సల్మాన్ ఖాన్
నటుడు, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
సల్మాన్ ఖాన్ (జననం 27 డిసెంబరు 1965),[1] భారతీయ నటుడు, నిర్మాత, టీవీ నటుడు. ఆసియాలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆయన చాలా ప్రసిద్ధులు. ఆయన అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. బాలీవుడ్ లో విజయవంతమైన, ప్రభావవంతమైన నటునిగా ప్రసిద్ధిపొందారు సల్మాన్.[2][3][4]
సల్మాన్ ఖాన్ | |
---|---|
జననం | అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ (1965-12-27) 1965 డిసెంబరు 27 (వయసు 58) ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం |
వృత్తి | చలనచిత్ర నటుడు టెలివిజన్ ప్రెజెంటర్ మోడల్ పరోపకారి పెయింటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1988–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | సలీం ఖాన్ (తండ్రి) సుశీలా చరక్ ఖాన్ (తల్లి) |
బంధువులు | అర్బాజ్ ఖాన్ (సోదరుడు) సోహైల్ ఖాన్ (సోదరుడు) అల్వీరా ఖాన్ అగ్నిహోత్రి (సోదరి) అర్పితా ఖాన్ (సోదరి) హెలెన్ (సవతి తల్లి) |
సల్మాన్ తండ్రి సలీం ప్రముఖ స్క్రీన్ రచయిత. బివి హోతో అయిసీ (1988) సినిమాలో సహాయనటునిగా తెరంగేట్రం చేశారు ఆయన. ఆ తరువాత సూరజ్ బర్జత్య దర్శకత్వంలో మైనే ప్యార్ కియా (1989) సినిమాతో కథానాయకునిగా మారారు సల్మాన్. 90వ దశకంలో ఆయన నటించిన హమ్ ఆప్కే హై కౌన్..! (1994), కరణ్ అర్జున్ (1995), బీవీ నెం.1 (1999) వంటి సినిమాలతో బాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచుకున్నారు ఆయన. 1998లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం అందుకున్నారు సల్మాన్. 2000వ దశకం ఆయనకు కలసి రాకపోయినా, 2010లో దబాంగ్ సినిమాతో మళ్ళీ హిట్ ల బాట పట్టారు సల్మాన్. ఆ తరువాత ఆయన నటించిన బాడీ గార్డ్ (2011), ఏక్ థా టైగర్ (2012), కిక్ (2014), బజరంగీ భాయీజాన్ (2015), సుల్తాన్ (2016) వంటి సినిమాలతో బాలీవుడ్ లోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలను అందించారు.[5][6][7][8] 9 ఏళ్ళ పాటు వరుసుగా బాలీవుడ్ కు అత్యధిక వసూళ్ళు చేసిన సినిమాలు అందించిన ఏకైక నటుడు సల్మాన్.[9] 2014లో ఫోర్బ్స్ భారత్ జాబితాలో ఆయన మొదట ఉన్నారు.[10] ఫోర్బ్స్ 2015 జాబితాలో 33.5 మిలియన్ డాలర్లు తీసుకుంటూ సల్మాన్ ను ప్రపంచ టాప్ పెయిడ్ ఎంటర్టైనర్స్ 2015గా నిలిచారు.[11]
ఆయన ఒక మంచి స్టేజ్ పెర్ఫార్మర్, దాతగా కూడా ప్రఖ్యాతులు. ఆయన బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సల్మాన్.[12] ఇవే కాక ఐశ్వర్య రాయ్ తో ప్రేమకథ, అరుదైన జంతువులను వేటాడిన కేసు విషయంలోనూ, ఫుట్ పాత్ పై అయిదుగురిపై కారు పోనిచ్చిన కేసులతో ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు.[13] 2015లో ఐదేళ్ళ జైలుశిక్ష వేసిన కోర్టు కొన్నిరోజుల తరువాత ఆయనను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది.[14][15][16]