From Wikipedia, the free encyclopedia
ప్లైస్టోసీన్ అనేది భౌగోళిక కాల మానంలో ఒక ఇపోక్. 25,80,000 సంవత్సరాల కిందటి నుండి, 11,700 సంవత్సరాల కిందటి వరకూ ఉన్న కాలమే, ప్లైస్టోసీన్. జనాంతికంగా దీన్ని మంచు యుగం అని కూడా పిలుస్తూంటారు. పదేపదే గ్లేసియేషన్లు ఏర్పడిన అత్యంత ఇటీవలి కాలమిది. ప్లైస్టోసీన్ ముగింపు, చివరి గ్లేసియల్ కాలపు ముగింపూ, పురావస్తు కాలమానం లోని పాతరాతియుగపు ముగింపూ అన్నీ ఒకే సమయంలో జరిగాయి.
క్వాటర్నరీ వ్యవస్థలోని ఉపవిభాగాలు | ||||
---|---|---|---|---|
సిస్టమ్/ పీరియడ్ |
సీరీస్/ ఇపోక్ |
స్టేజ్/ ఏజ్ |
వయసు (Ma) | |
క్వాటర్నరీ | హోలోసీన్ | మేఘాలయన్ | 0 | 0.0042 |
నార్త్‌గ్రిప్పియన్ | 0.0042 | 0.0082 | ||
గ్రీన్‌లాండియన్ | 0.0082 | 0.0117 | ||
ప్లైస్టోసీన్ | 'టారంటియన్' | 0.0117 | 0.126 | |
'చిబానియన్' | 0.126 | 0.773 | ||
కాలబ్రియన్ | 0.773 | 1.80 | ||
గెలాసియన్ | 1.80 | 2.58 | ||
నియోజీన్ | ప్లయోసీన్ | పయాసెంజియన్ | 2.58 | 3.60 |
2019 నాటికి, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రాఫీ ప్రకారం క్వాటర్నరీ పీరియడ్ లోని ఉపవిభాగం.[1]
హోలోసీన్లోని తేదీలు 2000 నాటి నుండి వెనక్కు లెక్కించినవి. (ఉదా.. గ్రీన్‌లాండియన్ 2000 నాటికి 11,700 స్ంవత్సరాల ముందు మొదలైంది). నార్త్‌గ్రిప్పియన్ ప్రారంభాన్ని2000 కు 8,236 సంవత్సరాల ముందు అని విధించారు.[2] మేఘాలయన్ 2000 కు 4,250 సంవత్సరాల ముందు మొదలౌతుంది.[1] 'చిబానియన్', 'టారంటియన్' లు అనధికారికమైనవి. వీటిని మరో అనధికారిక విభజనలైన 'మధ్య ప్లైస్టోసీన్', 'ఎగువ ప్లైస్టోసీన్' ఉప ఇపోక్‌ల స్థానాల్లో వాడారు. ఐరోపా, ఉత్తర అమెరికాల్లో, హోలోసీన్‌ను బ్లిట్-సెర్నాండర్ కాలమానానికి చెందిన ప్రిబొరియల్, సబ్‌బొరియల్, సబ్‌అట్లాంటిక్ అనే స్టేజ్‌లుగా విభజించారు. ప్రాంతీయంగా అగువ ప్లైస్టోసీన్‌కు అనేక ఉపవిభాగాలున్నాయి; సాధారణంగా ఇవి స్థానికంగా గుర్తించిన శీత గ్లేసియల్, వెచ్చని గ్లేసియల్ పీరియడ్లను బట్టి జరిగాయి. చివరి గ్లేసియల్ పీరియడ్, చల్లని యంగర్ డ్రయాస్ సబ్స్టేజ్తో ముగుస్తుంది. | ||||
ప్లైస్టోసీన్, క్వాటర్నరీ పీరియడ్ లోని మొదటి ఇపోక్. సెనోజోయిక్ ఎరా లోని ఆరవ ఇపోక్. ICS కాలమానంలో, ప్లైస్టోసీన్‌ను నాలుగు దశలుగా లేదా ఏజ్‌లుగా విభజించారు. గెలాసియన్, కాలాబ్రియన్, మధ్య ప్లైస్టోసీన్ (అనధికారికంగా "చిబానియన్"), ఎగువ ప్లైస్టోసీన్ (అనధికారికంగా "టరాన్టియన్").[3] ఈ అంతర్జాతీయ విభజనతో పాటు, వివిధ ప్రాంతీయ విభజనలు కూడా వినియోగంలో ఉన్నాయి.
