసాము కాని ఇలాంటి వింత చావు చూడలేదు. అసలు వీడికి చేతులు ఏవి? కాళ్ళు ఏవి ? గంధర్వులు ఇలాగే చంపుతారేమో. ఎందరినో యుద్ధ భూమిలో జయించిన సింహబలుని బలం ఎందుకూ కొరరానిదైంది కదా " అనుకున్నారు. ఉపకీచకులలో ఒకడు " ఎంత సేపు ఏడ్చినా పోయిన వాడు తిరిగి వస్తాడా. ఇతనికి అంత్య క్రియలు చేస్తాము " అన్నాడు. మిగిలిన కీచకులు సరే అన్నారు. ద్రౌపది వారికి దగ్గరగా నిలబడి వారు ఏమి చేస్తున్నారో చూస్తూ ఉంది. ఆమెను చూసిన కీచకులు కోపంతో రెచ్చి పోయారు. తమ అన్న మరణానికి కారణం ఆమె అని అనుకున్నారు. ఒక్కసారిగా ద్రౌపది మీదకు దూకి ఆమెను పట్టుకున్నారు. ఆమె చేతులు వెనక్కు విరిచి కట్టారు. వారు " దీని వలనే దీని అందం చూసి మోహించే కీచకుడు మరణించాడు. అంతటికీ కారణం ఈమే కనుక ఈమె ఇక బ్రతుక కూడదు. అన్న శవంతో చేర్చి కాల్చి వేయాలి " అని నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని విరాటరాజుకు తెలిపి అతని అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు. అప్పటికే కీచకుని మరణవార్త వన్న విరాటుడు కీచకుని మరణానికి ఎంతో దుఃఖిస్తున్నాడు. " మహారాజా! మేము ఈ సైరంధ్రిని కీచకుని శవంతో చేర్చి దహనం చేయాలని అనుకున్నాము ఇందుకు మీరు అనుమతించాలి " అని అడిగారు. విరాటుడు " మీకు తోచని విధంగా చేయండి " అని చెప్పాడు. ఉపకీచకులు ద్రౌపదిని ఈడ్చుకు వెళ్ళి కీచకుని శవంతో కట్టారు. అందరూ శ్మశానానికి బయలుదేరారు. అనుకోని ఈ పరిణామానికి ద్రౌపది కలత చెందింది. ఆపత్సమయంలో ఒకరిని ఒకరు పిలుచు కోవడానికి పాండవులు నిర్ణయించుకున్న మారు పేర్లతో ద్రౌపది భర్తలను ఎలుగెత్తి పిలువ సాగింది. " జయా! జయంతా! విజయా! జయత్సేనా! జయత్బలా! నన్ను ఈ దుర్మార్గులు కీచకుని శవంతో కట్టి దహనం చేయడానికి తీసుకు పోతున్నారు. రక్షించండి " అని తన రక్షణ కోసం పెద్దగా ఏడుస్తూ పాండవులను పిలిచింది. ద్రౌపది కేకలు భీముని చేరాయి. భీముడు ఆగ్రహోదగ్రుడై వారికంటే ముందుగా శ్మశానం చేరాడు. ఒక పెద్ద చెట్టును మొదలంటా పెకిలించి భుజంపై పెట్టుకుని ఉప కీచకుల రాకకై ఎదురు చూస్తున్నాడు. శ్మశానం చేరుకున్న ఉపకీచకులు భయంకరాకారంతో నిలబడి ఉన్న భీముని చూసి గంధర్వుడు వచ్చాడనుకుని భయపడి శవాన్ని అక్కడే వదిలి పారిపోయారు. భీముడు వారిని తరిమి తరిమి కొట్టి సంహరించాడు. తరువాత ద్రౌపదిని విడిపించి " త్వరగా సుధేష్ణ మందిరానికి వెళ్ళు " అని ద్రౌపదికి చెప్పి తాను వడివడిగా వంటశాల చేరుకున్నాడు.
