ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
ఒక వ్యక్తిని నాయకునిగా ఎన్నుకోవటానికి ఎన్నికలు (Elections) నిర్వహిస్తారు. సాధారణంగా ప్రజా ప్రతినిధిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. దీనిని ఏ రంగంలోనైన నాయకుడిని ఎన్నుకోనుటకు ఉపయోగించవచ్చు. ఎన్నికలలో నాయకులు కావాలనుకుంటున్న వ్యక్తులు పోటీ చేస్తారు. కానీ కొన్నిసార్లు ఒకరే అభ్యర్థి నిలబడినప్పుడు లేదా ఇతర అభ్యర్థులు తొలగినప్పుడు ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ భారత ఎన్నికల కమిషను (Election Commission of India). 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాతీయ ఎన్నికల కమిషన్ లో భాగం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ [1] ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పనులను చేస్తుంది.
ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి, తద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి వివిధ స్థాయిల్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు.
ఏ కారణం చేతనైనా ఐదు సంవత్సరాలు కొనసాగవలసిన ప్రభుత్వాలు కొనసాగకపోతే, మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు.
పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే సమయానికి, పాలనాకాలాన్ని ముగించుకున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కలిపి ఎన్నికలను నిర్వహించడాన్ని జమిలి ఎన్నికలు అంటారు.
1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఈవీఎం వాడుతుండటం వల్ల 10,000 టన్నుల కాగితం మిగులుతోంది. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఈవీఎం ఉపయోగించారు. వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేస్తాయి. విద్యుత్తు సరఫరా లేని చోట్ల కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి ఆల్కలైన్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లను నిక్షిప్తం చేసుకోగలదు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1400లోపు మంది ఓటర్లనే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వాడతారు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే బ్యాలెట్ పేపరు ఉపయోగిస్తారు.2004 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్లా ఈవీఎంలనే ఉపయోగించారు.
ఎన్నికలను ఆషామాషీగా తీసుకుని పోటీ చేసే అభ్యర్థులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఇకపై ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు రూ.25 వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ డిపాజిట్ రూ.10వేలే ఉంది. డిపాజిట్ పెంచుతూ ప్రతిపాదించిన ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు 2009 ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందింది.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లిస్తున్న రూ.5 వేలను రూ.12,500కు పెంచగా.. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్‌ను రెట్టింపు చేశారు. ధన, కండ బలాన్ని, కుల, ప్రాంతీయ ధోరణులను కట్టడి చేస్తూ.. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన అవసరం ఉందని బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి మొయిలీ పేర్కొన్నారు.
1.పార్టీలు, నేతలు అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు.
ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి.
ప్రజా జీవితంతో సంబంధంలేని, వ్యక్తిగత దూషణలు చేయకూడదు
. 2.రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు.
3.ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించుకోవడం,
4.పోలింగ్‌స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం వంటివి చేయరాదు.
5.గడువు దాటాక కూడా ప్రచారం చేయడం, పోలింగ్ కేంద్రంకు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం... వంటివి నిషిద్ధం.
ప్రశాంత గృహ జీవితాన్ని గడిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. దానికి భంగం కలిగేలా ప్రవర్తించకూడదు. ప్రజల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేయడం, పికెటింగ్‌లు చేయడం వంటివి నిబంధనలకు విరుద్ధం.
6.అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగరవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధం.
1.పార్టీలు సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా చెప్పాలి. దాన్ని బట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు.
2.సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలనుకునే చోట ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. నిషేధా జ్ఞలు అమలయ్యే ప్రదేశాల్లోకి ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.
3.లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలి. 4.సభలకు ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే... నిర్వాహకులు వారిపై నేరుగా దాడులకు పాల్పడకూడదు. పోలీసులకు సమాచారం అందించాలి.
1.పార్టీలు.. ఊరేగింపులకు అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏ మార్గం గుండా వెళుతుంది? తదితర వివరాలన్నీ ముందే సమర్పించాలి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకూ అందించాలి. దాన్నిబట్టి వారు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు.
2.ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు పొడవుగా ఉంటే, దాన్ని మధ్యలో విడగొట్టి కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలి.
3.సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీల నాయకులు, వారి అనుచరులు వాటికి భంగం కలిగించకూడదు. నిలదీయకూడదు. కరపత్రాలు పంచరాదు.
4.ఒకపార్టీ వేసిన పోస్టర్లను వేరే పార్టీ వారు తొలగించకూడదు. 5.రెండు అంత కంటే ఎక్కువ పార్టీలు ఒకేదారిలో ఒకే సమయంలో ఊరేగింపు నిర్వహించాలనుకుంటే... ముందుగానే పోలీసులను సంప్రదించాలి. ఊరేగింపులు ఎదురెదురుగా రాకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు.
6.ఊరేంగింపులో మూడు కంటే ఎక్కువ వాహనాలు వాడితే ఎన్నికల వ్యయంలో చూపించాలి.
1.ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించాలి. అన్ని పార్టీల నేతలు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సహకరించాలి.
2.పోలింగ్ బూత్‌లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందజేయాలి. వీటిపై పార్టీల గుర్తులు, పేర్లు ఉండకూడదు.
3.ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం చేయకూడదు. ప్రచార రూపంలో ఎస్ఎంఎస్లు కూడా నిషేధం.
4.పోలింగ్‌రోజు, అంతకు 24 గంటల ముందు మద్యం పంపిణీ చేయకూడదు.
5.అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్‌బూత్‌ల సమీపంలో ఏర్పాటుచేసే శిబిరాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకూడదు.
6.శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఇతర ఎన్నికల సామాగ్రి ఏమీ ఉండకూడదు. తినుబండారాలను కూడా పంపిణీ చేయకూడదు.
1.అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు.
2.అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు.
3.ముఖ్యమంత్రితో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.
4.సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి.
5.ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది.
6.ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్లు... తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి.
7.పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
8.టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.
9.ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.
నేడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కులము, డబ్బు మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. రాజకీయాలు చాలా నీచమైన స్థాయిలోకి దిగజారిపోయాయి. ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టగల వ్యక్తులను మాత్రమే పార్టీ అభ్యర్థులుగా ఎన్నికవుతున్నారు. అవినీతి కూడా కొలమానంలో లేదు. అభివృద్ధికి కృషి చేసిన అభ్యర్థులను కూడా ఓడించిన నియోజక వర్గాలు లేవు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.