2009 లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ వారు ధృవీకరించిన మార్పుకు ముందు, ప్లైస్టోసీన్‌కు అంతకు ముందరి ప్లయోసీన్‌కూ మధ్య కాల సరిహద్దుగా 18.06 లక్షల సంవత్సరాల క్రితాన్ని పరిగణించేవారు. ప్రస్తుతం ఇది 25.8 లక్షల సంవత్సరాల క్రితంగా ఉంది. పాతకాలపు ప్రచురణల్లో ఈ రెంటిలో ఏ పద్ధతి నైనా అనుసరించి ఉండవచ్చు.
ప్లైస్టోసీన్ 25.80 లక్షల (± 0.05) సంవత్సరాల క్రితం నుండి 11,700 సంవత్సరాల క్రితం వరకు [4] విస్తరించింది. ముగింపు తేదీ రేడియోకార్బన్ సంవత్సరాల్లో 10,000 కార్బన్ -14 సంవత్సరాల క్రితంగా చెబుతారు.[5] ఇది యంగర్ డ్రయాస్ శీతలం వరకు ఉన్న అన్ని తాజా గ్లేసియేషన్లతో కలిసి ఉంటుంది. యంగర్ డ్రయాస్ సా.శ.పూ 9,640 (11,654 క్యాలెండర్ సంవత్సరాల క్రితం) లో ముగిసింది. యంగర్ డ్రయాస్ ముగింపుతో ప్రస్తుత హోలోసిన్ ఇపోక్ మొదలౌతుంది. హోలోసీన్‌ను ఒక ఇపోక్గా పరిగణిస్తున్నప్పటికీ, ఇది ప్లైస్టోసీన్లోని అంతర్‌హిమనదీయ విరామాలకు భిన్నంగా ఏమీ లేదు.[6]
రేడియోకార్బన్ డేటింగ్ అభివృద్ధి చెందిన తరువాత మాత్రమే, ప్లైస్టోసీన్ కాలపు పురావస్తు త్రవ్వకాలు గుహల్లో మొద్లయ్యాయి. అప్పటి వరకు ఈ తవ్వకాలు బహిరంగంగా నదీ తీరాల్లోనే సాగేవి.[7]
2009 లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ (ఐయుజిఎస్) ప్లైస్టోసీన్ కాల వ్యవధిలో మార్పు చేసి, ప్రారంభ తేదీని 18.06 నుండి 25.88 లక్షల సంవత్సరాల క్రితంగా మార్చింది. గెలాసియన్ ప్రారంభాన్ని ప్లైస్టోసీన్ ప్రారంభంగా స్వీకరించింది.[8] ప్రస్తుతం ఈ ప్రారంభ తేదీని 25.80 లక్షల సంవత్సరాల క్రితానికి సవరించింది.[4]
ఇటీవలి కాలపు గ్లేసియేషన్లు ప్లైస్టోసీన్‌లో భాగం. గతంలో, చివరి మంచు యుగాన్ని సూచించేందుకు ప్లయో-ప్లైస్టోసీన్ అనే పేరు వాడేవారు. క్వాటర్నరీ నిర్వచనాన్ని సవరించిన తరువాత, ప్లైస్టోసీన్ ప్రారంభ తేదీ 25.8 లసంక్రి వరకు వెనక్కు జరిగింది. దాంతో, ఇటీవలి గ్లేసియేషన్లన్నీ ప్లైస్టోసీన్లోకి చేరాయి.