ఉపకీచకుల మరణ వార్త విన్న విరాటుడు తన భార్య సుధేష్ణ వద్దకు వెళ్ళి " సుధేష్ణా! ఈ సైరంధ్రీని ఎలాగైనా ఇక్కడి నుండి బయటకు పంపు. ఆమె ఇక్కడ ఉంటే మగవాళ్ళు ఆమె పక్కకు పోతేనే ప్రమాదంలో చిక్కు కుంటున్నారు. ఆమె ఇక్కడ ఉంటే మరింత అనర్ధాలు జరిగేలా ఉంది. నా మాటగా చెప్పి ఆమెను పంపించు " అన్నాడు విరాటుడు. శవాన్ని తాకిన మైల పోవడానికి ద్రౌపది సచేల స్నానం చేసింది. సుధేష్ణ మందిరానికి చేరటానికి పురవీధులలో నడచి వస్తుండగా ప్రజలు ఆమెను చూసి భయభ్రాంతికి లోనయ్యారు. " ఈ మెను కోరిన కీచకుడంతటి వానికే ఈ గతి పట్టింది ఇక మనమెంత ? " అంటూ ఆమెను చూడటానికే భపడ్డారు. వంటశాలను సమీపించిన ద్రౌపది ఎవరికీ అర్ధం కాకుండా " కీచకుల బారి నుండి నన్ను రక్షించిన నా గంధర్వ పతికి నమస్కరిస్తున్నాను " అన్నది. భీముడు కూడా అలాగే ఎవరికీ అర్ధం కాకుండానే " ఆపదలో ఉన్న భార్యను రక్షించడం భర్త కర్తవ్యం కదా దానికి పొగడ్త ఎందుకు " అన్నాడు. ద్రౌపది అక్కడి నుండి నర్తనశాలకు వెళ్ళింది. నాట్యం నేర్చుకుంటున్న కన్యలను చూస్తూ నిలబడింది. ఆమెను చూసిన కన్యలు " అయ్యో ఆ కీచకుడు ఇంత పని చేసాడా. తగిన శాస్తి జరిగింది. ఉప కీచకులు నిన్ను కీచకుని శవంతో కట్టి తీసుకు పోవడం ఏమిటి? నీ భర్తలచే వారికీ తగిన శాస్తే జరిగిందిలే " అన్నారు. ఆమెను చూసిన బృహన్నల " మాలినీ ఏమి జరిగిందో వివరంగా చెప్పు " అని అడిగాడు. ద్రౌపది " బృహన్నలా ! అంతఃపురంలో కన్యలకు ఆటపాటల నేర్పుకుంటున్న నీకు ఈ సైరంధ్రికి ఏమి జరిగినా పట్టదు కదా. అందుకే ఏమి జరిగిందని అడుగుతున్నావు " అన్నది. బృహన్నల " అయ్యో ! సైరంధ్రీ నీవు పడుతున్న కష్టాలు తెలిసినా నిన్ను ఆదుకోలేని పుట్టుక నాది. ఏమి చెయ్యగలను మనసులో నేను పడే బాధ ఎవరికి తెలుస్తుంది చెప్పు ? నీవు ఏ అపరాధం చేయవని నేనెరుగనా నీ కస్టాలు నన్ను బాధించవా " అని నిగూఢంగా అన్నాడు బృహన్నల. ద్రౌపది " అయ్యో ! నీ సంగతి నాకు తెలియనిదా. అంతఃపురంలో నీవు నీకు తగిన విధంగా ఉండటమే నాకు కావలసింది " అన్నది ద్రౌపది.
