స్థూల దేశీయోత్పత్తి
ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల మారక విలువ / From Wikipedia, the free encyclopedia
స్థూల దేశీయోత్పత్తి (ఆంగ్లం: gross domestic product/GDP) అంటే ఒక నిర్ణీత కాలవ్యవధిలో ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి చేయబడ్డ పూర్తయిన వస్తువులు, సేవల మార్కెట్ విలువ.[2][3] స్థూలంగా దేశీయంగా ఉత్పత్తులను కొలిచే ఒక ప్రమాణంగా ఇది ఆ దేశపు ఆర్థిక పరిపుష్టతను సూచిస్తుంది. మామూలుగా ఇది సంవత్సరానికొకసారి గణించినా అప్పుడప్పుడు త్రైమాసికానికోసరి కూడా గణిస్తారు.
భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఒ - కేంద్ర గణాంకాల శాఖ) ప్రతి సంవత్సరంలో మూడు నెలలకోసారి మొత్తం నాలుగు సార్లు స్థూల దేశీయోత్పత్తిని అంచనా వేస్తుంది. వీటిని త్రైమాసిక గణాంకాలు అంటారు. అలాగే ప్రతి సంవత్సరం వార్షిక వృద్ధి రేటును కూడా గణాంకాల శాఖ ప్రచురిస్తుంది. అల్పాదాయం, మధ్య ఆదాయం కలిగిన దేశాల్లో జిడిపి ఎంత వృద్ధిలో ఉంటే, వారి పెరుగుతున్న జనాభా అవసరాలు అంతగా తీరుతున్నట్లు లెక్క.[4]