ఆధునిక ఖండాలు ప్లైస్టోసీన్ సమయంలో కొద్దిగా అటూ ఇటూగా వాటి ప్రస్తుత స్థానాల్లోనే ఉండేవి. ఈ ఇపోక్ మొదలయ్యాక, ఖండాలు కూర్చున్న పలకలు, ఒకదాని కొకటి సాపేక్షికంగా 100 కి.మీ. కన్నా ఎక్కువేమీ కదలలేదు.
ప్లైస్టోసీన్‌లో గ్లేసియల్ చక్రాలు[నోట్స్ 1] పునరావృతమౌతూ ఉండేవి. ఆ కాలంలో ఖండాంతర హిమానీనదాలు కొన్ని చోట్ల 40 వ అక్షాంశం వరకూ విస్తరించేవి. గరిష్ట గ్లేసియల్ సమయంలో, 30% భూమి మంచుతో కప్పబడి ఉండేదని అంచనా. దీనికి తోడు, మంచు పలకల అంచు దగ్గరి నుండి పెర్మాఫ్రాస్ట్ దక్షిణదిశలో విస్తరించి, ఉత్తర అమెరికాలో కొన్ని వందల కిలోమీటర్ల మేర, యురేషియాలో అనేక వందల కిలోమీటర్ల మేరా కప్పివేసేది. మంచుపలకల అంచు వద్ద సగటు వార్షిక ఉష్ణోగ్రత −6 °C (21 °F), పెర్మాఫ్రాస్ట్ అంచు వద్ద, 0 °C (32 °F) ఉండేది.
ప్రతిసారి గ్లేసియర్లు పెరిగినపుడు 1,500 నుండి 3,000 మీటర్ల మందాన ఖండాంతర మంచు పలకలలు ఏర్పడి, సముద్రాల్లోని నీటిని పెద్ద యెత్తున మింగివేసేవి. ఫలితంగా భూమ్మీద యావత్తు సముద్ర మట్టం తాత్కాలికంగా 100 మీటర్లకు పైగా పడిపోయేది. ప్రస్తుతం ఉన్నఇంటర్‌గ్లేసియల్ లాంటి కాలాల్లో, తీరప్రాంతాలు మునిగిపోయేవి.
గ్లేసియేషను ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేవి. ప్లైస్టోసీన్ కాలమంతటా, అంతకు ముందరి ప్లయోసీన్ కాలం లోనూ అంటార్కిటికా మంచుతో కప్పబడి ఉండేది. అండీస్ దక్షిణ భాగాన్ని పటగోనియన్ మంచు టోపీ కప్పేసి ఉండేది. న్యూజిలాండ్, టాస్మానియాల్లో హిమానీనదాలు ఉండేవి. కెన్యా పర్వతం, కిలిమంజారో పర్వతం, తూర్పు, మధ్య ఆఫ్రికాలోని రువెన్జోరి పర్వతశ్రేణుల్లో ప్రస్తుతం క్షీణిస్తూన్న హిమానీనదాలు, అప్పట్లో పెద్దవిగా ఉండేవి. ఇథియోపియా పర్వతాలలోను, పశ్చిమాన అట్లాస్ పర్వతాలలోనూ హిమానీనదాలు ఉండేవి.
ఉత్తరార్ధగోళంలో, అనేక హిమానీనదాలు ఒకటిగా మిళితమై పోయాయి. కార్డిల్లెరన్ ఐస్ షీట్ ఉత్తర అమెరికా వాయువ్య ప్రాంతాన్ని కప్పివేసేది; తూర్పును లారెన్టైడ్ కప్పివేసేది. ఫెన్నో-స్కాండియన్ మంచు పలక గ్రేట్ బ్రిటన్‌తో సహా, ఉత్తర ఐరోపాపై కూర్చునేది; ఆల్ప్ పర్వతాలను ఆల్పైన్ మంచు పలక కప్పివేసేది. సైబీరియా, ఆర్కిటిక్ షెల్ఫ్ లపై అంతటా మంచు గోపురాలు అక్కడక్కడా విస్తరించి ఉండేవి. ఉత్తర సముద్రాలు మంచుతో కప్పబడి ఉండేవి.