ఆమె మిగిలిన అంతఃపుర కాంతలతో చేరి సుధేష్ణ మందిరంలో ప్రవేశించింది. సుధేష్ణ ఆమెను సాదరంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె ద్రౌపదితో " సైరంధ్రీ! నీవు చక్కని దానవు. కాని మగవాళ్ళు ఏమాత్రం నిగ్రహం లేని వాళ్ళని విరాటరాజు భయపడుతున్నాడు. నీ భర్తలైన గంధర్వులు నిన్ను చూసినంతనే మగవాళ్ళను హతమారు స్తున్నారు. ప్రజలు నిన్ను చూస్తేనే భయపడుతున్నారు. విరాటరాజు నిన్ను నువ్వు కోరిన చోటికి పంపమని తన మాటగా నాకు చెప్పాడు. కనుక నీవు మా దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళు " అన్నది. ద్రౌపది " అమ్మా ! సుధేష్ణా ఇక పదమూడు రోజులు మాత్రం నన్ను ఎప్పట్లా మీ ఇంట ఉండనివ్వండి చాలు. అంతటితో నా వ్రతం పూర్తి ఔతుంది. ఆ తరువాత నా భర్తలు మీకు కనిపించి మీ కోరిక తీరుస్తారు. వారు దయామయులు పరోపకార పరాత్పరులు. వారికి ఉపకారం చేసిన విరాటునికి వారు ప్రత్యుపకారం చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక సందేహించకు. ఇంత కాలం నన్ను మీతో సమానంగా ఆదరించి ఇప్పుడు విడిచి పెట్టడం భావ్యమా " అని వేడుకుంది. ద్రౌపది మాటలకు చలించిన సుధేష్ణ " మాలినీ! నీ వ్రతం పూర్తయ్యే వరకు నా ఇంట ఉండవచ్చు. నా భర్తను, కుమారుని రక్షించుము. నీవు ఇక అంతఃపురం దాటి రావద్దు. నీకు కావలసినవన్ని నేను సమకూరుస్తాను " అని పలికింది. మత్స్యదేశంలో ప్రజలు జరిగిన ఉదంతం గురించి నానా విధాలుగా అనుకుంటున్నారు. " అత్యంత బలశాలి అయిన విరాటుని బావమరిది ఒక్క ఆడదాని కోసం గంధర్వుని చేతిలో మరణించాడు " అనుకోసాగారు.
హస్థినలో దుర్యోధనుడు చారుల ద్వారా ఈ విషయం విన్నాడు. వెంటనే సభ ఏర్పాటు చేసాడు. దుర్యోధనుడు " పాండవులు అరణ్యవాసం అజ్ఞాత వాసం ముగించుకుని రాజ్యభాగాన్ని అడగక ముందే వారిని తిరిగి అరణ్యాలకు పంపే మార్గం ఆలోచించండి " అని దుర్యోధనుడు తన మంత్రులను ఆదేశించాడు. కర్ణుడు లేచి " సుయోధనా ! మనం వేలకొలది చారులను మారు వేషాలలో దేశం నలుమూలలకు పంపుదాం. వారు తప్పకుండా పాండవులను గుర్తిస్తారు " అన్నాడు. దుశ్శాసనుడు లేచి " పాండవుల గురించి నీవు భయపడవలసిన పని లేదు. వారు ఎప్పుడో అడవులలో కృరమృగాలకు బలి అయి ఉంటారు. వారిని గురించి ఆలోచించడం అనవసరం " అన్నాడు. ద్రోణుడు లేచి " సుయోధనా! పాండవులకు ఆపద కలగడం అసంభవం. కనుక వారిని వెతికించే ఏర్పాట్లు ముమ్మరం చెయ్యండి " అన్నాడు. భీష్ముడు " సుయోధనా ! ద్రోణాచార్యులు చెప్పింది సత్యం. పాండవులు బాహుబలంలోనూ, బుద్ధిబలంలోనూ అసమానులు. దైవబాలం కూడా తోడైంది కనుక వారికి ఆపద కలుగుట అసంభవం. నాకు పాండవులు మీరు సమానులు... కాని అడిగావు కనుక చెబుతున్నాను. పుణ్యత్ముడైన ధర్మరాజు ఏ రాజ్యంలో ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అక్కడి ప్రజలు ధర్మవర్తనులై ఉంటారు. అక్కడ పశుసంపద అభివృద్ధి చెందుతాయి. కనుక అలాంటి దేశాన్ని గుర్తించి అక్కడ వెదికించడం మంచిది " అన్నాడు. అది విన్న కృపాచార్యుడు " ఆలస్యం చేయకుండా వెదికించడం మంచిది. