From Wikipedia, the free encyclopedia
బంగ్లాదేశ్ విమోచన యుద్ధం (Bengali: মুক্তিযুদ্ধ ముక్తిజుద్ధొ/স্বাধীনতা যুদ্ধ షాధినోతా జుద్[1] ఈ యుద్ధాన్ని పాకిస్తాన్లో పౌరయుద్ధంగా, అంతర్యుద్ధంగా వ్యవహరిస్తారు[2]), బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధం లేదా తేలికగా విమోచన యుద్ధంగా వ్యవహరించే పరిణామం బెంగాలీ జాతీయవాద ఉద్యమం, స్వీయ గుర్తింపు ఉద్యమం, 1971 బంగ్లాదేశ్ జాతినిర్మూలన మారణహోమాలకు ఫలితంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్రారంభించిన తిరుగుబాటు, సాయుధ సంఘర్షణ. దీని ఫలితంగా బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం లభించి ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. 1971 మార్చి 25 రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన పాకిస్తానీ సైనికాధికారుల ముఠా ఆపరేషన్ సెర్చ్ లైట్ ప్రారంభించడంతో యుద్ధం మొదలైంది. జాతీయవాదులైన బెంగాలీ పౌరులు, విద్యార్థులు, మేధావులు, మతపరమైన మైనార్టీలు, సాయుధులను వెతికి వెతికి చంపడం ఇందులో భాగం. సైనిక ముఠా 1970 పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలను రద్దుచేసి, ఎన్నికైన ప్రధాని షేక్ ముజిబుర్ రహ్మాన్‌ను అరెస్ట్ చేశారు.
1970 ఎన్నికల ప్రతిష్టంభన తర్వాత ఎగసిన శాసన ఉల్లంఘనను అణచివేయడానికి ఉద్దేశించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు, వైమానిక దాడులు జరిగాయి. స్థానిక ప్రజానీకంపై చేసిన దాడుల సమయంలో సహకరించేందుకు రజాకార్లు, ఆల్-బద్ర్, ఆల్-షామ్స్ వంటి రాడికల్ మత సేనలను పాకిస్తాన్ సైన్యం తయారుచేసింది.[3][4][5] పాకిస్తాన్ సైన్యం సభ్యులు, సహకరించే సేనలు సామూహిక హత్యలు, బహిష్కరణ, అత్యాచారాల్లో నిమగ్నమయ్యారు. రాజధాని ఢాకాలో ఢాకా విశ్వవిద్యాలయ మారణహోమం సహా అనేక మారణహోమాలు జరిగాయి. కోటి మంది బెంగాలీ శరణార్థులు పొరుగున ఉన్న భారతదేశంలోకి పారిపోయివచ్చారు, వారు కాక మరో 3 కోట్ల మంది అంతర్గతంగా స్థానభ్రంశం పొందారు.[6] బెంగాలీలకు, ఉర్దూ మాట్లాడే స్థానికేతరులకు మధ్య వర్గపరమైన హింస చెలరేగింది. అకడమికల్ గా పాకిస్తానీ మిలటరీ చేసిన అకృత్యాలు జీనోసైడ్ అన్న అంశంలో విస్తృత ఆమోదం ఉంది.