మంచు పలకలకు దక్షిణాన అవుట్లెట్లు మూసుకుపోవడంతోను, చల్లటి గాలి వలన బాష్పీభవనం మందగించడం తోనూ పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడేవి. లారెన్టైడ్ ఐస్ షీట్ వెనక్కి తగ్గినప్పుడు, ఉత్తర-మధ్య ఉత్తర అమెరికా అంతటా అగస్సిజ్ సరస్సు విస్తరించి ఉండేది. ఉత్తర అమెరికా పశ్చిమాన ప్రస్తుతం ఎండిపోయిన, లేదా దాపు ఎండిపోయిన వందకు పైగా బేసిన్లు అప్పట్లో పొంగిపొర్లుతూండేవి. ఉదాహరణకు, బోన్నెవిల్లే సరస్సు ఇప్పుడు గ్రేట్ సాల్ట్ లేక్ ఉన్న చోట ఉండేది. యురేషియాలో, హిమానీనదాల నుండి ప్రవహించిన నీటితో పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. నదులు పెద్దవిగాను, చాలా ఎక్కువ ప్రవాహాలతో, మధ్యలో చిన్నచిన్న ద్వీపాలతోనూ ఉండేవి. నీరు ఆవిరవడం తగ్గిన కారణంగా ఆఫ్రికా సరస్సులు నిండు కుండల్లా ఉండేవి. మరోవైపు, ఎడారులు పొడిగాను, మరింత విస్తృతంగానూ ఉండేవి. సముద్రాల నుండి, ఇతర చోట్ల నుండి నీటి బాష్పీభవనం తగ్గడం వల్ల వర్షపాతం తక్కువగా ఉండేది.
ప్లైస్టోసీన్ కాలంలో, తూర్పు అంటార్కిటిక్ మంచు పలక కనీసం 500 మీటర్ల దాకా పలచబడిందని అంచనా వేసారు. చివరి హిమనదీయ గరిష్ఠం నాటి నుండి ఈ పలచబడడం 50 మీటర్ల కన్నా తక్కువ గానే ఉందని, బహుశా ఇది 14 వేల ఏళ్ళ కిందట మొదలై ఉంటుందనీ అంచనా వేసారు [9]
11 ప్రధాన హిమనదీయ సంఘటనలు, అలాగే అనేక చిన్న హిమనదీయ సంఘటనలూ ఈ కాలంలో జరిగాయని గుర్తించారు.[10] హిమనదాలు పెరగడాన్ని ఒక ప్రధాన హిమనదీయ సంఘటనగా, "గ్లేసియల్" అని పిలుస్తారు. రెండు గ్లేసియల్‌ల మధ్య కాలాన్ని "ఇంటర్‌గ్లేసియల్" అని అంటారు. గ్లేసియల్ కాలంలో, హిమానీనదం కొద్దిగా పురోగమించడం, కొద్దిగా తిరోగమించడం జరుగుతూంటుంది. చిన్నపాటి పురోగతిని "స్టేడియల్"అని, రెండు స్టేడియల్‌ల మధ్య కాలాన్ని "ఇంటర్‌స్టేడియల్" అనీ పిలుస్తారు.
ఈ సంఘటనలను హిమనదీయ పరిధిలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా నిర్వచించారు. అక్షాంశం, భూభాగం, వాతావరణాలను బట్టి ఆయా ప్రాంతాల్లోని హిమనదీయ చరిత్ర ఉంటుంది. వివిధ ప్రాంతాలలోని హిమానీనదాల మధ్య పరస్పర అనుబంధం ఉంటుంది. ఒక ప్రాంతం లోని గ్లేసియల్ యొక్క భూవైజ్ఞానిక వరాలు ఇంకా సరిగా తెలియని దశలోనే ఉన్నపుడు, పరిశోధకులు వాటి పేర్లను మారుస్తూంటారు. అయితే, ఒక ప్రాంతంలోని గ్లేసియల్ పేరును మరొక ప్రాంతంలోని దానికి వర్తింపచేయడం సాధారణంగా తప్పు.
