![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/75/Druplicon.vector.svg/langte-640px-Druplicon.vector.svg.png&w=640&q=50)
డౄపల్
From Wikipedia, the free encyclopedia
డ్రూపల్ స్వేచ్ఛా లైసెన్స్ తో పంపిణీ అయ్యే PHP లో రాయబడిన కంటెంట్ నిర్వహణా ఫ్రేంవర్క్. ఇది గ్నూ జీపీఎల్ ద్వారా అందుబాటులో ఉంది. కనీసం 2.1% జాలగూళ్ళు ఈ ఫ్రేంవర్క్ ను ఆధారం చేసుకొని రూపొందించినవి. వీటీలో వ్యక్తిగత బ్లాగులు మొదలు వ్యాపారపరమయిన జాలగూళ్ళు, రాజకీయ, ప్రభుత్వ జాలగూళ్ళు (whitehouse.gov, data.gov.uk తో సహా) మొ॥ ఉన్నాయి. నాలెడ్జ్ మేనేజ్మెంట్ (విజ్ఞాన నిర్వహణ), వాణిజ్య సహకారానికి కూడా డ్రూపల్ ను వాడుతున్నారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/75/Druplicon.vector.svg/640px-Druplicon.vector.svg.png)
డ్రూపల్ ప్రామాణిక విడుదలను డ్రూపల్ కోర్ అంటారు. జూమ్లా, మూడుల్, కేక్పీహెచ్పీ, లాంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం తరహాలోనే డ్రూపల్ కోర్ లో కనిష్టంగా అవసరమయ్యే ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఈ ప్రాథమిక అంశాలు : వాడుకరి ఖాతా నమోదు, నిర్వహణ, మెనూ నిర్వహణ, RSS ఫీడ్ల నిర్వహణ, పేజీ లేఅవుటు మార్పు-చేర్పులు, వ్యవస్థ నిర్వహణ. డ్రూపల్ కోర్ ను స్థాపించిన వెంటనే ఒక చిన్నపాటి జాలగూడుగా, లేదా ఒకరూ లేక అనేక మంది కలిసి నిర్వహించే బ్లాగుగా, అంతర్జాల చర్చావేదికగా, లేదా ఒక సంఘపు వెబ్సైటుగా వాడుకోవచ్చు.
2013 జనవరి నాటికి 20,100 ఉచిత డ్రూపల్ ఉపకరణాలు (వీటిని మాడ్యూల్స్ అంటారు) అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి డ్రూపల్ పనితనాన్ని హెచ్చించవచ్చు, మనకు అవసమయిన రీతిలో మలుచుకోవచ్చు. ఈ సదుపాయం వల్లనే డ్రూపల్ ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంగా కాక ఒక కంటెంట్ మేనేజ్మెంట్ ఫ్రేంవర్క్ గా గుర్తింపు పొందింది. డ్రూపల్ ని వెబ్ అప్లికేషన్ ఫ్రేంవర్క్ గా కూడా పరిగణిస్తారు, ఎందుకంటే అందుకు కావాల్సిన అంశాలన్నీ డ్రూపల్ లో ఉన్నాయి. డ్రూపల్ ప్రోగ్రామింగ్ పరంగా క్లిష్టమయిన అంతరవర్తిని అయినప్పటికీని, చిన్నపాటి వెబ్సైటు నడపటానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు. డ్రూపల్ ఎలాంటి వేదిక మీదయినా సునాయాసంగా పనిచేసేలా రూపొందించబడింది. PHP ను నడపగల (ఆడించగల) వెబ్ సర్వర్ (అపాచీ, ఐఐఎస్, లైట్టీపీడీ, హయావత, చెరోకీ లేదా ఇంజన్ఎక్స్), విషయాలు, నిర్వాహకాంశాలను భద్రపరిచే డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ (మైసీక్వెల్, మాంగోడీబీ, మారియాడీబీ, పోస్ట్గ్రెసీక్వెల్, సీక్వెలైట్ లేదా మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్) ఉంటే సరిపోతుంది. డ్రూపల్ 6 నడిపేందుకు PHP 4.4.0 ఆ పై, ఇంకా డ్రూపల్ 7 PHP 5.2.5 ఆపై కావాల్సి ఉంటుంది.