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసారు. అజ్ఞాత వాసం దాదాపు పూర్తి అయింది. పగవాడు అల్పుడైనా అతని పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాండవులు మహా బలవంతులు పైగా సుయోధనునిపై కోపంగా ఉన్నారు. కనుక వారితో సంధి చేసుకొనుట సముచితం. లేకున్న యుద్ధం అనివార్యం. పాండవులు సంధికి అంగీకరించకున్నా యుద్ధం తప్పదు. వారు అరణ్యాలలో మరణించారనుకున్నా వారి మిత్రదేశరాజులు మనపై దండెత్తే అవకాశం ఉంది కనుక మనం సైన్యాన్ని సమాయత్త పరచడం మంచిది " అన్నాడు. దుర్యోధనుడు అందరి మాటలను సావధానంగా విని సభను ఉద్దేశించి " కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు అసమాన బలాఢ్యులు. వీరితో పోలిన వారు భూమిలో ఎవరూ లేరు. వారిలో వారే ఒకరిని ఒకరు గెలవాలి. మత్స్యదేశ సైన్యాద్యక్షుడు కీచకుని గంధర్వుడెవరో చంపాడని తెలిసింది. ఒక కాంత కారణంగా చంపారు అని తెలిసింది. కీచకుని చంపాలంటే మిగిలిన ముగ్గురిలో ఒకరు చంపాలి. బలరాముడు , శల్యుడు మత్స్య దేశానికి దూరంగా ఉన్నారు కనుక వారు చంపలేరు. ఉపకీచకులతో చేర్చి కీచకుని వధించిన గంధర్వుడు అజ్ఞాతవాసంలో ఉన్న భీముడై ఉండచ్చు. ఆ కాంత ద్రౌపది కావచ్చు. తాతగారైన భీష్ముడు చెప్పిన లక్షణాలు మత్స్య దేశంలో కానవస్తున్నాయి. కనుక మనం పాండవుల కొరకు మత్స్యదేశంలో వెదకడం మంచిది. విరాటుడు మన శత్రువు కనుక అతని గోధనాన్ని అపహరిస్తే పాండవులు అతనికి సహాయంగా బయటికి వస్తారు. సమయభంగం అయినదని వారిని గుర్తించి తిరిగి అరణ్యవాసానికి పంపచ్చు. పాండవులు లేకున్నా అతని సంపదనంతా కొల్లగొడతాము కనుక మనకు ఎలాగైనా లాభమే. ఇది అందరికి సమ్మతమైతే యుద్ధప్రయత్నాలు చేయండి " అన్నాడు.
దుర్యోధనుని మాటలు విన్న త్రిగర్త దేశాధిపతి " సుయోధన సార్వభౌమా! ఇంతకు పూర్వం కీచకుడు నన్ను యుద్ధంలో గెలిచాడు. అతడు మరణించి నందున అతనితో యుద్ధం చేసే వీలు లేదు. నన్ను విరాటుని మీదకు యుద్ధానికి పంపండి. నేను విరాటుని ఓడించి అతని పశుధనం పట్టుకొస్తాను. అలాగే పాండవుల జాడ తెలుసుకొస్తాను " అన్నాడు. అది విన్న కర్ణుడు " సుయోధనా! త్రిగర్త దేశాధీసుడు ఉచితముగా చెప్పాడు. అందుకు మీరు అనుమతి ఇవ్వండి " అన్నాడు. సుయోధనుడు ఆలోచించి చూసి దుశ్శాసనునితో " ఈ సభలోని పెద్దలు నీకు అనుమతి ఇచ్చారు. మన సైన్యాలను సిద్ధం చెయ్యి. ముందురోజు సుశర్మ విరాటుని మీదకు యుద్ధానికి వెళతాడు. మరునాడు మనం విరాటుని మీదకు యుద్ధానికి వెళతాము " అని సుయోధనుడు అన్నాడు. దుశ్శాసనుడు అలాగే అన్నాడు. దుర్యోధనుడు తన వ్యూహాన్ని ఇలా వివరించాడు. " ముందుగా సుశర్మ తన బలగాలతో వెళ్ళి ఒక వైపు గోవులను మళ్ళిస్తాడు. విరాటుడు సుశర్మతో యుద్ధానికి దిగుతాడు. మరునాడు మనం మరొక వైపు నుండి విరాటుని గోవులను పట్టుకుందాం. అప్పుడు గత్యంతరం లేక పాండవులు మనతో యుద్ధానికి వస్తారు " అంటూ సుశర్మను చూసి " రాబోయే బహుళ అష్టమి నాడు నీవు నీ సేనతో విరాటుని గోగణాన్ని అపహరించు. మేము మరునాడు వేరొక వైపు నుండి విరాటుని గోవులను పట్టుకుంటాము " అన్నాడు. అందరూ యుద్ధానికి సిద్ధం అయ్యారు కాని అప్పటికే పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అయిందని ఎవరూ ఊహించ లేదు.