20 వ శతాబ్దం చాలా వరకూ కొన్ని ప్రాంతాలను మాత్రమే అధ్యయనం చేసారు. పేర్లు కూడా చాలా తక్కువ గానే ఉండేవి. నేడు వివిధ దేశాల భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్లైస్టోసీన్ గ్లేసియాలజీపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. పర్యవసానంగా, పేర్ల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది, విస్తరిస్తూనే ఉంటుంది. కొన్ని గ్లేసియల్ పురోగతులు, స్టేడియల్సూ పేర్లు లేకుండానే ఉన్నాయి. అలాగే, వాటిలో కొన్నింటికి సంబంధించిన భౌగోళిక ఆధారాలను పెద్ద గ్లేసియళ్ళు చెరిపివేసాయి. లేదా అస్పష్టంగా ఉన్నాయి. అయితే చక్రీయ వాతావరణ మార్పుల అధ్యయనం ద్వారా లభించే ఆధారాలు మిగిలే ఉన్నాయి.
కింది పట్టికలలోని గ్లేసియల్లు చారిత్రక ఉపయోగాలను చూపుతాయి. ఇవి వాతావరణం, భూభాగాలలో చాలా క్లిష్టమైన వైవిధ్యాల సరళీకరణ మాత్రమే. ఇవి సాధారణంగా ఉపయోగంలో లేవు. ఈ పేర్లు సంఖ్యా డేటాకు అనుకూలంగా వదిలివేయబడ్డాయి, ఎందుకంటే చాలా సహసంబంధాలు సరికావని లేదా తప్పని తేలింది. చారిత్రక పరిభాష, వాడుకలో స్థిరపడినప్పటి నుండి నాలుగు కంటే ఎక్కువ ప్రధాన గ్లేసియళ్ళను గుర్తించారు.[10][11][12]
ప్రాంతం | గ్లేసియల్ 1 | గ్లేసియల్ 2 | గ్లేసియల్ 3 | గ్లేసియల్ 4 |
---|---|---|---|---|
ఆల్ప్స్ | గన్జ్ | మిండెల్ | రీస్ | వూర్మ్ |
ఉత్తర ఐరోపా | ఎబురోనియన్ | ఎల్స్టీరియన్ | సాలియన్ | వీష్ |
బ్రిటిష్ దీవులు | బీస్టోనియన్ | ఆంగ్లియన్ | వోల్స్టోనియన్ | డెవెన్సియన్ |
మిడ్వెస్ట్ యుఎస్ | నెబ్రాస్కన్ | కాన్సన్ | ఇల్లినినోయన్ | విస్కాన్సినియన్ |
ప్రాంతం | ఇంటర్‌గ్లే్సియల్ 1 | ఇంటర్‌గ్లే్సియల్ 2 | ఇంటర్‌గ్లే్సియల్ 3 |
---|---|---|---|
ఆల్ప్స్ | గన్జ్-మిండెల్ | మిండెల్-రిస్ | రీస్-వూర్మ్ |
ఉత్తర ఐరోపా | వాలియన్ | హోల్స్టీనియన్ | ఈమియన్ |
బ్రిటిష్ దీవులు | క్రోమీరియన్ | హోక్స్నియన్ | ఇప్స్విచియన్ |
మిడ్వెస్ట్ యుఎస్ | ఆఫ్టోనియన్ | యార్మౌథియాన్ | సాంగామోనియన్ |
భూమి ఉపరితలంపై పనిచేసే వివిధ ట్రాన్సియెంట్ కారకాల మొత్తం చక్రీయమైనది: వాతావరణం, సముద్ర ప్రవాహాలు, ఇతర కదలికలు, గాలి ప్రవాహాలు, ఉష్ణోగ్రత మొదలైనవి. తరంగ రూప ప్రతిస్పందనకు మూలం, గ్రహం యొక్క అంతర్గత చక్రీయ కదలికలే. ప్లైస్టోసీన్‌లో పదేపదే ఏర్పడిన గ్లేసియేషన్లు ఈ కారకాల వల్లనే సంభవించాయి.
