ర్యామ్జెట్
గాలిని కంప్రెస్ చేసేందుకు కంప్రెసరేమీ లేకుండా, వాహనం ముందుకు పోయే వేగాన్నే వాడుకునే ఇంజను / From Wikipedia, the free encyclopedia
గాలి పీల్చుకునే జెట్ ఇంజిన్ యొక్క ఒక రూపం ర్యామ్జెట్. ఇంజిన్ వేగంగా ముందుకు పోతూండగా వాతావరణం లోని గాలిని ఇది సహజంగా లోనికి గ్రహిస్తుంది. అంతే తప్ప, గాలిని పీల్చుకోడానికి ప్రత్యేకంగా కంప్రెసరేమీ ఈ ఇంజనులో ఉండదు. వాహనం ముందుకు పోతూ ఉంటేనే గాలి లోపలికి వస్తుంది, అప్పుడే ఈ ఇంజను పనిచేస్తుంది. అందుచేత ఈ ఇంజను నిలబడి ఉన్న విమానంలో పనిచెయ్యదు. అందుచేత రామ్‌జెట్ ఇంజనుతో నడిచే వాహనానికి, ర్యామ్జెట్ పనిచేసే వేగాన్ని అందుకునే వరకు ఒక టేకాఫ్ సహాయకం అవసరం. వాహనం బయలుదేరి, ర్యామ్జెట్ ఇంజను పనిచెయ్యగల వేగాన్ని అందుకునే వరకూ ఈ సహాయక ఇంజను పనిచేస్తుంది. రామ్జెట్లు సూపర్సోనిక్ వేగాల వద్ద - మ్యాక్ 3 కి అటూ ఇటూగా - అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ఇంజను మ్యాక్ 6 వేగం వరకూ పనిచేయగలదు.
క్షిపణుల వంటి అధిక వేగాలు అవసరమైన చోట్లా, చిన్నపాటి సరళమైన మెకానిజము అవసరమయ్యే చోట్లా రామ్జెట్లు ఉపయోగపడతాయి. ఫిరంగి గుళ్ళను మరింత దూరం పేల్చేందుకు రామ్‌జెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని చూస్తున్నారు; 120 మి.మీ. మోర్టార్ షెల్, రామ్‌జెట్ సాయం ఉంటే, 35 km (22 mi) పరిధిని సాధించగలదని భావిస్తున్నారు. [1] హెలికాప్టర్ రెక్కలకు అదనపు వేగాన్ని ఇచ్చేందుకు - అవి సమర్థవంతం కాకపోయినా - వాటి రెక్కల చివర్లలో ర్యామ్జెట్లను విజయవంతంగా ఉపయోగించారు. [2]
వేగం పెరిగే కొద్దీ, ర్యామ్జెట్ ఇంజను ఇన్లెట్ వద్ద పీడనం కారణంగా గాలి వేడి పెరుగుతుంది. దాంతో ర్యామ్జెట్ ఇంజను పనితీరు పడిపోతుంది. ఇన్లెట్ ఉష్ణోగ్రత ఎగ్జాస్టు ఉష్ణోగ్రతకు దగ్గరగా చేరే కొద్దీ, థ్రస్టు రూపంలో శక్తిని పొందడం తగ్గిపోతుంది. అందుచేత, మరింత ఎక్కువ వేగాల వద్ద కూడా ర్యామ్జెట్ నుండి ఉపయోగపడే థ్రస్టును ఉత్పత్తి చెయ్యాలంటే లోనికి వచ్చే గాలి వేడిని మరీ ఎక్కువగా పెరగనీయకుండా చూడాలి. అంటే గాలి పీడనం ఎక్కువ పెరగకుండా చూడాలి. అంటే దానర్థం, కంబషన్ చాంబరు గుండా వెళ్ళే గాలి ఇంజను కంటే ఎక్కువ వేగంతో వెళ్ళనివ్వాలి. అంటే వాస్తవంలో ఈ గాలి సూపర్సోనిక్ వేగంతో ప్రవహించాలన్నమాట. అలాంటి ఇంజన్‌ను సూపర్సోనిక్ కంబషన్ ర్యామ్జెట్ అని, స్క్రామ్‌జెట్ అనీ అంటారు.