INS విక్రమాదిత్య భారత్ రష్యా నుండి కొనుగోలు చేసిన  విమాన వాహక నౌక. కీయెవ్ తరగతికి చెందిన అడ్మిరల్ గోర్ష్‌కోవ్ విమాన వాహక నౌకను విక్రమాదిత్యగా పునర్నిర్మించారు. ఇది 2013 లో భారతీయ నౌకాదళం లోకి ప్రవేశించింది.

1987 లో సోవియెట్ యూనియన్ రోజుల్లో దీన్ని నిర్మించారు. అప్పట్లో దీని పేరు బాకు. సోవియెట్ పతనం తరువాత, రష్యా అధీనంలోకి వచ్చాక దీని పేరు అడ్మిరల్ గోర్ష్‌కోవ్‌గా మార్చారు. ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో ఈ నౌక నిర్వహణ తలకు మించిన భారం కాగా, 1996 లో దీన్ని నౌకా దళం నుండి విరమింపజేసారు.[1][2][3] అనేక బేరసారాల తరువాత 2004 జనవరి 20 న 235 కోట్ల డాలర్లకు భారత్ దీన్ని కొనుగోలు చేసింది.[4] ఈ నౌక 2013 జూలై నాటికి సముద్ర పరీక్షలను,[5] 2013 సెప్టెంబరులో ఏవియేషను పరీక్షలనూ పూర్తి చేసుకుంది.[6]

2013 నవంబరు 16 న రష్యాలోని స్వెర్ద్‌లోవ్‌స్క్‌ లో జరిగిన ఉత్సవంలో ఈ నౌకను కమిషను చేసారు.[7][8] 2014 జూన్ 14 న ప్రధాని నరేంద్ర మోదీ INS విక్రమాదిత్యను లాంఛనంగా భారత నౌకాదళానికి అందజేసి, జాతికి అంకితం చేసాడు.[9][10]

చరిత్ర

కొనుగోలు

1996 లో అడ్మిరల్ గోర్ష్‌కోవ్‌ను నౌకాదళ సేవల నుండి విరమింపజేసాక, భారత్ తన విమాన వాహక నౌక సామర్థ్యాలను మెరుగుపరచుకునేందుకు అది పనికివస్తుందని భావించింది.[11] 2004 జనవరి 20 న కుదిరిన ఒప్పందం ప్రకారం, భారత్‌ ఈ నౌకను ఉచితంగా పొందుతుంది. 80 కోట్ల డాలర్లు నౌక పునర్నిర్మాణానికి, 100 కోట్ల డాలర్లు విమానాలకు, ఆయుధాలకూ వెచ్చిస్తుంది. తొలుత E-2C Hawkeye, విమానాలను వాడాలని భారత్ భావించినప్పటికీ, తరువాత ఆ ప్రతిపాదనను విరమించుకుంది.[12] 2009 లో నార్త్‌రాప్ గ్రుమ్మన్ E-2D Hawkeye విమానాలను భారత నౌకాదళానికి అమ్మజూపింది.[13]

Thumb
1988 లో బాకు గా ఉన్నపుడు

రష్యాతో కుదిరిన ఒప్పందంలో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో కూడిన 12 మిగ్ 29కె విమానాలు, 4 రెండు సీట్ల మిగ్ 29 కెయుబి విమానాలు (అవసరమైతే మరో 14 విమానాలను చేర్చుకునే నిబంధనతో), 6 కమోవ్ Ka-31 "హెలిక్స్" నిఘా, జలాతర్గామి ఛేదక హెలికాప్టర్లు, టార్పెడో గొట్టాలు, క్షిపణి వ్యవస్థలు, శతఘ్నులూ ఈ ఒప్పందంలో భాగం. శిక్షణా సౌకర్యాల కల్పన, శిక్షణ పద్ధతుల రూపకల్పన, పైలట్లకు, సాంకేతికులకూ శిక్షణ, సిమ్యులేటర్ల సరఫరా, స్పేరుపార్టులు, నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు వంటివి కూడా ఈ ఒప్పందంలో చేరి ఉన్నాయి.

నౌక పునర్నిర్మాణంలో భాగంగా గోర్ష్‌కోవ్‌కు ముందు భాగంలో ఉండే ఆయుధాలు, క్షిపణి లాంచర్లను తొలగించి, అక్కడ షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (STOBAR) వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి.[14] ఈ మార్పుతో కారియర్, క్రూయిజర్ల సంకరమైన గోర్ష్‌కోవ్, కేవలం కారియర్ నౌక విక్రమాదిత్యగా మారిపోతుంది.