ప్లైస్టోసీన్ కాలపు గ్లేసియేషనులో అనేక సార్లు గ్లేసియల్, ఇంటర్‌గ్లేసియల్, స్టేడియల్, ఇంటర్స్టేడియల్లు[నోట్స్ 1] ఏర్పడేవి. వాతావరణంలో ఏర్పడిన కాలానుగుణ మార్పులకు ఇవి అద్దం పడతాయి. వాతావరణ చక్రభ్రమణానికి కారణం మిలాన్కోవిచ్ సైకిల్స్ అని ప్రస్తుతం భావిస్తున్నారు. భూమి చలనాల్లో పునరావృతమయ్యే మార్పుల వల్ల భూమికి చేరే సౌర వికిరణంలో పునరావృతమౌతూ ఉండే మార్పులే మిలాన్కోవిచ్ సైకిల్స్.
వాతావరణ వ్యత్యాసాలకు మిలాన్కోవిచ్ చక్రాలే ఏకైక కారణం అని చెప్పే వీలు లేదు. ఎందుకంటే అవి ప్లియో-ప్లైస్టోసీన్ కాలం నాటి దీర్ఘకాలిక శీతలీకరణ ధోరణిని గాని, గ్రీన్లాండ్ ఐస్ కోర్లలో వెయ్యేళ్ల వైవిధ్యాలను గానీ ఈ చక్రాలు వివరించలేదు. 100,000, 40,000, 20,000 సంవత్సరాల ఆవర్తనంతో ఉండే గ్లేసియేషను ఘటనలను మిలాన్కోవిచ్ చక్రాలు చక్కగా వివరిస్తాయి. ఇటువంటి నమూనా ఆక్సిజన్ ఐసోటోప్ కోర్లలో కనిపించే వాతావరణ మార్పులకు సంబంధించిన సమాచారానికి సరిపోతుంది.
సముద్ర, భూ జంతుజాలాలు రెండూ ఆధునికమైనవే. అయితే మామత్‌లు, మాస్టోడాన్స్, డిప్రొటోడాన్, స్మిలోడాన్, పులి, సింహం, అరోచ్స్, చిన్న ముఖం గల ఎలుగుబంట్లు, జెయింట్ స్లోత్‌లు, గిగాంటోపిథెకస్ తదితర పెద్ద క్షీరదాలు నేలపై నివసించేవి. ఆస్ట్రేలియా, మడగాస్కర్, న్యూజిలాండ్, పసిఫిక్ ద్వీపాల వంటి ఏకాంత ప్రాంతాల్లో ఏనుగు పక్షి, మోవా, హాస్ట్ డేగ, క్వింకానా, మెగాలానియా, మీయోలానియా వంటి పెద్దపెద్ద పక్షులు సరీసృపాలు వృద్ధి చెందాయి.
మంచు యుగాల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు వృక్ష, జంతుజాలాలపై తీవ్ర ప్రభావాలు కలిగించాయి. మంచు పెరుగుతూ ముందుకు వచ్చేకొద్దీ ఖండాల్లోని విశాలమైన ప్రాంతాలు పూర్తిగా నిర్జనమై పోయేవి. చొచ్చుకు వచ్చే హిమానీనదానికి ముందు దక్షిణ దిశగా వెళ్తూ పోయే మొక్కలు, జంతువులూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జీవన ప్రదేశం తగ్గడం, ఆహార సరఫరా తగ్గడం తీవ్రమైన వాతావరణ మార్పులు తెచ్చిపెట్టిన పెద్ద ముప్పు. ప్రధాన విలుప్త సంఘటన, ఇందులో మామత్‌లు, మాస్టోడాన్లు, సేబర్-పళ్ళ పిల్లులు, గ్లిప్టోడాన్లు, ఉన్ని ఖడ్గమృగం, శివాతేరియం వంటి వివిధ జిరాఫిడ్‌లు; నేల స్లోత్‌లు, ఐరిష్ ఎల్క్, గుహ ఎలుగుబంట్లు, గోమ్‌ఫోథేర్, తోడేళ్ళు, చిన్న ముఖం గల ఎలుగుబంట్లు వంటి పెద్ద క్షీరదాలు అంతరించిపోయిన ఘటన ప్లైస్టోసీన్ చివర్లో మొదలై హోలోసిన్‌లో కొనసాగింది. ఈ కాలంలోనే నియాండర్తల్‌లు కూడా అంతరించి పోయారు. ఆఖరి మంచు యుగం చివరిలో, శీతల రక్తపు జంతువులు, చెక్క ఎలుకల వంటి చిన్న క్షీరదాలు, వలస పక్షులు, తెల్లతోక జింక వంటి వేగవంతమైన జంతువులూ మెగాఫౌనా స్థానాన్ని ఆక్రమించి ఉత్తరానికి వలస వెళ్ళాయి.