బెంగాలీ సైన్యం, పారామిలటరీ, పౌరులతో ఏర్పడిన జాతీయ విముక్తి సైన్యం - ముక్తి బాహిని చిట్టగాంగ్ నుంచి బంగ్లాదేశీ స్వాతంత్ర్య ప్రకటన చేసింది. ప్రతిఘటించడంలో తూర్పు బెంగాల్ రెజిమెంట్, తూర్పు బెంగాల్ రైఫిల్స్ కీలకమైన పాత్ర పోషించింది. పాకిస్తానీ సైన్యానికి వ్యతిరేకంగా జనరల్ ఎం.ఎ.జి.ఉస్మానీ, 11 సెక్టార్ల కమాండర్లు, బంగ్లాదేశీ బలగాలు మాస్ గెరిల్లా యుద్ధం చేశారు. సంఘర్షణ జరిగిన తొలి నెలల్లో వారు అనేక పట్టణాలు, నగరాలను విముక్తి చేశారు. వర్షాకాలం ప్రారంభమయ్యాకా పాకిస్తానీ సైన్యం ఊపందుకుంది. పాకిస్తానీ నౌకాదళానికి వ్యతిరేకంగా బెంగాలీ గెరిల్లాలు ఆపరేషన్ జాక్ పాట్ సహా విధ్వంసాలు సృష్టించారు. పాకిస్తానీ సైనిక స్థావరాలపై నవజాత బంగ్లాదేశీ వైమానిక దళం వైమానిక దాడులు చేపట్టింది. నవంబరు కల్లా రాత్రి వేళల్లో పాకిస్తానీ సైన్యం బారక్స్ లోనే నిలిచిపోయేలా బంగ్లాదేశీ బలగాలు చేయగలిగాయి. దేశంలోని పలు భాగాలపై నియంత్రణ సాధించారు.[7]
బంగ్లాదేశ్ ప్రాదేశిక ప్రభుత్వం 1971 ఏప్రిల్ 17న ముజిబ్ నగర్లో ఏర్పడింది, తర్వాత కలకత్తాకు మారి వలస ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వం అయింది. పాకిస్తానీ ప్రజా, సైన్య, దౌత్య వర్గాల్లో ఉన్న బెంగాలీలు బంగ్లాదేశీ ప్రాదేశిక ప్రభుత్వంలోకి ఫిరాయించారు. పశ్చిమ పాకిస్తాన్ లోని నిర్బందితులైన వేలాది బెంగాలీ కుటుంబాలు అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు తప్పించుకున్నారు. బెంగాలీ సాంస్కృతిక కార్యకర్తలు రహస్య స్వాధీన్ బెంగాల్ రేడియో కేంద్రం నడిపారు. యుద్ధ నిర్వాసితులైన బెంగాలీ పౌరుల దురవస్థలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలకు, సానుభూతికి కారణమయ్యాయి. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న భారత దేశం బంగ్లాదేశీ జాతీయవాదులకు గణనీయమైన దౌత్య, ఆర్థిక, సైనిక సహాయాన్ని అందించింది. బంగ్లాదేశీ ప్రజల సహాయార్థం బ్రిటీష్, భారతీయ, అమెరికన్ సంగీతకారులు ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి బెనిఫిట్ కాన్సర్ట్ న్యూయార్క్ లో ఏర్పాటుచేశారు. ఆ స్థాయిలోని బెనిఫిట్ కన్సర్ట్ లలో ఇది మొదటిది కావడం విశేషం. పాకిస్తానీ సైనికులు చేస్తున్న హింసను ఆపివేయాలంటూ సెనేటర్టెడ్ కెన్నెడీ ఉద్యమం ప్రారంభించారు; పాకిస్తానీ సైనిక నియంత యాహ్యా ఖాన్ తో నిక్సన్ ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు కలిగివుండడం, యుద్ధాన్ని సమర్థిస్తూండడం పట్ల తూర్పు పాకిస్తాన్ లోని అమెరికా దౌత్యవేత్తలు సంచలనాత్మకంగా తీవ్ర అసమ్మతి తెలిపారు. దౌత్యవేత్త ఆర్చర్ బ్లడ్ పంపిన టెలిగ్రామ్ తూర్పు పాకిస్తానీలపై పశ్చిమ పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అకృత్యాలు తెలుపుతూ, దౌత్యవేత్త నుంచి అనూహ్యమైన తీవ్రవ్యాఖ్యలు చేసి సంచలనాత్మకమైంది.
1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ ఉత్తర భారతదేశంలో ముందస్తు వైమానిక దాడులను ప్రారంభించడంతో భారతదేశం యుద్ధంలో అడుగుపెట్టింది. ఆపైన ప్రారంభమైన భారత్-పాక్ యుద్ధం ప్రారంభమై రెండు పక్షాలూ తలపడ్డాయి. తూర్పున సాధించిన వైమానిక ఆధిపత్యంతో భారత్, బంగ్లాదేశ్ మిత్రపక్షాలు ముందుకు సాగగా డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ ఢాకాలో లొంగిపోయింది.
యుద్ధం దక్షిణాసియాలో రాజకీయ భౌగోళిక చిత్రపటాన్ని మార్చివేసి, ప్రపంచంలోకెల్లా ఏడవ జనసమ్మర్ధమైన దేశంగా బంగ్లాదేశ్ ప్రాదుర్భవించింది. సంక్లిష్టమైన ప్రాంతీయ కూటముల కారణంగా, యుద్ధం అమెరికా, సోవియట్ యూనియన్, చైనాల్లో ఉద్రిక్తతలు రేకెత్తిస్తూ ప్రచ్ఛన్నయుద్ధంలో ప్రధాన ఘట్టం అయింది. 1972లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో చాలావరకూ బంగ్లాదేశ్ గణతంత్రాన్ని గుర్తించాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.