Thumb
2012 లో సెవెరోమోర్స్క్ రేవులో రష్యా విమాన వాహక నౌక అడ్మిరల్ కుజ్నెత్సోవ్ పక్కన విక్రమాదిత్య (ఎడమ)

విక్రమాదిత్యను భారత్‌కు అందించాల్సిన తేదీ 2008 ఆగస్టు. భారత్ వద్ద అప్పటికే ఉన్న విరాట్, నౌకాదళ సేవనుండి విరమించే నాటికి విక్రమాదిత్య దళంలోకి చేరేట్టుగా ఈ ఏర్పాటు చేసారు. అయితే పునర్నిర్మాణం ఆలస్యం కావడంతో విరాట్ విరమణను తొలుత 2010–2012 వరకూ పొడిగించారు.[15] తరువాత మరిన్ని మరమ్మతులు చేసి దాన్ని 2016 వరకూ పొడిగించారు.[16]

ఈ ఆలస్యానికి, పెరిగిన పునర్నిర్మాణ ఖర్చులు కూడా తోడై ఈ ప్రాజెక్టు ఒక సమస్యగా తయారైంది. దీని పరిష్కారానికి అత్యున్నత దౌత్య స్థాయిలో సంప్రదింపులు జరిగాయి. వీటి ఫలితంగా భారత్ మరో 120 కోట్ల డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో విక్రమాదిత్య వెల రెట్టింపైంది.[17] ఈసరికే జరుగుతున్న ఆలస్యాల కారణంగా విక్రమాదిత్యను అందించే తేదీ 2013 వరకూ సాగింది. ఈలోగా దేశీయంగా తయారౌతున్న విక్రాంత్ శ్రేణి వాహక నౌక కూడా ఒక సంవత్సరం ఆలస్యమైంది. అది 2013 లో కమిషను అవుతుందని అంచనా వేసారు.[18]

2008, 2009 లలో విక్రమాదిత్యపై తిరిగి బేరసారాలు సాగాయి. ఖర్చులు పెరిగిపోయాయని, దాని వెలను పెంచాలనీ రష్యా వాదించింది. రష్యా 290 కోట్ల డాలర్లు కావాలని అడగ్గా భారత్ 210 కోట్ల డాలర్లు ఇవ్వజూపింది. చివరికి 2010 మార్చి 10 న అప్పటి రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో ఈ విషయమై 235 కోట్ల డాలర్లకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.[4]

2010 ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్టు విషయంలో ఒక కుంభకోణం బయల్పడింది. గోర్ష్‌కోవ్ ధరపై జరిగే బేరాసారాలను ప్రభావం చేసే విధంగా ఒక సీనియర్ నౌకాదళ ఆఫీసరును బ్లాక్‌మెయిలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.[19] ఈ సంఘటన కారణంగా నౌక పునర్నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కమోడోర్ సుఖ్‌జిందర్ సింగ్‌ను నౌకాదళం నుండి తప్పించారు.[20]

పునర్నిర్మాణం

2008 నాటికి నౌక దేహభాగం పునర్నిర్మాణం పూర్తయింది.[21] 2008 డిసెంబరు 4 న విక్రమాదిత్యను ఆవిష్కరించారు.[22] 2010 జూన్ నాటికి 99% స్ట్రక్చరు పని, 50% కేబుళ్ళ పనీ పూర్తైంది. ఇంజన్లు, జనరేటర్ల వంటి భారీ యంత్రాలన్నిటినీ స్థాపించారు.[23] 2010 లోనే ఓ మిగ్ 29కె ప్రోటోటైపుతో విక్రమాదిత్య డెక్ వ్యవస్థలను పరీక్షించారు.[24]

ఈ పనంతా రష్యాలోని స్వెరోద్విన్స్క్ లో జరిగింది. అయితే కేబులు పనిని తక్కువగా అంచనా వెయ్యడంతో ఇది మూడేళ్ళు ఆలస్యమైంది.[25] సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక, సాంకేతిక విషయాలపై భారత రష్యాల మధ్య నిపుణుల స్థాయిలో చర్చలు జరిగాయి.[26] 2010 ఫిబ్రవరి నాటికి మిగ్-29కె భారత్‌లో ఆపరేషనులోకి వచ్చింది. భారత్ మరి కొంత మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించడంతో ఒక రాజీ సూత్రం కుదిరింది. నౌకలోని పాత వ్యవస్థలను రిపేరు చెయ్యడం కాకుండా, కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంది.[27]

2011 తొలినాళ్ళకల్లా హార్బరు పరీక్షలు పూర్తిచేసుకుని 2012 డిసెంబరు కల్లా నౌకను భారత్‌కు అందించాలనేది రష్యా లక్ష్యం.[28][29] 2011 మార్చి 1 న డాక్ పరీక్షలు మొదలయ్యాయి. ప్రధాన పవర్ జనరేటర్లను, భారత్‌లో తయారైన రేడియో-ఎలక్ట్రానిక్ ఆయుధ వ్యవస్థలను పరీక్షించడం ఈ పరీక్షల్లో ప్రధానోద్దేశం.[30][31] 2011 ఏప్రిల్లో భారత వైమానిక దళ అధికారులు విక్రమాదిత్యపై శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు.[32] 22012 ఏప్రిల్ 19 న నౌక లోని వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయని,, నౌక పూర్తిగా స్వయం సమృద్ధంగా ఉందనీ ప్రకటించారు. సముద్ర పరీక్షలు మొదలు కాకముందు నౌక అయస్కాంత క్షేత్రాన్ని, గరిమనాభినీ కొలిచారు.[33]

డిజైను

Thumb
Thumb
పునర్నిర్మాణంలో భాగంగా నౌక ముందుభాగంలో ఉన్న ఆయుధాలను, క్షిపణి లాంచర్లను తొలగించి విమానాలు టేకాఫ్ అయ్యేందుకు వీలుగా 14.3° ర్యాంపును నిర్మించారు.