ఈ విలుప్త ఘటనల ప్రభావం ఆఫ్రికాపై పెద్దగా లేదు. ఉత్తర అమెరికాలో మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అక్కడ స్థానిక గుర్రాలు, ఒంటెలు తుడిచిపెట్టుకు పోయాయి.
2018 జూలైలో, ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ సహకారంతో రష్యన్ శాస్త్రవేత్తల బృందం 42,000 సంవత్సరాల క్రితం పెర్మాఫ్రాస్ట్‌లో కూరుకుపోయిన రెండు ఆడ నెమటోడ్లను (రౌండ్వార్ం అని కూడా అంటారు) తిరిగి బ్రతికించినట్లు ప్రకటించింది.[13] ఆ సమయంలో ఈ రెండు నెమటోడ్లే అత్యంత పురాతనమైన జీవులు.[14]
శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల పరిణామం ప్లైస్టోసీన్ సమయంలో జరిగింది.[15][16] ప్లైస్టోసీన్ ప్రారంభంలో పారాంత్రోపస్ ప్రజాతి ఉనికిలో ఉంది. కాని దిగువ పాతరాతియుగం కాలానికి అవి కనుమరుగయ్యాయి. అలాగే మానవుల తొలి పూర్వీకులూ ఉన్నారు. ప్లైస్టోసీన్‌లో ఎక్కువ భాగానికి చెందిన శిలాజ రికార్డులలో కనిపించే ఏకైక హోమినిన్ జాతి హోమో ఎరెక్టస్. సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం నాటి హోమో ఎరెక్టస్‌తో పాటు అషూలియన్ రాతి పనిముట్లు కూడా కనిపించాయి. ఎ. గార్హి జాతి, తొలి హోమో జాతులూ ఉపయోగించిన మరింత ప్రాచీనమైన ఓల్డోవాన్ పనిముట్ల స్థానంలో ఇవి వచ్చాయి. మధ్య పాతరాతియుగంలో హోమోలో మరింత వైవిధ్యమైన పరిణామం కనిపిస్తుంది. 2,00,000 సంవత్సరాల క్రితం కనిపించిన హోమో సేపియన్స్ కూడా ఇందులో భాగమే
మైటోకాన్డ్రియల్ టైమింగ్ టెక్నిక్స్ ప్రకారం, ఈమియన్ స్టేజ్ లోని మధ్య పాతరాతియుగంలో రీస్ గ్లేసియేషను తరువాత ఆధునిక మానవులు ఆఫ్రికా నుండి వలస వచ్చారు. ప్లైస్టోసీన్ చివర్లో మంచు లేని ప్రపంచం అంతటా వీరు విస్తరించారు.[17][18] ఈ మానవులు అప్పటికే ఆఫ్రికా నుండి బయట పడ్డ పురాతన మానవ రూపాలతో జాత్యంతర సంపర్కం చేసుకుని, పురాతన మానవ జన్యు పదార్థాన్ని ఆధునిక మానవ జన్యు కొలనులో చేర్చుకున్నారు.[19]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.