![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/90/Flexibles_Endoskop.jpg/640px-Flexibles_Endoskop.jpg&w=640&q=50)
ఎండోస్కొపీ
From Wikipedia, the free encyclopedia
ఎండోస్కొపి, లేదా కుహరాంతర దర్శనం లేక అంతర్దర్శనం శరీరపు లోపలి భాగాలను పరిశీలించే వైద్య పరీక్ష. ఎండోస్కోపి అనగా లోపలికి చూడడం; ఈ పరీక్షకు ఉపయోగించే పరికరంను అంతర్దర్శిని (ఎండోస్కోప్) అని వ్యవహరిస్తారు. వీటిని వివిధ అవయవాల్లో చాలా రకాల వ్యాధులను గుర్తించడానికి, వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ అంతర్దర్శిని పరీక్షలు చేసేటప్పుడు అవసరంబట్టి వ్యక్తులకు నిద్రమందులు లేక మత్తుమందులు ఇస్తారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/90/Flexibles_Endoskop.jpg/640px-Flexibles_Endoskop.jpg)
తొలిగా ముక్కు, చెవి, గొంతు, స్వరపేటిక, శ్వాసనాళం, అన్నవాహిక ( అన్ననాళం) పురీషనాళం, గర్భాశయద్వారాలను పరీక్షించుటకు లోహాలతో చేసిన వంపులుపోని సరళ అంతర్దర్శినులు వాడకంలోనికి వచ్చాయి. వీటి ద్వారా దీపకాంతి ప్రసరింపచేసో లేక వీటి చివర దీపాలు అమర్చో లోపల ఉన్న కుహరాలు పరీక్షిస్తారు. కణపరీక్షలకు తునుకలను లేక కుంచెలు లేక శలాకలతో కణసముదాయాన్ని కూడా గ్రహించగలరు. వంకలు తిరగని నిటారు అంతర్దర్శినులతో శరీరంలో కొన్ని భాగాలనే పరీక్ష చేయగలరు.
గాజుతంతువుల ద్వారా కాంతిని ప్రసరించు సాంకేతికత లభ్యమై తంతు దృశాశాస్త్రం ( ఫైబర్ ఆప్టిక్స్) అభివృద్ధి చెందడంతో వంపులు తిరిగే నమన అంతర్దర్శినులు (ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్) వాడుకలోనికి వచ్చాయి. తంతువుల సముదాయంతో నిర్మించబడు ఈ అంతర్దర్శినులు కొద్ది మిల్లీమీటర్లనుండి సుమారు ఒక సెంటీమీటరు వ్యాసపరిమాణంలో అవసరమైన పొడవు కలిగి వంపులు తిరిగే గొట్టాలవలె ఉంటాయి. ఈ అంతర్దర్శినులలో వంగే గాజు లేక ప్లాస్టిక్ తంతువులు శరీరం లోపలిభాగాల ప్రతిబింబాలను వైద్యుల కళ్ళకు కటకాల ద్వారా అందిస్తాయి.
ఆపై నవీనతరంలో దృశ్యదర్శినులు (విడియోస్కోప్స్) వాడుకలోకి వచ్చాయి. ఇవి అవయవాల నాళం లేక కుహరంలోనికి కాంతిని ప్రసరించి, వీటి చివర ఉండే చిత్రగ్రాహకాలతో అవయవాల లోపలి చిత్రాలు గ్రహించి ఆ చిత్రాలను తీవెల ద్వారా దూరదర్శిని తెరపైకి ప్రసరింపజేస్తాయి.
అంతర్దర్శినుల పైన అమర్చిన చోదనచక్రాలు తిప్పి అంతర్దర్శిని కొనను పైకి, క్రిందకు, కుడిపక్కకు, ఎడమ ప్రక్కకు పూర్తిగా వంచగలుగుట వలన పరీక్షిస్తున్న అవయవ నాళంని (కుహరంని) అనుసరించి అంతర్దర్శినిని ముందుకు నడిపించి పరీక్ష చేయగలుగుతారు. ఈ అంతర్దర్శినులలో ప్రత్యేకమార్గం ద్వారా అవయవాలలోనికి గాలి పంపించి అవయవాల నాళాలను, తిత్తులను తెఱిచి ఉంచగలరు. మరో ప్రత్యేక ద్వారంలోంచి సన్ననితీగ వంటి శ్రావణం చొప్పించి అవయవాలనుంచి కణపరీక్షకు చిన్న చిన్న తునుకలు గ్రహించవచ్చు. అవసరమైతే నీటిని చిందించి చిత్రగ్రాహకాన్ని కడిగి శుభ్రం చేయవచ్చు.
కడుపులో పుళ్ళు కనిపెట్టుటకు, పెద్దప్రేవులలో కర్కటవ్రణాల (కేన్సర్ల) శోధనకు, కంతుల (పోలిప్స్) నిర్మూలనకు అంతర్దర్శినులు విరివిగా వాడకంలోకి వచ్చినా, ఈ దినాలలో వివిధ వైద్యరంగాలలో అంతర్దర్శినులు ప్రాచుర్యం పొందాయి. వ్యాధులను కనుగొనుటకే గాక, చికిత్సా ప్రక్రియలకు కూడ అంతర్దర్శినులు ఉపయోగపడుతున్నాయి.