సుశర్మ తన సైన్యాలతో మత్స్యదేశం పై దండెత్తాడు. చారుల వలన గోసమూహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని పట్టుకోవడానికి ముందుకు సాగాడు. గోసమూహాలను చేరి వాటిని మళ్ళిస్తున్నాడు. గోరక్షకులు సుశర్మతో పోరాడుతున్నారు కాని సుశర్మ సైన్యాల ధాటికి ఆగలేక పోతున్నారు. వారంతా విరాటుని వద్దకు పరుగెత్తారు. విరాటుడు వారిని చూసి కలవర పడ్డాడు. వారు " మహారాజా ! సుశర్మ తన సేనలతో వచ్చి మన గోసమూహాలను మళ్ళించుకు పోతున్నాడు. తమరు వచ్చి కాపాడాలి " అన్నారు. అది విన్న విరాటుడు ఆశ్చర్య పోయి ఇలా అన్నాడు. " మీరు చెప్పేది నిజమా. మన చేతిలో చావు దెబ్బ తిన్న సుశర్మకు ఇంతలో ఇంత ధైర్యం ఎలా వచ్చింది " అంటూ మంత్రులను చూసి " ఇప్పుడు మనం మన సేనలను తీసుకు వెళ్ళి సుశర్మతో యుద్ధం చేయాలి. లేకుంటే మన పశుధనం మనకు దక్కదు. వెంటనే యుద్ధానికి సిద్ధం కండి " అన్నాడు.
విరాటుడు చారుల ద్వారా సుశర్మ గోగణాలతో ఎటు వెళుతున్నాడో తెలుసుకుని అటు వైపు తన సేనలను నడిపించాడు. విరాటుని తమ్ముళ్ళు శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తుడు తమతమ సేనలతో విరాటుని వెంబడించారు. విరాటుని కుమారుడు శంఖుడు కూడా తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఈ సమర సన్నాహాలను చూసిన ధర్మరాజు తన తమ్ములను తీసుకుని విరాటుని వద్దకు వచ్చాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా నేను ఇది వరకు ఒక ఋషి వద్ద ఎన్నో శాస్త్రాలు అభ్యసించాను. నాకు యుద్ధం చేయడంలో నైపుణ్యం ఉంది. తమరు యుద్ధానికి వెళుతుంటే నేను ఊరకుండటం న్యాయమా నేను కూడా నీతో యుద్ధానికి వస్తాను " అన్నాడు. విరాటుడు అందుకు అంగీకరించాడు. వెంటనే ధర్మరాజు తన తమ్ములైన భీమ, నకుల, సహదేవులను రమ్మని సైగ చేసాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా ! ఇతడు మన వంటవాడు వలలుడు మల్లయుద్ధంలో నేర్పరని మీకూ తెలుసు మనకు యుద్ధంలొ అవసర పడగలడు. అలాగే మన అశ్వపాలకుడైన తామ్రగంధికి యుద్ధంలో ప్రావీణ్యం ఉంది. అలాగే గోరక్షకుడైన తంత్రీపాలునికి యుద్ధంలో నేర్పు ఉంది. అందుకని వీరిని కూడా యుద్ధానికి పిలుచుకు పోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది " అన్నాడు. విరాటుడు శతానీకుని పిలిచి వారికి కూడా రథాలను సిద్ధ పరచమని చెప్పాడు.