పూర్తయ్యాక, విక్రమాదిత్యకు దాని పూర్వ రూపమైన బాకు కంటే ఎక్కువ డిస్‌ప్లేస్‌మెంటు ఉంటుంది. నౌకలోని 2,500 కూపేల్లోను 1,750 కూపేలను పునర్నిర్మించారు. కొత్త రాడార్లు, సెన్సర్లకు అనువుగా కేబుళ్ళను కొత్తగా అమర్చారు. విమాన లిఫ్టులను మెరుగుపరచారు. రెండు కొత్త రిస్ట్రెయినింగ్ స్టాండ్లను నిర్మించారు. వీటి సహాయంతో యుద్ధ విమానాలు టేకాఫ్‌కు ముందే పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటాయి. వంపు తిరిగిన డెక్ వెనుక భాఅగంలో అరెస్టింగ్ గేర్లను అమర్చారు. నేవిగేషను, కారియర్ లాండింగ్ సహాయకాలనూ చేర్చారు. ఇవి షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (STOBAR) కు సహకరిస్తాయి.[34][35]

దేహంలో మార్పులు

అడ్మిరల్ గోర్ష్‌కోవ్‌ను షార్ట్ టేకాఫ్ అండ్ వెర్టికల్ లాండింగ్ (STOVL) కోసం నిర్మించారు. దీన్ని STOBAR కు అనువుగా మార్చడం నౌకలో చేపట్టే ప్రధాన మార్పుల్లో ఒకటి. నౌక ముందు భాగంలో ఉన్న ఆయుధాలను, క్షిపణి లాంచర్లనూ తొలగించి, 14.3° స్కీ జంపును అమర్చాలి. నౌక వెనుక భాగంలో ఉన్న విమానాల లిఫ్టు సామర్థ్యాన్ని 30 టన్నులకు పెంచాలి. STOBAR ఆపరేషన్ల కోసం మూడు 30 మీ. అరెస్టర్ వైర్లను, మూడు రిస్ట్రెయినింగ్ గేర్లనూ అమర్చారు. వీటి కోసం ఫ్లైట్ డెక్ విస్తీర్ణాన్ని పెంచారు. అందుకొరకు 234 హల్ విభాగాలను కొత్తగా అమర్చారు. ఈ మార్పుచేర్పుల కోసం 2,500 టన్నుల ఉక్కును వాడారు.[34][35]

కొత్త రాడార్ వ్యవస్థలు, కొత్త కమాండ్ కంట్రోల్ వ్యవస్థలకు అనుగుణంగా సూపర్‌స్ట్రక్చరును డిజైను చేసారు. సెన్సర్లను మెరుగుపరచారు. సుదూర పరిధి ఆకాశ నిఘా రాడార్లను, ఉన్నత ఎలెక్ట్రానిక్ యుద్ధ సహాయక పరికరాలనూ అమర్చారు. ఇవి నౌకకు 500 కి.మీ. దూరంలో నిఘా క్షేత్రాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి. ఈ మార్పులన్నిటికీ 2,300 కి.మీ. కొత్త కేబుళ్ళు, 3,000 కి.మీ. కొత్త గుట్టాలూ అవసరమయ్యాయి.[35][36]

8 బాయిలర్లను తీసివేసి, కొత్త తరం బాయిలర్లను అమర్చారు. ఒక్కొక్కటీ గంటకు 100 టన్నుల స్టీమును ఉత్పత్తి చేస్తుంది.[37] ఈ కొత్త బాయిలర్లు 1,80,000 హార్స్‌పవరును ఉత్పత్తి చేస్తాయి. అవి నాలుగు ప్రొపెల్లర్లను నడిపిస్తాయి. నౌక అత్యధిక వేగం గంటకు 30 నాట్లు. నౌకలోని ఆరు టర్బో జనరేటర్లు 18 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్తును నౌకలోని అనేక పరికరాలు, వ్యవస్థల కోసం వినియోగిస్తారు. నౌకలో నెలకొల్పిన నీటి శుద్ధి వ్యవస్థలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగాఅ తీర్చిదిద్దారు. 1.5 మెగావాట్ల ఆరు కొత్త వార్ట్‌సిలా జనరేటర్లు, సమాచార వ్యవస్థ, నేవిగేషన్ రాడారు, కొత్త టెలిఫోన్ ఎక్స్చేంజి, కొత్త డేటాలింకు, కొత్త IFF Mk XI వ్యవస్థలనూ అమర్చారు. రోజుకు 4 లక్షల లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే ఆర్వో ప్లాంటును నెలకొల్పారు. రిఫ్రిజిరేషను, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలనూ మెరుగుపరచారు. పది మంది మహిళా ఆఫీసర్లకు సరిపోయేలా నివాసాలను విస్తరించి, మెరుగుపరచారు.[34][35][38]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.