అందరితో కలసి విరాటుడు సుశర్మ గోవులను మళ్ళించిన వైపు సైన్యాలను నడిపించాడు. సుశర్మ సేనలను చేరుకున్నాడు. సుశర్మ సేనలకు విరాటుని సేనలకు ఘోరయుద్ధం జరిగింది. శతానీకుడు తన సేనలతో సుశర్మ సేనలను చుట్టు ముట్టాడు. మదిరాశ్వుడు తన సేనలతో సుశర్మ సేనలను నుగ్గు నుగ్గూ చేస్తున్నాడు. సూర్యదత్తుడు కూడా తన సేనలతో సుశర్మ సేనలను కకావికలు చేస్తున్నాడు. విరాటుడు కూడా యుద్ధరంగంలో ఎక్కడ చూసినా తానే అయి యుద్ధం చేస్తున్నాడు. విరాటుడు సుశర్మ రథాన్ని చూసాడు. విరాటుడు సుశర్మను ఎదుర్కొన్నాడు. ఇద్దరూ భీకరంగా పోరు సాగించారు. విరాటుని ధాటికి తాళ లేక సుశర్మ సేనలు తిరుగు ముఖం పట్టాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. చీకట్లు అలుముకున్నాయి. కళ్ళు కనిపించక యుద్ధం ఆపివేసారు. కొంతసేపటికి చంద్రోదయం అయింది పండు వెన్నెల వచ్చింది. ఆ వెన్నెల వెలుగులో ఇరు పక్షాలు మరలా యుద్ధానికి సిద్ధ పడ్డాయి. సుశర్మ రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి వచ్చాడు. విరాటుని సారథిని గుర్రాలను చంపి విరాటుని పట్టుకున్నాడు. తన రథం మీదకు విరాటుని లాగిన సుశర్మ పెద్దగా సింహనాదం చేసాడు. విజయ దుంధుభులు మ్రోగించారు.
సుశర్మ విరాటుని పట్టుకున్నాడన్న వార్త అందరికీ తెలిసింది. ధర్మరాజు భీముని పిలిచి " భీమా! ఈ విరాటుని కొలువులో మేము తలదాచుకుని బ్రతుకు తున్నాము. సుశర్మ విరాటుని బంధీగా పట్టుకున్నాడు. అతన్ని విడిపించడం మన ధర్మం. సుశర్మను వెంబడించి విరాటుని విడిపించి తీసుకురా " అన్నాడు. భీమసేనుడు " అన్నయ్యా! అదెంత పని ఈ మద్ది చెట్టును పెకిలించి సైన్యాన్ని చావగొట్టి విరాటుని విడిపించుకు వస్తాను " అన్నాడు. ధర్మరాజు నవ్వి భీమసేనా " నువ్వలా చేస్తే నువ్వు భీముడవని అందరికి తెలిసి పోతుంది. మన అజ్ఞాత వాసం భంగం ఔతుంది. కనుక విల్లు అంబులతో యుద్ధం చెయ్యి. నకుల, సహదేవులు నీకు చక్ర రక్షకులుగా ఉంటారు " అని అన్నాడు. భీముడికి నిరాశ కలిగినా అన్న మాట ప్రకారం చెట్ల జోలికి పోకుండా " అన్నయ్యా! తమరు చెప్పినట్లే చేస్తాను నా భుజబలంతో శత్రువులను ఓడిస్తాను. విరాటుని తెచ్చి అప్పగిస్తాను " అన్నాడు. అంతట ధర్మరాజు తాను ముందుండి సేనలను నడిపించాడు. త్రిగర్త సైనికులు ఇది చూసి ధర్మరాజు పై కత్తులు బాణాలతో దాడి చేసారు. భీముడు శత్రువుల రథాలను విరగొట్టాడు, సారధులను చంపాడు. ధర్మరాజు సుశర్మను ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. ఇది చూసిన సుశర్మ రథంలో ఉన్న విరాటుడు పక్కనే ఉన్న గద ఒకటి తీసుకుని రథం మీద నుండి కిందికి దూకి సుశర్మను మోదాడు. అదే అదనుగా తీసుకుని భీముడు సుశర్మ రథం మీదకు దూకాడు. సుశర్మను పట్టుకుని అతని చేతులు విరిచి పట్టుకుని గట్టిగా సింహనాదం చేసాడు. సుశర్మ సేనలు ఆశ్చర్య పోయాయి. సుశర్మ చక్రరక్షకులు పారి పోయారు. సుశర్మ సైన్యాలు వెనుదిరిగాయి. భీముడు వారిని వెంబడించి తరిమాడు. సుశర్మ తోలుకు పోతున్న పశువులను మళ్ళించాడు.
అన్నగారు ధర్మరాజుతోను నకుల సహదేవులతోను భీముడు విరాటుని దగ్గరకు వచ్చాడు. విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో వారిని అభినందనలతో ముంచెత్తాడు. విరాటుడు ధర్మరాజును చూసి " మీరు నా ధన, మాన, ప్రాణాలను కాపాడారు. అందుకు ప్రతిగా నేను ఏమిచ్చుకోగలను. నా రాజ్యాన్ని మీకు సమర్పించుకుంటాను. ఇది మీరు కాపాడిన శరీరం, ఈ రాజ్యం మీరు జయించింది. కనుక ఈ మత్స్యదేశాన్ని మీరే తీసుకోండి " అన్నాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా! ఇది మీకు మా మీద ఉన్న మర్యాద. మీరు విజయోత్సాహంతో మత్స్యదేశంలో విజయం చేయడం కంటే నాకు మరొక ఆనందం లేదు. నన్ను ఇంతగా పొగడ తగదు " అన్నాడు. విరాటరాజు ధర్మరాజుని చూసి " కంకా ! నాకు అర్ధం కానిది ఒకటి ఉంది. నువ్వు చేసింది నాకు ఉపకారమా లేక నావద్ద ఉన్నందుకు సేవాతత్పరతా ! నాపై కృతజ్ఞతా ! లేక నాపై కృపా ! లేక శతృ సంహార మొనర్చి నీవు కీర్తి పొందుదామనా? ఏ కారణంతో నీవు ఈ శత్రు సంహారం చేసావు. అయినా వంటల వాడేమిటి? అతని పరాక్రమం ఏమిటి? ఆ యుద్ధం చేయడమేమిటి? ఇతడే కదా నన్ను యుద్ధంలో గెలిచింది. ఈ అశ్వశిక్షకుడు, గోపాలకుడు వీరిద్దరే యుద్ధంలో గాయపడకుండా శత్రుసంహారం చేసింది. ఆపదలో ఉన్నప్పుడు సాయంచేసిన వాడే నిజమైన మిత్రుడు. కంకా ! నీ మైత్రిని నేను మరువలేను. మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి గజములా ! అశ్వములా ! కాంచనమా! రత్నములా ! వజ్ర వైఢూర్యములా ! దేవతా కాంతల పోలు అందగత్తెలా ! నానావిధ భోగభాగ్యములా ! మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి నేను మీకు సమర్పించుకుంటాను " అన్నాడు. అది విన్న పాండవులు " మహారాజా ! మీరు మమ్ము ఇలా గౌరవించడం మాకు ఎంతో ఎక్కువ. దీని కంటే మీరు ఇస్తానన్న కానుకలు ఎక్కు కాదు. మనం అందరం నగరానికి చేరుకున్న తరువాత మమ్ములను తగురీతిన సత్కరించండి " అన్నారు. ధర్మరాజు విరాటుని చూసి " మహారాజా ! నా దొక మనవి. మీరు కోరుకోమని చెప్పారు కనుక కోరుతున్నాను. ఈ సుశర్మను అతని బంధు మిత్రులతో ససైన్యంగా విడుదల చెయ్యండి. ఇదే నేను కోరుకొనేది. వెంటనే మన నగరంలో ఈ విజయ వార్తను ప్రకటించండి. విజయోత్సవాలు జరిపించండి " అని అన్నాడు. ధర్మరాజు కోరిన ప్రకారం విరాటుడు సుశర్మను అతని బంధుమిత్రులను ససైన్యంగా విడుదల చేసాడు. ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు విరాట నగరానికి ప్రయాణ మయ్యారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.